హైదరాబాద్‌‌లో వికలాంగులపై లాక్‌డౌన్ ఎఫెక్ట్: ‘కడుపునిండా తినడానికి డబ్బుల్లేవు’

25 సంవత్సరాల స్వామినాథన్ పై అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ భారం ఉంది.

ఫొటో సోర్స్, SWAMINATHAN

ఫొటో క్యాప్షన్, 25 సంవత్సరాల స్వామినాథన్ పై అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ భారం ఉంది.

భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి మొదలై తొమ్మిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ చాలా మంది వికలాంగులు తిండి తినేందుకు డబ్బులు లేక, ప్రాధమిక వైద్యం అందక బ్రతుకు దెరువు కోసం కష్టపడుతున్నారు. బీబీసీ కోసం అరుంధతి నాథ్ అందిస్తున్న కథనం.

25 సంవత్సరాల స్వామినాథన్‌పై అయిదుగురు కుటుంబ సభ్యుల పోషణ భారం ఉంది. ఆయనకు వినికిడి లోపం ఉంది.

"లాక్ డౌన్ ముందు వరకు నేను హైదరాబాద్‌లోని టాకింగ్ హ్యాండ్స్ అనే రెస్టారెంట్లో ఆహారం అందించే పని చేసేవాడిని" అని తంజావూర్ నివాసి స్వామినాథన్ చెప్పారు.

ఆయన పని చేసే రెస్టారంట్ లో సిబ్బంది అంతా బధిరులే ఉండేవారు. మార్చిలో రెస్టారెంట్ మూత పడటంతో ఆయన జీవనాధారాన్ని కోల్పోయారు.

"చేతిలో ఉద్యోగం లేకపోవడంతో నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి, గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు" అని ఆయన చెప్పారు.

డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ లాంటి స్వచ్చంద సంస్థలు కొంత మంది బధిరులకు ఆర్ధిక సహాయం చేస్తున్నప్పటికీ, స్వామినాథన్ కుటుంబానికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కానీ, వైరస్ భయంతో ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లాలంటే భయపడుతున్నారు.

"మా అమ్మ, సోదరుడికి ఆరోగ్యం పాడయింది. లాక్ డౌన్ కి ముందు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తెచ్చుకునే వారు. కానీ, వైరస్ సోకుతుందేమోననే భయంతో రెండు నెలలకొకసారే ఆసుపత్రికి వెళుతున్నాం" అని ఆయన చెప్పారు.

130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూ ఉండటంతో వైద్య రంగం పై తీవ్రమైన ఒత్తిడిపడుతోంది. ఇప్పటికే 60 లక్షల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడగా లక్షకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.

నిత్యావసరాలు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వికలాంగులు

ఫొటో సోర్స్, G SUNITHA

ఫొటో క్యాప్షన్, నిత్యావసరాలు సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వికలాంగులు

సంజయ్ కుమార్ బక్షి అతని భార్య అంధులు.

అతను పని చేస్తున్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ కాంట్రాక్టు పునరుద్ధరించక పోవడంతో ఆయన ఉద్యోగం వదులుకోవల్సి వచ్చింది.

ఆయన ప్రతీ నెలా సుమారు 15000 రూపాయిలు సంపాదించే వారు. కానీ, ఆయనిప్పుడు అగరబత్తీలు అమ్ముకుంటున్నారు. దీంతో ఆయన ఆదాయం సగానికి పైగా పడిపోయింది.

"నేనింకా ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. కానీ, చదువు, ఉద్యోగ అనుభవం ఉన్నప్పటికీ నాకు ఉద్యోగం ఎందుకు దొరకటం లేదో అర్ధం కావటం లేదు" అని ఆయన అన్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (ఎన్ సి పి ఇ డి పి) 1067 మంది వికలాంగులతో నిర్వహించిన ఒక అధ్యయనంలో 73 శాతం మంది ఈ మహమ్మారి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.

అందులో 57 శాతం మంది ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతుండగా, 13 శాతం మంది ఆహారం దొరకక, 9 శాతం మంది వైద్యం అందక కష్టాలు పడుతున్నట్లు తెలిసింది.

ఫ్యాక్టరీలలో పని చేసే వారు, రైల్వే స్టేషన్ల దగ్గర వస్తువులు అమ్ముకునే వారు వంటి కొంత మంది వికలాంగులు తమ జీవనాధారాలను కోల్పోయినట్లు చెప్పారు. అలాగే, అంగవైకల్యం ఉన్న మహిళలు, పిల్లలపై గృహ హింస కూడా పెరిగిందని ఈ అధ్యయనం చెప్పింది.

భారతదేశంలో వికలాంగులను చాలా సార్లు ఉద్యోగం చేయడానికి అర్హులు కానట్లు, జాలితో చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. మహమ్మారి సమయంలో రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఆన్ లైన్ లో చదువును నేర్చుకునే అవకాశాలు కొరవడటంతో ఇలాంటి అభిప్రాయాలకు ఊతం ఇచ్చినట్లయింది.

ప్రజా రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిపివేయడంతో పనుల కోసం వెళ్లేందుకు దారి లేక చాలా మంది జీవనాధారాలు కోల్పోయారని డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ రమ్య మిరియాల చెప్పారు.

కొంత మంది బధిరులు పని చేసే చాలా కంపెనీలు జీతాలు చెల్లించలేకపోవడంతో ఇంటి అద్దె కట్టలేక ఇళ్ల యజమానులు నుంచి సమస్యలు ఎదుర్కొన్నట్లు రమ్య చెప్పారు.

"కొంత మంది అల్పాదాయ వర్గాలకు చెందిన బధిరులు పని చేసేందుకు అవసరమైన సాంకేతిక సహాయం, దుబాసీ సహాయం దొరకకపోవడంతో వారి ఉద్యోగావకాశాల పై ఈ అంశాలు ప్రభావం చూపాయి.’’

భారతదేశంలో బ్రతుకుతెరువు కోసం ఇబ్బందులు పడుతున్న వికలాంగులు

ఫొటో సోర్స్, RAMYA MIRIYALA

హైదరాబాద్‌కి చెందిన 37 సంవత్సరాల సునీత ఒకరి ఇంట్లో జీతానికి ఇంటి పనులు చేసేవారు. కానీ, ప్రజా రవాణా సౌకర్యాలు నిలిపి వేయడంతో ఆమె పనులకు వెళ్లలేకపోయారు.

"నా భర్తకి అంగ వైకల్యం ఉంది. ఈ మధ్యనే మా నాన్నగారు మరణించారు. మాకు తిండి తినడానికే కష్టంగా ఉంది. ఇంటి అద్దె కట్టలేకపోవడంతో ఇల్లు కూడా ఖాళీ చేయవలసి వచ్చింది. ఇప్పుడు నేను నా సోదరితో కలిసి ఉంటున్నాను" అని ఆమె చెప్పారు.

సునీతకి ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు కొంత వరకు లభిస్తున్నప్పటికీ తనకు ప్రతీ నెలా వచ్చే వికలాంగుల పెన్షన్ మాత్రం ఇంకా అందవలసి ఉంది. మార్చిలో ఆమె ఆ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా లాక్ డౌన్ వలన ఆమె తన పెన్షన్ వివరాలను పునరుద్ధరించలేదు.

ఈ లోపు నిత్యావసరాలు సమకూర్చుకోవడానికి, కూతురు చదువు కోసం ఆమె చాలా ఇబ్బందులు పడుతున్నారు.

వికలాంగులకు కేవలం ఆర్ధిక సహాయం దొరకకపోవడం ఒక్కటే ప్రభావితం చేయలేదు. వైరస్ భయంతో తోటి మనిషి చేసే దారి చూపించడం లాంటి చిన్న చిన్న సహాయాలకు కూడా వారు దూరమయ్యారు.

"వైరస్ భయంతో గతంలో వికలాంగుల దగ్గరకు వచ్చి చేసే చిన్న చిన్న సహాయాలు కూడా ఇప్పుడు ఎవరూ చేయటం లేదు" అని స్కోర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జార్జ్ అబ్రహాం చెప్పారు.

కానీ, ఇవన్నీ తాత్కాలికమే అని, ఈ పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సాంకేతికత వికలాంగులకు విద్యావకాశాలు కల్పించడంలో తోడ్పడవచ్చని ఆయన అన్నారు.

కానీ, ఈ అంశం పై స్వచ్చంద సంస్థలకు చాలా అనుమానాలు ఉన్నాయి.

వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను సమయానికి ఇవ్వడంతో పాటు వారి ఆహారం, వైద్యం, కోవిడ్ పరీక్షల అవసరాల గురించి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ సి పి ఇ డి పి అభిప్రాయపడింది. అలాగే వికలాంగులకు సేవలు అందించే వ్యక్తులకు కూడా వారితో పాటు ప్రయాణం చేసేందుకు పాస్ లు మంజూరు చేయాలని కోరింది.

కానీ, ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోదనే భయాన్ని కూడా స్వచ్చంద సంస్థలు వ్యక్తం చేశాయి,

వికలాంగుల కోసం వివిధ ప్రభుత్వ విభాగాలలో మొర పెట్టుకున్నప్పటికీ, భవిష్యత్తులో వికలాంగులకు ఇచ్చే సహాయంలో ప్రాధాన్యత లభిస్తుందో లేదో చెప్పలేమని ఎన్ సి పి ఇ డి పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ అన్నారు.

"భారతదేశంలో వికలాంగుల కోసం చేసే పనిని స్వచ్చంద సేవ గానే చూడటంతో రాజకీయంగా వీరి తరుపున మాట్లాడేవారెవరూ కనిపించటం లేదు. ప్రధాన వార్తల్లోనూ, ప్రభుత్వ విధానాలలోనూ వికలాంగులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత లభించటం లేదు" అని ఆయన అన్నారు.

ఈ అంశాల పై ప్రశ్నలకు భారత ప్రభుత్వ వికలాంగ వ్యవహారాల శాఖ స్పందించలేదు.

వీడియో క్యాప్షన్, పుట్టుకతోనే అంధుడు, కానీ పట్టుదలతో ఐఏఎస్... కట్టా సింహాచలం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)