విజయవాడ: పీజీ వైద్య విద్యార్థిని మృతి.. విధుల్లో ఒత్తిడే కారణమంటున్న తండ్రి.. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే తేలుతుందంటున్న కాలేజ్ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌, విజయవాడ, సిద్ధార్ధ వైద్య కళాశాల, అనస్థీషియా విద్యార్థి, బత్తుల దీపిక, మృతి

ఫొటో సోర్స్, Deepika family

ఫొటో క్యాప్షన్, పీజీ వైద్య విద్యార్థిని దీపిక
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 5 నిమిషాలు

విజయవాడలోని సిద్ధార్ధ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా విద్యార్థిని బత్తుల దీపిక ఆకస్మిక మృతిపై ఆమె తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు.

విధుల్లో విపరీతమైన ఒత్తిడి కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి కోదండరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తుండగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఏ విషయం తెలుస్తుందని కళాశాల ప్రిన్సిపల్‌ ఎ.ఏడుకొండలు బీబీసీతో అన్నారు.

మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్న ఈ ఘటన వివరాలను సీఐ రమణతో పాటు ప్రిన్సిపల్‌ ఏడుకొండలు బీబీసీకి వెల్లడించారు.

‘అనంతపురం నగరానికి చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల చిన్న కుమార్తె దీపిక తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మూడో సంవత్సరం చదువుతున్నారు. మరో నాలుగు నెలల్లో ఎగ్జామ్స్‌ తర్వాత పీజీ పూర్తి కానుంది. సిద్ధార్ధ వైద్య కళాశాల పీజీ విద్యార్థులు.. అనుబంధ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తుంటారు.

'ఫిబ్రవరి 4న రాత్రి దీపికతో పాటు మరొక పీజీ జూనియర్‌ విద్యార్థిని ఆస్పత్రి విధుల్లో ఉన్నారు. వారితో పాటు మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కూడా నైట్‌ డ్యూటీలో ఉన్నారు. ఐదు గంటల నుంచి నైట్‌ డ్యూటీ మొదలువుతుంది. పగలు కూడా వాళ్లు రెగ్యులర్‌ డ్యూటీలో ఉన్నారు. నైట్‌ వచ్చిన మూడు కేసులు చూశారు. రాత్రి 9.30 నుంచి 10 గంటల లోపు బయటి నుంచి ఫుడ్‌ తెప్పించుకుతిన్నారు. ఆ తర్వాత డాక్టర్‌ దీపికతో పాటు మరొక పీజీ విద్యార్థిని ఎవరి వార్డుల్లో వారు విధులు నిర్వర్తించారు' అని ప్రస్తుతం ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వైద్య కశాశాల ప్రిన్సిపల్‌ ఏడుకొండలు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆపరేషన్‌ థియేటర్‌ వద్ద అచేతనంగా..

'బుధవారం అర్ధరాత్రి 1.30 కి ఇద్దరూ క్యాజువాలిటీలోకి వెళ్లి కేసులు చూడాలి. అయితే దీపిక తనకు కడుపులో బాగోలేదని, వాంతి వచ్చేలా ఉందని, క్యాజువాలిటీకి రాలేనని, డ్యూటీ రూంలోనే ఉంటానని చెప్పారు. తగ్గడానికి ఇంజక్షన్‌ చేయాలని చెప్పడంతో ఆ జూనియర్‌ విద్యార్థిని.. ఒక ఇంజక్షన్‌ చేశారు. ఆ తర్వాత జూనియర్‌ పీజీ విద్యార్థిని క్యాజువాలిటీకి వెళ్లి ఓ పేషెంట్‌ను పరీక్షించారు. పేషెంట్‌ పరిస్థితి చెప్పేందుకు తన సీనియర్‌ అయిన డాక్టర్‌ దీపికకు ఫోన్‌ కాల్‌ చేశారు. కానీ ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో జూనియర్‌ పీజీ విద్యార్థిని డ్యూటీ రూంకి రాగా, అక్కడ సీనియర్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ దీపిక కనిపించలేదు. ఎదురుగా ఉన్న ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లో ఓ బల్ల మీద ఎడమవైపు వాలి పడిపోయి కనిపించింది' అని డాక్టర్‌ ఏడుకొండలు తెలిపారు.

శరీరంపై గాయాలు ఏమీ లేవు..

''దీపిక పల్స్, బీపీ చూసే సరికి అపస్మారక స్థితిలో ఉన్నట్టు అర్ధమైంది. వెంటనే డాక్టర్లు వచ్చి సీపీఆర్‌ చేశారు. వెంటిలేటర్‌ కనెక్షన్‌ కూడా ఇచ్చారు. లైఫ్‌ సపోర్టింగ్‌ మెడికేషన్‌ మొత్తం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయారు. తెల్లవారుజామున 3.30 సమయంలో దీపిక తల్లిదండ్రులకు సమాచారం పంపాం.

బల్ల మీద వాలి పడిపోవడం వల్ల తలకు ఏమైనా దెబ్బలు తగిలాయామోనని సీటీ స్కాన్‌ కూడా చేశాం.. కానీ రిపోర్ట్‌లో దెబ్బలు తగిలినట్టు లేదు'' అని ఏడుకొండలు వివరించారు.

సిద్ధార్ధ వైద్యకళాశాల, విజయవాడ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సిద్ధార్ధ వైద్యకళాశాల, విజయవాడ

పోస్టుమార్టం రిపోర్ట్‌ వస్తేనే..

''దీపిక పడిపోయిన ఎమర్జెన్సీ థియేటర్‌ వద్ద బల్ల పక్కన ఓ ఖాళీ సిరంజి కనపడింది. ఆ సిరంజి ఏంటో పరిశీలిస్తున్నాం.. ఆమె ఆ సిరంజి తీసుకున్నారా.. ఒకవేళ తీసుకుంటే దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా.. ఒక వేళ నైట్‌ తీసుకున్న డైట్‌ వల్లనా.. లేదా జూనియర్‌ పీజీ స్టూడెంట్‌ చేసిన ఇంజక్షన్‌ వికటించిందా.. అని అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తేనే తెలుస్తుంది'' అని ఏడుకొండలు బీబీసీతో అన్నారు. ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని తోటి విద్యార్థులు చెబుతున్నారని డాక్టర్‌ ఏడుకొండలు చెప్పారు.

కేసు దర్యాప్తు చేస్తున్నాం: సీఐ

దీపిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మాచవరం సీఐ రమేష్‌ తెలిపారు.

5వ తేదీ గురువారం సాయంత్రానికి పోస్ట్‌మార్టం పూర్తయిందనీ, అయితే రిపోర్ట్‌ రావడానికి మూడువారాల సమయం పడుతుందని చెప్పారు.

దీపిక

ఫొటో సోర్స్, Deepika family

ఫొటో క్యాప్షన్, తల్లితండ్రులతో దీపిక

ఆస్పత్రి వాళ్లు తప్పుగా సమాచారం చెబుతున్నారు: దీపిక తండ్రి ఆరోపణ

'ఇంజక్షన్‌ వల్లే మా పాప చనిపోయినట్టుగా కాలేజీ వాళ్లు, ఆస్పత్రి వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు.. వాళ్లు చెబుతున్నట్టుగానే ఇంజక్షన్‌ తీసుకున్న తర్వాత కూడా పాప వార్డు నుంచి ఎమర్డెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ వరకూ నడుచుకుంటూ వెళ్లింది కదా.. అంటే ఇంజక్షన్‌ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్టు కదా' అని డాక్టర్‌ దీపిక తండ్రి కోదండరామిరెడ్డి బీబీసీతో అన్నారు.

‘బుధవారం ఉదయం 9 గంటల నుంచి మా పాప కంటిన్యూస్‌గా డ్యూటీ చేసింది.. పని ఒత్తిడి వల్ల తీవ్ర నీరసానికి గురై ఇబ్బంది పడిందేమో కదా.. ఆ విషయం చెప్పకుండా ఇంజక్షన్లు, ఖాళీ సిరంజి దొరికింది.. అని చెప్పడం అన్యాయం' అని ఆయన అన్నారు.

'వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ నాతో ఫోన్‌లో మాట్లాడి.. సమగ్రంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు' అని కోదండరామిరెడ్డి తెలిపారు.

దీపిక తండ్రి ఆరోపణలపై కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పీజీ మెడిసిన్ విద్యార్థులందరికీ.. కళాశాలలో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఆసుపత్రిలో పని వేళలు.. మొత్తంగా అలానే ఉంటాయని స్పష్టం చేశారు.

పని ఒత్తిడి వల్ల అర్థంతరంగా.. అది కూడా ఆ వయసులో తనువు చాలించే పరిస్థితి ఉండదని డాక్టర్ కె.సుధాకర్ బీబీసీతో అన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే అసలు విషయం తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రఘునందన్‌ను బీబీసీ సంప్రదించగా తనకు ఇంకా సమాచారం లేదని చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)