విజయవాడ, దిల్లీ సహా 50 నగరాలకు భూకంపం ముప్పు - ట్రిపుల్ ఐటీ, ఎన్‌డీఎంసీ నివేదిక : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, venugopal bollampalli
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు దేశ రాజధాని దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి తదితర 50 నగరాలు అధిక భూకంప ముప్పు మండలాల్లో ఉన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా ఈ భూకంప విపత్తు ముప్పు సూచిక (ఎర్త్‌క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్) నివేదికను ప్రచురించాయి.
ప్రభావిత ప్రాంతాల్లోని జనసాంద్రత, గృహనిర్మాణం, నగరాల పరిస్థితి ఆధారంగా ప్రయోగాత్మకంగా అధ్యయనం చేపట్టారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోని ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగ అధిపతి ప్రొఫెసర్ ప్రదీప్ రామనచర్ల సారథ్యంలో పరిశోధక విద్యార్థులు మూడేళ్ల పాటు శ్రమించి నివేదికను రూపొందించారు. దీనిని ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ యంత్రాంగం సమీక్షించినట్లు ప్రదీప్ తెలిపారు.
దేశవ్యాప్తంగా విజయవాడ సహా 50 నగరాలు.. ఒక జిల్లా అధిక భూకంప ముప్పు గల మండలాల్లో ఉన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ 50 నగరాల్లోనూ 13 నగరాలు అధిక ప్రమాదకర స్థాయి, 30 మధ్యస్థ, 7 నగరాలు తక్కువ ప్రమాదకర స్థాయిల్లో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
అధిక భూకంప మండలంలో విజయవాడ, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, చండీగఢ్ తదితర నగరాలు ఉన్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, @HindolSengupta
దేశంలో మొదటి అంధ మహిళా ఐఏఎస్
''ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది'' అంటూ దేశంలోనే మొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారని ''సాక్షి'' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం, ప్రంజల్ పాటిల్ సోమవారం కేరళలో తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల వయసులోనే చూపు కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు.
అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది.
కానీ, ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి ఏడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఏడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.
రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు.

ఫొటో సోర్స్, High court website
భవనాలన్నీ తెలంగాణవే... సచివాలయం చాలదా?: సర్కారుకు హైకోర్టు ప్రశ్న
‘‘ఏపీ సెక్రటేరియట్ లేదు. బిల్డింగులు అన్నీ తెలంగాణవే. ఇప్పుడు కూడా సెక్రటేరియట్ చాలదా? కొత్త భవనాల్ని కట్టాలా..? కొన్నేళ్ళ పాటు పాత బిల్డింగులు వాడుకోవచ్చు కదా?’’ అని హైకోర్టు తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం, ‘‘అగ్నిప్రమాదాలు జరిగితే నివారణ చర్యలు తీసుకునే దారి ఆయా బ్లాక్స్ మధ్య లేదు. అందుకే, అన్ని హంగులతో కొత్తగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది’’ అని తెలంగాణ సర్కార్ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు హైకోర్టుకు చెప్పారు.
సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చరాదని కోరుతూ ప్రొఫెసర్ విశేశ్వర్‌రావు, ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు వేసిన పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది.
పాత బిల్డింగులు కూల్చకుండా ఉత్తర్వులు ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం కాదని పిటిషనర్ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఏపీ సెక్రటేరియట్ ఖాళీ అయ్యాక కూడా తెలంగాణకు ఎందుకు బిల్డింగులు సరిపోవడం లేదో తెలియడం లేదన్నారు.
బిల్డింగులు కడితే ప్రజాధనం దుర్వినియోగం ఏవిధంగా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. బిల్డింగ్ కట్టడమనేది ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగం అవుతుందని, ఇలాంటి సమయంలో కోర్టులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

ఆవులను పరిరక్షించడం లేదని కలెక్టర్‌ను సస్పెండ్ చేసిన సీఎం
గోశాలలో ఆవులను పరిరక్షించడంలో విఫలమయ్యారని సాక్షాత్తూ జిల్లా కలెక్టరుతో పాటు ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దేశంలో సంచలనం రేపిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లా నిచలాల్ తహసీల్ పరిధిలోని మాధవాలియా గోశాలలో వీధి ఆవులను ఉంచడంలో కలెక్టరుతోపాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారిపై సీఎం యోగి సస్పెన్షన్ వేటు విధించారు.
గోరఖ్ పూర్ డివిజనల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ గోశాలపై దర్యాప్తు జరిపి సర్కారుకు నివేదిక సమర్పించింది. అధికారిక లెక్కల ప్రకారం మాధవాలియా గోశాలలో 2,500 ఆవులుండాలి, కాని కేవలం 954ఆవులే ఉన్నాయని దర్యాప్తులో తేలింది.
గోశాలకు 500 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 328 ఎకరాలను గోశాలల పేరిట రైతులకు అక్రమంగా ఇచ్చారని వెల్లడైంది. ఆవుల సంఖ్యను కాగితాల్లో చూపించి, వాటికి పశుగ్రాసం పేరిట సర్కారు నిధులను దుర్వినియోగం చేశారని వెలుగుచూసింది.
జిల్లా కలెక్టరు అమర్ నాథ్ ఉపాధ్యాయ, నామినేటెడ్ సభ్యుడు దేవేంద్రకుమార్, అధికారులు సత్యం మిశ్రా, పశుసంవర్ధకశాఖ వైద్యుడు డాక్టర్ రాజీవ్ ఉపాధ్యాయ, డాక్టర్ వీకే మౌర్యాలను సీఎం యోగి సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- నిరసన ప్రదర్శనలు, అహింసా ఉద్యమాలతో సమాజంలో మార్పు రాదా? ఎక్స్‌టింక్షన్ రెబెలియన్ ఏమంటోంది?
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








