కరీం లాలా: 'చేతికర్రతో బొంబాయిని శాసించిన డాన్'

ఫొటో సోర్స్, Roli Books
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అఫ్గానిస్తాన్ నుంచి 1936 సంవత్సరంలో ముంబయికి వచ్చిన కరీం, తర్వాత ఒక పెద్ద డాన్‌గా మారిన తీరు, ఏ సినిమా కథకూ తీసిపోదు.
కరీం మొదట్లో ముంబయి ఓడరేవులో కూలీగా పనిచేసేవారు. ఇది 1940ల చివరి సంవత్సరాల నాటి మాట, ఒకరోజు ఆయన తన అఫ్గాన్ స్నేహితులతో కలిసి కూర్చుని ఉండగా, మలబారీ గ్యాంగ్ లీడర్ ఒకరు వారు అక్కడ పనిచేస్తున్నందుకుగాను ప్రతిఫలం ఇవ్వాలంటూ వసూళ్లు మొదలుపెట్టారు.
ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తన పుస్తకం 'వెన్ ఇట్ ఆల్ బిగన్'లో ఈ ఘటన గురించి రాశారు.
'కరీం ముందుకొచ్చి ఆ మలబారీ గ్యాంగ్ లీడర్‌తో.. "మేం కష్టపడుతున్నాం, నువ్వూ కష్టపడుతున్నావు. మన మధ్య తేడా ఏమీ లేదు, మేం పైసలు ఇవ్వం. ఇప్పటి నుంచి వసూళ్లు బంద్" అన్నారు.'
'దీంతో కరీంపై ఆ మలబారీ గ్యాంగ్ లీడర్ దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ వారిద్దరి శక్తిసామర్థ్యాలలో పోలికే లేదు. కరీం ఆయన్ను చితకబాదారు.
అంతలోనే ఆయన పఠాన్ స్నేహితులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి మలబారీ కూలీల ముఠా అక్కడి నుంచి పారిపోయింది.
సరిగ్గా ఈ సంఘటన నాటి నుంచే కరీం ఖాన్ పఠాన్ కాస్తా 'కరీం లాలా'గా మారిపోయారు.
తర్వాత కొంతకాలానికే, ఆయన ఓడరేవు నుంచి వస్తువులను దొంగిలించి, మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు.
అలా చేతి నిండా వచ్చిన డబ్బును అధిక వడ్డీలకు అప్పుగా ఇవ్వడమూ ప్రారంభించారు’ అని రాకేశ్ మారియా రాశారు.


ఫొటో సోర్స్, Vintage
వడ్డీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన లాలా
‘‘కరీం లాలా వడ్డీ వ్యాపారం అంతకంతకూ పెరుగుతూ పోయింది. జూదంలో డబ్బు పోగొట్టుకున్న వారు నిత్యావసర వస్తువులను కొనుక్కోవడానికి కరీం వద్ద వడ్డీకి అప్పులు తీసుకునేవారు. ప్రతి నెలా పదో తేదీ నాటికల్లా ఆ అప్పుపై వడ్డీని చెల్లించాలనేది కరీం పెట్టిన నిబంధన.
ఫలితంగా, ప్రతి నెలా పదో తేదీ వచ్చేసరికి ఆయన ఖజానా నిండడం మొదలైంది.
అప్పులు ఇవ్వడమే కాకుండా, కరీం లాలా ప్రజల మధ్య గొడవలను పరిష్కరించడం, అద్దెకున్నవారు మొండికేస్తే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడం వంటి పనులు కూడా చేసేవారు.
1950వ దశకంలో, ఆయన ప్రజల గొడవలను పరిష్కరించడానికి ప్రతి ఆదివారం తన ఇంటి వద్ద 'దర్బార్' నిర్వహించడం ప్రారంభించారు.
దీంతో స్వల్ప కాలంలోనే దక్షిణ ముంబయిలో కరీం లాలా పేరు మార్మోగిపోయింది’’ అని రాకేశ్ మారియా రాశారు.
షీలా రావల్ తన పుస్తకం 'గాడ్‌ఫాదర్స్ ఆఫ్ క్రైమ్'లో.. ''కరీం లాలా మెరుగైన జీవితం కోసం ముంబయికి వచ్చారు. చదువుకోకపోవడం వల్ల, ఆయన మొదట్లో ధనవంతులైన వ్యాపారులు, వస్త్ర పరిశ్రమ యజమానుల వద్ద పని చేయడం ప్రారంభించారు. బాకీల వసూలు కోసం వారు ఆయన సేవలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే 'పఠాన్ గ్యాంగ్' పుట్టుకొచ్చింది'' అని రాశారు.
సమయం, సందర్భాన్ని బట్టి కరీం మద్యం అక్రమ వ్యాపారం, జూదం, వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలోకి కూడా అడుగుపెట్టారు.
మరోవైపు ఆయన క్రమక్రమంగా పేదలు, నిరుద్యోగులు, ముస్లిం యువతకు ఒక 'గాడ్‌ఫాదర్'గా మారిపోయారు అని రాశారు.

ఫొటో సోర్స్, Hachette
కరీం లాలా 'వాకింగ్ స్టిక్'కు ఆసక్తికరమైన కథ...
కరీం లాలాకు ఎంత అపఖ్యాతి వచ్చిందంటే, ఆయన పేరు చెబితే చాలు అద్దెకున్నవారు ఇళ్లు ఖాళీ చేసేసేవారు.
ఎస్.హుస్సేన్ జైదీ తన పుస్తకం 'డోంగ్రీ టు దుబాయ్'లో కరీం లాలా గురించి రాశారు.
'ఇంటి యజమాని ఎప్పుడైతే "ఇక నేను లాలాను పిలవాల్సిందే" అని అంటారో, అద్దెకున్నవారు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయేవారు' అని జైదీ రాశారు.
'కరీం లాలా పఠానీ సూట్ మానేసి తెల్లటి సఫారీ సూట్ వేసుకోవడం ప్రారంభించారు. నల్లటి కళ్లద్దాలు పెట్టుకోవడానికి ఇష్టపడేవారు. తరచుగా ఖరీదైన సిగార్లు, పైపులు తాగుతూ కనిపించేవారు.'
'ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా ఎవరో ఒక ఖరీదైన 'వాకింగ్ స్టిక్'ను బహుమతిగా ఇచ్చారు. కానీ, అది ఆయనకు నచ్చలేదు. తాను శారీరకంగా ఇంకా దృఢంగా ఉన్నానని, తనకు ఏ కర్ర సాయం అక్కర్లేదని చెప్పారు. కానీ ఆ కర్ర వల్ల వ్యక్తిత్వానికి మరింత నిండుదనం వస్తుందని అనుచరులు చెప్పడంతో, ఆయన దానిని తీసుకున్నారు. ఆ తర్వాత ఆ కర్ర కరీం లాలాకు ఒక చిహ్నంగా మారిపోయింది.'
'ఆ కర్రను కరీం లాలా ఒకవేళ మసీదులో ఒకచోట వదిలి ప్రార్థనకు ముందు శుభ్రం చేసుకోవడం కోసం వెళ్లినా, ఆ మసీదు నిండా జనం ఉన్నప్పటికీ, ఆ కర్ర ఉన్నచోట కూర్చోవడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోయేది కాదు' అని జైదీ రాశారు.

ఫొటో సోర్స్, Roli Books
పఠాన్ల నాయకుడిగా ఎదిగిన లాలా...
‘క్రమక్రమంగా కరీం లాలా అనుచరులు ఆ చేతి కర్రను మరో రకంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. లాలాపై పోలీసులు, సీఐడీ నిఘా పెరుగుతుండటంతో, ఇళ్లు ఖాళీ చేయించే పనులకు స్వయంగా వెళ్లవద్దని, అలాగే తన మనుషులను కూడా పంపవద్దని అనుచరులు ఆయనకు సలహా ఇచ్చారు’ అని హుస్సేన్ జైదీ తన పుస్తకంలో రాశారు.
'ఆ సలహా విన్న కరీం లాలా, 'మరి ఇల్లు ఎలా ఖాళీ అవుతుంది?' అని అడిగారు. దానికి ఆ అనుచరులు, ''మా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. దీనివల్ల పాము చస్తుంది, కర్ర కూడా విరగదు'' అని చెప్పారు.'
'అప్పటి నుంచి ఎప్పుడైనా ఏదైనా ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తే, లాలా మనుషులు ఆ ప్రదేశంలో కేవలం ఆయన చేతి కర్రను వదిలి వచ్చేవారు. అక్కడ అద్దెకు ఉన్నవారు ఆ కర్రను చూడగానే, ప్రాణభయంతో వెంటనే ఇల్లు ఖాళీ చేసేవారు. అంతకుముందు ముంబయిలో ఏ గ్యాంగ్‌స్టర్‌కూ ఇంతటి ప్రభావం, పట్టు ఉండేవి కావు' అని జైదీ రాశారు.
ఇళ్లు లేదా స్థలాల నుంచి ఖాళీ చేయించిన విషయంలో కరీం లాలాకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి.
వాటిలో ప్రముఖ నటి హెలెన్ ఇల్లు ఖాళీ చేయించిన ఉదంతం చాలా ప్రచారంలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
లాలాపై 'సరిహద్దు గాంధీ' ప్రభావం...
అఫ్గానిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో 1911లో జన్మించిన అబ్దుల్ కరీం ఖాన్ అలియాస్ కరీం లాలా దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉండేవారు.
'సరిహద్దు గాంధీ'గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆశయాల ప్రభావం కరీంపై తొలినాళ్లలో ఉండేది.
1930, ఏప్రిల్ 23న పెషావర్‌లోని 'కిస్సాఖ్వానీ బజార్'లో సరిహద్దు గాంధీకి సంబంధించిన కార్యకర్తలపై కాల్పులు జరిగినప్పుడు కరీం అక్కడే ఉన్నారు.
1936లో ఆయన కలకత్తా నుంచి బొంబాయి (ముంబయి) రావడానికి 'ఇంపీరియల్ ఇండియన్ మెయిల్' రైలు ఎక్కారు.
దేశ విభజన తర్వాత చాలామంది పఠాన్లు భారతదేశంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు, అలాంటివారిలో కరీం ఒకరు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, విదేశీయులు వివరాల నమోదు, వారి పర్మిట్ల పునరుద్ధరణకు ముంబయి పోలీసు శాఖలో ఒక కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక 'పఠాన్ బ్రాంచ్' కూడా ఉండేది.
1950వ దశకంలో కరీం లాలా తరచుగా ఈ బ్రాంచ్‌కు వెళ్తూ, పఠాన్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం మొదలుపెట్టారు.
అలా ముంబయిలో నివసించే పఠాన్లు తమ సమస్యల పరిష్కారం కోసం కరీం లాలా వద్దకు రావడం ఎక్కువైంది. నిరుద్యోగం నుంచి ఆర్థిక విషయాల వరకు, ఆఖరికి వారి కుటుంబ తగాదాలలో కూడా కరీం జోక్యం చేసుకుని పరిష్కరించేవారు’.

ఫొటో సోర్స్, Lotus
కరీం లాలా, హాజీ మస్తాన్ స్నేహం...
కరీం లాలా గురించి ముంబయి అండర్ వరల్డ్‌లో మరో డాన్ హాజీ మస్తాన్ చెవిన పడింది.
మస్తాన్‌కు క్లిష్టమైన పనులను పూర్తి చేయగల ఒక సమర్థుడైన వ్యక్తి అవసరం ఎప్పుడూ ఉండేది. 1970లలోనే ఆయన కరీం లాలాను కలవాలనే ఆసక్తి కనబరిచారు.
ఈ విషయమై హుస్సేన్ జైదీ ఇలా రాశారు.
'గ్రాంట్ రోడ్ మసీదులో శుక్రవారం నమాజ్ తర్వాత వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత కరీం ఆయనను తన నివాసమైన 'తాహెర్ మంజిల్'కు తీసుకువెళ్లారు.'
"బాంబే పోర్టు ట్రస్ట్ డాక్ వద్ద నా సరకు చాలా దిగుమతి అవుతుంది. ఆ సరకు మార్కెట్లో అమ్ముడుపోయే వరకు నీ మనుషులు దానికి రక్షణగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని మస్తాన్.. కరీం లాలాను అడిగారు.'
'దీనికి కరీం స్పందిస్తూ, '' ఈ మొత్తం వ్యవహారంలో ఏదైనా హింస జరిగే అవకాశం ఉందా?" అని మస్తాన్‌ను అడిగారు.'
'దీంతో మస్తాన్ నవ్వుతూ, ''ఖాన్ సాబ్, మీ మనుషులు అండగా ఉంటే, మా దరిదాపుల్లోకి రావడానికి కూడా ఎవరూ సాహసించరు'' అని అన్నారు.'
ఈ విధంగా బొంబాయి అండర్ వరల్డ్‌లో ఒక భారీ ఒప్పందం కుదిరింది. దీంతో ముంబయిలోని అగ్రశ్రేణి డాన్ల జాబితాలో కరీం లాలా పేరు కూడా చేరిపోయింది.

ఫొటో సోర్స్, Lotus
'పఠాన్ గ్యాంగ్'కు పునాది...
కరీం లాలా ముంబయి డాన్‌గా ఎదుగుతున్న క్రమంలో, ఆయన గ్యాంగ్‌లోని సభ్యుల సంఖ్య కూడా త్వరగా పెరుగుతూ వచ్చింది.
ఆ గ్యాంగ్‌లో మాజిద్ దీవానా ఒకరు. మరొక ముఖ్య అనుచరుడు నవాబ్ ఖాన్. ఆయన గతంలో డాక్స్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. కరీం ఆయనకు ఇస్రాయెలీ మొహల్లాలోని మద్యం అడ్డాల బాధ్యతను అప్పగించారు.
కరీం లాలాకు మరో నమ్మకస్తుడైన సహచరుడు నాసిర్ ఖాన్. తెల్లగా, భారీ శరీరం ఉన్న ఆయన్ను 'సఫేద్ హాథీ' (తెల్ల ఏనుగు) అని పిలిచేవారు.
కరీం గ్యాంగ్‌లో హీరో లాలా, బష్రీన్ మామా, కరమ్ ఖాన్, లాల్ ఖాన్ కూడా ఉండేవారు. వీరు కరీం లాలా కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉండేవారు.
వీరందరూ కలిసే ముంబయిలో 'పఠాన్ గ్యాంగ్'కు పునాది వేశారు.
అలా అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతమైన కునార్ నుంచి వచ్చిన ఒక కుర్రాడు, వేల మైళ్ల దూరంలో ఉన్న ముంబయిని తన అడ్డాగా మార్చుకోవడమే కాకుండా, ఈ మహానగరానికి 'డాన్'గా ఎదిగారు.

ఫొటో సోర్స్, Lotus
కరీం లాలా, ఇందిరా గాంధీ భేటీ...
కరీం లాలా మరణించిన చాలా ఏళ్ల తర్వాత ఒక ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఆయన ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నట్లుగా ఆ ఫోటోలో ఉంది.
ఆ ఫోటోలో కరీం లాలాతో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కళాకారుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కూడా ఉన్నారు.
చటోపాధ్యాయ స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడి సోదరుడు.
ఈ విషయయమై బల్జీత్ పర్మార్ అనే జర్నలిస్ట్ ఇలా రాశారు.
'కరీం లాలా తానెప్పుడూ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లలేదని చటోపాధ్యాయతో చెప్పారు. అందుకే 1973లో హరీంద్రనాథ్‌కు పద్మ అవార్డు వచ్చినప్పుడు, ఆయనతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలనే కోరికను కరీం లాలా వ్యక్తపరిచారు. అలా ఆయన అక్కడకు తీసుకెళ్లినప్పుడే, '' ఆయన ముంబయిలోని పఠాన్ల నాయకుడు'' అని కరీం లాలాను ఇందిరా గాంధీకి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పరిచయం చేశారు.
కరీం లాలా, ఇందిరా గాంధీ మధ్య జరిగిన ఆ భేటీ మొదటిదే కాదు చివరిది కూడా.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రితో స్నేహం, కొడుకుతో గ్యాంగ్ వార్...
1975 నుంచి 1977 మధ్య కాలంలో, దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో హాజీ మస్తాన్, యూసుఫ్ పటేల్, సుకుర్ నారాయణ్ బఖియాలను స్మగ్లింగ్ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. కానీ, కరీం లాలా జోలికి మాత్రం ఎవరూ పోలేదు.
ఆ తర్వాత కొంతకాలానికి వేరే ఇతర కేసుల్లో కరీం లాలా అరెస్టు అయ్యారు.
ముంబయిలో కేవలం ఒక్క పోలీస్ అధికారి పట్ల మాత్రమే కరీం లాలా గౌరవం చూపించేవారు. ఆయనే హవల్దార్ ఇబ్రహీం కాస్కర్.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తండ్రి.
కాస్కర్ ఎప్పుడూ కరీం నుంచి డబ్బు ఆశించలేదు, ఆయన ముందు ఎప్పుడూ మోకరిల్లలేదు. తన రూ.75 నెల జీతంతోనే కుటుంబాన్ని పోషించుకున్నారు.
అప్పట్లో కరీం లాలా ముంబయి పోలీసు శాఖలోని చాలామంది జేబులు నింపుతుండేవారు.
ఇబ్రహీం కాస్కర్ తనకంటే పదేళ్లు చిన్నవాడైనప్పటికీ, కరీం లాలా ఆయనను 'ఇబ్రహీం భాయ్' అని పిలిచేవారు.
రాకేశ్ మారియా తన పుస్తకంలో వారిద్దరి మధ్య సంబంధం ఎలా ఉండేదో రాశారు.
‘ఇబ్రహీం అవినీతిపరుడు కానందున కరీం లాలాకు ఆయనపై ఎంతో గౌరవం ఉండేది.
దావూద్ జన్మించినప్పుడు, విందు ఏర్పాటుచేయడానికి కూడా ఇబ్రహీం వద్ద డబ్బు లేదు.
అప్పుడు కరీం లాలా, ఇబ్రహీం తరపున అందరికీ విందు ఇచ్చారు.
దావూద్ పుట్టిన సందర్భంలో 1955 డిసెంబర్ నెలలో ఆ విందు ఏర్పాటుచేశారు.
కానీ 1980 వచ్చేసరికి ముంబయి అండర్ వరల్డ్‌లో దావూద్ ఇబ్రహీం పాగా వేశారు. అదే సమయంలో కరీం లాలాకు ఆయనకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
1980 దశకం మొదటి ఐదేళ్లలో దావూద్, పఠాన్ గ్యాంగ్ మధ్య మొదలైన హత్యల పరంపర ఇక ఆగలేదు.
ఈ గొడవల్లో దావూద్ తన సోదరుడు షబ్బీర్‌ను కోల్పోగా, కరీం లాలా కూడా తన తమ్ముడు రహీం లాలాను పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఈ గ్యాంగ్ వార్ తర్వాతే దావూద్ ఇబ్రహీం ముంబయి వదిలేసి, తన కార్యకలాపాలకు దుబయిని కేంద్రంగా మార్చుకున్నారు’ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాబల్యం తగ్గిపోతున్నప్పుడు సంధి ప్రయత్నం...
1980 తరువాత కరీం లాలా ప్రాభవం తగ్గుముఖం పట్టింది. తాను ఇప్పుడు రిటైర్ అయ్యానని, విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన చెప్పడం మొదలుపెట్టారు.
తాను ఇప్పుడు కేవలం ఒక సామాజిక కార్యకర్తనని, ముంబయిలో నివసించే అఫ్గాన్ ప్రజల నాయకుడిని మాత్రమేనని చెప్పుకొనేవారు.
పఠాన్ గ్యాంగ్‌లోని యువకులు హింసకు పాల్పడకుండా ఆపడంలో విఫలమైన కరీం లాలా, తెర వెనుకకు వెళ్లడమే సరైనదని భావించారు.
పఠాన్ గ్యాంగ్ నాయకత్వం ఆయన మేనల్లుడు 'సమద్ ఖాన్' చేతుల్లోకి వెళ్లింది.
'కరీం లాలా తన గతాన్ని మర్చిపోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన పెరిగిన సంస్కృతిలో శత్రువుతో శాంతి కోసం చర్చలు జరపడమనేది గౌరవానికి విరుద్ధంగా భావించేవారు' అని రాకేశ్ మారియా తన పుస్తకంలో రాశారు.
'అయినప్పటికీ, దావూద్ ఇబ్రహీంతో సామరస్యం కోసం ప్రత్యేకంగా 1987 సెప్టెంబర్‌లో మక్కాకు వెళ్లి కలిశారు. కరీం కన్నీళ్లతో దావూద్‌ను కౌగిలించుకున్నారు. ''ఇప్పటికే చాలా రక్తం చిందింది, ఇకనైనా ఆపండి. నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి'' అంటూ రెండు వర్గాలకు నచ్చజెప్పారు' అని రాకేశ్ మారియా రాశారు.

ఫొటో సోర్స్, Lotus
90 ఏళ్ల వయసులో మరణం...
వయసు పెరుగుతున్నకొద్దీ కరీం లాలా వ్యక్తిగత అవసరాలు తగ్గుతూ వచ్చాయి.
ఒకప్పుడు వీధిలో మంచం మీద కూర్చుని ప్రజల గొడవలను పరిష్కరించే కరీం, సామాన్య జీవితాన్ని గడపడానికే ఇష్టపడేవారు.
ఆయన సంపన్నుడవుతున్న కొద్దీ నాటుసారా స్థానంలో ఖరీదైన స్కాచ్ విస్కీ తాగడం మొదలుపెట్టారు. కానీ జీవిత చరమాంకంలో మద్యం తాగడం పూర్తిగా మానేశారు.
కరీం లాంటి డాన్‌లంతా విలాసవంతమైన భవంతుల్లో నివసించేవారు, కానీ ఆయన మాత్రం చివరి వరకు 'నావెల్టీ సినిమా' వెనుక ఉన్న తన పాత ఇంటిని వదిలి వెళ్లలేదు.
చివరకు 2002, ఫిబ్రవరి 18న తన 90 ఏళ్ల వయసులో కరీం లాలా మరణించారు.
ఆయన జీవితం ఏ కత్తిపోటుకో, తుపాకీ తూటాకో, శత్రువుల పగకో లేదా కుట్ర వల్లనో ముగియలేదు. అకస్మాత్తుగా వచ్చిన గుండెనొప్పి ఆయన మరణానికి కారణమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














