విశాఖ ఏజెన్సీలో ‘ఎన్‌కౌంటర్’ - ఐదుగురు మావోయిస్టుల మృతి: కిడారి హత్యకు ప్రతీకారమా?

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఆదివారం నుంచి వరుసగా జరుగుతున్న 'ఎదురు కాల్పుల'తో గిరిజనుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆదివారం, సోమవారం రెండు రోజులూ జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతదేహాలను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో మావోయిస్టు పార్టీ సెప్టెంబరు 21 నుంచి 28 వరకు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలోకి మావోయిస్టు అగ్ర నేతలు పెద్ద సంఖ్యలో వచ్చారని చింతపల్లి ఏఎస్‌పీ సతీశ్‌కుమార్ చెప్పారు. పోలీస్, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహించామని, ఆ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గూడెం కొత్తవీధి (జీకే వీధి) మండలం మాదిగ మల్లు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు.

''ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. మృతదేహాల వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాం'' అని సతీశ్ చెప్పారు.

ఐతే సోమవారం సాయంత్రం మాదిగమల్లు అటవీ ప్రాంతంలోని పేములమల్లు ప్రాంతం వద్ద మరోసారి మావోయిస్టులు ఎదురుపడ్డారని.. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పేర్కొన్నారు. ఈసారి మృతదేహాల వద్ద ఏకే47 తుపాకీ దొరకడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నారన్న ప్రచారం జరిగింది. కానీ అగ్రనేతలు ఎవరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదన్నారు ఏఎస్‌పీ.

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్

అంతా గోప్యమే..

ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగిందని.. అప్పుడే ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం నాటికి ముగ్గురు మావోయిస్టులు మరణించారనీ వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారనీ పోలీసులు చెప్పారు. కొంతమంది తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆ ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలనూ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం నాటికి మరో ఎన్‌కౌంటర్ జరిగిందనీ ఇద్దరు చనిపోయారనీ మృతుల వద్ద ఏకే47 ఉందని చెప్తున్నారు.

మామూలుగా ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంలో మృతదేహాల వీడియో క్లిప్పింగ్స్ తీసుకోవడానికి మీడియాను అనుమతిస్తారు. తద్వారా మరణించింది ఎవరు, ఎదురు కాల్పులు ఎలా జరిగాయి తదితర విషయాలు బయటకు వస్తాయి. కానీ ఈసారి మాత్రం పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోనూ నర్సీపట్నంలోనూ మీడియాను వీడియోలు తీయడానికి అనుమతించలేదు. తామే ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తామని ప్రకటించారు.

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్

న్యాయ విచారణ జరపాలి: ప్రజా సంఘాలు

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ల మీద న్యాయ విచారణ జరపాలని ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆ సంఘ నాయకుడు శ్రీరాములు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయాలని కోర్టును కోరామని.. పిటిషన్ మీద వాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్

''ఎన్‌కౌంటర్ మీద మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పారిపోయే వ్యక్తులకు తూటాలు శరీరం ముందు నుంచి ఎలా వచ్చాయి? బూద్రి నోట్లో నుంచి తుపాకీ పెట్టి కాల్చి చంపినట్లు ఉంది. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లుగా కనిపిస్తున్నారు'' అని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధి లక్ష్మి ఆరోపించారు.

2018లో నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అప్పటి మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు మావోయిస్టుల చేతుల్లో హత్యకు గురై సరిగ్గా సంవత్సరం అయింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)