పాక్, చైనాలతో పోలిస్తే భారత రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువా, తక్కువా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మొహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
రక్షణ రంగానికి 2026-27 బడ్జెట్‌లో కేటాయింపులు దాదాపు 15 శాతం పెంచారు. గత ఏడాది రక్షణ రంగ బడ్జెట్ రూ. 6,81,210 కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెట్‌లో అది రూ. 7,84,678 కోట్లకు పెరిగింది.
క్యాపిటల్ అవుట్‌లేకు భారీగా కేటాయింపులు పెరిగాయి. ఇవి 21.84 శాతానికి చేరాయి. ఇంతకుముందు రూ. 1.80 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.2.19 లక్షల కోట్లకు పెరిగింది.
ఆయుధాలు, పరికరాల కొనుగోలు, అమ్మకాలకు క్యాపిటల్ అవుట్‌లే ద్వారా నిధులు సమకూరుతాయి.
రక్షణ సర్వీసులు (రెవెన్యూ) కేటాయింపులు 17.24 శాతం పెరిగాయి. గతంలో రూ. 3.11 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 3.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నిర్వహణ, ఇంధనం, మరమ్మత్తులు, జీతాలతో సహా రోజువారీ వ్యవహారాల ఖర్చులు రక్షణ సర్వీసులు(రెవెన్యూ) కిందకు వస్తాయి.
రక్షణ పెన్షన్‌ను 6.53 శాతం పెంచారు. దీంతో అది రూ.1.71 లక్షల కోట్లకు చేరింది.

15శాతం పెరుగుదలతో కలిగే ప్రయోజనం ఏంటి?
గత ఏడాది మేలో భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో రక్షణ బడ్జెట్ 15 శాతం పెరిగింది.
పహల్గామ్ కాల్పుల తరువాత, పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు భారత్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు భారతదేశం "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది.
ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరిగింది. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీఎంఓ)విజ్ఞప్తి తర్వాత సైనిక ఘర్షణ ఆగిపోయిందని భారత సైన్యం తెలిపింది.
అప్పటి నుంచి తన రక్షణ బడ్జెట్‌ను భారత్ పెంచవచ్చని ఊహాగానాలు వచ్చాయి.
రక్షణ బడ్జెట్‌లో పెరుగుదలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతించారు.
"ఈ బడ్జెట్ భారత రక్షణ సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది. రక్షణ రంగానికి 7.85 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు" అని ఆయన అన్నారు .

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్ అవసరాలను రక్షణ రంగ బడ్జెట్ తీరుస్తుందా?
రక్షణ బడ్జెట్‌లో 15శాతం పెరుగుదల అన్ని అవసరాలను తీరుస్తుందా? అంటే పెరిగిన కేటాయింపులు కావాల్సినస్థాయిలో లేవని రక్షణరంగ విశ్లేషకులు రాహుల్ బేదీ సమాధానమిచ్చారు.
‘‘ ద్రవ్యోల్బణం రేటు నిరంతరం పెరుగుతోంది. రూపాయి బలహీనపడుతుండటం కూడా ఆందోళన కలిగించే విషయం. ఈ కోణం నుంచి చూస్తే 15 శాతం పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనం సున్నాగా భావించాలి. అందుకే ఈ బడ్జెట్‌ను ఫ్లాట్ బడ్జెట్ అనాలి'' అని రాహుల్ బేదీ అన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ సమయంలో డ్రోన్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన భిన్నమైన యుద్ధం కనిపించింది.
భారత సాయుధ దళాలు నెట్-సెంట్రిక్ నుంచి డేటా-సెంట్రిక్ వార్‌ఫేర్‌కు మారుతున్నాయని, భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కృత్రిమ మేధస్సు కీలకమైన వ్యవస్థగా అవతరిస్తోందని గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో సీడీఎస్ జనరల్ అనీల్ చౌహాన్ అన్నారు.
అధునాతన సెన్సార్లు, ఏఐ సాంకేతికత యుద్ధరంగంలో దాదాపుగా పూర్తి పారదర్శకతను తీసుకువస్తున్నాయని, సాంకేతిక ఆధిపత్యం అవసరమని ఆయన అన్నారు.
అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదని, మారుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సైనిక నాయకత్వం మేధోపరంగా సిద్ధంగా ఉండాలని, ఆ పద్ధతులను అవలంబించాలని ఆయన సూచించారు.
మరి రక్షణరంగ బడ్జెట్ ఈ భవిష్యత్ అవసరాలన్నింటినీ తీరుస్తుందా?
భారత్ 114 కొత్త యుద్ధ విమానాలు, ఆరు జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవలసి ఉందని రక్షణరంగ విశ్లేషకులు రాహుల్ బేదీ అన్నారు.
"ఆరు జలాంతర్గాముల కోసం జర్మనీతో 10 బిలియన్ డాలర్ల ఒప్పందం ఉంది. 114 కొత్త యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం 30-35 బిలియన్ డాలర్ల ఒప్పందం ఎవరితో జరుగుతుందో ఇంకా నిర్ణయించలేదు. దీని కోసం డబ్బు ఒకేసారి ఖర్చు చేయరు. కానీ దాని కోసం బడ్జెట్ కేటాయించాలి, చర్చలు జరగాలి" అని ఆయన చెప్పారు.
"'ఆపరేషన్ సిందూర్' తర్వాత నుంచి ఆర్మీ చీఫ్, సీడీఎస్, రక్షణ మంత్రి, ప్రధాని అందరూ సైన్యాన్ని సాంకేతికంగా ఆధునికీకరిస్తామని చెబుతున్నారు. దీనికి చాలా డబ్బు అవసరం. బడ్జెట్ కేవలం 15 శాతం పెరుగుదలతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం'' అని విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకంతకూ పెరుగుతోన్న రక్షణ వ్యయం
కేంద్రబడ్జెట్‌లో రక్షణ మంత్రిత్వశాఖకు అత్యధిక కేటాయింపులు జరిగాయని, గత ఏడాది ఇది 13.45 శాతంగా ఉండగా, ఇప్పుడు వాటా 14.68 శాతానికి పెరిగిందని ‘ది వీక్’ ఆంగ్ల పత్రిక సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ సంజీబ్ కుమార్ బరువా చెప్పారు.
"రక్షణ బడ్జెట్ చర్చలు అంత తేలిక కాదు. రక్షణ రంగానికి కేటాయించాల్సిన నిధుల గురించి చర్చించేముందు అనేక అంశాలు ఆమెను లోతుగా ఆలోచింపచేసి ఉండాలి. 'ఆపరేషన్ సిందూర్', ఆ తర్వాత పరిస్థితి, చైనా వేగంగా సాంకేతిక, సైనిక పురోగతి సాధించడం, భారత్ స్వావలంబన లక్ష్యం, అత్యాధునిక సైనిక పరికరాల అత్యవసర అవసరం వంటివి"
"2026–27 సంవత్సరానికి ఈ కేటాయింపు గత ఏడాది రక్షణ బడ్జెట్ అయిన రూ.6.81 లక్షల కోట్ల కంటే 15.27% ఎక్కువ. ఇది రక్షణ వ్యయం పెరుగుతూనే ఉంటుందని, సైనిక ఆధునీకరణ మరింత వేగవంతం అవుతుందని సూచిస్తుంది" అని ఆయన విశ్లేషించారు.
ఆధునికీకరణకు కేవలం యుద్ధ విమానాలు లేదా జలాంతర్గాములను కొనుగోలు చేయడం సరిపోతుందా? "ఇప్పుడు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, జలాంతర్గాములతో పాటు డ్రోన్లు, సైబర్ యుద్ధాల ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం, జలాంతర్గాములు, యుద్ధ విమానాల కొరత ఉంది" అని రాహుల్ బేదీ అన్నారు.
"భారత వైమానిక దళం 42 ఫైటర్ స్క్వాడ్రన్లకు ఆమోదం పొందింది. కానీ ఇప్పుడు 29-30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఒక స్క్వాడ్రన్‌లో దాదాపు 20 విమానాలు ఉంటాయి కాబట్టి 250-300 విమానాలు అవసరమని అంచనా వేయవచ్చు. జలాంతర్గాములు పాతవైపోయాయి. వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. హెలికాప్టర్లు, శిక్షణ విమానాలు పాతవయ్యాయి. వాటిని మార్చాల్సిన అవసరం ఉంది"
"ఇవన్నీ గమనిస్తే చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నింటికోసం బడ్జెట్‌లో డబ్బు అవసరం" అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, AFP
‘పాకిస్తాన్ బడ్జెట్ తక్కువే అయినా...’
గత ఏడాది మే నెలో భారత్‌తో ఘర్షణ తర్వాత, జూన్‌లో పాకిస్తాన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి తన రక్షణరంగ బడ్జెట్‌ను 20.2 శాతం పెంచింది.
పాకిస్తాన్ రక్షణరంగ బడ్జెట్‌ను 2122 బిలియన్ పాకిస్తానీ రూపాయల నుంచి 2550 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు పెంచింది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది పాకిస్తాన్ జీడీపీలో 1.97 శాతం.
2024లో చైనా రక్షణరంగ బడ్జెట్ దాని జీడీపీ 18.74ట్రియలియన్ డాలర్లలో 1.7 శాతంగా ఉంది. 2024లో బంగ్లాదేశ్ రక్షణరంగ బడ్జెట్ దాని జీడీపీ 450 బిలియన్ డాలర్లలో కేవలం 0.9 శాతంగా ఉంది .
భారతదేశం రక్షణ బడ్జెట్ మొత్తం జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లలో 1.9 శాతం.
ఈ గణాంకాలను పరిశీలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రక్షణరంగ బడ్జెట్లు భారత్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. భారత్ రక్షణ బడ్జెట్ చైనా కంటే చాలా తక్కువగా ఉంది.
"మన బడ్జెట్ కంటే చైనా బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే పాకిస్తాన్ బడ్జెట్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా భారత్ పొరుగున ఉన్న అనేక దేశాలకు చైనా సాయమందిస్తుంది. కాబట్టి ఇలాంటి పోలికలు చేయలేం'' అని రాహుల్ బేదీ విశ్లేషించారు.
భారతదేశ అవసరాలకు సంబంధించి రక్షణరంగ బడ్జెట్ ఎలా ఉండాలి? అంటే జీడీపీలో 3 శాతానికి చేరుకోకపోతే, రక్షణరంగ అవసరాలను తీర్చడం కష్టమని రాహుల్ బేదీ అంటున్నారు.
"1962లో చైనాతో యుద్ధం జరిగినప్పటి నుంచి, జీడీపీలో, రక్షణ రంగ బడ్జెట్ ఈ సంఖ్య చుట్టూనే ఉంది. మన దేశ జీడీపీ కచ్చితంగా చాలా రెట్లు పెరిగింది, కానీ రక్షణ బడ్జెట్ కేవలం 2 శాతానికి మాత్రమే చేరుకుంది. రక్షణరంగానికి కేటాయింపుల డిమాండ్ మొత్తం జీడీపీలో 3 శాతంగా ఎప్పుడూ ఉంటుంది'' అని ఆయన చెప్పారు.
"మనం వీలైనంత త్వరగా సైన్యాన్ని ఆధునికీకరించాలనుంటే, రక్షణ బడ్జెట్ మొత్తం జీడీపీలో 3 శాతం ఉండాల్సిందే'' అని ఆయన విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














