డబ్ల్యూసీఎల్: భారత్, పాక్ మ్యాచ్ రద్దు.. 'ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా' - శిఖర్ ధవన్

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) చర్చల్లో నిలిచింది. దీనికి కారణం ఇండియా చాంపియన్స్, పాకిస్తాన్ చాంపియన్స్ మధ్య మ్యాచ్.
టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లో ఆరు జట్లు ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ క్రికెట్ లీగ్‌లో భాగంగా, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు.
పహల్గాం దాడి, భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణల కారణంగా టీమిండియా క్రికెటర్లు, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
ఈ లీగ్‌లో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్ ఆడనంటూ భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.


ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty
భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయినట్లు పేర్కొంటూ డబ్ల్యూసీఎల్ ఆదివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.
''భారత దిగ్గజ క్రికెటర్లకు అసౌకర్యం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. కానీ, మాకు తెలియకుండానే వారికి అసౌకర్యం కలిగించాం. ఈ లీగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొన్ని మంచి జ్ఞాపకాలను అందించాలనేదే మా ఉద్దేశం'' అని ట్వీట్‌లో పేర్కొంది.
డబ్ల్యూసీఎల్ ప్రకటన కంటే ముందే భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఒక ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను జత చేశారు.
''మే11న నేను తీసుకున్న చర్యకే కట్టుబడి ఉన్నా. నాకు అన్నింటికంటే నా దేశమే ముఖ్యం. దేశం కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదు'' అంటూ ట్వీట్‌కు క్యాప్షన్ జోడించారు.
రాబోయే డబ్ల్యూసీఎల్ లీగ్‌లో పాకిస్తాన్‌తో జరిగే ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనబోనని శిఖర్ ధవన్ తెలియజేశారనేది ఆ ఈమెయిల్ స్క్రీన్‌షాట్ సారాంశం.
భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా శిఖర్ ధవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈమెయిల్‌లో రాసి ఉంది.

ఫొటో సోర్స్, Manoj Verma/Hindustan Times via Getty
వెనక్కి తగ్గిన స్పాన్సర్
డబ్ల్యూసీఎల్ లీగ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌కు దూరంగా ఉంటామని ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.
''వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌తో అయిదేళ్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రెండేళ్ల క్రితం చేసుకున్నాం. అయితే, పాకిస్తాన్‌తో సంబంధమున్న ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనబోమని స్పష్టంగా చెప్పాం. మేం ఇండియా చాంపియన్స్‌కు మద్దతు ఇస్తాం. పాకిస్తాన్ ఆడే ఏ మ్యాచ్‌కూ మేం మద్దతు ఇవ్వం, ప్రోత్సహించం'' అంటూ ఒక అధికారిక ప్రకటనలో ఈజ్ మై ట్రిప్ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty
ఏ ఆటగాళ్ల గురించి చర్చ జరుగుతోంది?
ఇండియా చాంపియన్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు ముందే పాక్‌తో మ్యాచ్ నుంచి వైదొలిగారని చాలా వార్తా కథనాలు పేర్కొన్నాయి.
హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీ కాగా, యూసుఫ్ పఠాన్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
ఇదే జట్టులో ఉన్న క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈజ్ మై ట్రిప్ చేసిన ప్రకటనను రీపోస్ట్ చేశారు.
ఇక ఈ లీగ్ విషయానికొస్తే, లీగ్ సీఈవో, వ్యవస్థాపకుడు హర్షిత్ తోమర్‌గా దీని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
సహ వ్యవస్థాపకులుగా నటుడు అజయ్ దేవగణ్ పేరును వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం రెండో సీజన్ పోటీలు జరుగుతున్నాయి. నిరుడు జరిగిన తొలి సీజన్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఇండియా చాంపియన్స్ గెలిచింది.
భారత్, పాకిస్తాన్‌లతో పాటు ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు కూడా పాల్గొంటాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














