ఆస్ట్రేలియాలో వేల సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా ఒకవైపు కార్చిచ్చుతో సతమతవుతోంది. మంటల్లో లక్షలాది జంతువులు ఆహుతయ్యాయి. అదే ఆస్ట్రేలియాలో మరోవైపు, వేలాది ఒంటెలను వేటాడి చంపుతున్నారు.
దక్షిణ ఆస్ట్రేలియాలో ఒంటెలు పెద్ద సంఖ్యలో దాడి చేసి పట్టణాలు, భవనాలను ధ్వంసం చేస్తున్నాయని ఆ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజలు ఫిర్యాదు చేయటంతో స్నైపర్లు హెలికాప్టర్లలో తిరుగుతూ ఈ వేట కొనసాగిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటంతో పాటు, కరవు కారణంగా ఒంటెలను వేటాడి హతమార్చాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ వేట ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.
''ఒంటెలు నీటి కోసం వెదుకుతూ రోడ్ల మీద సంచరిస్తున్నాయి. పిల్లల భద్రత గురించి మేం ఆందోళన చెందుతున్నాం'' అని కానిపి సమాజంలో నివసించే మారిటా బేకర్ చెప్పారు.
ఒంటెలతో పాటు కొన్ని అడవి గుర్రాలను కూడా చంపుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా పర్యావరణ, జల విభాగానికి చెందిన వేటగాళ్లు ఈ జంతువులను షూట్ చేసి చంపే పని నిర్వహిస్తారు.
వేడి, పొడి వాతావరణం వల్ల ఆస్ట్రేలియా వ్యాప్తంగా కొన్న నెలలుగా భారీ ఎత్తున కార్చిచ్చులు చెలరేగాయి. అయితే.. దేశంలో కొన్నేళ్లుగా కరవు పరిస్థితులు నెలకొన్నాయి. కార్చిచ్చు సంక్షోభానికి, ఒంటెల సంహారానికి నేరుగా సంబంధం లేదు.
దక్షిణ ఆస్ట్రేలియాలో జనం అతి తక్కువగా నివసించే అనంగు పిత్జాన్తాత్జారా యాంకున్యాత్జాన్జాత్జారా (ఏపీవై) అనే ప్రాంతంలో ఒంటెల సంహారం జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియా ఆదివాసీ బృందాలు నివసించే ప్రాంతం.
''ఒంటెలు భారీ సంఖ్యలో నీటి కోసం ఊర్ల మీదకు వస్తున్న నేపథ్యంలో ఈ ఆదివాసీ సమూహాలు, వారి పశుసంపద మీద ఒత్తిడి చాలా తీవ్రమవుతోంది'' అని ఏపీవై జనరల్ మేనేజర్ రిచర్జ్ కింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఒంటెలను తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
''ఒంటెలు కంచెలు కూల్చివేసి వస్తున్నాయి. ఇళ్ల చుట్టూ, ఇళ్లలోకి వస్తున్నాయి. ఎయిర్ కండిషనర్ల నుంచి నీరు తాగాలని ప్రయత్నిస్తున్నాయి. మేం వేడిలో, అసౌకర్య పరిస్థితుల్లో చిక్కుకున్నాం. అనారోగ్యంగా ఉన్నాం'' అని ఏపీవై ఎగ్జిక్యూటవ్ బోర్డు సభ్యురాలు మారిటా బేకర్ వివరించారు.
నిజానికి, కంగారూల నిలయమైన ఆస్ట్రేలియాలో ఒంటెలు స్థానికంగా పుట్టినవి కాదు. బ్రిటిష్ వాళ్లు 19వ శతాబ్దంలో ఇక్కడికి వలస వచ్చినపుడు.. ఇండియా, అఫ్ఘానిస్తాన్, మధ్య ప్రాచ్యం నుంచి ఒంటెలను తీసుకువచ్చారు.
దేశంలోని మధ్య ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో అడవి ఒంటెలు ఉన్నట్లు అంచనా. అవి నీటి కోసం ఇళ్లు, ఊళ్లు ధ్వంసం చేయగలవు. పైగా వాతావరణ మార్పునకు తోడ్పడే మీథేన్ వాయువును విడుదల చేస్తాయి.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చుల కారణంగా సెప్టెంబర్ నుంచి 25 మంది చనిపోయారు. దాదాపు 2,000 ఇళ్లు ఆహుతయ్యాయి. దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటల్లో పెద్ద సంఖ్యలో జంతువులు కూడా చనిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- ట్రాయ్: ట్రోజన్ యుద్ధం నిజంగా జరిగిందా లేక కట్టు కథా?
- వివేకానందుడు చికాగో ప్రసంగంలో ఏం చెప్పారు?
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ:
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారా
- ‘జేఎన్‌యూలో దాడి చేసింది ఏబీవీపీ విద్యార్థులే’ - న్యూస్ చానెల్ స్టింగ్ ఆపరేషన్
- CAA: విదేశీ నేతలు ఏమంటున్నారు... అక్కడి పత్రికలు ఏం రాస్తున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








