Ex: మీ మాజీ ప్రేమికులతో స్నేహం చేయొచ్చా? 4 రూల్స్..

రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Olivia Petter

    • రచయిత, ఎమిలీ హోల్ట్

బ్రేక్-అప్.. అంటే, విడిపోవడం.. ఇది చాలా కష్టమైన విషయం. మీరు మీ సర్వస్వం పంచుకున్న వ్యక్తిని అకస్మాత్తుగా కోల్పోవడం బాధాకరం. కానీ, మీ 'ఎక్స్‌'తో స్నేహంగా కొనసాగడం కూడా అంతే బాధాకరంగా ఉంటుంది.

"నిజానికి, తమ ఎక్స్‌తో స్నేహంగా ఉండే మిత్రులు నాకు పెద్దగా ఎవరూ లేరు'' అని 'మిలీనియల్ లవ్' అనే డేటింగ్ హ్యాండ్‌బుక్ రచయిత్రి ఒలీవియా పెటర్ అంటున్నారు.

కానీ, ఆమె మాత్రం కొన్ని సందర్భాల్లో అలాంటి స్నేహాన్ని కొనసాగించగలిగారు.

మీరు మీ ఎక్స్‌తో స్నేహంగా ఉండాలా? వద్దా? లేదంటే ఆ సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవాలా? అని నిర్ణయానికి వచ్చేముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన నాలుగు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Getty Images

1.మీ రిలేషన్‌షిప్ ఎంత గాఢమైనది?

"ఒకరిద్దరు పురుషులతో కొద్దికాలం, సాధారణ రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, అవి ఆ తర్వాత స్నేహంగా మారాయి'' అని ఒలీవియా బీబీసీ రేడియో 4 'విమెన్స్ అవర్' ప్రోగ్రామ్‌లో చెప్పారు.

"మేం ఒకప్పుడు బంధంలో ఉన్నామన్న విషయం.. మా మధ్య ఎలాంటి అస్పష్టత లేదా ఇబ్బందులు లేకుండా సన్నిహితంగా ఉండటానికి సహాయపడుతుంది" అని ఆమె వివరించారు.

కానీ, సీరియస్ రిలేషన్‌షిప్స్ విషయానికి వస్తే.. వారితో తనకు మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, సన్నిహిత స్నేహితులం మాత్రం కాదని ఆమె చెప్పారు.

"క్యాజువల్ రిలేషన్‌షిప్స్‌లో చిక్కుముళ్లు తక్కువగా ఉంటాయి. అందుకే వాటిని స్నేహంగా మార్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది'' అని డేటింగ్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్ కేట్ మాన్స్‌ఫీల్డ్ చెబుతున్నారు.

''కానీ, అప్పుడప్పుడు క్యాజువల్ రిలేషన్‌షిప్స్ కూడా తీవ్ర భావోద్వేగాలకు దారితీయవచ్చు. ఎందుకంటే, అవి కూడా అప్పుడప్పుడూ తీవ్రంగా ఉండొచ్చు" అని ఆమె అన్నారు.

"నిజానికది.. ఆ బ్రేకప్ ఎలా జరిగింది? పరస్పర సమ్మతితో దూరమయ్యారా? లేదంటే ఒక్కరు మాత్రమే వద్దనుకున్నారా? ఎవరు బ్రేకప్ చెప్పారు? వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ ఎంతకాలం కలిసి ఉన్నారనే దానికంటే, ఈ అంశాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి" అని కేట్ వివరించారు.

రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Getty Images

2. మీరు వారిని పూర్తిగా మర్చిపోయారా?

మీరు ఆ వ్యక్తిని, వారితో మీకు ఉన్న పాత ప్రేమను వేరుచేసి చూడగలరా? అనేదే ఇక్కడ అతిపెద్ద సమస్య.

"మీరు బ్రేక్-అప్‌ నుంచి పూర్తిగా బయటపడాలి. అంటే భౌతికంగా విడిపోవడమే కాదు, మానసికంగా కూడా ఆ బాధ నుంచి కోలుకోవాలి" అని కేట్ చెబుతున్నారు.

మీ బంధంలో ప్రేమ లేదా ఆకర్షణ కాకుండా, అంతకుమించి మీ ఇద్దరి మధ్య ఒకే రకమైన ఆసక్తులు ఏవైనా ఉన్నాయా? అని ఆలోచించండి. అంటే, ప్రేమతో సంబంధం లేకుండా మీకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు ఉండాలి.

ఒకవేళ మీ బంధం, కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణ మీద మాత్రమే ఆధారపడి ఉంటే, దానిని స్నేహంగా కొనసాగించడం చాలా కష్టం.

అలాగే, మీరు వారితో ఎందుకు స్నేహంగా ఉండాలనుకుంటున్నారనే విషయంలో నిజాయితీగా ఉండడం కూడా చాలా ముఖ్యం.

"ఒకవేళ వారు తమ మనసు మార్చుకుంటారని మీరు ఇంకా ఆశిస్తున్నా, లేదా వారు ఎవరితో డేటింగ్ చేస్తున్నారో నిఘా పెట్టడానికే వారితో టచ్‌లో ఉంటున్నా అది స్నేహం కాదు, స్నేహం ముసుగులో ఉన్న వ్యామోహం మాత్రమే'' అని కేట్ చెబుతున్నారు.

చివరగా, ఇద్దరు వ్యక్తులు తమ బంధం ముగిసిపోయిందనే నిజాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి, ఎవరికీ ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేనప్పుడు మాత్రమే ఈ స్నేహం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Rosie Wilby

ఫొటో క్యాప్షన్, రిలేషన్‌షిప్స్‌పై రోజీ కూడా 'ది బ్రేక్‌అప్ మోనోలాగ్స్' అనే పుస్తకాన్ని రాశారు.

3.బ్రేక్-అప్ జరిగి ఎంత కాలమైంది?

ప్రేమికుల నుంచి వెంటనే స్నేహితులుగా మారడం కష్టం కావొచ్చు.

"కొంతకాలం పాటు విరామం తీసుకోవడం, ఆలోచించుకోవడానికి కొంతదూరం పాటించడం ముఖ్యం'' అని ఒలీవియా చెబుతున్నారు.

తాను తన మాజీ ప్రేయసుల (ఎక్స్-గాళ్‌ఫ్రెండ్స్‌)తో విజయవంతంగా స్నేహం కొనసాగించగలిగానని హాస్య నటి, రచయిత్రి రోజీ విల్బీ చెప్పారు.

రోజీ తల్లి మరణించిన కొన్నాళ్లకే ఆమె, తన మాజీ భాగస్వామి డోనా విడిపోయారు. అదే సమయంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోవడంతో వారి విలువైన వస్తువులు కూడా కోల్పోయారు.

తాము కేవలం మూడు వారాల పాటు మాత్రమే మాట్లాడుకోకుండా ఉన్నామని రోజీ చెప్పారు.

''మేం అప్పటివరకే ఉండగలిగాం. ఎందుకంటే, మా మధ్య అంత బలమైన అనుబంధముంది. ఆ కష్టకాలంలో మాకు ఒకరి తోడు మరొకరికి అవసరం'' అని ఆమె అన్నారు.

ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత, ''డోనా నాకు ఒక సోదరిలా అనిపిస్తుంది'' అని రోజీ అంటున్నారు.

రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Getty Images

4.మీ కొత్త భాగస్వామికి ఇది సమ్మతమేనా?

ఒకవేళ మీరు స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకుంటే, మీలో ఎవరైనా అప్పటికే మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉండుంటే.. అప్పుడు మీ స్నేహం ఎలా ఉండాలనే దానిపై ఇద్దరూ మాట్లాడుకోవాలని కేట్ సూచిస్తున్నారు.

ఒకవేళ మీ కొత్త భాగస్వామికి ఈ స్నేహంపై అసౌకర్యంగా ఉంటే, వారి ఆందోళనకు మీరు ప్రాధాన్యం ఇవ్వాలని కేట్ స్పష్టంగా చెబుతున్నారు.

"అది కేవలం అభద్రతాభావం మాత్రమే కాకపోవచ్చు. కొన్నిసార్లు అది చట్టబద్ధమైన ఆందోళన కూడా కావొచ్చు'' అని ఆమె అన్నారు.

''మీ స్నేహాన్ని కొనసాగించేందుకు మీ మాజీ భాగస్వామితో మాట్లాడాల్సి రావొచ్చు. అందులో భాగంగా 'తరచుగా మాట్లాడుకోవడం, ఒంటరిగా కాకుండా గ్రూపు సమావేశాల్లో కలవడం, లేదా మీరు కలిసి చేసే పనుల గురించి పారదర్శకంగా ఉండడం' వంటివి'' అని ఆమె చెబుతున్నారు.

మహిళలు తమ పురుష భాగస్వాముల మాజీ ప్రియురాళ్లను ముప్పుగా భావించేలా సమాజం వారిని తయారు చేస్తోందని ఒలీవియా అంటున్నారు.

కానీ, ఎల్‌జీబీటీ కమ్యూనిటీలలో మాత్రం మాజీ భాగస్వాములతో స్నేహంగా ఉండటమనేది చాలా సాధారణమని రోజీ చెబుతున్నారు.

"అక్కడ వాళ్లది పూర్తిగా విభిన్నమైన ప్రవర్తనా నియమావళి" అని ఆమె అన్నారు.

రిలేషన్‌షిప్, సంబంధాలు, ఎక్స్, బ్రేక్‌అప్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటప్పుడు కచ్చితంగా దూరంగా ఉండాలి?

కొన్ని సందర్భాలలో స్నేహం అస్సలు సాధ్యపడదని కేట్ చెబుతున్నారు.

"ఒకవేళ ఆ బంధం శారీరకంగా లేదా మానసికంగా వేధింపులతో కూడినదైనా, నమ్మకం పూర్తిగా కోల్పోయినా లేదా ఒక వ్యక్తికి ఇంకా అవతలి వారిపై ఆకర్షణ ఉన్నా స్నేహానికి ప్రయత్నించడకూడదు'' అని ఆమె చెప్పారు.

"కొన్నిసార్లు మీ ఇద్దరూ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, ఆ అధ్యాయం ముగిసిపోయిందని అంగీకరించడం'' అని చెబుతున్నారు.

"ఏదో ఒకవిధంగా నాకు తీవ్రమైన హాని కలిగించిన వారిని మాత్రమే నేను నా జీవితం నుంచి పూర్తిగా తొలగించాను'' అని ఒలీవియా చెప్పారు.

తన స్నేహితుల్లో చాలామంది తమ మాజీ భాగస్వాములతో టచ్‌లో లేరని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)