భారత్‌లో విమాన ప్రయాణం సురక్షితమేనా, పార్లమెంటరీ కమిటీ నివేదిక బహిర్గతం చేసిన లోపాలేంటి?

ఫొటో సోర్స్, Avishek Das/SOPA Images/LightRocket via Getty Images
- రచయిత, అమృత దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు రోజుల కిందట జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు. ఈ ప్రమాదంతో దేశంలో విమాన ప్రయాణ భద్రత మరోసారి చర్చనీయంగా మారింది.
ఆగస్ట్ 2025లో సమర్పించిన పార్లమెంటరీ నివేదిక.. భారత పౌర విమానయాన భద్రతా వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది.
ఇది భారత విమానయాన రంగం నియంత్రణ సంస్థలపై ఒత్తిడి, నియంత్రణలో లోపాలు, భవిష్యత్తు భద్రతా ముప్పు గురించి స్పష్టంగా తెలియజేసింది.
ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంజయ్ ఝా చైర్మన్‌గా వ్యవహరించారు.
'ఓవరాల్ రివ్యూ ఆఫ్ సేఫ్టీ ఇన్ ది సివిల్ ఏవియేషన్ సెక్టార్' నివేదికను ఆగస్ట్ 2025లో ఈ కమిటీ పార్లమెంట్‌కు సమర్పించింది.


ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
విమానయాన సంస్థలకు లైసెన్స్‌లు ఎలా జారీచేస్తారు?
దేశంలో విమానయాన సేవలను ప్రారంభించడానికి కంపెనీలు లైసెన్స్ పొందాలి. లైసెన్స్ మంజూరు చేసేప్పుడు.. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య, విమాన మార్గాలు, షెడ్యూల్స్, ఉద్యోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి పెద్దసంఖ్యలో ప్రయాణికుల విమానాలను నడిపే సంస్థలను 'షెడ్యూల్డ్ ఆపరేటర్లు' అని పిలుస్తారు. వాటికి కఠినమైన నియమాలు వర్తిస్తాయి.
చిన్న విమానయాన సంస్థలు పరిమిత విమానాలను నడుపుతాయి. ఈ సేవలను నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తారు.
ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్: ఒక వ్యక్తి లేదా కంపెనీకి సొంతంగా ఉన్న విమానం. వ్యక్తిగత లేదా వాణిజ్య ఉపయోగం కోసం ఒక వ్యక్తి లేదా కంపెనీ యాజమాన్యం లీజుకు తీసుకున్న విమానం.
చార్టర్ ఫ్లైట్స్: షెడ్యూల్ చేయని లైసెన్స్ పొందిన కంపెనీ నిర్వహించే ఆపరేషన్స్. వీటిని థర్ట్ పార్టీ నిర్వహిస్తుంది.
పార్లమెంటరీ నివేదిక ప్రకారం.. ఈ చిన్న, ప్రైవేట్ ఆపరేటర్ల కార్యకలాపాలపై తగినంత పర్యవేక్షణ లేదని స్పష్టమైంది.

ఫొటో సోర్స్, EPA
డీజీసీఏ బాధ్యతలేంటి? ఎంతమంది ఉద్యోగులున్నారు?
ఈ మొత్తం పర్యవేక్షణ బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)పై ఉంది.
డీజీసీఏ అనేది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నియంత్రణ సంస్థ. అయితే, డీజీసీఏ తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది.
ఈ సంస్థకు 1,063 పోస్టులు మంజూరైనప్పటికీ, కేవలం 553 మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే, దాదాపు 50 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా డీజీసీఏ తన ప్రధాన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని నివేదిక స్పష్టంగా పేర్కొంది.
భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్.
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ వృద్ధి, పెరుగుతున్న ఆదాయాలు, కొత్త విమానాశ్రయాలలో ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా విమాన ప్రయాణం వేగంగా అభివృద్ధి చెందింది.
అయితే, ఈ వృద్ధికి అనుగుణంగా భద్రతా యంత్రాంగం మెరుగుపడలేదని నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
నివేదికతో బహిర్గతమైన లోపాలేంటి?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని నివేదిక పేర్కొంది. మెట్రోపాలిటన్ నగరాల్లోని ఏటీసీ ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగులకు అలసట కూడా ప్రధాన సమస్యగా ఉంది.
కొన్నిచోట్ల వారికి తగిన శిక్షణ కూడా ఉండదు.
నియామకాలు జరగాల్సిన స్థాయిలో లేకపోవడం, సరైన శిక్షణ ఇవ్వకపోవడం, అలాగే పెరుగుతున్న పనిభారాలు విమానయాన భద్రతకు ప్రత్యక్ష, నిరంతర ముప్పుగా మారాయని నివేదిక హెచ్చరించింది.
రన్‌వేపై జరిగే ప్రతి ప్రమాదానికి సంబంధించి మూల కారణాన్ని పరిశోధించడం అవసరమని నివేదిక పేర్కొంది. విమానాన్ని ఢీకొన్న పక్షి లేదా పక్షుల గుంపు, రన్‌వేపై విమానం సరైన స్థానంలో లేకపోవడం, వాహనం లేదా వ్యక్తి రన్‌వేపైకి రావడం, నిర్వహణ, రిపేర్లకు విదేశాలపై ఆధారపడడం వంటివాటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించింది.
భారత్‌లోని ప్రైవేట్ విమానయాన సంస్థలు విమాన నిర్వహణ, రిపేర్ల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడతాయి.
ఈ నివేదికలో అందించిన సమాచారం ప్రకారం.. నిర్వహణ, రిపేర్లు దాదాపు 85 శాతం విదేశాలలో జరుగుతున్నాయి.
ఇటీవలి కాలంలో ప్రైవేట్, చార్టర్ విమానాల సంఖ్య పెరిగిందని, మరోవైపు సిబ్బంది కొరత కారణంగా డీజీసీఏ దీనిపై పూర్తి దృష్టి పెట్టలేకపోతోందని నివేదిక పేర్కొంది.
షెడ్యూల్డ్ క్యారియర్‌లకు, అంటే ప్రయాణికుల విమానాలకు వర్తించే భద్రతా నియమాలను ప్రైవేట్ ఆపరేటర్లకు కూడా వర్తింపజేయాలని నివేదిక సూచించింది.

కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ..
వాయు రవాణా భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సూచించింది. భద్రతా లోపాలను పరిష్కరించుకునేందుకు విమానయాన సంస్థలకు పరిమిత సమయం ఇవ్వాలని, నిబంధనల ప్రకారం అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలని సిఫార్సులు చేసింది.
ప్రస్తుతం కొత్త విమానాల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు అదే వేగంతో అభివృద్ధి చెందడం లేదు. విస్తరించడం లేదు. ఇది ఇప్పటికే ఉన్న సేవలపై ఒత్తిడిని పెంచి, వాటి నాణ్యతను తగ్గిస్తోంది. ఫలితంగా భద్రతా ప్రమాణాలపై ప్రభావం పడుతోంది.
ఒత్తిడిని తట్టుకునేందుకు ఏటీసీని ఆధునికీకరించడం, విమానాశ్రయాలలో సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడం, విమాన సిబ్బంది పని గంటలను పరిమితం చేయడం అవసరమని నివేదిక పేర్కొంది.
కంట్రోలర్లను వెంటనే నియమించుకోవడం, ఒత్తిడిని నివారించడానికి ఉద్యోగుల పని షెడ్యూల్‌ను మెరుగుపరచడం, కమ్యూనికేషన్, నావిగేషన్, నిఘా వ్యవస్థలను ఆధునికీకరించడం అవసరమని సూచించింది.
కొత్త విమానాల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఉద్యోగులు, సాంకేతికత అదే వేగంతో పెరగడం లేదని నివేదిక వెల్లడించింది. ఇది సేవల నాణ్యత, భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













