JNU హింస: దిల్లీ పోలీసులకు మాజీ పోలీసు అధికారుల ప్రశ్నలు

దిల్లీ పోలీసులు
    • రచయిత, బ్రజేశ్ మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం జరిగిన విధ్వంసం, హింసలో చాలా మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదంతా జరుగుతున్న సమయంలో దిల్లీ పోలీసుల తీరుపై ఎన్నో ప్రశ్మలు వస్తున్నాయి.

రిపోర్ట్స్ ప్రకారం సుమారు 30 మంది ముసుగులు వేసుకున్న వ్యక్తులు కర్రలు, రాడ్లు తీసుకుని ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలో చొరబడ్డారు. క్యాంపస్ లోపల విధ్వంసం సృష్టించారు. హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులను కొట్టారు.

కొన్ని గంటలవరకూ హింస జరుగుతున్నప్పుడు, లోపల విద్యార్థులకు సాయం చేయడానికి బదులు పోలీసులు అసలు లోపలికే రాలేదని ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసులు మాత్రం జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్ అనుమతి కోసం వేచిచూస్తున్నామని, అందుకే లోపలికి రాలేదని అంటున్నారు.

అయితే, పోలీసుల ఈ సమాధానంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేక ప్రదర్శనలు జరిగినపుడు జామియా మిలియా ఇస్లామియాలో చొరబడి విద్యార్థులను కొట్టి, విధ్వంసం సృష్టించారని దిల్లీ పోలీసులపై ఆరోపణలు కూడా వచ్చాయి.

దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Social media

దర్యాప్తు జరిగింది

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, దానిపై దర్యాప్తు కూడా జరుగుతోందని దిల్లీ పోలీసులు చెబుతున్నారు.

జేఎన్‌యూ విషయంలో పోలీసులు వెంటనే, కఠినంగా ఎందుకు వ్యవహరించలేదు? దీనిపై మాజీ ఐపీఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ మాట్లాడారు.

"యూనివర్సిటీలో పోలీసులు చొరబడినప్పుడు, అనుమతి లేకుండానే లోపలికి ప్రవేశించారని విమర్శించారు. హింస జరుగుతున్నప్పుడు, పోలీసులు రాలేదని ఇప్పుడు కూడా విమర్శిస్తున్నారు. అందుకే, పోలీసు పాత్ర చాలా కష్టంగా ఉంటుంది. యూనివర్సిటీ అధికారులు ఎన్నిగంటలకు పోలీసులను పిలిచారు, వారు ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు అనేదే ప్రశ్న. విద్యార్థి సంఘానికి చెందిన ఎవరైనా పోలీసులకు కాల్ చేసి, వారు వచ్చుంటే.. యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా లోపలికి ఎందుకొచ్చారని, అప్పుడు కూడా ప్రశ్నిస్తారు" అన్నారు.

పోలీసులు ప్రతిసారీ ఇలా యూనివర్సిటీ అధికారుల అనుమతి కోసం వేచిచూస్తుంటే, పెద్ద ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన కూడా అంగీకరించారు.

దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Ani

పోలీసులు సంప్రదాయం మార్చుకోవాలి

"ఈ సంప్రదాయాన్ని మార్చుకోవాలి. ఈమధ్య పిస్టల్, కత్తులు, బాంబులతో క్యాంపస్‌లో తిరుగుతున్నారు. పోలీసులకు హింస గురించి ఏదైనా సమాచారం అందగానే, వాళ్లు క్యాంపస్‌లోకి వెళ్లి యాక్షన్ తీసుకోవాలి. అలాంటి స్థితి ఉన్నప్పుడు వీసీ అనుమతి వచ్చేవరకూ వేచిచూడకూడదు. కానీ, దానిని సమాజం కూడా అంగీకరించాలి. విద్యా సంస్థల్లో అనుమతి లేకుండా పోలీసులు లోపలికి రాకూడదు అనే అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్ని క్యాంపస్‌లలో ఇలాంటి నేర ఘటనలు జరుగుతున్నాయి. ఇలా, మీరు రోజూ అనుమతి అడుగుతూ కూచుంటే, ఏదో ఒకరోజు క్యాంపస్‌లో హత్య కూడా జరుగుతుంది, అప్పుడు కూడా పోలీసులు అనుమతి కోసం ఎదురుచూస్తుంటారు" అన్నారు ప్రకాశ్ సింగ్.

దిల్లీ పోలీస్ పీఆర్ఓ ఎంఎస్ రంధావా మాత్రం "ఆదివారం ఐదు గంటలకు దిల్లీ పోలీసులకు ఒక ఫోన్ వచ్చింది. జేఎన్‌యూలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతోందని వారు చెప్పారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి గొడవలు మా దృష్టికి వచ్చాయి" అన్నారు.

"దిల్లీ పోలీసులు క్యాంపస్ లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. కానీ కోర్టు ఆదేశాలతో అడ్మినిస్ట్రేషన్ బ్లాకులో మాత్రం పోలీసులను మోహరించవచ్చు. హింస జరిగింది అక్కడికి కాస్త దూరంలో ఉంది. జేఎన్‌యూ అధికారులు రాత్రి 7.45కు దిల్లీ పోలీసులను క్యాంపస్‌లోకి రమ్మని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు" అన్నారు.

ఈ ఘటనలో దిల్లీ పోలీసులు అనుసరించిన పద్ధతి గురించి ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్‌తో కూడా బీబీసీ మాట్లాడింది.

"పోలీసులు క్యాంపస్‌లోకి వెళ్లడానికి చాలా సేపటి తర్వాత అనుమతించారని చెబుతున్నారు. నేను ఆ వాదనను పట్టించుకోను. ప్రస్తుతం జేఎన్‌యూ చాలా సున్నితమైన ప్రాంతం. ఆ చుట్టుపక్కల పోలీసులు ఉండి తీరాలి. మీరు క్యాంపస్‌లో లేకపోతే ఆ చుట్టుపక్కల ఎందుకు లేరు" అన్నారు.

దిల్లీ పోలీసులు

పోలీసులు వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు?

"ఇంత హింసకు సన్నాహాలు జరుగుతున్నప్పుడు, అంటే దాదాపు 30 మంది ముసుగులతో రాడ్లు తీసుకుని దేశంలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలోకి చొరబడి, గంటలపాటు విధ్వంసం సృష్టించారని చెబుతున్నప్పుడు, జేఎన్‌యూ అంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నప్పుడు, మీరు యాక్షన్ తీసుకోవాల్సింది. పరిస్థితి అదుపు తప్పుతుంటే, వీసీ పిలవకపోయినా, మీరు లోపలికి వెళ్లుండాలి. మీరేమో అనుమతి లేదంటున్నారు. ఉద్రిక్తతలు అసలు ఆగేలా లేనప్పుడు, మీరు అలా ఎలా చెప్పగలరు" అని విక్రమ్ సింగ్ అన్నారు.

24 గంటల తర్వాత కూడా పోలీసులు ఆ విషయంలో ఎలాంటి ప్రత్యేక దర్యాప్తూ చేయలేదని, ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

క్యాంపస్ లోపల జరిగిన ఈ హింసపై అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), వామపక్ష విద్యార్థి సంఘం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

పోలీసులు క్యాంపస్ బయట ఉన్నారని, కానీ దాడి చేసినవారు లోపల విధ్వంసం సృష్టిస్తుంటే సాయం కోసం రాలేదని చాలా మంది విద్యార్థులు చెబుతున్నారు.

దిల్లీ పోలీసులు

దిల్లీ పోలీసులపై వరుస ప్రశ్నలు

ఇటీవల కాలంలో దిల్లీలో జరిగిన ఘటనలను గమనిస్తే, వకీళ్లను చితకబాదిన ఘటనైనా, పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ప్రదర్శనల్లో జామియాలో చర్యలు అయినా, ఇప్పుడు జేఎన్‌యూ హింస అయినా దిల్లీ పోలీసుల చర్యలపై వరుస ప్రశ్నలు వస్తున్నాయి.

అది పోలీసుల దురదృష్టం అని విక్రమ్ సింగ్ చెప్పారు. పోలీసులు వరస ఘటనలతో పాఠం నేర్చుకోలేదన్నారు. వకీళ్లపై బలప్రయోగం చేయని పోలీసులు, జామియా ఘటనలో ఎక్కువ బలం ప్రదర్శించారని, జేఎన్‌యూ హింస సమయంలో అసలు చర్యలు చేపట్టలేదని చెప్పారు. వారిలో లోపం ఎక్కడుందో దిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు చూడాలన్నారు.

ఇప్పటివరకూ అరెస్టులు ఎందుకు జరగలేదు?

ఈ కేసులో 24 గంటలు గడిచినా ఎలాంటి అరెస్టులూ జరగలేదు. దాడుల్లో గాయపడిన చాలామంది విద్యార్థులను అంబులెన్సులో ఆస్పత్రులకు పంపించారు. దాడిలో జేఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు.

అయితే జేఎన్‌యూ విద్యార్థులు పోలీసుల పనితీరును ప్రశ్నించడం ఇది మొదటిసారి కాదు, జేఎన్‌యూలో ఫీజులు, ఇతర అంశాల గురించి నిరసనలు జరిగినప్పుడు కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు పట్టుకోలేకపోయారు?

విధ్వంసం, దాడి, హింస తర్వాత దాడిచేసినవారు జేఎన్‌యూ నుంచి బయటకు వెళ్లగానే, పోలీసులు వారిని ఎందుకు పట్టుకోలేదని, పోలీసులు క్యాంపస్ లోపలికి వెళ్లలేకపోయినా, బయటైనా వారిపై యాక్షన్ తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు.

మాజీ ఐపీఎస్ ప్రకాశ్ సింగ్ కూడా ముసుగులు వేసుకున్న వారు క్యాంపస్ నుంచి బయట రోడ్డుపైకి వెళ్లినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సింది అన్నారు. "పోలీసులు అక్కడ ఉండుంటే, వారిని పట్టుకోవాల్సింది. వారు నిర్దోషులైతే తర్వాత వదిలేసుండచ్చు. కానీ యాక్షన్ తీసుకోవాల్సింది. అలా చేయలేదు కాబట్టే వారిపై ప్రశ్నలు రావడం సబబే" అన్నారు.

పోలీసులు యాక్టివ్‌గా ఉండుంటే జేఎన్‌యూలో ఇలాంటి ఘటన జరిగేదే కాదని విక్రమ్ సింగ్ అన్నారు.

"30 మంది కర్రలు, రాడ్లతో క్యాంపస్‌లోకి చొరబడితే, విధ్వంసం చేస్తుంటే, మీరు ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా ఎలా ఉంటారు. దానివల్ల పోలీసుల పనితీరుపై ప్రశ్నలు వస్తాయి. అది దిల్లీ పోలీస్ ఉన్నతాధికారుల బాధ్యత. వారు దీని గురించి ఆలోచించాలి" అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

దిల్లీ పోలీస్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిలో పనిచేస్తోందా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

దీనిపై "దిల్లీ పోలీసులే కాదు, దేశంలోని పోలీసులందరిపై ఆ ప్రభావం ఉంది. వారిపై ఎవరి రాజకీయ నియంత్రణ ఉంటుందో, అక్కడి పోలీసులపై వారి ప్రభావం కనిపిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టు యాక్షన్ తీసుకునేలా పోలీసులకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి" అని ప్రకాశ్ సింగ్ అన్నారు.

దిల్లీ పోలీసులు మాత్రం ఈ కేసులో క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని చెబుతున్నారు. అక్కడ ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్నిటి ఫుటేజ్ సేకరిస్తున్నారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు.

జేఎన్‌యూ హింస ఘటనలో మొత్తం 34 మంది గాయపడ్డారు. వారిని ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌కు పంపించారు. అందరినీ ఇప్పుడు అక్కడి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)