దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య సంక్షోభం దేనికి సంకేతం?

కర్ణాటక అసెంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడు, కేరళ గవర్నర్ల మాదిరిగానే, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కూడా గతవారం జరిగిన అసెంబ్లీ జాయింట్ సెషన్‌‌లో తన ప్రసంగాన్ని ఆపేసి, సమావేశం నుంచి వెళ్లిపోయారు.

దీంతో, ఈ ధోరణి సరికొత్త నమూనాను తెరపైకి తెస్తోందా? అని రాజకీయ, రాజ్యాంగ నిపుణుల్లో చర్చకు దారితీసింది.

గహ్లోత్ ఈ విధంగా వ్యవహరించడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నప్పుడు కానీ, బిల్లుల విషయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కానీ గహ్లోత్ చాలా సంయమనంతో ఆచితూచి వ్యవహరించారు.

అయితే, గతవారం కేవలం మూడు రోజుల్లోనే దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల గవర్నర్లు ఒకే రకమైన వైఖరిని ప్రదర్శించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ఎన్ రవి తర్వాత, గహ్లోత్ కూడా సంప్రదాయబద్ధంగా సాగే క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు.

గవర్నర్ ప్రసంగాన్ని అలా మధ్యలోనే ఆపేయడంతో షాకైన అధికారులు, జాతీయ గీతం ప్లే చేయాలని ఆదేశాలిచ్చేలోపే ఆయన బయటికి వెళ్లిపోయారు.

కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఒక అడుగు ముందుకేసి, ప్రసంగంలోని కొన్ని పారాగ్రాఫ్‌లను తనకు నచ్చినట్లు మార్చేశారు. దీంతో, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ ప్రత్యేకంగా ఆమోదించిన ప్రసంగాన్ని అసెంబ్లీలో రికార్డు చేసేందుకు, ప్రసంగ ప్రతులను ఆయన స్వయంగా చదివి వినిపించారు. ఇద్దరి మధ్య నెలకొన్న ఈ సంఘర్షణ ఆదివారం మరింత పెరిగింది.

అయితే, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇలా జరిగినందుకు గల కారణాలను వివరించారు. మైక్రోఫోన్ ఆగిపోయినట్లు తెలిపారు. ఆర్ఎన్ రవి గత మూడేళ్లలో మూడు సార్లు ఇలా ప్రసంగాన్ని అసంపూర్తిగా వదిలేశారు.

అంతేకాక, జాతీయ గీతాన్ని ప్లే చేయకుండా అవమానపరిచారని ఆయన ఆరోపించారు. అయితే, సంప్రదాయం ప్రకారం, రాష్ట్ర గీతాన్ని తొలుత ప్లే చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాలు, ప్రభుత్వాలు, గవర్నర్లు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వీబీ – జీ రామ్ జీ తీసుకురావడాన్ని డీఎంకే ఆధ్వర్యంలోని తమిళనాడు ప్రభుత్వం, ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అసలు సమస్యేంటి?

గహ్లోత్, అర్లేకర్ ఇద్దరూ కూడా ఈ ప్రసంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్ఈజీఏ) స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) (వీబీ – జీ రామ్ జీ ) తీసుకురావడం, కేంద్ర నిధుల కేటాయింపులను తగ్గించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో వీబీ – జీ రామ్ జీ తీసుకురావడాన్ని డీఎంకే ఆధ్వర్యంలోని తమిళనాడు ప్రభుత్వం, ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ ఉపాధి పథకానికి చెందిన ప్రాథమిక నిర్మాణంలో మార్పులపైనే కాక, ఈ మార్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అదనంగా ఆర్థిక భారం పడుతుందని కూడా ఈ మూడు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాజ్యాంగ నిపుణులు, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య బీబీసీతో మాట్లాడుతూ, "ఇది అలవాటుగా మారుతోంది. క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదవనని నిరాకరించడాన్ని రాజ్యాంగం అనుమతించదు. అది కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు అయినప్పటికీ.. గవర్నర్‌ దీనిపై అభ్యంతరం చెప్పలేరు. ఎందుకంటే, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేది రాష్ట్ర ప్రభుత్వమే'' అని అన్నారు.

''తమిళనాడు, కేరళ (అరిఫ్ మొహమ్మద్ ఖాన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా) దీన్నొక అలవాటుగా ఉల్లంఘించేవి. శాసన సభ బిల్లులను, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రసంగాలను అడ్డుకునేందుకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకునేది. కేంద్రం నుంచి వీరికి ఆదేశాలు వస్తున్నాయని నాకు అనుమానంగా ఉంది'' అని సీనియర్ పొలిటికల్ కామెంటర్ ఆనంద్ సహాయ్ అన్నారు.

థావర్‌చంద్ గహ్లోత్

ఫొటో సోర్స్, ANI

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలని తమను ఒత్తిడి చేయలేరని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు మూడు రాష్ట్రాల గవర్నర్లు స్పష్టంగా తెలియజేశారు.

కర్ణాటక గవర్నర్ గహ్లోత్ తన ప్రసంగంలోని 11 పారాగ్రాఫ్‌లను తీసివేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కేరళ గవర్నర్ కూడా ప్రసంగంలోని కొంత భాగాన్ని తీసివేయాలని, మార్చాలని కోరారు. అయితే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు నిరాకరించాయి.

గవర్నర్ అర్లేకర్ ఒక అడుగు ముందుకేసి, తన ప్రసంగంలోని కొన్ని మార్పులు చేసుకుని, కొన్ని పారాగ్రాఫ్‌లకు సంబంధించి సొంతంగా తాను సవరించుకున్న మార్పులతో ప్రసంగించారు.

తన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫుటేజీని, ముఖ్యమంత్రి ప్రకటనను, ఆ ప్రకటనను ఆమోదిస్తూ సభలో జరిగిన ప్రొసీడింగ్స్‌ను షేర్ చేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ షంసీర్‌కు ఆదివారం సాయంత్రం గవర్నర్ లేఖ రాశారు.

అయితే, సోమవారం సాయంత్రం వరకు స్పీకర్ కార్యాలయం నుంచి తమకెలాంటి స్పందన అందలేదని లోక్‌ భవన్ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

ప్రసంగంలోని భాషను మార్చమని సూచించే హక్కు గవర్నర్‌కు ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం రెండు పారాగ్రాఫ్‌లను సవరించింది కూడా. అయితే, మొత్తం పారాగ్రాఫ్‌నే తొలగించాలనే గవర్నర్ల డిమాండ్‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి.

దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1)ను రాష్ట్రాలు ఉదహరించాయి.

''ఒకవేళ గవర్నర్ సూచనలతో ప్రభుత్వం ఏకీభవించకపోతే, గవర్నర్‌కు మరో దారి ఉండదు. ఆయన తప్పనిసరిగా ప్రసంగాన్ని చదవాల్సిందే. మరో పరిష్కారం లేదు'' అని పీడీటీ ఆచార్య చెప్పారు.

కర్ణాటక రాజ్‌ భవన్

ఫొటో సోర్స్, Getty Images

గవర్నర్‌ అధికారాలు..

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ (ఎన్ఎల్ఎస్)లో రాజ్యాంగ న్యా న్యాయశాస్త్రాన్ని బోధిస్తూ, వాటిపై పరిశోధనలు చేస్తున్నారు ప్రొఫెసర్ అరుణ్ తిరువెంగదమ్.

''కర్ణాటక గవర్నర్ ప్రసంగంలో విధానపరమైన అంశాలకు సంబంధించి 11 పేరాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) ప్రకారం.. శాసన సభను పిలవడానికి గల కారణాలను గవర్నర్ తెలియజేయాలి. గవర్నర్లకు రాజ్యాంగం గణనీయమైన అధికారాలను ఇచ్చింది. వాటిల్లో కొన్నింటిని వారు తమ అభీష్టానుసారం ఉపయోగించుకోవచ్చు'' అని తెలిపారు.

''అయితే, పార్లమెంటరీ సంప్రదాయాలు, కోర్టు నిర్ణయాలు ఈ ప్రత్యేక అధికారాలకు సంబంధించిన ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మంత్రిమండలి సూచన మేరకే ఈ ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాలని పేర్కొంటున్నాయి'' అని ఆయన అన్నారు.

''గవర్నర్‌కు ఉండే ఈ విశిష్టమైన అధికారాలు కేవలం కొన్ని విషయాలకే పరిమితం. శాసన సభ బిల్లులకు ఆమోదం తెలపడం, నిలిపివేయడం, రాష్ట్రపతి వద్దకు పున:పరిశీలనకు పంపడం, ముఖ్యమంత్రిని నియమించడం, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడం, అసెంబ్లీని రద్దు చేయడానికే పరిమితమై ఉన్నాయి. మిగతా అన్ని విషయాల్లో గవర్నర్ కేవలం అలంకారప్రాయమైన అధిపతి మాత్రమే'' అని కర్ణాటక మాజీ అడ్వకేట్ జనరల్ అశోక్ హరణహళ్లి చెప్పారు.

గవర్నర్, రాష్ట్రపతి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదో వివరిస్తూ షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు తీర్పును ఉదహరించారు ప్రొఫెసర్ అరుణ్.

"ఏదైనా అధికారిక నిర్ణయం లేదా విధి నిర్వహణకు రాష్ట్రపతి లేదా గవర్నర్ సమ్మతి అవసరమని రాజ్యాంగం చెప్పినప్పటికీ, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం లేదా వ్యక్తిగత నిర్ణయమని కాదు. తన అధికారాలు, విధుల నిర్వహణలో క్యాబినెట్ సమష్టి నిర్ణయం లేదా సలహా సూచనల మేరకు వ్యవహరించాలి."

గవర్నర్ పదవి, అరిఫ్ మొహమ్మద్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ కాలంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంతో రాజ్ భవన్‌కు తలెత్తే అభిప్రాయభేదాలు వార్తల్లో నిలిచేవి. (ఫైల్ ఫోటో)

గవర్నర్ పదవిని రాజకీయం చేస్తున్నారా?

ఇందిరా గాంధీ సమయంలో అయినా, లేదా 2014 తర్వాత అయినా.. గవర్నర్ పదవి చాలాకాలంగా రాజకీయాల ద్వారా ప్రభావితమవుతోందని రాజకీయ, రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఏకు సంబంధించిన మార్పులను కర్ణాటక అసెంబ్లీలో చర్చించాల్సి ఉన్నందున, గవర్నర్ ప్రసంగంలో దీనిపై ప్రభుత్వ వైఖరిని చేర్చాల్సిన అవసరం లేదని అశోక్ అంటున్నారు.

గవర్నర్ ద్వారా కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విమర్శించవచ్చా? లేదా? అన్నది కోర్టు మాత్రమే నిర్ణయించగలదని చెప్పారు.

"ఇందిరా గాంధీ సమయంలో లాగా, నేటికీ రాజకీయ కారణాలతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు హోం మంత్రి నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా చర్యలను తీసుకుంటున్నారు" అశోక్ హరణహళ్లి అన్నారు.

అశోక్ హరణహల్లి అభిప్రాయంతో మాజీ ఐఏఎస్ అధికారి రంగరాజన్ ఆర్ కూడా ఏకీభవిస్తున్నారు.

''గవర్నర్ పదవి రాజకీయం కావడం చాలా కాలం క్రితమే మొదలైంది. దశాబ్దాలుగా సాగుతోన్న వ్యవస్థాగత సమస్య ఇది. ఇప్పుడు జోక్యాలు మరింత పెరిగాయి. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి'' అని ఆయన అన్నారు.

మోదీ, అర్లేకర్, విజయన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, తిరువనంతపురంలో జనవరి 23న కొత్తగా అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి విజయన్.

రాజ్యాంగ సంక్షోభం నెలకొంటోందా?

గత కొంతకాలంగా పదేపదే తలెత్తుతున్న ఈ సమస్యలపై ఎలాంటి పరిష్కారం దొరకలేదని ప్రొఫెసర్ అరుణ్ అన్నారు.

''మనం తీవ్రమైన ఉద్రిక్తతలు, పోలరైజ్డ్ పరిస్థితుల మధ్య ఉన్నాం. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాలు, అధికార కేంద్రాలు 'మాతో కలిసుండండి లేదంటే మాకు ప్రత్యర్థిగా ఉండడం' అనే ధోరణిని అనుసరిస్తున్నాయి. ఇటువంటి వాతావరణం ఎలాంటి నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైనది కాదు'' అని చెప్పారు.

''రాష్ట్రాలు, కేంద్రం మధ్య బహిరంగ సైద్ధాంతిక యుద్ధం నడుస్తోంది. దీనిలో గవర్నర్లు 'రబ్బర్ స్టాంపుల' తరహా పాత్రనే పోషిస్తున్నారు'' అని సహాయ్ అన్నారు.

''అడవిలో పెద్ద జంతువులు పోట్లాడుకుంటుంటే, చిన్న జంతువులు సమస్యలు ఎదుర్కోవాలి. ఎందుకంటే, సామాన్య ప్రజల్లా, ఇవి కూడా సంఘర్షణలో ఇరుక్కుపోతాయి'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక న్యాయవాది అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)