'ఇంకా ఐదు నిమిషాలే.. ఆ తర్వాత, నన్నెప్పటికీ చూడలేవ్’, భార్యతో భర్త అన్న ఆ క్షణం..

కోల్‌కతా, అగ్నిప్రమాదం, ఫైర్

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

ఫొటో క్యాప్షన్, మౌసమీ హాల్దార్
    • రచయిత, ఇల్మా హసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

'ఆయన ఇక లేరని అర్థమైంది'

కోల్‌కతాలోని ఆనంద్‌పూర్ ప్రాంతంలో సోమవారం (జనవరి 26) ఉదయం రెండు గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారు చెబుతున్న మాటలివి.

ఈ ప్రమాదం జరిగి నాలుగు రోజులవుతున్నా.. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది కనిపించకుండా పోయారు? అనే విషయాలను అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతుండగా.. సరైన సమాచారం చెప్పకపోతుండడం మరింత బాధగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26న తెల్లవారుజాము 3 గంటల సమయంలో పుష్పాంజలి డెకరేటర్స్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఆ గోడౌన్ పక్కనే ఉన్న ''వావ్ మోమో'' అనే ఫుడ్ చెయిన్‌ సంస్థకు చెందిన గోడౌన్‌కు కూడా వ్యాపించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అదే గోడౌన్ కాంప్లెక్స్‌లో మౌసమీ హాల్దార్ భర్త పంకజ్ పనిచేస్తున్నారు. తన భర్త తనకు తెల్లవారుజామున 3.11 గంటలకు ఫోన్ చేశారని మౌసమీ చెప్పారు.

''మంటలు చెలరేగినట్లు ఆయన చెప్పారు. త్వరగా బయటికి వచ్చేయండని నేను ఆయనతో అన్నా. ఆ తర్వాత, కాల్ కట్ అయిపోయింది'' అని తెలిపారు.

తిరిగి మౌసమీ కాల్ చేయగానే, పంకజ్ ఫోన్ ఎత్తారు.

అప్పుడు ఆయన, ''ఇంకా ఐదు నిమిషాలే ఉంది. ఆ తర్వాత, నువ్వు నన్నెప్పటికీ చూడలేవని ఆయన నాతో అన్నారు'' అని మౌసమీ తెలిపారు.

కోల్‌కతా, అగ్నిప్రమాదం, ఫైర్

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

గడుస్తున్న రోజులు.. ఆవిరవుతున్న ఆశలు..

మౌసమీ వెంటనే పంకజ్ పనిచేసే చోటుకు పరుగెత్తుకెళ్లారు. అప్పటికే, ఆ భవనమంతా మంటల్లో కాలిపోతోంది.

''ఆయన బయటకు వచ్చేసి ఉంటారని అనుకున్నాం. కానీ, రోజులు గడచిపోతున్నాయి. ఎలాంటి సమాచారం తెలియకపోతుండడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఆయన మంటల్లో కాలిపోయి ఉంటారని నమ్మక తప్పడం లేదు'' అని మౌసమీ కన్నీటి పర్యంతమయ్యారు.

తమ సంస్థకు చెందిన ముగ్గురు మరణించారని, వారిలో ఇద్దరు ఉద్యోగులు కాగా.. మరొకరు కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుగా వావ్ మోమో తెలిపింది. అయితే, వారి మృతదేహాలను ఇంకా తమకు అప్పగించలేదని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నయన్ హాల్దార్ తండ్రి కూడా అదే గోడౌన్‌లో పనిచేస్తున్నారు. ''నా డీఎన్‌ఏ శాంపుల్ ఇచ్చాను. కానీ, ఇంకా నాకెలాంటి సమాచారం అందలేదు. నిజం చెప్పాలని కోరుకుంటున్నా'' అని ఆయన అన్నారు.

మృతుల సంఖ్యను ధ్రువీకరించడం కష్టమని పోలీసు అధికారులు చెబుతున్నారు.

''ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. ఒకరిని అరెస్టు చేసి 8 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నాం'' అని బారుయీపూర్ ఎస్పీ సువేంద్ర కుమార్ బీబీసీతో చెప్పారు.

''16 కీలక ఆధారాలను సేకరించాం. డీఎన్ఏ టెస్టులు జరుగుతున్నాయి. మృతదేహాలు లభ్యం కాలేదు, కేవలం శరీర భాగాలను మాత్రమే గుర్తించాం. అందుకే, ఇప్పుడే మృతుల సంఖ్యను ధ్రువీకరించలేం'' అని ఆయన అన్నారు.

కోల్‌కతా, అగ్నిప్రమాదం, ఫైర్

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల నుంచి కోల్‌కతాకు వచ్చిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

తన సోదరుడు గోడౌన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారని సునీల్ హాంసదా చెబుతున్నారు. "తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో కాల్ చేశారు. ఇక్కడ మంటలు చెలరేగాయి. బయట పడే దారి కనిపించడం లేదు. నేను చనిపోబోతున్నా. నా భార్య, పిల్లలు జాగ్రత్తగా చూసుకో అన్నారు" అని సునీల్ తెలిపారు.

ఆ తర్వాత ఫోన్ కట్ అయిందని ఆయన చెప్పారు. ఆ వెంటనే బయలుదేరి, కొద్దిగంటల్లోనే సునీల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

''ఉదయం నేను అక్కడకు వచ్చేప్పటికి ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అవి చూశాక నా సోదరుడు ఇక లేరని అనిపించింది. ఆయన భార్య కుప్పకూలిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు'' అని సునీల్ అన్నారు.

పంకజ్ ఆయన భార్యతో చివరిసారి మాట్లాడినప్పుడు, "మా నాన్న ఊపిరాడక అప్పటికే మరణించారని ఆమెకు చెప్పారు" అని నయన్ హాల్దార్ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, "మేం ఇక్కడికి వచ్చేప్పటికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు'' అని అన్నారు.

అగ్నిప్రమాద సమయంలో, రెండు గోదాముల లోపల ఎంతమంది ఉన్నారనే వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

అయితే, అధికారులు చెబుతున్న దానికంటే ఎక్కువ మందే లోపల ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అగ్నిప్రమాదం, కోల్‌కతా

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

లోపల పరిస్థితేంటి?

సాధారణంగా, ఈ రెండు గోడౌన్లలో రాత్రంతా చురుగ్గా పనులు జరుగుతుంటాయని సమీప గోడౌన్‌లో పనిచేసే ఉద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు.

''లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుంటుంది. లోపల చాలామంది ఉంటారు. రిపోర్ట్ చేసిన దానికంటే ఎక్కువ మందే లోపల ఉండొచ్చు'' అని ఆ ఉద్యోగి అన్నారు.

ఈ రెండు గోడౌన్లలో కూడా నూనె, కలప, పేపర్, అలంకరణ సామగ్రి వంటి మండే స్వభావం ఉన్న వస్తువులే ఉన్నాయని వావ్ మోమో సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు బీబీసీతో చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో చాలామంది ఉద్యోగులు నిద్రపోతుండవచ్చని వారు అంటున్నారు.

అధికారికంగా సరైన సమాచారం లేకపోవడంతో, ప్రమాదం నుంచి బయటపడిన వారు, సహోద్యోగులతో మాట్లాడుతూ రాత్రి లోపల ఎంతమంది ఉండొచ్చనే సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై కూడా పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు కుటుంబ సభ్యులు.

మంటలు చెలరేగితే బయటికి వచ్చే మార్గం ఉందని, కానీ ఆ పక్కనే ఉన్న గోడౌన్ వారు డెకరేషన్ వస్తువులు అడ్డుపెట్టడంతో ఆ మార్గం మూసుకుపోయిందని నయన్ హాల్దార్ ఆరోపించారు.

అందువల్లే లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని ఆయన అంటున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన డెకరేషన్ వస్తువుల గోడౌన్‌కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, ఫైర్ సేఫ్టీ ప్రాథమిక పరికరాలు కూడా లేవని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

నిర్లక్ష్యం కారణంగా మరణాలకు కారణమయ్యారనే అభియోగాలపై డెకరేషన్ వస్తువుల గోడౌన్ యజమానిని అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

గోడౌన్లలో భద్రతా నిబంధనలను పాటిస్తున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడతామని కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

పక్కనున్న గోడౌన్ నుంచి తమ గోడౌన్‌కు మంటలు అంటుకున్నాయని వావ్ మోమో తెలిపింది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం, జీవితకాలం పాటు నెలవారీ ఆర్థిక సాయంతో పాటు వారి పిల్లల చదువులకు సాయం అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

సునీల్ హాంసదా

ఫొటో సోర్స్, Rubaiyat Biswas

ఫొటో క్యాప్షన్, సునీల్ హాంసదా

తండ్రి కోసం వేచిచూస్తోన్న మూడేళ్ల కూతురు

ఈ భారీ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమైందని, అంత్యక్రియలు నిర్వహించేందుకు డీఎన్‌ఏ నిర్ధరణ కోసం వేచిచూస్తున్నట్లు తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

ఆ రాత్రి గోడౌన్ల లోపల ఎంతమంది ఉండొచ్చనే విషయం తెలుసుకునేందుకు కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాయి, అయితే అధికారులు ఆ సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేదు.

''అది కేవలం నంబర్ కాదు, విధులకు వెళ్లి ఇక ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వారికి సంబంధించిన విషయం'' అని మౌసమీ హాల్దార్ అన్నారు.

మౌసమీ, పంకజ్‌కు మూడేళ్ల కూతురు ఉంది. ఆమె తండ్రి ఇక లేరని కూతురికి ఇంకా చెప్పలేదు.

''ఈరోజు కూడా మా నాన్న వచ్చి నాతో ఆడుకుంటాడని ఎదురుచూస్తోంది" అంటూ మౌసమీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)