విషాదం నింపిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు

ఫొటో సోర్స్, gettyimages/facebook
- రచయిత, పవన్ కుమార్.డి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.
గతంలో తెలుగు నేలకు చెందిన కొందరు నాయకులు, తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాలలో చనిపోయిన ఘటనలున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
జీఎంసీ బాలయోగి: లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి
వైమానిక ప్రమాదాలలో చనిపోయిన నాయకులలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన జీఎంసీ బాలయోగి ఒకరు.
2002 మార్చి 3న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారని ‘బీబీసీ కథనం’లో తెలిపింది. అప్పుడాయన వయసు 50 ఏళ్లు.
ప్రైవేట్ హెలికాప్టర్‌లో ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు బాలయోగి వ్యక్తిగత సహాయకుడు, మరొకరు పైలట్. వారిద్దరూ ఈ ప్రమాదంలో చనిపోయారు.
భీమవరం నుంచి హైదరాబాద్ వస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వాడలంక సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ది ట్రిబ్యూన్ తన కథనంలో తెలిపింది.
సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారని అధికార వర్గాలను ఉటంకిస్తూ ది ట్రిబ్యూన్ రిపోర్ట్ చేసింది. అయితే, ఓ కొబ్బరి చెట్టును ఢీకొని, చేపల చెరువు కట్టపై హెలికాప్టర్ కూలిపోయిందని రిపోర్ట్ చేసింది.
లోక్‌సభకు తొలి దళిత స్పీకర్
లోక్‌సభ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. గంటి మోహన చంద్ర బాలయోగి 1951 అక్టోబర్ 1న తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గన్నయ్య, సత్యమ్మ. వారిది వ్యవసాయ కుటుంబం.
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆయన పొలిటికల్ సైన్సులో పీజీ, న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
లోక్ సభ స్పీకర్‌గా ఎంపికైన తొలి దళిత నాయకుడు బాలయోగి. ప్రాంతీయ పార్టీ నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఆయనే అని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఫొటో సోర్స్, STR/AFP via Getty Images
సినీ నటి సౌందర్య
విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు అనగానే చాలా మంది సౌందర్య మరణాన్ని గుర్తు చేసుకుంటారు.
తెలుగులో అనేక సినిమాల్లో నటించిన ఆమె 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సెస్నా 180 అనే సింగిల్ - ఇంజిన్ విమానంలో ఆమె బెంగళూరులోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి.. కరీంనగర్ వెళ్లేందుకు బయల్దేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని ది హిందూ ఓ కథనంలో తెలిపింది.
బీజేపీలో చేరిన ఆమె ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ‘ది హిందూ’ కథనం పేర్కొంది.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లో అనేక చిత్రాల్లో సౌందర్య నటించారు.

ఫొటో సోర్స్, YSR Congress Party/AirForce/BSN Malleswara Rao
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.
2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం 8.38 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఉదయం 10.30 గంటలకల్లా ఆయన చిత్తూరు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది. కానీ, చేరుకోలేదు.
బీబీసీ తెలుగులో గతంలో ప్రచురితమైన కథనం ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతం వద్ద హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఏం జరిగిందోనన్న ఆందోళన అంతా నెలకొంది.
మధ్యాహ్నానికి హెలికాప్టర్ మిస్సయ్యిందని, ముఖ్యమంత్రి ఆచూకీ లభించడం లేదని, గాలింపు చర్యలు చేప్టటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది.
ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కనిపించటం లేదన్న వార్త జాతీయ స్థాయిలో సంచలనమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు జిల్లాలను అప్రమత్తం చేసి, గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
11 ఎయిర్ క్రాఫ్ట్‌లు, 2,000 మంది భద్రతా సిబ్బంది ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారని బీబీసీ కథనంలో పేర్కొంది.
25 గంటల తర్వాత అధికారిక సమాచారం…
ఈ ప్రమాదంలో ఈ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న రాజశేఖరరెడ్డితో పాటు అప్పటి సీఎంఓ ముఖ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సీఎం ప్రధాన భద్రతాధికారి ఏఎస్‌సీ వెస్లీ, హెలికాప్టర్ పైలట్ ఎస్ కే భాటియా, కోపైలట్ ఎం.సత్యనారాయణ రెడ్డి కూడా మృతి చెందారు.
బుధవారం ఉదయం 9 గంటల 27 నిమిషాల 57 సెకండ్లకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) పనిచేయడం ఆగిపోయిందని డీజీసీఏ నివేదిక పేర్కొంది. తర్వాతి రోజు గురువారం ఉదయం 9.20 గంటలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నల్లమల అడవులపై గాలింపు చర్యలు చేపడుతూ.. కూలిన హెలికాప్టర్‌ను గుర్తించింది.
ముఖ్యమంత్రి ఆచూకీ గల్లంతైన దాదాపు 25 గంటల తర్వాత.. ఆయన చనిపోయారని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం దిల్లీలో మీడియాకు అధికారికంగా వెల్లడించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














