తమ కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడని స్తంభానికి కట్టేసి దాడి చేశారు

ప్రేమ వివాహం చేసుకున్న సాయిచంద్, సాయిదుర్గ

ఫొటో సోర్స్, Saichand

ఫొటో క్యాప్షన్, ప్రేమ వివాహం చేసుకున్న సాయిచంద్, సాయిదుర్గ
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

తమ కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, సోదరుడు, బంధువులు పెళ్లి కుమారుడిని కిడ్నాప్‌ చేసి ఊళ్లో అందరి ముందు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లా ముసునూరులో చోటుచేసుకుంది.

యువకుడిని అర్థనగ్నంగా చేసి, స్తంభానికి కట్టి దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

కలకలం రేపిన ఈ ఘటన పూర్వాపరాలను నూజివీడు డీఎస్పీ ప్రసాద్‌‌తో పాటు బాధిత యువడుకు బీబీసీకి వెల్లడించారు. వారు చెప్పిన వివరాల మేరకు..

ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన సాయిచంద్‌.. అదే గ్రామానికి చెందిన సాయిదుర్గ ప్రేమించుకున్నారు.

సాయిచంద్‌ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా, దుర్గ ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్ట్‌ ఉమెన్‌గా పని చేస్తున్నారు.

సాయిచంద్‌ కాపు సామాజికవర్గానికి , దుర్గ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుంటామని తమ తమ తల్లిదండ్రులకు చెప్పారు. కానీ సాయిదుర్గ తల్లిదండ్రులు మరో కుమార్తె కూడా గతంలో ఇలానే కులాంతర ప్రేమ వివాహం చేసుకుదంటూ ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని చెప్పారని డిఎస్పీ వివరించారు.

దుర్గ తల్లిదండ్రులు నిరాకరించినా వివాహం చేసుకోవాలని సాయిచంద్, దుర్గ నిర్ణయించుకున్నారు. 2025 డిసెంబర్ 30వ తేదీన ఏలూరులోని గంగానమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నామని సాయిచంద్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గంగానమ్మ గుడిలో పెళ్లి చేసుకున్న సాయిచంద్, సాయిదుర్గ

ఫొటో సోర్స్, Saichand

ఫొటో క్యాప్షన్, 2025 డిసెంబర్‌ 30వ తేదీన ఏలూరులోని గంగానమ్మ గుడిలో పెళ్లి చేసుకున్న సాయిచంద్, సాయిదుర్గ

పోలీసులకు సమాచారం ఇచ్చి...

సాయిచంద్, సాయిదుర్గ డిసెంబరు 29వ తేదీన కానుకొల్లు పరిధిలోకి వచ్చే మండవల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి తాము మేజర్లమనీ, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామనీ, కానీ, దుర్గ తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఇబ్బందులు రావొచ్చని ఫిర్యాదు చేశారు.

స్పందించిన పోలీసులు ఆ యువతి తండ్రికి, సోదరుడికి ఫోన్‌ చేసి, విషయం చెప్పి స్టేషన్‌కి రావాల్సిందిగా కోరారు. కానీ వారు స్పందించలేదు. సాయంత్రం వరకు వేచి చూసిన పోలీసులు, ‘‘వాళ్లు రావడం లేదు.. మీరు జాగ్రత్తగా ఉండండి.. మీకేమైనా ఇబ్బంది కలిగితే ఫోన్‌ చేయండి’’ అని చెప్పి పంపేశారు.

మరుసటి రోజే కిడ్నాప్‌.. దాడి

పెళ్లి తరువాత పెళ్లి కొడుకు కిడ్నాప్ కావడం, ఆయనపై దాడి ఎలా జరిగిందో నూజివీడు డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడించారు.

సాయిదుర్గ, సాయిచంద్ వివాహం డిసెంబర్‌ 30వ తేదీన జరగ్గా, ఆఫీస్‌లో సెలవు ఇవ్వకపోవడంతో మరుసటి రోజు 31వతేదీన సాయిదుర్గను ముసునూరు మండలం రమణక్కపేటలోని పోస్టాఫీసు వద్ద దింపేందుకు సాయిచంద్‌ కూడా వెళ్లారు.

ఈ సమాచారం తెలుసుకున్న సాయిదుర్గ తల్లితండ్రులు, బంధువులు అక్కడికి వచ్చి తమ కుమార్తెను పక్కకు లాగి.. సాయిచంద్‌ను కారులో ఆ ఊరి సెంటర్‌కి తీసుకువెళ్లి అక్కడున్న స్తంభానికి కట్టేశారు.

సాయిచంద్‌ బట్టలు చించేసి, బూతులు తిడుతూ ఇష్టమొచ్చిన రీతిలో దాడి చేయగా, స్థానికులు నిలువరించే యత్నం చేశారు. అయితే తమ కుమార్తె వెంటపడి వేధిస్తున్నాడని చెప్పడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేదనీ, దాదాపుగా రెండుగంటల పాటు అలా దాడి చేస్తూనే ఉన్నారని సాయిచంద్‌ బీబీసీకి వివరించారు. అయితే అక్కడకు జనం చేరుకోవడం ఎక్కువ కావడంతో తనను అలాగే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు.

ఊరి జనం రాకపోయింటే తన ప్రాణం పోయేవరకూ కొట్టేవారని సాయిచంద్‌ బీబీసీతో అన్నారు.

విషయం తెలిసిన వెంటనే స్పందించామని, దాడికి పాల్పడిన సాయిదుర్గ తల్లిదండ్రులు విజయలక్ష్మి, కందుల బాబు, సోదరుడు శివనాగప్రసాద్, బంధువులు శివకృష్ణ, శిరీష, విజయను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపామని డీఎస్పీ ప్రసాద్‌ బీబీసీకి తెలిపారు.

బాధితులు సాయిచంద్, సాయిదుర్గలకు పూర్తి రక్షణ కల్పించామని చెప్పారు.

కులం కోణం లేదు.. డీఎస్పీ

తమ కుమార్తె ప్రేమపెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నిందితులు దాడిచేశారని, ఇందులో కులం కోణం లేదని డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేశామని చెప్పారు.

మరోవైపు బాధితులు బయటకు వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారు చెప్పలేదనీ, దాంతోనే ఈ ఘటన జరిగిందని మండవల్లి ఎస్‌ఐ రామచంద్రరావు బీబీసీతో అన్నారు.

అయితే ఈ ఘటనలో కులం కోణం కూడా ఉందని బాధిత యువకుడు సాయిచంద్‌ బీబీసీతో అన్నారు. ఈ విషయమై సాయిదుర్గ బంధువులతో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)