క్రిటికల్ 11 మినిట్స్: ఆ చివరి 8 నిమిషాలు జాగ్రత్త పడి ఉంటే అజిత్ పవార్ విమానం కూలిపోయేది కాదా?

అజిత్ పవార్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ప్రమాదానికి గురైంది.
    • రచయిత, రౌనక్ భైరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అజిత్ పవార్ మరణం తరువాత, ఇలాంటి విమాన ప్రమాదాలను నివారించే అవకాశం ఎందుకు లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బారామతి రన్‌వేపై మరిన్ని సౌకర్యాలు ఉండి ఉంటే, తక్కువ దృశ్యమానతలో కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బారామతి విమానాశ్రయంలో రన్‌వేను అభివృద్ధి చేయాలని అజిత్ పవార్ కోరుకున్నారు, దీని కోసం పలు సమావేశాలు కూడా నిర్వహించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక కథనం ప్రకారం, "గత సంవత్సరం జులైలో బారామతి విమానాశ్రయాన్ని మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఎంఏడీసీ) స్వాధీనం చేసుకుంది. ఈ ప్రణాళికను ఖరారు చేయడానికి అజిత్ పవార్ ఇటీవల ఎంఏడీసీతో సమావేశాలు నిర్వహించారని విశ్వసనీయ సమాచారం" అని తెలిపింది.

హిందూస్తాన్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం, 2025 ఆగస్టు వరకు విమానాశ్రయాన్ని అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ విమానాశ్రయ డెవలపర్లు నిర్వహించారు. అయితే, విమానాశ్రయ నిర్వహణ సరిగా లేదని, అందుకే ఆగస్టు 19న దాని బాధ్యతలు తిరిగి తీసుకున్నామని బారామతి విమానాశ్రయం ఎంఏడీసీ మేనేజర్ ఇన్‌చార్జ్ శివాజీ తవ్డే తెలిపారు.

"విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి అజిత్ పవార్ గత కొన్నినెలలుగా సమావేశాలు నిర్వహించారు. పీఏపీఐ, నైట్ ల్యాండింగ్, రెగ్యులర్ ఏటీసీ వంటి ప్రాథమిక సౌకర్యాలను కోరారు" అని ఆ కథనం పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహారాష్ట్ర, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు.

"బారామతిలో సరైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేకపోవడం దిగ్భ్రాంతికరం. సర్టిఫైడ్ కంట్రోలర్ మాత్రమే నేలపై దృశ్యమానతను కచ్చితంగా చెప్పగలరు" అని రిటైర్డ్ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ బీబీసీతో అన్నారు.

"డ్యూటీలో అనుభవజ్ఞుడైన కంట్రోలర్ లేకపోతే, పైలట్ తాను చూడగలిగే దాని ఆధారంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. క్రాష్ సమయంలో, సూర్యరశ్మి పైలట్ కళ్లను తాకి ఉండవచ్చు, దీని వలన విమానం సరైన దిశలో కదులుతుందో లేదో నిర్ధరించడం కష్టమవుతుంది" అన్నారు.

విజువల్ అప్రోచ్ సిస్టమ్ సరిగా లేకుండా, పైలట్ స్వయంగా దృశ్యమానతను అంచనా వేసినప్పుడు ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ది హిందూ కథనం ప్రకారం, ఎయిర్‌స్ట్రిప్‌ను రెడ్ బర్డ్ ఫ్లయింగ్ స్కూల్, కార్వర్ ఏవియేషన్‌కు లీజుకు ఇచ్చారు. ఇక్కడ విమాన శిక్షణ అందిస్తున్నారు. ఇదొక 'అన్‌కంట్రోల్డ్ ఏరోడ్రోమ్' అంటే, దీనికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్‌, భద్రతా ఏర్పాట్లు లేదా అగ్నిమాపక దళాలు వంటి ఇతర సాధారణ విమానాశ్రయ సౌకర్యాలు లేవు. వాతావరణ శాస్త్రవేత్తలు లేరు, పైలట్‌లకు తెలియజేయడానికి మంచి నేవిగేషనల్ సహాయాలు లేవు.

బారామతిలో విమాన ప్రమాదం, అజిత్ పవార్ మృతి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బారామతిలో విమాన ప్రమాదం తర్వాత శకలాలను పరిశీలిస్తున్న అధికారులు

సౌకర్యాల కొరత

బారామతి ఎయిర్‌స్ట్రిప్‌లోని రన్‌వే చిన్నగా ఉన్నప్పటికీ, లియర్‌జెట్ 45 వంటి విమానాలకు ఇది సరిపోతుందని రిటైర్డ్ పైలట్ ఎహ్సాన్ ఖలీద్ అన్నారు.

"ఈ ప్రమాదం రన్‌వే వల్ల జరిగిందని అనుకోను. ఎందుకంటే, ప్రమాదం రన్‌వేకు ముందు లేదా పక్కన జరిగింది. రన్‌వేపై ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్), వీఓఆర్, జీపీఎస్ వంటి వ్యవస్థలు ఉంటే, ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఎందుకంటే, ఈ వ్యవస్థలు తక్కువ దృశ్యమానతలో కూడా పైలట్‌కు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఈ వ్యవస్థలు ప్రమాద అవకాశాన్ని 75 నుంచి 80 శాతం తగ్గించి ఉండేవి" అన్నారు.

ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) అనేది గ్రౌండ్-బేస్డ్ రేడియో వ్యవస్థ, ఇది విమానం రన్‌వేపై సురక్షితంగా, కచ్చితంగా ల్యాండ్ కావడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా దట్టమైన పొగమంచు, భారీ వర్షం, మేఘావృతమైన ఆకాశం, చీకటి లేదా ఇతర కారణాల వల్ల దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు, ఐఎల్ఎస్ వ్యవస్థ విమానాన్ని రన్‌వే మధ్యలోకి సరైన వేగంతో, సరైన కోణంలో నడిపిస్తుంది.

"బారామతి ఎయిర్‌స్ట్రిప్ పూర్తిగా డెవలప్ అయిన ఎయిర్‌పోర్ట్ కాదు. అక్కడ రెండు ట్రైనింగ్ స్కూల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అభివృద్ధి చెందిన విమానాశ్రయాలలో ఐఎల్ఎస్ వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. అందుకే, బారామతిలో ఐఎల్ఎస్ లేదు, విమానాశ్రయ ఏటీసీ అథారిటీ కూడా లేదు" అని భారత పైలట్ల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు కెప్టెన్ ఎంఆర్ వాడియా అన్నారు.

బారామతి వంటి చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ఐఎల్ఎస్‌ను ఏర్పాటు చేయలేమని ఎహ్సాన్ ఖలీద్ కూడా అంగీకరించారు. అయితే, ఆయన దానికి ప్రత్యామ్నాయాన్ని సూచించారు.

"ఈ రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా విమానాలు ఉపగ్రహ ఆధారిత జీపీఎస్‌ను ఉపయోగించి నిర్వహిస్తున్నారు. జీపీఎస్‌ అందుబాటులో ఉంటే, గ్రౌండ్-బేస్డ్ ఎక్విప్‌మెంట్స్ అవసరం లేదు" అన్నారు.

"ఆఫ్రికాలో కూడా, ల్యాండింగ్‌లు జీపీఎస్‌ ఆధారంగా ఉంటాయి. ఐఎల్ఎస్‌ వ్యవస్థ కావాలంటే డబ్బు, భూమి అవసరం. కాబట్టి, జీపీఎస్‌-ఆధారిత వ్యవస్థ సరసమైనది" అన్నారు ఖలీద్.

విమాన ప్రమాదాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత సంవత్సరం అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగింది.

ల్యాండింగ్ సమయం కీలకం

ఏ విమానానికైనా 11 నిమిషాలు కీలకం. టేకాఫ్ కోసం 3 నిమిషాలు, ల్యాండింగ్ కోసం 8 నిమిషాలు. దీనిని 'క్రిటికల్ 11 మినిట్స్' అంటారు.

ఇతర దేశాలలో కూడా, ఈ సమయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

జపాన్ ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ ప్రకారం, విమానంలోని మొదటి మూడు నిమిషాలు (టేకాఫ్ తర్వాత), ల్యాండింగ్‌కు ముందు ఎనిమిది నిమిషాలు కీలకం. ఈ 11 నిమిషాలలో, క్యాబిన్ సిబ్బంది (విమాన సహాయకులు) కాక్‌పిట్ (పైలట్)తో మాట్లాడటం నిషేధం.

పైలట్లు విమానాన్ని నియంత్రించే పనిని మాత్రమే చేయాలి. వారు చాటింగ్ లేదా మరేదైనా ఇతర పని చేయకూడదు. ఎందుకంటే 80 శాతం వాణిజ్య విమాన ప్రమాదాలు ఈ రెండు సమయాల్లోనే జరుగుతాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు.

2005 నుంచి 2023 వరకు జరిగిన విమాన ప్రమాదాలపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం డేటాను సేకరించింది.

ఈ పరిశోధనల ప్రకారం, విమాన ప్రమాదాలలో సగానికి పైగా (53 శాతం) ల్యాండింగ్ సమయంలో సంభవించాయి. మరో 8.5 శాతం ప్రమాదాలు టేకాఫ్ తర్వాత జరిగాయి. ల్యాండింగ్ సమయంలో పైలట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది.

విమాన ప్రమాదాలు

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

ల్యాండింగ్ సమయంలో ఎందుకు చాలా ప్రమాదాలు జరుగుతాయని అడిగినప్పుడు, రిటైర్డ్ పైలట్ ఖలీద్ హుస్సేన్ స్పందిస్తూ, వాతావరణం సరిగా లేకపోవడంతో విజిబిలిటీ స్పష్టంగా లేకపోవడం దీనికి కారణమని తెలిపారు.

ఒక ఉదాహరణ ఇస్తూ, "ఒక పక్షి ఎగిరినట్లుగానే, విమానం కూడా ఎగురుతుంది. ఎగురుతున్నప్పుడు, ఎవరినీ ఢీకొనకుండా లేదా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త వహించాలి" అన్నారు.

"విమానం ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, ప్రమాదం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ల్యాండింగ్ ప్రారంభమైన వెంటనే, విమానాశ్రయం ఎక్కడ ఉంది. రన్‌వే ఎక్కడ ఉంది, ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అనే దానిపై జాగ్రత్తగా ఉండాలి" అన్నారు హుస్సేన్.

ప్రస్తుతానికి, విమాన ప్రమాదంపై దర్యాప్తు నివేదిక కోసం అందరూ వేచి ఉండాలని కెప్టెన్ ఎంఆర్ వాడియా సూచించారు.

‘అర్థం చేసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం దృశ్యమానత 3,000 మీటర్లు, అది అంత పేలవంగా లేదు. మొదట, పైలట్ రన్‌వేను చూడలేకపోయారు. తరువాత, చూశారు, కానీ విమానాన్ని ల్యాండ్ చేయడంలో విఫలమయ్యారు.

ఇప్పటివరకు అయితే ప్రమాదానికి గల కారణాలపై స్పష్టమైన సమాధానాలు లేవు’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)