నిర్భయ గ్యాంగ్‌రేప్ నిందితులకు ఉరిశిక్ష: డెత్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం.. ఇంతకీ రామ్ సింగ్, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, మైనర్ నిందితుడు ఎవరు?

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, delhi police

    • రచయిత, భూమికా రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2012 డిసెంబర్ 16 తర్వాత నుంచి దేశంలోని బాలికలు, యువతులు, మహిళలు ఎవరిపై అత్యాచారం జరిగినా.. ఆ ఘటనలను ప్రతిసారీ నిర్భయ కేసుతో పోలుస్తున్నారు.

కఠువా గ్యాంగ్‌రేప్ నుంచి ఉన్నావ్ రేప్ కేస్, ఇటీవలి హైదరాబాద్ గ్యాంగ్‌రేప్ అమానుషం వరకూ జరిగిన దారుణ ఘటనలను నిర్భయ గ్యాంగ్‌రేప్‌తోనే పోల్చారు.

దిల్లీ నిర్భయ గ్యాంగ్‌రేప్- ఈ కేసులో క్రూరత్వం గురించి విన్నప్పుడు, చదివినప్పుడు, చూసినప్పుడు ఇలాంటి దారుణాన్ని కొంతమంది మనుషులు చేశారనేది నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. 2012లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు పట్టుబడ్డారు. కోర్టు వారిని దోషులుగా ఖరారు చేసింది.

శిక్షను ఎదుర్కుంటున్న ఒక వ్యక్తి జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని బాలనేరస్థుల గృహానికి పంపించారు. మిగిలిన నలుగురికి ఉరిశిక్షను సమర్థించారు.

దోషులకు దిల్లీలోని పటియాలా కోర్టు జనవరి 7న డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకూ మరణశిక్షను అమలుచేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

జనవరి 22 లోపు (అంటే 14 రోజుల్లోపు) వారు క్యూరేటివ్ పిటిషన్ లేదా రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

ఒకట్రెండు రోజుల్లో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

రామ్ సింగ్

రామ్ సింగ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడుగా చెప్పారు. 2013 మార్చిలో తీహార్ జైల్లో అతడి శవం దొరికింది.

రామ్ సింగ్ ఉరి వేసుకున్నాడని పోలీసులు చెప్పారు. కానీ అతడిని హత్య చేశారని ఆయన తరఫున వాదిస్తున్న వకీల్, రామ్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బస్ డ్రైవర్ రామ్ సింగ్ ఇల్లు దక్షిణ దిల్లీ రవిదాస్ ఝుగ్గీ బస్తీ కాలనీలో ఉంది. 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన బస్సుకు రామ్ సింగ్ డ్రైవర్‌. శరీరం లోపల తీవ్రమైన గాయాలతో కొన్నిరోజుల తర్వాత బాధితురాలు మృతి చెందింది.

ఎప్పుడూ మద్యం తాగి, గొడవలు చేయడం రామ్ సింగ్‌కు మామూలే అని అతడి పొరుగు వారు చెపారు.

రామ్ సింగ్ కుటుంబం 20 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఒక గ్రామం నుంచి దిల్లీ వచ్చింది. ఐదుగురు సోదరుల్లో రామ్ సింగ్ మూడో వాడు. చదువుకోమని స్కూల్లో చేర్పిస్తే ప్రాథమిక స్థాయిలోనే చదువు మానేశాడు.

నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో మొదట అరెస్టు చేసింది రామ్‌ సింగ్‌నే.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

ముకేశ్ సింగ్

ముకేశ్ సింగ్, రామ్ సింగ్ సొంత తమ్ముడు. అతడు అన్నతోపాటే ఉండేవాడు. అప్పుడప్పుడు బస్ డ్రైవరుగా, లేదంటే క్లీనరుగా పనిచేసేవాడు.

నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో కొట్టినందుకు ముకేశ్ సింగ్‌ను దోషిగా నిర్ధారించారు. అయితే అతడు తాను అలా చేయలేదని చెబుతూ వచ్చాడు.

ఘటన జరిగిన రాత్రి తను బస్ నడుపుతున్నానని, మిగతా నలుగురూ యువతిపై అత్యాచారం చేశారని, ఆమె ఫ్రెండును కొట్టారని ముకేశ్ సింగ్ విచారణ సమయంలో చెప్పాడు.

కానీ కోర్టు ముకేశ్ సింగ్‌ను కూడా దోషిగా ఖరారు చేసింది. అతడికి కూడా మరణశిక్ష విధించింది.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, AFP

వినయ్ శర్మ

దాదాపు 26 ఏళ్ల వినయ్ శర్మ ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వినయ్ ఇల్లు కూడా రామ్ సింగ్ ఉంటున్న రవిదాస్ ఝుగ్గీ బస్తీ కాలనీలోనే ఉంది.

దోషుల్లో వినయ్ మాత్రమే స్కూల్ విద్యను పూర్తి చేశాడు. కాస్త ఇంగ్లిష్ కూడా మాట్లాడగలడు.

2013 వేసవిలో వినయ్ శర్మ కాలేజ్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయడానికి ఒక నెల బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. కానీ కోర్టు దానికి అంగీకరించలేదు.

నిర్భయ ఘటన జరిగినప్పుడు తను అసలు బస్సులోనే లేనని వినయ్ శర్మ విచారణలో చెప్పాడు. ఈ కేసులో మరో దోషి అయిన పవన్ గుప్తాతో తను ఒక సంగీత కార్యక్రమం చూడ్డానికి వెళ్లానన్నాడు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

అక్షయ్ ఠాకూర్

34 ఏళ్ల బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్ బిహార్‌కు చెందినవాడు. అక్షయ్‌ను ఘటన జరిగిన ఐదో రోజు 2012 డిసెంబర్ 21న బిహార్‌లో అరెస్ట్ చేశారు.

అక్షయ్ మీద అత్యాచారం, హత్య, కిడ్నాప్‌తోపాటు ఘటన తర్వాత సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అక్షయ్ అదే ఏడాది బిహార్ నుంచి దిల్లీ వచ్చాడు. వినయ్ లాగే అతను కూడా ఘటన జరిగినప్పుడు తను బస్సులో లేనని చెబుతున్నాడు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

పవన్ గుప్తా

వృత్తిరీత్యా పళ్లు అమ్ముకునే 25 ఏళ్ల పవన్ గుప్తా కూడా తన మిగతా సహచరుల్లాగే అత్యాచారం జరిగినపుడు అసలు బస్సులో లేనని కోర్టుకు చెప్పాడు. వినయ్ శర్మతో కలిసి సంగీత కార్యక్రమానికి వెళ్లానని అంటున్నాడు.

కోర్టులో సాక్షిగా హాజరైన అతడి తండ్రి హీరా లాల్ కూడా, తన కొడుకు ఏ తప్పు చేయలేదని, ఆ కేసులో అతడిని ఇరికించారని చెప్పారు.

ఘటన జరిగిన రోజు కొడుకు పవన్ గుప్తా మధ్యాహ్నానికే షాపు మూసి ఇంటికి వెళ్లిపోయాడని, మద్యం తాగి భోజనం చేశాక, దగ్గరే ఉన్న ఒక పార్కులో జరిగే సంగీత కార్యక్రమానికి వెళ్లిపోయాడని చెప్పాడు.

వేరే బంధువుతో కలిసి వెళ్లి పవన్‌ను ఆ పార్కు నుంచి ఇంటికి తీసుకొచ్చానని అతడి తండ్రి చెప్పాడు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

మైనర్ నిందితుడు

ఈ నేరంలో ఆరో దోషి వయసు ఘటన జరిగినప్పుడు 17 ఏళ్లు. దాంతో అతడిని మైనరుగా భావించి కేసు నడిపారు.

2013 ఆగస్టు 31 నాటికి మైనర్‌ను అత్యాచారం, హత్యలో దోషిగా తేల్చారు. అతడిని మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపించారు. భారత చట్టాల ప్రకారం మైనర్లు ఎవరికైనా ఇది అత్యధిక శిక్ష అవుతుంది.

మైనర్ దోషి ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందినవాడు. 11 ఏళ్ల వయసులో అతడు దిల్లీ వచ్చేశాడు. అతడి పేరు వెల్లడించడంపై చట్టపరమైన నిషేధం ఉంది.

అతడి తల్లి బీబీసీతో మాట్లాడుతూ "దిల్లీకి బస్సులో వెళ్తున్నప్పుడు నా కొడుకుతో నేను చివరి సారి మాట్లాడాను. 2012 డిసెంబర్‌లో పోలీసులు మా ఇంటికి వచ్చి తను అత్యాచార కేసులో పట్టుబడ్డాడని చెప్పేవరకూ అతడు చనిపోయాడనే అనుకున్నాను" అన్నారు.

మైనర్ దోషి కుటుంబం ఆ గ్రామంలోని అతి పేద కుటుంబాల్లో ఒకటి. అతడి తండ్రి మానసిక వైకల్యంతో ఉన్నాడు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, Getty Images

2012 డిసెంబర్ 16న ఏం జరిగింది?

ఈ ఘటన 2012 డిసెంబర్ 16న రాజధాని దిల్లీలో జరిగింది. ఆ రాత్రి 23ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపైన, ఆమె సహచరుడిపైన నడుస్తున్న బస్సులో దాడి చేశారు. యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేసి, ఇద్దరినీ రోడ్డుపైన విసిరేశారు.

పోలీసులు తర్వాత బస్ డ్రైవర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో మైనర్ యువకుడు అత్యంత క్రూరంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి.

యువతిని దిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఆమె పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. దాంతో, ఆమెను మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని ఒక ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు.

కానీ అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. డిసెంబర్ 29న గ్యాంగ్‌రేప్ బాధిత విద్యార్థిని మృతిచెందింది.

వీడియో క్యాప్షన్, ఎన్ని చట్టాలున్నా నేరాలు ఎందుకు తగ్గడం లేదు

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ

నిర్భయ గ్యాంగ్‌రేప్ తర్వాత దేశమంతటా తీవ్ర వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. అత్యాచారానికి వ్యతిరేకంగా కఠిన చట్టం చేయాలనే డిమాండ్ వచ్చింది.

2012 డిసెంబర్ 23న దిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు.

2013 జనవరి 3న పోలీసులు 33 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. 2013 జనవరి 21న కెమెరాల నిఘాలో ఆరుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది.

మైనర్‌ను విచారించిన జువైనల్ జస్టిస్ బోర్డ్ 2013 జనవరి 28న తన కీలక తీర్పులో అతడిని దోషిగా ప్రకటించింది. ఫిబ్రవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ ఆరోపణలను నిర్ధారించింది.

కోర్టు విచారణ సమయంలో 2013 మార్చి 11న రామ్ సింగ్ తీహార్ జైల్లోని బ్యారక్‌లో చనిపోయి కనిపించాడు.

ఈ కేసులో 2013 ఆగస్టు 31న జువైనల్ జస్టిస్ బోర్డ్ నిర్భయపై అత్యాచారం, హత్యలో మైనర్ నిందితుడిని దోషిగా భావిస్తూ మూడేళ్ల శిక్ష విధించింది. 2013 సెప్టెంబర్ 3న ఫాస్ట్ ట్రాక్ కోర్టు మిగతా నలుగురు నిందితుల విచారణ పూర్తి చేసింది. ఇక్కడ మొత్తం 130 సార్లు విచారణలు జరిగాయి. వందకు పైగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు.

ప్రత్యక్ష సాక్షిగా అత్యాచార బాధితురాలి స్నేహితుడిని కోర్టులో హాజరుపరిచారు. అతడు ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రత్యక్ష సాక్షి. ఘటన సమయంలో అదే బస్సులో ఉన్నాడు.

నిందితులపై భారత శిక్షాస్మృతి ప్రకారం హత్య, సామూహిక అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, అసహజ నేరం, దోపిడీ, దోపిడీ సమయంలో హింస, సాక్ష్యాలు చెరిపేయడం, నేరపూరిత కుట్ర లాంటి సెక్షన్లు నమోదు చేశారు.

నిర్భయ గ్యాంగ్‌రేప్

ఫొటో సోర్స్, AFP

ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?

2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.

2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.

2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.

2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.

2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: తీహార్ జైలు అధికారులు తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను కోరారు.

2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.

2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)