ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చి అర్హత లేదని వెనక్కి తీసుకున్నారు.. ఎందుకు?

- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
పీజీ చదవడం పాపమా... పీజీ విద్యార్థులు ఏం పాపం చేశారు? అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కొందరు అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేతికందిన ఉద్యోగం దూరమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ వారి ఆందోళనకు కారణమేంటి... ఉద్యోగం ఇచ్చి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్షలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు అభ్యర్థులు అర్హత సాధించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. వారిలో కొందరు విధులు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ తరుణంలో అధికారులు వారికి షాక్ ఇచ్చారు.
డిగ్రీలో బీకాం, బీఎస్సీ చదివినవారు ఈ ఉద్యోగినికి అర్హులు కాదని, వెంటనే ఉద్యోగాలకు రాజీనామా చేయాలంటూ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని మోసం చేసి ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అనర్హులైన అభ్యర్థులపై అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆ అభ్యర్థులంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

ఫొటో సోర్స్, vsws.ap.gov.in
ఈ గందరగోళానికి కారణమేంటి?
గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా అన్ని జిల్లాల్లోని నగరపాలక సంస్థలకు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.
మొత్తం 3,786 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్‌లో ఈ పోస్టులకు ‘‘ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ యబౌవ్ ’’ అని అర్హతగా పేర్కొంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మాత్రం ‘‘ఏ గ్రాడ్యుయేట్ ఆర్ యబౌవ్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్’’ అని చెప్పింది.
నోటిఫికేషన్‌లో యబౌవ్ అని ఆన్ లైన్ అప్లికేషన్లో ఏ గ్రాడ్యుయేట్ ఆర్ యబౌవ్ అని ఉండటంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్, డిగ్రీ చదివి ఆపై సోషియాలజీ, సోషల్ వర్క్, రూరల్ డెవలప్‌మెంట్, ఆంత్రోపాలజీ, పాపులేషన్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్ లలో పీజీ చేసిన అభ్యర్థులు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.
జేఎన్‌టీయూ, రాయలసీమ యూనివర్సిటీలు కామర్స్ డిగ్రీని హ్యుమానిటీస్ డిగ్రీగా గుర్తిస్తుండటం, నోటిఫికేషన్‌లో ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అని ఉండటంతో బీకాం, ఎంకాం చదివినవారు కూడా దరఖాస్తు చేశారు.
వీరందరికి హాల్ టికెట్లు రావటంతో అర్హత పరీక్ష రాశారు. మెరిట్ ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. తుదిజాబితాలో పేర్లు ఉండటంతో ఉద్యోగ నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొందరు నియామక ఉత్తర్వులు పొంది ఉద్యోగాల్లో చేరి రెండురోజులు విధులు కూడా నిర్వహించారు.

ఫొటో సోర్స్, Andrapradeshcm/fb
అధికారుల పునరాలోచన
ప్రభుత్వం సెప్టెంబర్ 26న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బీఎస్సీ , బీకాం అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుకారని అలాంటప్పుడు వారికి ఎలా ఉద్యోగాలిచ్చారని కొందరు బీఏ అభ్యర్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నగరపాలక అధికారులు నిర్ణయించారు. వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శులుగా ఎంపికైనవారిని కార్యాలయాలకు పిలిపించారు. బీకాం, బీఎస్సీ డిగ్రీ చదివిన అభ్యర్థులు వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి పోస్టుకు అనర్హులని , బీఏ విద్యార్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. అర్హత లేనందున తక్షణం ఉద్యోగాలకు రాజీనామా చేయాలని సూచించారు.
అనంతపురంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగాలు పొందిన వారిలో 21 మంది అనర్హులని మున్సిపల్ అధికారులు మీడియాకు వెల్లడించారు. దీంతో కొన్ని స్థానిక వార్తా పత్రికల్లో సర్టిఫి'కేటుగాళ్లు' , అర్హతలేకపోయిన అందలం , సచివాలయ ఉద్యోగాల్లో అనర్హులు అంటూ పేర్లతో సహా వార్తలు ప్రచురితమయ్యాయి. 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు వార్తాలు రావటం సంచలనంగా మారింది.
అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కేటుగాళ్లం కాదని, ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారమే అర్హత ఉందని కొందరు అధికారులవద్ద నిర్ధారించుకున్నాకే దరఖాస్తు చేశామని వాపోతున్నారు. ఎన్నో దశల్లో పరిశీలించి నియామక ఉత్తర్వులిచ్చిన అధికారులు ఇప్పుడు తమను దోషులుగా చిత్రీకరించటమేంటని ఆవేదన చెందుతున్నారు.

‘వారి తప్పులకు మేం బలి’
అనంతపురానికి చెందిన అమర్నాథ్ బీబీసీతో మాట్లాడుతూ.. "డిగ్రీలో బీకాం, పీజీలో సోషియాలజీ, పీహెచ్‌డీ చేశాను. ఈ విద్యార్హతతో వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శిగా ఎంపికయ్యాను. అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు రీవెరిఫికేషన్ చేసి బీఏ లేదని రాజీనామా చేయమంటున్నారు. నోటిఫికేషన్‌లో ఓ రకంగా , ఆన్ లైన్ అప్లికేషన్‌లో మరో రకంగా విద్యార్హత ఉంది. అధికారులను సంప్రదించి అర్హులమని నిర్ధారించుకున్నాకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్నాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో డిగ్రీలోకాని, పీజీలోకాని సోషల్ వర్క్, సోషియాలజీ , ఆంత్రోపాలజీ చేసిన వారు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు మైకులో స్పష్టంగా అనౌన్స్ చేశారు. అంతా అయిపోయాక ఇప్పుడు అర్హత లేదంటున్నారు. ఉన్నతాధికారుల వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మమ్మల్ని కేటుగాళ్లుగా చిత్రీకరించటం ఎంతవరకు న్యాయం? ఈ గందరగోళానికి తెరదించాలి’’ అని చెప్పారు.
పులివెందులకు చెందిన బాలవెంకటేశ్ మాట్లాడుతూ, ‘‘పరీక్షలకు ముందే అనర్హులమని చెప్పి ఉంటే దీనికోసం కష్టపడే వాళ్లం కాదు. బీకాం, బీఎస్సీ, బీటెక్, ఎం.ఏ, ఎం.కామ్, ఎంఎస్ డబ్ల్యూ వంటి అర్హతలతో ఉద్యోగాలకు ఎంపికై , తుదిజాబితాలో పేరుండి నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న లేదా నియామక ఉత్తర్వులు పొంది ఉద్యోగం కోల్పోయినవారు రాష్ట్రం మొత్తం మీద 500 మంది దాకా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నపోస్టుల కంటే అర్హత సాధించిన వారు తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఉద్యోగాలు మిగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం మానవత దృక్పథంతో అర్హత సాధించినవారికి ఉద్యాగాలివ్వాలి’’ అని కోరారు.
ఈ ఘటనలపై చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, కడప నగరపాలక సంస్థ కమిషనర్ లవన్నలను బీబీసీ వివరణ కోరగా.. ‘‘విద్యార్హతలకు సంబంధించి ఉన్నతాధికారులు ఒక ఉత్తర్వు ఇచ్చారు. అందులో డిగ్రీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సుల జాబితా ఉంది. దాని ప్రకారం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూపులో బీకాం, బీఎస్సీ కోర్సులు లేవు. బీఏ ఉన్న అభ్యర్థులే ఈ పోస్టుకు అర్హులు. ఇతర అర్హతతో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునఃపరిశీలిస్తున్నాం ’’ అని వారు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నోటిఫికేషన్‌లోనే లోపాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ సెప్టంబర్ 26న ఓ సర్క్యులర్ జారీ చేశారు. అందులో " ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ యబౌవ్ ఇన్క్ల్యూడ్స్ ద ఫాలోయింగ్ డిగ్రీస్ " అని బీఏ ఆర్ట్స్ , బీఎస్ డబ్ల్యూ, బీఆర్ఎస్ , బీఏ లిటరేచర్ , బీఏ ఓరియంటల్ లర్నింగ్ , బీఏ పాపులేషన్ స్టడీస్ , బీఏ సోషియల్ స్టడీస్ , బీఏ సోషియల్ సైన్స్ డిగ్రీల పేర్లు ఇచ్చారు.
పీజీ మాత్రం ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక యూనివర్సిటీల్లో సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ ప్రధాన పాఠ్యాంశాలుగా కలిగిన డిగ్రీ కోర్సులు లేవు . అతి తక్కువ కాలేజీల్లో సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అయితే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విద్యార్హతలకు సంబంధించిన సర్క్యులర్ జారీ చేసే సమయానికే కొన్ని చోట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైంది. అనేక చోట్ల 29వ తేదీ వరకూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. తరువాత తుది జాబితా తయారు చేసి అక్టోబర్ రెండో తేదీన ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు.
సర్క్యులర్ ప్రకారం బీఏ మాత్రమే అర్హతగా భావిస్తే , సర్క్యులర్ జారీ అయినప్పటి నుంచి, నియామక ఉత్తర్వులిచ్చేనాటికైనా ఎందుకు పొరపాట్లు సరిదిద్దుకోలేకపోయారని బీబీసీ ప్రశ్నించగా, ఈ విషయం ఉన్నతాధికారులను అడగాలని సమాధానం ఇచ్చారు.
నోటిఫికేషన్ వివరణాత్మకంగా లేకపోవడం, రిజిస్ట్రేషన్ సమయంలో అనర్హత ప్రకటించకపోవడం, సలహా కేంద్రాల వారు అర్హతలు సరిపోతాయని సంతృప్తి వ్యక్తం చేయడం, విద్యార్హత పత్రాల పరిశీలన సమయంలో సంబందిత అధికారులు సంతృప్తి చెందటం, నియామక పత్రాలు అందించటం వెరసి ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి కొందరు అభ్యర్థులు బలైపోయారు.
దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ వివరణ కోరేందుకు బీబీసీ అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్ ఏమయ్యారు?
- 'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు
- 'ఏడేళ్ల వయసులో జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్లకు ఎందుకు చెప్పానంటే...'
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- గాడిద పాలతో చేస్తారు.. కేజీ రూ.78 వేలు.. తినడానికి విదేశాల నుంచి వస్తారు
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








