ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్.. విశేషాలివే..

ఇంగ్లండ్ , ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ,భారత్, శ్రీలంక, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌-2026 కు సమయం సమీపిస్తోంది.

భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నమెంట్‌లో అడుగుపెడుతోంది.

తమకు అలవాటైన పరిస్థితుల మధ్య ఆడనుండడంతో భారత జట్టు టోర్నమెంట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

అయితే, అనూహ్యంగా మారిపోయే టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కాబట్టి, ఈ టోర్నమెంట్ ఏకపక్షంగా కాకుండా రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది.

మరోవైపు భారత్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడకూడదనే తన నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ తాజాగా వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 వరల్డ్ కప్ ఎప్పుడు మొదలవుతుంది?

ఫిబ్రవరి 7న, ఉదయం 11 గంటలకు.. నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబోలో జరగేది ఈ టోర్నీలో తొలి మ్యాచ్. అదే రోజు.. వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మధ్యాహ్నం 3 గంటలకు, ఇండియా, యూఎస్ఏ మధ్య రాత్రి 7గంటలకు మ్యాచ్‌లు జరుగుతాయి.

మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో గ్రూపుకు 5 జట్లు చొప్పున 4 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్(లీగ్) దశలో రోజుకు 3 మ్యాచ్‌ల చొప్పున జరగనున్నాయి. ఈ దశలో చివరి రోజున రాత్రి 7 గంటలకు ఆఖరి మ్యాచ్ జరుగుతుంది.

లీగ్ దశ నుంచి 8 జట్లు సూపర్‌ 8కు చేరుకుంటాయి. ఈ దశలో రోజుకు ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లేదా, రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత, మార్చి 4, 5 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి.

మార్చి 8వ తేదీ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ టీ20 ప్రపంచ కప్‌‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి.

లీగ్ దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ 8కి చేరుకుంటాయి.

భారత్, శ్రీలంకలో జరిగే ఈ టోర్నమెంట్‌లో సూపర్ 8 దశలో 4 జట్లు చొప్పున రెండు గ్రూపులుగా మ్యాచ్‌లు జరుగుతాయి.

సూపర్ 8లో, ప్రతి గ్రూప్‌లో మొదటి 2 జట్లు సెమీస్‌కు వెళ్తాయి. సెమీస్‌లో ప్రతి గ్రూప్ విజేత మరొక గ్రూప్ రన్నరప్‌తో తలపడుతుంది.

రెండు దశల్లోనూ గెలిచిన జట్టుకు 2 పాయింట్లు, ఫలితం తేలకుంటే చెరొక పాయింట్ వస్తాయి. ఓడిపోయిన జట్టుకు పాయింట్లేమీ ఉండవు.

ఏయే జట్లు పోటీపడుతున్నాయి?

ఇటలీ ఒక్కటే ఈ టోర్నమెంట్‌లో మొదటిసారి ఆడుతున్న జట్టు కాగా, కెనడా 2014 తర్వాత మొదటిసారి ప్రపంచ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా తమ జట్టు ఆడబోయే మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలన్న అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించడంతో బంగ్లాదేశ్ జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు దక్కింది.

పాకిస్తాన్ కూడా పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని అనుకున్నప్పటికీ , ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) స్పందించాల్సి ఉంది.

2024లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. భారత్, పాకిస్తాన్ జట్లు తటస్థ వేదికలపై తలపడతాయి.

లీగ్ దశలో 20 జట్లు, 4 గ్రూపులు:

గ్రూప్ ఏ: భారత్, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్, అమెరికా

గ్రూప్ బీ: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే

గ్రూప్ సీ: ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్, వెస్టిండీస్

గ్రూప్ డీ: అఫ్గానిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ప్రపంచ కప్‌ వేదికలు:

మొత్తం 8 చోట్ల మ్యాచ్‌లు జరగనున్నాయి. వాటిలో ఐదు వేదికలు భారత్‌లో, మూడు శ్రీలంకలో ఉన్నాయి.

భారత్‌లో.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

శ్రీలంకలో.. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్దదైన, 1,32,000 మంది సీటింగ్ సామర్థ్యమున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.

పాకిస్తాన్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్ కొలంబోలో నిర్వహించనున్నారు.

గత టీ20 ప్రపంచ కప్ విజేతలు..

ఇప్పటివరకు తొమ్మిది టీ20 మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లు జరిగాయి. వీటిలో 6 జట్లు విజేతలుగా నిలిచాయి.

  • 2007 - భారత్
  • 2009 - పాకిస్తాన్
  • 2010 - ఇంగ్లండ్
  • 2012 - వెస్టిండీస్
  • 2014 - శ్రీలంక
  • 2016 - వెస్టిండీస్
  • 2021 - ఆస్ట్రేలియా
  • 2022 - ఇంగ్లండ్
  • 2024 - భారత్

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)