బీజింగ్‌లో అడుగుపెట్టిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. చైనాతో సంబంధాలపై విమర్శకులేమంటున్నారు?

కీర్ స్టార్మర్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, క్రిస్ మేసన్, ఇసాబెల్లా అలెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ బీజింగ్‌లో అడుగుపెట్టారు. 2018 తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ పర్యటనలో భాగంగా ఆయన గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, జీఎస్‌కే ఫార్మాస్యూటికల్ కంపెనీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సహా వ్యాపార సంస్థల ప్రముఖులు, అలాగే నేషనల్ థియేటర్‌కి చెందిన సాంస్కృతిక రంగ ప్రతినిధులు కలిసి సుమారు 60 మంది కీర్ స్టార్మర్ వెంట ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.

చైనాతో సంబంధాలను పునరుద్ధరించడానికి బ్రిటన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది అత్యంత తాజా, ముఖ్యమైన ఘట్టం.

అయితే, చైనా విషయంలో ప్రపంచ దృక్కోణం భిన్నమైందని, ఆ దేశాన్ని విశ్వసించలేమని విమర్శకులు వాదిస్తున్నారు. అక్కడి కమ్యూనిస్టు పార్టీతో వ్యవహారంలో యూకే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

చైనా అధ్యక్షుడితో చర్చల సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రధాని స్టార్మర్ ప్రస్తావిస్తారా అని ప్రశ్నించగా, 'సవాలుతో కూడిన అంశాలను ఆయన తప్పకుండా లేవనెత్తుతారు' అని ప్రధానమంత్రి కార్యాలయం సమాధానమిచ్చింది.

చైనాలోని వాయువ్య ప్రాంతమైన షిన్‌జియాంగ్‌లో వీగర్‌లు సహా ముస్లిం మైనారిటీ తెగలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

అలాగే హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్ పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నారు.

చైనా మానవహక్కుల ఉల్లంఘన రికార్డుతో పాటు, బ్రిటన్‌లో చైనా చేస్తున్న గూఢచర్య కార్యకలాపాల స్థాయిపై కూడా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. చైనా ప్రభుత్వ ఏజెంట్లు బ్రిటన్ జాతీయ భద్రతకు ప్రతిరోజూ ముప్పుగా మారుతున్నారని బ్రిటిష్ నిఘా సంస్థ ఎం15 చీఫ్ ఇటీవల హెచ్చరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కీర్ స్టార్మర్

ఫొటో సోర్స్, PA Media

'బ్రిటన్‌కు చైనా చాలా ముఖ్యమైన దేశం'

చైనా పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ, "చైనా విషయంలో చాలా సంవత్సరాలుగా మన విధానం నిలకడ లేకుండా ఉంది. కానీ, మనకు నచ్చినా నచ్చకపోయినా, బ్రిటన్‌కు చైనా చాలా ముఖ్యమైన దేశం'' అన్నారు.

''ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటైన చైనాతో వ్యూహాత్మక, స్థిరమైన సంబంధాన్ని కలిగి ఉండటం మన జాతీయ ప్రయోజనాలకు చాలా అవసరం. అలా అని, వారి వల్ల ఎదురయ్యే సవాళ్లను చూసీచూడనట్లు వదిలేస్తామని కాదు. విభేదాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా చైనాతో సంబంధాన్ని కొనసాగించడమే మా ఉద్దేశం'' అని స్పష్టం చేశారు.

చైనా పర్యటనలో ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు బిజినెస్ సెక్రటరీ పీటర్ కైల్, ట్రెజరీ ఎకనామిక్ సెక్రటరీ లూసీ రిగ్బీ కూడా పాల్గొంటున్నారు.

పీటర్ కైల్ ఈ పదవిని చేపట్టిన కొద్దిరోజల్లోనే, గత ఏడాది సెప్టెంబర్‌లో బీజింగ్‌ను సందర్శించారు.

చాన్సలర్ రాచెల్ రీవ్స్ ఏడాది క్రితం చైనాలో పర్యటించారు. అప్పటి విదేశాంగ కార్యదర్శి, ప్రస్తుత ఉపప్రధాన మంత్రి డేవిడ్ లామీ పర్యటించిన కొన్ని నెలల వ్యవధిలోనే రీవ్స్ కూడా సందర్శించారు.

బ్రిటిష్ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా చైనాపై చూపించిన విముఖతను కీర్ విమర్శించే అవకాశం ఉంది.

దానికి బదులుగా, చైనాతో 'వ్యూహాత్మకమైన సంబంధాలు' కలిగి ఉండటమే మనల్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన వాదించవచ్చు.

'ఆ దేశాల నేతలూ పర్యటించారు కదా...'

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇద్దరూ ఇటీవల చైనాలో పర్యటించారని కీర్ స్టార్మర్ కార్యాలయం గుర్తుచేస్తోంది.

ఎనిమిదేళ్ల క్రితం థెరిసా మే చైనాలో పర్యటించిన తర్వాత ఫ్రాన్స్, జర్మనీ దేశాల అధినేతలు పలుమార్లు అక్కడ పర్యటించారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఏప్రిల్‌లో పర్యటించే అవకాశం ఉంది.

చైనా పర్యటన అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ టోక్యోకు బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయె టకయిచితో భేటీ అవుతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)