#BBCShe : ‘టీజింగ్ చేస్తే ఒక్క చెంపదెబ్బ చాలు.. చాలకపోతే ఇంకొకటి!’
- రచయిత, అరవింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఓ రోజు సాయంకాలం.. పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్నా. ఓ కారు నన్ను ఫాలో అవ్వడం గమనించా. ఆ రోడ్డు సాధారణంగా సందడిగా ఉంటుంది. కానీ ఆ రోజు ఆదివారం. అంతా నిర్మానుష్యంగా ఉంది. నడకలో వేగం పెంచా. కారు నా ముందు ఆగింది. అందులో నుంచి ఓ యువకుడు దిగాడు. అతడి చేతిలో కత్తి ఉంది. కత్తి చూపిస్తూ.. కారు ఎక్కమన్నాడు. ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకున్నాను.. వాడిని ఒక్క తోపు తోసి పరిగెత్తాను. కాసేపటికే ఓ ఆటో కనిపించింది. ఎలాగోలా వాడి నుంచి బయటపడ్డాను. కానీ.. ఆ క్షణం నేను భయపడి ఉంటే, ఈ రోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదేమో!''
ఇదీ.. పంజాబ్‌లోని ఓ యువతికి ఎదురైన అనుభవం. తన అనుభవాన్ని ‘బీబీసీ షీ’ కార్యక్రమంలో పంచుకున్నారు ప్రాక్షీ ఖన్నా.
పంజాబ్‌లో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. వేధింపుల సమయంలో కొందరు మహిళలు తిరగబడుతుంటే.. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. అయితే.. వేధించేవారిపై తిరగబడటమే సమస్యకు సరైన పరిష్కారం అని భావించే మహిళలతో ‘బీబీసీ షీ’ కథనం..
ప్రాక్షీ ఖన్నా వయసు 20. ఈమె ఓ రచయిత్రి. పంజాబ్‌లోని జలంధర్‌లో ఈమెకు ఓ సంగీత సంస్థ కూడా ఉంది.

ఈమె పేరు సందీప్ కౌర్. జలంధర్‌లోని ఓ కళాశాలలో చదువుకుంటున్నారు. ఓరోజు.. తన బంధువును పికప్ చేసుకోవడానికి స్కూటర్‌పై వెళుతోంది. ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఢీకొట్టాడు. ''అతడు బాగా తాగున్నాడు. నా స్కూటర్‌ను ఢీకొట్టి.. పైగా నన్నే తిట్టడం మొదలుపెట్టినాడు. అంతే.. కోపమొచ్చి వాడికి ఒక్కటిచ్చాను'' అని తన అనుభవాన్ని పంచుకున్నారు సందీప్ కౌర్.
ఇలాంటి సందర్భాలు సందీప్ కౌర్‌కు కొత్త కాదు. బస్సు ప్రయాణాల్లో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మగవాళ్ల చెంపలు ఛెళ్లుమనిపించిన ఘటనలు కూడా సందీప్ కౌర్, ప్రాక్షీ ఖన్నాల జీవితాల్లో ఉన్నాయి. ఈ మేరకు వారు ఆ ఘటనలను వివరించారు.

తమను వేధించే మగవాళ్లతో పోరాడుతున్నది వీళ్లు మాత్రమే కాదు. ఓ వారం కిందట హరియాణాలో ఓ యువతి వార్తలకెక్కారు. ఆటోలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ పోలీసుకు తన కరాటే విద్యతో గుణపాఠం చెప్పారు.
కానీ ఈమెలాగ చాలా మంది యువతులు నిత్యం.. మగవాళ్ల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. వారిలో కొందరు ఎదురుతిరుగుతున్నారు. కానీ వారి పోరాటాలు వార్తల్లోకి ఎక్కకపోవచ్చు. కానీ.. కాలేజ్ వాతావరణం, మిత్రులు, పనిచేసే కార్యాలయాల్లో వీరి పోరాటాల ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది.
''వేధింపులకు గురిచేసే వారికి ఎదురుతిరగడం ఒక్కటే దారి!'' అంటున్నారు సందీప్ కౌర్. చాలా మంది యువతులు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.
''ప్రతి దాడి చేయడం వల్ల.. మమ్మల్ని మేం రక్షించుకోగలుగుతున్నాం. అవసరమైనపుడు నిర్భయంగా బయటికెళ్లగలుగుతున్నాం.'' అని సందీప్ తెలిపారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం పంజాబ్‌లో మహిళలపై దాడి ఘటనలు 2016లో 5వేలకు పైగా రికార్డయ్యాయి. అందులో 1038 కేసులు లైంగిక దాడికి ఘటనలే. కానీ.. ఇంకా చాలా కేసులు పోలీసుల దృష్టికి రావడం లేదు.

''మన వీధులు అంత సురక్షితం కాదు. అందుకు.. మేమే ఆకతాయిలకు గుణపాఠం చెప్పాల్సి వస్తోంది'' అని సందీప్ అంటున్నారు.
ఇలా.. మగవాళ్ల వేధింపులకు ఎదురుతిరిగిన వాళ్లలో ప్రీతి కూడా ఒకరు. జలంధర్‌లోని ఓ కళాశాలలో ప్రీతి డిగ్రీ చదువుతున్నారు.
''నేను బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను. ప్రాక్టీస్‌లో భాగంగా నేను షార్ట్స్ వేసుకుంటాను. నాకు ఇలాంటి వేధింపులు ప్రతిరోజూ ఎదురవుతూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. ఒక వ్యక్తి కామెంట్ చేస్తే.. అందుకు దీటుగానే స్పందిస్తాను. కానీ.. ఓ గుంపులో నలుగురైదుగురు కామెంట్ చేస్తే ఎలా స్పందించాలో అర్థం కాదు.'' అని ప్రీతి అన్నారు.
కానీ.. వేధించే వారికి ఎదురుతిరగడం పట్ల కొందరు యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
''రోజూ ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉంటారు. అలా అని.. అందరితో గొడవ పడలేం కదా. ఈరోజు వారితో గొడవ పడితే.. రేపు మాకు ఏదైనా హాని చేయొచ్చు.'' అని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శివాని అన్నారు.
ఈవ్ టీజర్లను పట్టించుకోకపోవడం ఉత్తమం అంటున్నారు మరో యువతి జస్లీన్ కౌర్. ఈమె గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
''ఏదైనా ఒక ప్రదేశం అంత సురక్షితం కాదు అని తెలిసినపుడు అక్కడకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళితే.. సమస్యలను మనమే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.'' అని జస్లీన్ కౌర్ అభిప్రాయపడ్డారు.

కానీ ఈ అభిప్రాయంతో ప్రాక్షీ విభేదిస్తున్నారు. ''మనం ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేం'' అంటున్నారు.
''ఈవ్ టీజర్లను అస్సలు ఉపేక్షించకూడదు. భయం అన్నది ఈ సమస్యకు పరిష్కారం కాదు. మనం భయపడితే.. వారు మరింత రెచ్చిపోతారు. రేపు మరికొందరు అమ్మాయిలను వేధిస్తారు. వారిని మనమే ప్రోత్సహించినట్టవుతుంది.'' అని ప్రాక్షీ అన్నారు.
పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయరు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..
''కొన్ని సందర్భాల్లో పోలీసులను ఆశ్రయించక తప్పదు. కానీ.. ఎవరైనా కామెంట్ చేసినపుడు, లేక అసభ్యంగా ప్రవర్తించినపుడు పోలీసుల వరకు ఎందుకు? ఒక చెంపదెబ్బ సరిపోతుంది. ఒకటి సరిపోదనుకుంటే.. రెండు దెబ్బలు!'' అని సందీప్ అన్నారు.

పోలీసులను ఆశ్రయించినా.. మాపైనే ఆంక్షలు
ఈ విషయమై ప్రాక్షీ స్పందిస్తూ.. మరో కోణాన్ని ప్రస్తావించారు.
''ఒకవేళ పోలీసులను ఆశ్రయిస్తే.. కేసులు, కోర్టులు.. అంటూ తల్లిదండ్రులు భయపడతారు. ఈ వేధింపులకు తోడుగా మాపై కుటుంబ పరమైన ఆంక్షలు కూడా మొదలవుతాయి.'' అన్నారు.
మహిళల వేధింపుల అంశంలో భారత ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసింది.
2013లో సవరించిన క్రిమినల్ చట్టం ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే ఐపీసీ 354-ఏ, మహిళలను వివస్త్రలను చేస్తే ఐపీసీ 354-బీ, వారిని రహస్యంగా, అసభ్యకర రీతిలో చిత్రీకరిస్తే ఐపీసీ 354-సీ, మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా వారిని వెంబడిస్తే ఐపీసీ 354-డీ సెక్షన్ల కింద మహిళలను వేధించిన సందర్భాల్లో కేసులు నమోదు చేయవచ్చు.

''చాలా మంది పంజాబీ అమ్మాయిలు క్రీడా రంగంలో విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఈ పరిణామం యువతుల్లో స్ఫూర్తి నింపుతోంది. అందుకే.. వేధింపులను కూడా వీళ్లు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కానీ చదువుకున్న యువతుల్లో వచ్చిన ఈ చైతన్యం నిరక్షరాస్యులైన యువతుల్లో ఇంకా రాలేదు. వారు ఇప్పటికీ అణిచివేతకు గురవుతూనే ఉన్నారు.'' అని పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మన్జీత్ సింగ్ అన్నారు.
పోకిరీలను ఎదుర్కోవడం పంజాబ్‌లో ఓ ట్రెండ్‌లా మారిందా? అన్నది చెప్పడం కష్టమే. కానీ అమ్మాయిల్లో.. ఆకతాయిలపై ఎదురుతిరగడం పట్ల అయిష్టత పెరుగుతోందన్నది సుస్పష్టం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









