బంగారం, వెండి ధరల భారీ తగ్గుదలకు కారణమేంటి, మళ్లీ పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల తగ్గుదల

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 6 నిమిషాలు

ఆకాశన్నంటుతున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం (జనవరి30న) భారీగా పతనమయ్యాయి. ఈ ఒక్కరోజే బంగారం 12 శాతం, వెండి 26 శాతం, ప్లాటినం 18 శాతం తగ్గాయి.

మునుపటి ర్యాలీ బంగారం, వెండి ధరల చరిత్రాత్మక పెరుగుదలకు దారితీసింది.

"ఇది మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం లాంటిది. ఈ పరిస్థితి కొత్తదేమీ కాదు. ఇలాంటి సందర్భంలో గందరగోళం, అనిశ్చితి ఉంటుంది. అందరూ స్పష్టత కోసం చూస్తున్నారు" అని పన్మురే లిబెరంలో కమోడిటీస్ ఎనలిస్ట్ టామ్‌ప్రైస్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు.

"ఖరీదైన లోహాల చరిత్రలో అత్యంత అస్థిరమైన నెల" ఇది అని, నెల ముగింపులో (జనవరి 29,30) భారీ హెచ్చుతగ్గులొచ్చాయని ఎంకేఎస్ పాంప్ కంపెనీలో విశ్లేషకురాలు నిక్కీ షీల్స్ అన్నారు.

వెనెజ్వెలా నుంచి గ్రీన్‌లాండ్, ఇరాన్ వరకు ప్రపంచ సంక్షోభాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనిశ్చిత వైఖరిపై పెరుగుతున్న ఆందోళనలు పెట్టుబడిదారులను విలువైన లోహాల వైపు మళ్లించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం, వెండి, రాగి, ధరలు, డాలర్, అమెరికా, ఫెడరల్ రిజర్వ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడం బంగారం ధరలపై ప్రభావం చూపిందని నిపుణులు భావిస్తున్నారు.

అంచనాలకు అతీతంగా

"ప్రతిరోజూ ఊహించని విషయాలు జరుగుతున్నాయి. ఇది చాలా వేగంగా, భారీ స్థాయిలో జరిగింది" అని విశ్లేషకురాలు నిక్కీ షీల్స్ అన్నారు.

"గతంలోని భారీ ధరలను దృష్టిలో పెట్టుకుంటే భారీ అస్థిరతను కూడా ఊహించాల్సి ఉంటుంది’’ అని పిక్టెట్ సీనియర్ మల్టీ-అసెట్ స్ట్రాటజిస్ట్ అరుణ్ సాయి ఫైనాన్షియల్ టైమ్స్‌తో అన్నారు.

బంగారం,వెండి ధరలు బాగా పెరిగిన తరువాత అవి తగ్గే అవకాశం కూడా ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తూనే ఉన్నారు. తాజా ధరల పతనం ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచాయి.

బంగారం, వెండి, రాగి, ధరలు, డాలర్, అమెరికా, ఫెడరల్ రిజర్వ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బంగారం, వెండి ధరల తగ్గుదల రాగి, ఇతర లోహాల ధరలపై ప్రభావం చూపింది.

రికార్డు స్థాయిలో తగ్గుదల

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల వల్ల మార్కెట్ నిరంతరం కుదుపులకు లోనవుతోంది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు 60 శాతం పెరిగాయి .

గత ఏడాది నుంచి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల డిమాండ్ పెరిగి రికార్డులమీద రికార్డులు సృష్టించింది.

ఈ పెరుగుదల అనుభవజ్ఞులైన వ్యాపారులను కూడా ఆశ్చర్యపరిచింది. ధరలలో భారీ హెచ్చుతగ్గులకు కారణమైంది.

కరెన్సీల విలువ బలహీనపడడం, ఫెడరల్ రిజర్వ్ స్వేచ్ఛపై ఆందోళనలు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో జనవరిలో హెచ్చుతగ్గులు తీవ్రమయ్యాయి.

బంగారం, వెండి, రాగి, ధరలు, డాలర్, అమెరికా, ఫెడరల్ రిజర్వ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కెవిన్ వార్ష్

ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌ నియామక ప్రభావం

ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను ప్రతిపాదించిన వార్తే ‘ ఈ భారీ పతనానికి’’ కారణమైందని, కానీ అంతకుముందే మార్కెట్ పడిపోవడానికి కావాల్సిన పరిస్థితి తయారై ఉందని, ఈ వార్త కేవలం ఓ సాకు మాత్రమేనంటూ ఓవర్‌సీస్ -చైనీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వ్యూహకర్త క్రిస్టోఫర్ వాంగ్‌ను ఉంటకిస్తూ బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కూడా ట్రంప్ ప్రకటనను స్వాగతించారు. ఈ క్లిష్ట సమయాల్లో ప్రపంచంలోని అత్యంత కీలకమైన సెంట్రల్ బ్యాంకును నడిపించడానికి కెవిన్ ఒక అద్భుతమైన ఎంపిక అని ఆయన అన్నారు.

పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారనే అంచనా కూడా ఉంది.

''సంప్రదాయ ఆర్థిక వేత్తగా భావించే వార్ష్ నేతృత్వంలోని ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణంపై కఠినమైన నియంత్రణ కొనసాగించే అవకాశం ఉందని కొందరు పెట్టుబడిదారులు వాదిస్తున్నారు. డాలర్ బలహీనపడడం కూడా బంగారంలో పెట్టుబడులు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది'' అని ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది.

బంగారం, వెండి, రాగి, ధరలు, డాలర్, అమెరికా, ఫెడరల్ రిజర్వ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనవరిలో బంగారం 13 శాతం లాభపడగా, వెండి 19 శాతం పెరిగింది.

బంగారం, వెండి ‘ఓవర్‌బాట్’

డాలర్ బలపడితే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోతాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయని, ఆస్ట్రేలియా డాలర్, స్వీడిష్ క్రోనా వంటి కమోడిటీ కరెన్సీలలో అమ్మకాలు జరగడంతో డాలర్ బలపడిందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగుస్తుంది. ఆయన తర్వాత ఫెడ్ చైర్మన్‌గా కెవిన్ వార్ష్ నామినేట్ అయ్యారనే వార్తలతో డాలర్ విలువ పెరిగింది.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, సెనేట్ డెమోక్రాట్ల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ముప్పు నుంచి మరోసారి బయటపడింది.

ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ సంకేతాలివ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా తగ్గాయి.

బంగారం, వెండి తగ్గుదలకు మరొక కారణం ఇవి "ఓవర్‌బాట్ (ధర బాగా పెరిగిన స్థితి)"కి చేరాయి. వాటి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్(ఆర్ఎస్ఐ)90కి చేరుకుంది. ఇటీవలి దశాబ్దాల్లో ఇది అత్యధిక స్థాయి.

ఆర్ఎస్ఐ 70 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దాని అర్థం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ధరలు విపరీతంగా పెరిగాయని, దిద్దుబాటు అవసరమని.

అయితే శుక్రవారం(జనవరి 30) తగ్గుదల తర్వాత కూడా మొత్తంగా ఈ నెలలో బంగారం 13 శాతం లాభపడగా, వెండి 19 శాతం పెరిగింది.

బంగారం, వెండి, రాగి, ధరలు, డాలర్, అమెరికా, ఫెడరల్ రిజర్వ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగారం ధరల పెరుగుదలలో చైనా పెట్టుబడిదారులు కీలక పాత్ర పోషించారు.

మెటల్ మార్కెట్‌పై ప్రభావం

లోహాల మార్కెట్‌లో ఈ క్షీణత ప్రధాన మైనింగ్ కంపెనీల షేర్లపై కూడా ప్రభావం చూపింది. భారత స్టాక్ మార్కెట్‌లో బంగారం, వెండి ఈటీఎఫ్‌లు దాదాపు 10 శాతం తగ్గాయి. రాగి షేర్లు కూడా బాగా పడిపోయాయి.

న్యూయార్క్ ట్రేడింగ్‌లో న్యూమాంట్ కార్ప్, బార్రిక్ మైనింగ్ కార్ప్, అగ్నికో ఈగిల్ మైన్స్ వంటి ప్రధాన బంగారం కంపెనీల షేర్లు 10 శాతానికి పైగా పడిపోయాయి.

న్యూయార్క్‌లో స్పాట్ బంగారం 8.9 శాతం తగ్గి ఔన్సుకు 4,894.23 డాలర్ల దగ్గర ముగిసింది.

వెండి ధర 26 శాతం తగ్గి ఔన్సుకు 85.20 డాలర్ల దగ్గర ముగిసింది. ప్లాటినం, పల్లాడియం కూడా తగ్గాయి.

బ్లూమ్‌బర్గ్ డాలర్ స్పాట్ ఇండెక్స్ 0.9 శాతం పెరిగింది.

లండన్ మెటల్ ఎక్సేంజ్‌లో రాగి టన్నుకు 13,157.50 డాలర్ల వద్ద ముగిసింది. గురువారం ఇది టన్నుకు 14,000డాలర్ల పైన పెరిగింది. 2008 తర్వాత ఒకరోజులో ఇది అతిపెద్ద లాభం. ఆ తర్వాత అది పడిపోయింది.

''రాబోయే కాలంలో హెచ్చు తగ్గులు కొనసాగుతాయనడానికి మనం సిద్ధంగా ఉండాలి" అని హెరాయస్ ప్రీషియస్ మెటల్స్ ట్రేడింగ్ హెడ్ డొమినిక్ స్పెర్జెల్ చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

బంగారం ధరల పెరుగుదలలో చైనా పెట్టుబడిదారులు కీలక పాత్ర పోషించారు. వారి భారీ కొనుగోళ్ల కారణంగా, షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ విలువైన, పారిశ్రామిక లోహాల పెరుగుదలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకోవాల్సివచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)