అజిత్ పవార్: రాజకీయాల్లో 'నంబర్ 2' గానే జీవితాన్ని ముగించిన లీడర్

అజిత్ పవార్ మరణం, ఎన్సీపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు.
    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ విమానం బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. విమానం సమీపంలోని పొలంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు.

కూలిపోయిన విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన పర్సనల్ అసిస్టెంట్, సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, పైలట్, కో పైలట్‌ ఉన్నట్లు డీజీసీఏ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది.

రాబోయే జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ప్రచారం చేయడానికి బారామతిలో నాలుగు బహిరంగ సమావేశాలను ఏర్పాటుచేశారు. వీటిలో పాల్గొనడానికే అజిత్ పవార్ బుధవారం (జనవరి 28) ఉదయం 8 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బారామతికి బయలుదేరారు.

అయితే, బారామతి విమానాశ్రయం రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అజిత్ (అనంతరావు) పవార్ మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నాయకుడు.

మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద వ్యక్తులలో ఒకరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అజిత్ పవార్, శరద్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శరద్ పవార్ అన్నయ్య అనంతరావు గోవిందరావు పవార్ కుమారుడు అజిత్ పవార్.

బారామతి నుంచి 'రాజకీయం'

1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని దేవ్‌లాలి ప్రవరాలో జన్మించారు అజిత్ పవార్.

ఆయన్ను స్థానికంగా 'దాదా' (అన్నయ్య) అని పిలుస్తారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌. ఈ దంపతులకు పార్థ్, జయ్ పవార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

శరద్ పవార్ అన్నయ్య అనంతరావు గోవిందరావు పవార్ కుమారుడే అజిత్ పవార్.

ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం, 1982లో గ్రామీణ మహారాష్ట్రలో రాజకీయ ప్రభావం బలంగా ఉన్న స్థానిక చక్కెర సహకార సంస్థ బోర్డు ఎన్నికల ద్వారా పబ్లిక్ సర్వీస్‌లోకి అడుగుపెట్టారు అజిత్ పవార్.

16 సంవత్సరాలు పుణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. ఇది ఈ ప్రాంతంలో ఆయన సంస్థాగత బలాన్ని పెంపొందించడానికి సహాయపడింది.

అజిత్ పవార్ తొలిసారిగా 1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో శరద్ పవార్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆయన పార్లమెంటులో అడుగుపెట్టాల్సి రావడంతో అజిత్ పవార్ ఆ స్థానాన్ని ఖాళీ చేశారు.

అదే సంవత్సరం అజిత్ పవార్ బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అయితే, 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) స్థాపించారు. దీంతో అజిత్ పవార్ ఎన్సీపీలో చేరారు.

ఆర్థిక, జల వనరులు, ఇంధనం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు అజిత్ పవార్.

అజిత్ పవార్ మృతి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2023 జులైలో అజిత్ పవార్ పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వెళ్లి ఏక్‌నాథ్ షిండే-బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు.

కూటమి ఏదైనా 'డిప్యూటీ' ఆయనే...

ఐదుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం అనేక ఒడిదుడుకులతో సాగింది.

వివిధ సమీకరణాల మధ్య రాష్ట్ర రాజకీయాల్లో 'నంబర్ టూ' గా భావించే డిప్యూటీ సీఎం పదవిలో పవార్ పనిచేశారు.

మొదట 2010లో కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. 2012లో మరోసారి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత, నవంబర్ 2019 నవంబర్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా మూడు రోజులపాటు కొనసాగిన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు అజిత్ పవార్.

ఆ తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని 'మహా వికాస్ అఘాడి' కూటమిలో చేరి, మరోసారి డిప్యూటీ సీఎం(2019 నుంచి 2022)గా పనిచేశారు.

2023 జులైలో అజిత్ పవార్ పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వెళ్లి ఏక్‌నాథ్ షిండే-బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. వారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేరారు. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండుగా చీలిపోయింది.

ఫిబ్రవరి 2024 నాటికి, భారత ఎన్నికల సంఘం శాసనసభ మెజారిటీ ఆధారంగా అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్ని అధికారిక ఎన్సీపీగా గుర్తించింది. అదే ఏడాది నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయగా, 41 స్థానాలను గెలుచుకుంది.

ఆ తర్వాత 2024లో మరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు అజిత్ పవార్. డిప్యూటీ సీఎంగా ఉంటూనే విమాన ప్రమాదంలో మరణించారు.

కేసులు, వివాదాలు

అజిత్ పవార్‌పై మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌కు సంబంధించిన 25 వేల కోట్ల రూపాయల స్కాంలో ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం మనీ ల్యాండరింగ్‌కు సంబంధించింది.

సరిగ్గా ఎన్నికలకు ముందు 2019 ఆగస్టులో ఈడీ ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనపై దర్యాప్తు ప్రారంభించింది.

అది కాకుండా అజిత్ పవార్‌పై నీటిపారుదల కుంభకోణం ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఆయన మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయినపుడు జరిగింది.

అయితే ఆ కేసుల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి అక్రమాలూ గుర్తించలేదని, అజిత్ పవార్‌ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియాలో కథనాలు వచ్చాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)