కాంగ్రెస్‌ పార్టీలో సమస్యలకు సోనియా గాంధీ కుటుంబమే కారణమా?

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మా పార్టీ వెనుకబడలేదు. బీజేపీనే మా కన్నా ముందుకు వెళ్లిపోయింది’’.. ఇదీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నమాట.

రాజస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఇది నిజమేనేమో అనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతుల్లో నుంచే అధికారం బీజేపీకి వెళ్లింది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్‌కు అధికారం దూరం కానుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. కానీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ వెనుకబడిందనైతే చెప్పలేం.

మొదట మధ్యప్రదేశ్, ఇప్పుడు రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్‌లో వచ్చిన తిరుగుబాట్లు 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో నిరాశకు కారణమవుతున్నాయి.

సచిన్ పైలట్ తిరుగుబాటు సంకేతాలు మార్చి నుంచి కనిపిస్తూ వచ్చాయి. ‘కాంగ్రెస్ హైకమాండ్ దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? ఒకవేళ పసిగట్టినా, ఎందుకు పరిష్కరించలేకపోయింది?’ అని రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత తిరుగుబాట్లు చాలా వస్తున్నాయి. పార్టీ ముందు చాలా సవాళ్లు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో పార్టీకి ఎటువైపు చూసినా, ఇప్పుడు అయోమయ పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అసలు ఇంత ఘోరమైన పరిస్థితి కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చింది? ఆ పార్టీని విడిచివెళ్లాలని నాయకులు ఎందుకు అనుకుంటున్నారు?

రాహుల్ గాంధీకి పోటీగా పార్టీలో ఎవరూ ఎదగకూడదని సోనియా గాంధీ కోరుకుంటున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీకి పోటీగా పార్టీలో ఎవరూ ఎదగకూడదని సోనియా గాంధీ కోరుకుంటున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి

నెహ్రూ-గాంధీ కుటుంబం

జ్యోతిరాదిత్య సింధియాను ఇప్పటికే బీజేపీ తమ పార్టీలోకి తీసుకుంది. సచిన్ పైలట్‌ను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆ పార్టీ వర్గాల ప్రకారం కాంగ్రెస్‌లో సమస్యలకు కారణం గాంధీ కుటుంబమే. మరీ ముఖ్యంగా సోనియా గాంధీ.

‘‘తన కుమారుడు రాహుల్ గాంధీకి పోటీగా పార్టీలో ఎవరూ ఎదగకూడదని సోనియా గాంధీ కోరుకుంటున్నారు. కుమారుడిని కాపాడుకునేందుకు సిద్ధాంతాలను, సమర్థులను ఆమె పక్కనపెట్టారు. కనీసం తన కుమార్తె ప్రియాంక గాంధీని కూడా ఆమె రాజకీయంగా ఎదగనివ్వలేదు’’ అని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ వీడి తమతో కలిసి వచ్చేలా బీజేపీ ప్రేరేపిస్తోందన్న అభిప్రాయం జనాల్లో ఉంది.

‘‘వాళ్లకు వాళ్లుగానే వస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, ఆయనకున్న రాజకీయ అవగాహనపై వారికి పూర్తిగా నమ్మకం లేదు. గాంధీ కుటుంబం తమను ఎదగనివ్వదని తెలుసు. అందుకే, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేందుకు లైన్లు కడుతున్నారు. సమర్థులనే మేం చేర్చుకోవాలని అనుకుంటున్నాం’’ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ముంబయికి చెందిన భావన జైన్ అమెరికాలో చాలా ఏళ్లు ఉండి, భారత్‌కు తిరిగివచ్చారు. సోనియా గాంధీకి ప్రభావితురాలై, కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె చెప్పారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీల వల్ల కాంగ్రెస్‌కు ఏ సమస్యా లేదని ఆమె అంటున్నారు.

‘‘గాంధీ కుటుంబాన్ని సోషల్ మీడియాలో అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు. అమ్ముడుపోయిన మీడియా, సోషల్ మీడియా, కొందరు సినీ తారలు కూడా ఇందులో భాగం. ఇదంతా హిట్లర్ పాలనలా నడుస్తోంది. మేం వారిని ఎదుర్కొనే ప్రయత్నిస్తున్నాం’’ అని భావన అన్నారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ATUL LOKE

ఫొటో క్యాప్షన్, ‘సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు సీనియర్ నాయకులు రాహుల్‌కు అండగా నిలవలేదు’

పార్టీలో గాంధీ కుటుంబానికి పూర్తి మద్దతు ఉందని భావన గట్టిగా వాదిస్తున్నారు.

‘‘సోనియా, రాహుల్‌లకు కాంగ్రెస్ కార్యకర్తలు విధేయులై ఉన్నారు. రాహుల్ అధ్యక్షుడైన తర్వాత పార్టీ అంతటా ఆయన పట్ల ఆమోదం కనిపించింది’’ అని ఆమె అన్నారు.

రాహుల్ గాంధీకి ఉన్న ఆదరణ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలూ లేవని మథురకు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు ఒకరు అన్నారు.

‘‘సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు సీనియర్ నాయకులు రాహుల్‌కు అండగా నిలవలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. దీన్ని బట్టి ఓ నాయకుడికున్న ఆదరణను అంచనా వేయడం సరికాదు’’ అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పరిస్థితిపై శ్యామ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్‌ డైరెక్టర్ డాక్టర్ అనిర్బన్ గంగూలీ లోతుగా అధ్యయనం చేశారు.

గాంధీ కుటుంబం కాంగ్రెస్‌కు గుదిబండలా తయారైందని ఆమె అంటున్నారు.

‘‘కొందరు నేతలు పార్టీ నుంచి బయటపడుతుండటానికి ఇదే కారణం. మరో అవకాశం లేక కొందరు పార్టీలోనే ఉండిపోతున్నారు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

గాంధీ కుటంబానికి సన్నిహుతుడైన అఖిలేశ్ ప్రతాప్ సింగ్ మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు. గాంధీ కుటుంబం నాయకత్వంలోనే పార్టీ ముందుకు నడిచిందని ఆయన అంటున్నారు.

సచిన్ పైలట్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, FACEBOOK/SACHINPILOT

పునర్నిర్మాణం అవసరమా?

‘‘కాంగ్రెస్ పార్టీ తనను తాను మార్చుకోలేకపోతోంది. ఇంతవరకూ ఆత్మ పరిశీలన చేసుకోలేదు. బీజేపీని అమిత్ షా పూర్తిగా పునర్నిర్మించారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా, సిద్ధాంతపరంగా ఏ మార్పులూ రాలేదు’’ అని అనిర్బన్ అన్నారు.

నిర్మాణ పరంగా కాంగ్రెస్ కన్నా పటిష్ఠమైన పార్టీ మరొకటి లేదని భావన జైన్ అంటున్నారు.

‘‘పార్టీ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ చాలా మెరుగ్గా ఉంది. దేశంలోనే అత్యంత పురాతన పార్టీ మాది. ఇక పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై మరింత స్పష్టత తెచ్చేందుకు రాహుల్ గాంధీ 2014 ఎన్నికలకు ముందు ప్రయత్నించారు. సోషల్ మీడియా లాంటి కొన్ని చోట్ల మేం వెనుకబడ్డాం. దీనిపై మేం పనిచేస్తున్నాం’’ అని ఆమె చెప్పారు.

కాంగ్రెస్‌కు పునర్నిర్మాణం అవసరమన్న వాదనను అఖిలేశ్ ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. సమయానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటే చాలని, ఈ విషయంలో కృషి జరుగుతోంది ఆయన అన్నారు.

గుజరాత్‌లో యువ నాయకుడు హార్దిక్ పటేల్‌ను కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేయడం ఇలాంటి అడుగేనని అఖిలేశ్ చెప్పారు.

‘‘గుజరాత్‌లో మోదీ తర్వాత జనాదరణ ఉన్న నాయకుడు హార్దిక్ పటేలే. ఆయన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేయడం 2020 ఎన్నికల వ్యూహంలో భాగమే. గుజరాత్‌లో బీజేపీకిది సవాలు కూడా’’ అని లఖ్‌నవూకు చెందిన సీనియర్ పాత్రికేయుడు వీరేందర్ నాథ్ భట్ట్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

కార్యకర్తలు ఉన్నారు, కానీ...

కాంగ్రెస్‌కు క్యాడర్ లోపం ఉందని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కోసం పనిచేస్తున్న ఓ కార్యకర్త అన్నారు.

‘‘కాంగ్రెస్ ఉద్యమం నుంచి పుట్టుకువచ్చిన పార్టీ. మేం క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయాం. మా పార్టీకి కార్యకర్తలున్నారు. కానీ నిబద్ధత ఉన్న క్యాడర్ లేదు. వ్యక్తులపై పార్టీ ఆధారపడింది. కానీ, బీజేపీ క్యాడర్‌పై ఏర్పడింది. అందుకే కల్యాణ్ సింగ్, ఉమా భారతి బీజేపీని వీడినప్పుడు, ఆ పార్టీకి నష్టం జరగలేదు’’ అని చెప్పారు.

కాంగ్రెస్‌కు కూడా క్యాడర్ ఉందని, అయితే వారిలో నిబద్ధత లోపించిందని అల్వార్‌కు చెందిన ఆ పార్టీ యువ నాయకుడు సీ శాన్ అన్నారు.

క్షేత్ర స్థాయిలో, అంటే గ్రామాల్లో కాంగ్రెస్‌కు సీజనల్ కార్యకర్తలు ఉంటారు. 2018 చివర్లో నేను మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్ విజయం తర్వాత నేను చాలా రాష్ట్రాల్లో పర్యటించా. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడా. వారిలో ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇదివరకు కాంగ్రెస్‌ను వదిలిపోయిన వాళ్లు కూడా ఆ విజయాల తర్వాత మళ్లీ వచ్చి చేరుతున్నారని వాళ్లు నాతో చెప్పారు.

జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలవరైనా పార్టీ మారినప్పుడు, వారితోపాటు పాటు కొందరు సమర్థులైన కార్యకర్తలు కూడా వెళ్లిపోతారు. ఆ లోటు పూడ్చుకుని, మళ్లీ అక్కడ పార్టీ బలపడటం సులువు కాదు.

ఇక కాంగ్రెస్‌లో కష్టపడేవారికి కొదువ లేదని, కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతూ ఉంటుందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు ప్రణవ్ దాస్ వైష్ణవ్ అన్నారు. ఫలితంగా పార్టీ కొన్ని సార్లు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

‘బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు’

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ‘బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు’

మనీ, మజిల్, మీడియా

బీజేపీ వద్ద మనీ (డబ్బు), మజిల్ (బలం), మీడియా ఉన్నాయని, తాము వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని భావన జైన్ అంటున్నారు.

అధికారం కోసం బీజేపీ ఏదైనా చేస్తుందని అఖిలేశ్ ప్రతాప్ సింగ్ వ్యాఖ్యానించారు.

‘‘బీజేపీని మేం ఆధునిక పార్టీ అనుకోం. ఆ పార్టీ ఏ స్థాయికైనా వెళ్తుంది. సోషల్ మీడియా కావొచ్చు, మరొకటి కావొచ్చు, బీజేపీ నిర్మాణాత్మకంగా వాడుకోకుండా, దుర్వినియోగం చేస్తోంది’’ అని అన్నారు.

కాంగ్రెస్ వ్యూహాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ చెప్పారు.

‘‘అన్నా హజారే ఆందోళన సమయంలో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషించింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓ ప్రచారం నడిచింది. దీనిపై ప్రతిదాడి చేయకపోవడం మా మొదటి తప్పు. సోషల్ మీడియాలోకి మేం ఆలస్యంగా వచ్చాం. 2014 నుంచి ఈ తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాం’’ అని భావన జైన్ అన్నారు.

కాంగ్రెస్ నాయకుల్లో నిరాశ ఆవహించి ఉందని వీరేందర్ నాథ్ భట్ట్ అన్నారు.

‘‘ఇప్పడు రాజకీయాలు 24X7 పని. కానీ రాహుల్ గాంధీ 24X7 రాజకీయ నాయకుడు కాదు. ఆరేళ్లలో జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ఓ గట్టి వాదనేదీ కాంగ్రెస్ తీసుకురాలేకపోయింది. ఏదైనా అంశం వచ్చినప్పుడు రాహుల్, ప్రియాంక ట్వీట్లు చేస్తారు. ఈ ట్వీట్లతోనే రాజకీయాలు జరుగుతాయా?’’ అని ఆయన అన్నారు.

మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని భట్ట్ అన్నారు.

గట్టి ప్రతిపక్షంగా ఉండలేకపోవడం కాంగ్రెస్ అతిపెద్ద వైఫల్యమని డాక్టర్ అనిర్బన్ గంగూలీ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ అధికార పార్టీలానే వ్యవహరిస్తూ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అందరి కళ్లూ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభంపైనే ఉన్నాయి. దీని నుంచి ఆ పార్టీ ఎలా బయటపడతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)