స్లీప్ బ్యాంకింగ్: టైమ్ దొరికినప్పుడు ఎక్కువ నిద్రపోయి దాన్ని బ్యాంక్ బ్యాలన్స్‌లాగా తర్వాత వాడుకోవచ్చా?

నిద్ర లేమి, వారాంతాల్లో నిద్ర, క్రీడా నైపుణ్యం, స్లీప్ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కేటీ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

వారాంతం రావడానికి ముందే, అలారం ఆపేసి, కావల్సినంత సేపు నిద్ర పోవడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటారు.

పని రోజుల్లో మిస్సయిన రెస్ట్‌ను తిరిగి పొందేందుకు వారాంతాల్లో దొరికే ఈ సౌకర్యాన్ని వాడుకోవడం సాధారణ వ్యూహం.

అయితే మనం దీని గురించి కరెక్టుగానే ఆలోచిస్తున్నామా?

నిద్ర లేని రాత్రుల్ని ఎదుర్కోవడానికి, వారాంతం తర్వాత వచ్చే పని రోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, ముందుగానే అదనపు గంటలు నిద్ర పోవడం మంచిదేనా?

నిద్రను తర్వాతి అవసరాల కోసం 'దాచుకోవడం' వల్ల ప్రయోజనాలుంటాయా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి?

స్లీప్ బ్యాంకింగ్- మీరు తక్కువ నిద్రపోయే అవకాశం ఉన్న సమయానికి ముందే అనేక రాత్రులు ఎక్కువ సేపు నిద్రపోవడం.

కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇది ప్రభావవంతమైన వ్యూహం కావచ్చు.

దీని వల్ల మెదడు కీలకమైన వనరులను నిల్వ చేసుకోవడంతో పాటు నిద్ర లేమి వల్ల సమస్యలు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి ఇది సాయపడుతుందనేది పరిశోధకుల అభిప్రాయం.

నిద్ర లేమి, వారాంతాల్లో నిద్ర, క్రీడా నైపుణ్యం, స్లీప్ బ్యాంక్

ఫొటో సోర్స్, Ryan Pierse/Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్

'స్లీప్ బ్యాంకింగ్' అనేది పని చేస్తుందా?

టిక్‌టాక్‌లో వీడియోలు చేసే వెల్‌నెస్ ఔత్సాహికుల్లో ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.

ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది 'సేఫ్టీ నెట్' లాంటిదని వారి అభిప్రాయం.

స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్‌లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం యూటా స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ట్రేసీ రుప్ నేతృత్వంలోని ఈ బృందం వివిధ ఆపరేషన్లు చేపట్టడానికి ముందు సైనికుల అప్రమత్తతను మెరుగుపరిచే మార్గాల్ని పరిశోధిస్తోంది.

24 మంది సైనికుల్ని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రాత్రి 7 గంటలు, మరో గ్రూపు 10 గంటలు నిద్రపోయేందుకు అనుమతించారు.

తర్వాత వారు తమ రోజు వారీ జీవితంలో 8 గంటల నిద్ర పోవడానికి ముందు ఒక వారం రోజులు రెండు గ్రూపుల వారిని 3 గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు.

ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 10 గంటలు నిద్రపోయినవారు 7 గంటలు నిద్రపోయిన వారి కంటే చురుగ్గా ఉన్నారు. నిద్ర వారికి నియంత్రణలో ఉంది.

నిద్ర లేని రాత్రులకు ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది మానసిక, శారీరక రోగ నిరోధకశక్తిగా పని చేస్తుందని అనేక ఏళ్లపాటు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

2023లో మయామిలోని ఒక ఆసుపత్రిలో వైద్యులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో నైట్ షిఫ్టులో పని చేసే డాక్టర్లు మూడు రోజుల పాటు వారి రోజు వారీ నిద్ర సమయం గంటన్నర అదనంగా నిద్రపోవడం వల్ల రెండు వారాల తర్వాత షిఫ్టులలో మెరుగ్గా పని చేసినట్లు తేలింది.

క్రీడాకారుల విషయంలోనూ ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

సెయిలింగ్ చేసే క్రీడాకారులు స్లీప్ బ్యాంకింగ్‌ను ఫాలో అవుతారు. అదనపు సమయం నిద్ర వల్ల సెయిలర్లు రెగట్టా పోటీల్లో లోపాలు చేయకుండా, వేగంగా పడవ నడిపారు.

మూడు వారాలు రోజుకు 10 గంటలు నిద్ర పోయే రగ్బీ ఆటగాళ్లు, తమపై శారీరక ఒత్తిడి తక్కువగా ఉందని చెప్పారు.

టెన్నిస్ ఆటగాళ్లు వారం రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోయినప్పుడు వారు సర్వీస్ బాగా పడినట్లు తేలింది.

5 నుంచి 7 వారాలు ఎక్కువ నిద్రపోయిన బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో షాట్ కొట్టే కచ్చితత్వం పెరిగింది. వాళ్లు వేగంగా పరుగెత్తగలిగారు.

నిద్ర లేమి, వారాంతాల్లో నిద్ర, క్రీడా నైపుణ్యం, స్లీప్ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిద్రకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిస్తే స్లీప్ బ్యాంకింగ్ సహాయపడుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

నిద్ర ఎందుకు అవసరం?

స్లీప్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ అది వివాదాస్పదంగానే ఉంది.

మనం ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నిద్రను తగ్గించుకునే ఉద్దేశంతో నిద్రను 'నిల్వ చేయడం' సాధ్యం కాదని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.

శరీరం నిజంగా భవిష్యత్ కోసం నిద్రను నిల్వ చేస్తుందా? లేక అంతకు ముందు శరీరానికి అందని నిర్ణీత గంటల నిద్రను భర్తీ చేస్తుందా అనేది గుర్తించడం కష్టమనేది వారి వాదన.

షిఫ్టు వర్కర్లలో స్లీప్ బ్యాంకింగ్ గురించి నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాలు చర్చకు దారి తీశాయి. దైనందిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వారి పనితీరు మెరుగుదలలో ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.

ఈ వాదనకు కారణం మన శరీరానికి నిద్ర ఎందుకు అవసరం అనే ప్రశ్న.

"మనం ఎందుకు నిద్రపోతాం అనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి" అని హాకెన్‌సాక్ మెరిడియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో స్లీప్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ పోలోస్ చెప్పారు

"నిద్రలో మన జీవక్రియ, హార్మోన్లు, నాడీ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిద్రపోయే సమయం మెదడుకు, మన ఆలోచనలను ఏకీకృతం చేయడానికి లేదా అందులో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన సమయం అని భావిస్తారు" అని ఆయన వివరించారు.

నిద్ర లేమి, వారాంతాల్లో నిద్ర, క్రీడా నైపుణ్యం, స్లీప్ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాత్రిపూట నిద్ర లేమితో బాధ పడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటు తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?

శారీరంగా చూస్తే మన శరీరంలోని వేల కోట్ల కణాలకు నిద్ర చాలా అవసరం

"మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ఇంధనం నింపడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఆరోగ్యకరమైన నిద్ర అవసరం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖేల్ హోవెల్ చెప్పారు.

"రోజంతా మన శరీరంలో, మెదడులో అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. మనం నిద్ర పోయినప్పుడు మెదడు వాటిని తుడిచి పెట్టేస్తుంది" అని హోవెల్ అన్నారు.

"అనేకమంది పెద్దవాళ్లు రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు బాగా పని చేస్తారని హోవెల్ చెప్పారు.

నాలుగైదు గంటలే నిద్రపోయే వాళ్లు చాలా అరుదుగా ఉంటారనేది ఆయన అభిప్రాయం.

అందుకే నిద్రలేమి, తీవ్రమైన నిద్ర లోపం చాలా హానికరం.

"మనకు ఒక గంట నిద్ర తక్కువైతే తట్టుకోలగం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితేనే సమస్య. దీని ప్రభావం మొత్తంగా మన పనితీరు మీద, సామాజిక జీవితం మీద పడుతుంది" అని పోలోస్ చెప్పారు.

తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు వ్యర్థాలను బయటకు పంపదు. అంటే మీరు సరిగ్గా నిద్రపోని రాత్రి తర్వాతి రోజు ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇబ్బంది పడవచ్చని హోవెల్ చెప్పారు.

శరీరంలో న్యూరోనల్ వేస్ట్‌ను బయటకు పంపడానికి మెదడుకు అవసరమైన మరింత సమయాన్ని స్లీప్ బ్యాంకింక్ ఇస్తుందని రుప్, ఆమె సహచరులు భావిస్తున్నారు.

అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడుకు అవసరమైన గ్లైకోజెన్ స్థాయిలను నింపడానికి కూడా అదనపు నిద్ర ఉపకరిస్తుందనేది వారి వాదన.

నిద్ర లేమి, వారాంతాల్లో నిద్ర, క్రీడా నైపుణ్యం, స్లీప్ బ్యాంక్

ఫొటో సోర్స్, Serenity Strull/ BBC

స్లీప్ బ్యాంకింగ్ మంచిదేనా?

నిద్ర మధ్యలో మెలకువ వచ్చే వారికెవరికైనా స్లీప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"మీరు కూడా స్లీప్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నించాలనుకుంటే, మీరు నిద్ర సరిపోని రోజులు ఎదురవుతాయని భావించినప్పుడు రోజుకు గంట సేపు అదనంగా నిద్రపోండి. అలా రెండు వారాలు అదనంగా మరో గంట నిద్ర పోయేందుకు ప్రయత్నించండి" అని హోవెల్ చెప్పారు.

ఇందుకోసం అలారంను ఆలస్యంగా లేచేందుకు వీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.

అయితే దీనికి విరుద్దంగా "కొంతమందికి ముందుగా పడుకోవడం మంచి వ్యూహం కావచ్చు. మీ శరీరం ఉదయం 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఉదయం 6 గంటలకు మేల్కొనే అవకాశం ఉంది" అని పోలోస్ చెబుతున్నారు.

నిద్ర లేమితో బాధ పడేవారి విషయంలో స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ క్లెర్మాన్ ఈ ఆలోచనను తోసిపుచ్చారు.

"స్లీప్ బ్యాంకింగ్ జరుగుతుందని చూపించడానికి, ఎవరైనా అలసిపోనప్పుడు నిద్రపోగలరని మీరు చూపించాలి. అందుకు ఎలాంటిన ఆధారాలు లేవు" అని ఆమె చెప్పారు.

స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తే, గతంలో బాగా నిద్రపోయిన వారు తర్వాతి కాలంలో తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భావించే అవకాశం ఉందని క్లెర్మాన్ ఆందోళన చెందుతున్నారు.

"అలా చేయడం వల్ల వారు తమ ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రాథమికమైన దాన్ని కోల్పోతారు" అని ఆమె విశ్లేషించారు.

మనం భవిష్యత్తు కోసం నిద్రపోతున్నామా లేదా మనం చెల్లించాల్సిన అప్పును తీర్చుకుంటున్నామా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి రాత్రి అదనంగా అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు చిన్న కునుకు తీయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

స్లీప్ బ్యాంకింగ్ పనిచేసినా అది దీర్ఘకాలిక పరిష్కారం కాదని పోలోస్ అంటున్నారు.

"పడుకునే, మేల్కొనే సమయాల క్రమబద్ధమైన షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. తగినంత పరిమాణంలో నాణ్యమైన నిద్రను ఆస్వాదించండి" అని పోలోస్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)