మియన్మార్ నిరసనలు: నెత్తురోడుతున్న యాంగోన్... ఒకే రోజు 50 మంది మృతి

నిరసనకారులు సైనికులకు అడ్డంగా టైర్లు పడేసి తగులబెట్టారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనకారులు సైనికులకు అడ్డంగా టైర్లు పడేసి తగులబెట్టారు

మియన్మార్‌లో 50 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని సైనిక కుట్రకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందళనకారులు తెలిపారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఒకే రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారని వారు చెప్పారు.

మియన్మార్‌లోని అతి పెద్ద నగరమైన యాంగోన్‌లో భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయి. నిరసనకారులు కర్రలు, కత్తులతో కనిపించారు.

ఆ ప్రాంతంలో చైనీస్ వ్యాపార సంస్థలపై దాడి జరగడంతో అక్కడ మార్షల్ లా విధించారు.

బర్మీస్ మిలటరీకి చైనా మద్దతు ఇస్తోందని నిరసనకారులు అనుమానిస్తున్నారు. అయితే, దీని వెనుక ఎవరున్నాన్నది స్పష్టంగా తెలియదు.

ఫిబ్రవరి 1న సైన్యం తిరుగుబాటు చేసి దేశాధ్యక్షురాలైన ఆంగ్ సాన్ సూచీని నిర్బంధంలో ఉంచినప్పటి నుంచీ మియన్మార్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఏడాది ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్‌డీ) పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.

అయితే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది.

విధుల నుంచి తొలగించిన కొంతమంది ఎంపీలు సైన్యం అధికారాన్ని తిరస్కరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సైన్యాన్ని ఎదిరిస్తూ "విప్లవానికి" సిద్ధం కావాలని వారి నాయకుడు మన్ విన్ ఖైంగ్ థాన్ తన మొదటి బహిరంగ ప్రసంగంలో పిలుపునిచ్చారు.

"ఈ దేశంలో ఇవి అత్యంత చీకటి రోజులు. సూర్యోదయానికి ద్వారాలు మూసుకుపోయాయి. విప్లవం గెలవాలి" అని ఆయన అన్నారు.

ఆదివారం యాంగోన్‌లో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పలువురు చనిపోయినట్లు, గాయాల పాలైనట్లు తెలుస్తోంది.

ఆదివారం ఒక్కరోజే 50 మంచి మరణించినట్లు 'ది అసిస్టన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్' (ఏఏపీపీ) అనే పర్యవేక్షణ సంస్థ తెలిపింది.

అనేకమందికి తుపాకీ గుళ్లు తగిలి తీవ్రంగా గాయాలయ్యాయని, యాంగోన్‌లోని హ్లైంగ్ థర్‌యార్ ప్రాంతంలో మరణాల సంఖ్య పెరగవచ్చని వైద్య సిబ్బంది అంటున్నారు.

యాంగోన్ శివార్లలోని పారిశ్రామిక వాడలో మంటలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యాంగోన్ శివార్లలోని పారిశ్రామిక వాడలో మంటలు

హ్లైంగ్ థర్‌యార్‌లో ఏం జరిగింది?

హ్లైంగ్ థర్‌యార్, ష్వేప్యితా ప్రాంతాల్లోని చైనా ఫ్యాక్టరీలపై దాడి జరిగిందని, తమకు రక్షణ కావాలని చైనా కోరడంతో సైన్యం ఆ ప్రాంతాల్లో మార్షల్ లా విధించింది.

కొందరు వ్యక్తులు ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారని, పెట్రోల్ పోసి నిప్పంటించారని.. యాంగోన్‌లో 10 చైనా కర్మాగారాలను దెబ్బ తీశారని చైనా ప్రభుత్వం తెలిపింది. అవన్నీ కూడా దుస్తులు ఉత్పత్తి, నిల్వల కర్మాగారాలే. ఒక చైనీస్ హొటల్ మీద కూడా దాడి జరిగింది.

"కొన్ని కర్మాగారాలపై దాడి చేసి దోచుకున్నారు, ధ్వంసం చేశారు. పలువురు చైనా సిబ్బంది గాయపడ్డారు. దాడిలో చిక్కుకుపోయారు" అని చైనా రాయబార కార్యాలయం తన ఫేస్బుక్ పేజీలో తెలిపింది.

"దాడి, హింసలను అరికట్టడానికి మియన్మార్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని, చైనా కంపెనీలకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని" కోరింది.

మంటలను ఆర్పడానికి వస్తున్న అగ్నిమాపక దళాలను వెళ్లనివ్వకుండా నిరసనకారులు అడ్డుకున్నారని మిలటరీ మీడియా మ్యావాడ్డీ తెలిపింది.

ఆదివారం రోజంతా తుపాకుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మిలటరీ వాహనాలు రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి.

భద్రతా దళాలు కాల్పులు జరపినప్పుడు నిరసనకారులు ఇసుక సంచులను, కారు టైర్లను అడ్డం పెట్టుకుని తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించారు. అవి అడ్డం పెట్టుకుని గాయలపాలైన వారిని సురక్షిత ప్రదేశానికి తరలించే ప్రయత్నం చేశారు.

భారీ ఆయుధాలను ఉపయోగించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు ఒక ఆఫీసర్ సోషల్ మీడియాలో తెలిపారు.

"హ్లైంగ్ థర్‌యార్ ప్రాంతంపై నేను ఏ రకమైన దయ చూపించలేను. వాళ్లు కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తారు. వాళ్లందరూ అలాంటివాళ్లే" అని ఆ అధికారి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. కానీ, తరువాత ఆ పోస్ట్‌ను తొలగించారు.

"నేను చికిత్స అందిస్తుండగా ముగ్గురు నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి పంపిస్తున్నాను. ఇప్పుడు ఇంతకన్నా నేనింకేం చెప్పలేను" అని ఒక డాక్టర్ ఏఎఫ్‌పీకి తెలిపారు.

మియన్మార్‌లోని మిగతా ప్రాంతాల్లో కూడా సైన్యం చేతిలో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.

బాగో ప్రాంతంలో నిరసనకారులు రాళ్లు విసరడంతో ముగ్గురు పోలీస్ అధికారులు గాయపడ్డారని, ఒక పోలీస్ అధికారి చనిపోయారని ప్రభుత్వ ఎంఆర్‌టీవీ తెలిపింది.

మియన్మార్‌లో నిరసనలు ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ మొత్తం 120 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని ఏఏపీపీ సంస్థ తెలిపింది.

ఆదివారం సాయంత్రం యాంగోన్‌లో హ్లెడెన్ ప్రాంతంలోని ప్రధాన కూడలి దగ్గర వందలాది మంది గుమికూడి కొవ్వొత్తులు వెలిగించి చనిపోయినవారికి నివాళులు అర్పించారు.

మన్ విన్ కైంగ్ థాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మన్ విన్ కైంగ్ థాన్

మన్ విన్ ఖైంగ్ థాన్ ఏమన్నారు?

సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత, అరెస్ట్ నుంచీ తప్పించుకుని పారిపోయిన ఎంపీలు కలిసి 'కమిటీ ఫర్ రిప్రెజెంటింగ్ ది యూనియన్ పార్లిమెంట్ (సీఆర్‌పీహెచ్) అనే ఒక కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు.

మన్ విన్ ఖైంగ్ థాన్‌‌ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. ఈ కమిటీ మియన్మార్‌లోని అసలైన ప్రభుత్వంగా అంతర్జాతీయ గుర్తింపు కోరుతోంది.

అయితే, సీఆర్‌పీహెచ్ చట్టవిరుద్ధమైన కమిటీ అనీ, దానికి సహకరించినవారు దేశ ద్రోహం నేరాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మిలటరీ హెచ్చరించింది.

మన్ విన్ ఖైంగ్ థాన్ ఫేస్బుక్ ప్రసంగంలో మాట్లాడుతూ.. "చీకటికి ఎదురొడ్డి నిలిచేందుకు ఇదే సమయం" అని అన్నారు.

"ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్టించేందుకు, అణగారిన వర్గాలకు నియంతృత్వం నుంచీ విముక్తి కలిగించేందుకు మనందరం గట్టిగా పూనుకుని విప్లవాన్ని కొనసాగించాలి. అందుకు ఇదే సరైన సమయం" అని ఆయన అన్నారు.

యాంగోన్ హ్లెదాన్ జంక్షన్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యాంగోన్ హ్లెదాన్ జంక్షన్‌లో నిరసనలు

మియన్మార్ సంక్షోభం.. ఏం జరిగింది?

గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆంగ్‌ సాన్‌ సూచీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) ప్రభుత్వాన్ని సైనిక నాయకత్వం అంగీకరించలేదు.

ప్రతిపక్ష పార్టీ మద్దతున్న సైనిక నాయకత్వం దేశంలో మరోసారి ఎన్నికలు జరగాలని కోరుతోంది. గత ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయన్నది సైన్యం, ప్రతిపక్షాల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆ దేశ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు కూడా ఎన్నికల్లో ఎలాంటి మోసాలు, అవకతవకలు జరగలేదని చెప్పారు.

కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందుగానే సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

గత వారం ఆంగ్‌ సాన్‌ సూచీ 6,00,000 డాలర్లను, 11 కేజీల బంగారాన్ని లంచంగా తీసుకున్నారని మిలటరీ ఆరోపించింది.

ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఒక ఎన్‌ఎల్‌డి చట్టసభ్యుడు తిరస్కరించారు.

ఆంగ్‌ సాన్‌ సూచీని గత ఐదు వారాలుగా గుర్తు తెలియని ప్రాంతంలో గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమెపై అనేక రకాల అభియోగాలు మోపారు.

ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అనేక నియమాలను సూచీ పాటించలేదని, చట్ట విరుద్ధంగా ఆమె కొన్ని సమాచార సాధనాలు వాడుతున్నారని, కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించారని సైన్యం ఆరోపించింది. సూచీతోపాటు అనేకమంది పార్లమెంటు సభ్యులను కూడా నిర్బంధంలో ఉంచింది.

అప్పటినుంచీ సైన్యం నియంతృత్వాన్ని ఖండిస్తూ మియన్మార్‌లో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి.

అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు మిలటరీ చర్యలను ఖండించాయి.

అమెరికా మియన్మార్ మిలటరీ నాయకులపై ఆంక్షలు విధించింది. సహాయక నిధిని వారికి అందకుండా చేసేందుకు చర్యలు చేపట్టింది.

మిలటరీ తనపై వస్తున్న విమర్శలన్నింటినీ ఖండించింది. ప్రస్తుతం జరుగుతున్న హింసకు ఆంగ్ సాన్ సూచీ బాధ్యులని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)