జ్యోతిరాదిత్య సింధియా: నేను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో ఎందుకు చేరానంటే...

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, ANI

జ్యోతిరాదిత్య సింధియా బుధవారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య రాజ్యసభకు వెళ్తారని బీజేపీ వెల్లడించింది.

News image

బీజేపీలో చేరిన అనంతరం ఆయన జేపీ నడ్డాతో కలిసి మీడియాతో మాట్లాడారు.

"నా జీవితంలో రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. అలాగే నా జీవితంలో కూడా. మొదటిది 2001 సెప్టెంబర్ 30. అది నా తండ్రి మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన రోజు. విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. రెండోది 2020 మార్చి 10. ఇది ఆయన 75వ జయంతి. ఈరోజే నేను నా జీవితంలో ఓ ముఖ్యమైన మలుపు చోటుచేసుకుంది" అని సింధియా వ్యాఖ్యానించారు.

దీంతోపాటు, 18ఏళ్ల అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కూడా సింధియా వివరించారు.

"నా తండ్రి మరణించిన తర్వాత, ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రానికి, దేశానికి సేవచేసేందుకు గత 18-19 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రయత్నించాను. కానీ, ఈరోజు ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా నా మనసు చాలా అశాంతికి, సంఘర్షణకు గురైంది. అవును, ప్రజాసేవ అనే లక్ష్యం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ద్వారా నెరవేరడం లేదు. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు" అని సింధియా అన్నారు.

"వాస్తవ పరిస్థితులను పార్టీ అంగీకరించడం లేదు. సలహాలిచ్చినా పట్టించుకోవడం లేదు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి" అని సింధియా అభిప్రాయపడ్డారు.

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, ANI

మధ్యప్రదేశ్‌లో నా కలలు కల్లలైపోయాయి

"2018లో మా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాకు ఎన్నో కలలున్నాయి. కానీ 18 నెలల్లో ఆ కలలన్నీ చెదిరిపోయాయి. 10రోజుల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు, కానీ 18 నెలలు గడిచినా అది అమలు కాలేదు.

రాష్ట్రంలో అవినీతికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అక్కడ ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది" అని సింధియా ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాసేవ చేయాలంటే బీజేపీ ద్వారానే సాధ్యమని తనకు ఆశ కలిగిందని సింధియా అన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, Getty Images

"ఇలాంటి పరిస్థితుల్లో నడ్డా, ప్రధానమంత్రి, అమిత్ షాలు నాకు ఓ వేదిక కల్పించడం నా అదృష్టం. ఇక్కడి నుంచి నా ప్రజాసేవను నేను కొనసాగించగలను. మోదీ చేతుల్లో భారత భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని నేను నమ్ముతున్నా" అని సింధియా తెలిపారు.

హోలీ రోజున జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ముందురోజు నుంచే మధ్యప్రదేశ్‌ రాజకీయాలు సంక్షోభం దిశగా పయనించాయి. సింధియా రాజీనామాతో కమల్‌నాథ్ ప్రభుత్వం కష్టాల్లో పడింది.

సింధియా రాజీనామా తర్వాత, ఆయనకు సన్నిహితంగా ఉండే ఆరుగురు మంత్రులతో సహా 22మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు.

జ్యోతిరాదిత్య ట్విటర్ ద్వారా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాకు పంపించారు. అయితే, అప్పటికి తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఏమీ స్పష్టం చేయలేదు.

రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్‌లో పనిచేయడం కష్టం

"కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. కానీ దీనికి సంబంధించి సంవత్సరం నుంచి తాను ఆలోచిస్తున్నాను" అని తన రాజీనామా లేఖలో సింధియా పేర్కొన్నారు.

"నా రాష్ట్ర, దేశ ప్రజలకు సేవ చేయడమే మొదటి నుంచీ నా జీవిత లక్ష్యం. కానీ ఈ పార్టీలో కొనసాగుతూ అది చేయడం ప్రస్తుతం అసాధ్యమని నాకనిపిస్తోంది. ప్రజలు, కార్యకర్తల ఆశలను నెరవేర్చేందుకు నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంది" అని లేఖలో తెలిపారు.

మరోవైపు, జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారని వార్త సంస్థ పీటీఐ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తన రాజీనామాను బహిర్గతం చేయడానికి ముందు సోమవారం జ్యోతిరాదిత్య హోంమంత్రి అమిత్ షాను, తర్వాత ప్రధాని మోదీని కలిశారు.

దీంతో మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)