మియన్మార్‌లో భారత్ ఏం కోరుకుంటోంది.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్నా.. సైనిక పాలననా?

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వంపై ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి, అధికారం చేజిక్కించుకుంది. సూచీ సహా ప్రభుత్వంలోని కీలక నేతలను అరెస్టు చేసింది.

మియన్మార్ రాజధాని నేపిడా, యాంగూన్ నగరాల్లో రహదారులపై సైనికులను మోహరించారు. కొన్ని అంతర్జాతీయ టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.

మియన్మార్ సైన్యం తీరును అమెరికా, బ్రిటన్, ఐరాస ఖండించాయి.

‘‘మయన్మార్‌లో సైనిక తిరుగుబాటును, ఆంగ్ సాన్ సూచీ‌ సహా పౌరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నా. ప్రజా తీర్పును గౌరవించాలి. పౌర నేతలను విడుదల చేయాలి’’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు మియన్మార్‌పై కొత్త ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

అంతర్జాతీయ శక్తులు మియన్మార్ సైన్యంపై ఆంక్షల గురించి మాట్లాడుతున్న వేళ... భారత్ కూడా ఈ విషయంపై స్పందించింది. కానీ, ఆ స్పందన మరీ అంత తీవ్రంగా లేదు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లో నెలకొన్న పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని, పరిస్థితులను గమనిస్తోందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మియన్మార్‌లోని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మియన్మార్‌లో ప్రజాస్వామిక మార్పును భారత్ ఎప్పుడూ సమర్థించింది. చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య ప్రక్రియలు కొనసాగాలన్నదే మా ఆకాంక్ష’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు గురించి సోమవారం ఉదయం వార్తలు రాగానే ఈ పరిణామాల ప్రభావం దక్షిణాసియాపై, భారత్‌పై ఎలా ఉంటుదన్న ప్రశ్న మొదలైంది.

ఈ ప్రశ్నకు సమాధానం కోసం మియన్మార్‌లో భారత రాయబారిగా ఇదివరకు పనిచేసిన జి. పార్థసారథిని బీబీసీ ప్రతినిధి సారికా సింగ్ సంప్రదించారు.

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

ప్రజాస్వామ్య విలువల కన్నా భద్రత ముఖ్యమా?

మియన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా, సైనిక ప్రభుత్వమైనా భారత్‌తో మంచి సంబంధాలనే కోరుకుంటాయని పార్థసారథి అంటున్నారు.

‘‘భారత్‌తో మియన్మార్‌కు 1,640 కి.మీ.ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో వేర్పాటువాద సంస్థలు చాలా ఉన్నాయి. అవి ఇటు భారత ప్రభుత్వానికి, అటు మియన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకం. కొన్ని చైనాను సమర్థిస్తాయి’’ అని ఆయన అన్నారు.

‘‘భారత్, మియన్మార్, చైనాలతో ఇదొక త్రికోణ అంశంలా ఉంటుంది. అరాకన్ సైన్యం, కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ సహా 26 సంస్థలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇవన్నీ వేర్పాటువాద బృందాల్లాంటివే. వీటిని చైనా ప్రోత్సహిస్తుంది. అందుకే, మియన్మార్‌లో ఎలాంటి ప్రభుత్వం ఉన్నా భారత్‌తో మంచి సంబంధాలనే కొనసాగిస్తుంది. మనం మియన్మార్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’’ అని పార్థసారథి వివరించారు.

‘‘చైనా తమ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వం మియన్మార్‌లో ఉండాలని కోరుకుంటోంది. మియన్మార్ సమీపంలోని బంగాళాఖాతం సముద్ర సరిహద్దుల వరకూ తమను రానివ్వాలని ఆశిస్తోంది’’ అని ఆయన అన్నారు.

ఆంగ్ సాన్ సూచీ, మోదీ

ఫొటో సోర్స్, MONEY SHARMA/gettyimages

‘‘మనం ఆంగ్ సాన్ సూచీని సమర్థిస్తాం. కానీ, అంతకన్నా ముందు మన జాతీయ ప్రయోజనాలు మనకు ముఖ్యం. వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయే పరిస్థితులు రాకుండా చూడటం అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరం. ఎందుకంటే, మన సరిహద్దుపై దాని ప్రభావం ఉంటుంది. అందుకే మన దేశంలో ఎవరి ప్రభుత్వం ఉన్నా మియన్మార్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. కానీ, వ్యక్తిగత స్థాయిలో చెప్పాలంటే... ఆ దేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వమే మంచిదని మనం చెబుతాం’’ అని వివరించారు.

ఆంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

చైనా వైపు మొగ్గే ప్రమాదం

భారత్‌లాగే చైనా కూడా మియన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై సాధారణ రీతిలోనే ప్రతిస్పందించింది.

‘‘తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, మియన్మార్‌లో సైనిక ప్రభుత్వం ఉంటేనే మంచిదని చైనా భావిస్తోంది. మియన్మార్ ద్వారా బంగాళాఖాతం చేరుకోవాలని చైనా ఆశిస్తోంది. వీటన్నింటినీ మనం గమనించాల్సి ఉంటుంది’’ అని పార్థసారథి అన్నారు.

మియన్మార్‌తో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయని, ఆ దేశ నావికాదళానికి భారత్ ఒక సబ్‌మెరైన్‌ను కూడా ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అవసరమైనప్పుడు మియన్మార్‌కు సైనికపరమైన సహాయం కూడా భారత్ చేసిందని చెప్పారు.

ఆంగ్ సాన్ సూచీకి భారత్ మద్దతు కొనసాగిస్తుందని, అదే సమయంలో మియన్మార్‌ ప్రభుత్వంతో సంబంధాలు చెడగొట్టుకోదని పార్థసారథి అభిప్రాయపడ్డారు.

‘‘నేను రాయబారిగా ఉన్న సమయంలో మేం చాలా సార్లు ఆంగ్ సాన్ సూచీ విడుదల గురించి అక్కడి సైన్యం ప్రతినిధులతో మాట్లాడాం. కానీ, వీటిని బయటకు వెల్లడించలేదు. మియన్మార్, భారత్‌లకు చాలా ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి’’ అని చెప్పారు.

అమెరికా స్పందించినట్లుగానే భారత్ కూడా స్పందిస్తే, మియన్మార్ సైన్యం చైనా వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని సీనియర్ పాత్రికేయురాలు సుహాసిని హైదర్ ద హిందూ పత్రికకు రాసిన ఓ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

‘‘వ్యూహాత్మక కారణాలతోపాటు భారత్‌ అతిగా స్పందించకుండా ఉండటానికి ఇతర ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. మియన్మార్‌తో కలిసి భారత్ కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను చేస్తోంది. వీటిలో భారత్, మియన్మార్, థాయిలాండ్‌ల మధ్య త్రైపాక్షిక హైవే, కాలాదన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌తోపాటు సిట్వే డీప్ వాటర్ పోర్టులో స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు వంటివి ఉన్నాయి’’ అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)