సముద్రంలో కొట్టుకుపోయిన అమ్మ, తమ్ముడు, చెల్లెలిని 13 ఏళ్ల కుర్రాడు నాలుగు గంటల పాటు 4 కిలోమీటర్ల దూరం ఈది కాపాడాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెరీనా కొబినా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియా తీరంలో సముద్రంలో కొట్టుకుపోయిన తన తల్లి, ఇద్దరు తోబుట్టువులను కాపాడటానికి 13 ఏళ్ల బాలుడు మసకవెలుతురులో నాలుగు కిలోమీటర్ల దూరం ఈదుకుంటూ వెళ్లాడు.
పశ్చిమ ఆస్ట్రేలియాకు దక్షిణాన ఉన్న జియోగ్రాఫ్ బే వద్ద గత శుక్రవారం ఓ కుటుంబం పెడల్ బోర్డింగ్, కయాకింగ్ చేస్తుండగా బలమైన గాలులకు వారు వెళ్తున్న ఇన్‌ఫ్లేటబుల్స్ దారితప్పాయని పోలీసులు తెలిపారు.
దాంతో సహాయం కోరేందుకు ఆ కుర్రాడు తీరానికి తిరిగి రావాలని ప్రయత్నించాడు. కానీ అతని కాయక్‌లో నీరు చేరడంతో సాధ్యం కాక మిగిలిన 4 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చాడు.
"ఈ కుటుంబం చూపిన ధైర్యం, బలం, సాహసం అసాధారణమైనవి. ముఖ్యంగా సహాయం కోరేందుకు 4 కిలోమీటర్లు ఈదిన ఆ చిన్న కుర్రాడు నిజంగా అద్భుతం" అని నేచురలిస్ట్ వాలంటీర్ మెరైన్ రెస్క్యూ గ్రూప్ తెలిపింది.
ఆ సంస్థ కమాండర్ పాల్ బ్రెస్లాండ్ ఆ యువకుడిని "సూపర్ హ్యూమన్"గా అభివర్ణించారు.

"లైఫ్ జాకెట్‌తో మొదటి రెండు గంటలు ఈదాను, కానీ లైఫ్ జాకెట్ ఉంటే ముందుకు సాగలేననిపించింది. అందుకే తర్వాత రెండుగంటలు లైఫ్ జాకెట్ తీసేసి ఈదాను" అని ఆ బాలుడు ఏబీసీ న్యూస్‌తో చెప్పాడు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఆ బాలుడు అలారం మోగించగలిగాడు. దీంతో బస్సెల్టన్ సమీపంలోని క్విండాలప్ బీచ్‌లో సముద్రంలో చిక్కుకుపోయిన బాలుడి కుటుంబ సభ్యులకోసం అన్వేషణ మొదలుపెట్టామని డబ్ల్యూఏ పోలీసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ బాలుడి 47 ఏళ్ల తల్లి, 12 ఏళ్ల సోదరుడు, 8 ఏళ్ల సోదరిని సుమారు రాత్రి 12:30 గంటల సమయంలో రెస్క్యూ హెలికాప్టర్ గుర్తించింది. వారు తీరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఒక పెడల్ బోర్డును పట్టుకుని ఉన్నారు.
"వలంటీర్ మెరైన్ రెస్క్యూ బోటును వారున్న చోటుకు పంపించాం. ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు" అని ఆ పోలీసులు తెలిపారు.
"సముద్రంలో పరిస్థితులు ఎంత వేగంగా మారవచ్చో అన్నదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ" అని ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బ్రాడ్లీ అన్నారు.
"అదృష్టవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయిన ముగ్గురూ లైఫ్ జాకెట్లు ధరించి ఉండటం వల్ల వారు ప్రాణాలతో బయటపడ్డారు. 13 ఏళ్ల బాలుడు చేసిన పనిని ఎంత ప్రశంసించినా తక్కువే. అతని పట్టుదల, ధైర్యమే అతని తల్లి, తోబుట్టువుల ప్రాణాలు కాపాడాయి" అని ఆయన స్థానిక మీడియాకు చెప్పారు.
పారామెడిక్స్ ఆ కుటుంబాన్ని పరీక్షించిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
తరువాత వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి, కృతజ్ఞతలు చెప్పేందుకు మెరైన్ రెస్క్యూ బృందాన్ని కలిసినట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














