ఫాదర్స్ డే ఇలా మొదలైంది: తల్లిలా పెంచిన తండ్రి కోసం కూతురు ప్రారంభించిన వేడుక

ఫొటో సోర్స్, GETTY IMAGES / VONKARA1
ఫాదర్స్ డేను ఏటా జూన్ నెలలో మూడో ఆదివారం నిర్వహిస్తున్నారు.
తండ్రి, తండ్రి స్థానంలో ఉండి పిల్లల్ని రక్షించే వారి కోసం ఫాదర్స్ డేగా జరుపుతుంటారు.
ఈ ఏడాది (2023)లో జూన్ 18న ఫాదర్స్ డే జరుపుకొంటున్నారు.
అయితే, మదర్స్ డే ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుపుతున్నప్పటికీ, ఆ తర్వాత చాలా కాలానికి ఫాదర్స్ డే ప్రారంభమైంది.
ఫాదర్స్ డే తొలిసారి అమెరికాలో నిర్వహించారు.
ఇదెలా ప్రారంభమైందనే విషయంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES/ VLADIMIR VLADIMIROV
అలాంటి ఒక కథ ఇది..
వాషింగ్టన్‌లోని సోనోరా లూయీస్ స్మార్ట్ అనే మహిళ తొలిసారి ఫాదర్స్ డే జరిపారని చెప్తుంటారు.
సోనోరా తల్లి ఆరో బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో మరణించారు.
అప్పటి నుంచి తండ్రే పిల్లలను పెంచి పెద్ద చేశారు.
అయితే, 1909లో సోనోరా చర్చిలో మాతృ దినోత్సవానికి సంబంధించిన ఒక ప్రసంగాన్ని విన్నారు.
అప్పుడు ఆమె తండ్రుల కోసం ఒక రోజు ఎందుకు ఉండకూడదు అని అనుకున్నారు.
సోనోరా ఆలోచనను విన్న తర్వాత చాలా మంది స్థానికులు ఫాదర్స్ డే జరపడానికి అంగీకరించారు.
అలా తొలిసారి 1910 జూన్ 19న తొలిసారి సోనోరా ఆధ్వర్యంలో ఫాదర్స్ డే చేశారు.
1966లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ లిండాన్ బీ జాన్సన్ కూడా జూన్ మూడో వారంలో ఫాదర్స్ డే నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ తర్వాత ఆరేళ్లకు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ దీన్ని ఒక చట్టంగా మార్చేందుకు సంతకం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES / RICHARD VILLALONUNDEFINED UNDEFINED
ప్రపంచవ్యాప్తంగా పితృ దినోత్సవాన్ని ఎలా నిర్వహిస్తారు?
థాయ్‌లాండ్: తమ దేశ జాతిపితగా కొలిచే దివంగత రాజు భూమిబల్ అతుల్యతేజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 5న థాయ్‌లాండ్ ప్రజలు ఫాదర్స్ డే నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా థాయ్‌లాండ్‌లో సంప్రదాయబద్ధంగా పసుపు దుస్తులు ధరిస్తారు.
తండ్రులకు, తాతలకు అక్కడి ప్రజలు కాన్నా పువ్వును ఇచ్చేవారు. కానీ, ఆ సంప్రదాయం ఇప్పుడు అంత ప్రాచుర్యంలో లేదు.
మెక్సికోలో పితృ దినోత్సవాన్ని జూన్ నెల మూడో ఆదివారం జరుపుతున్నారు.
ప్రతి ఏడాది మెక్సికో నగరం ఫాదర్స్ డే రేసుగా పిలిచే 13 మైళ్ల రేసును నిర్వహిస్తోంది.
తండ్రులతో కలిసి పిల్లలు కూడా ఈ రేసులో పాల్గొనవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES /REDA&CO
జర్మనీ: జర్మనీలో తండ్రులు ఫాదర్స్ డేను భిన్నంగా జరుపుతారు. పిల్లలతో గడపడం కాకుండా తండ్రులు బృందాలుగా ఏర్పడి పర్వతాలను అధిరోహించడానికి వెళ్తుంటారు.
కొన్నిసార్లు వారు వ్యాగన్ల నిండా ఆహారం, పానీయాలను పట్టుకుని వెళ్తారు.
నేపాల్: ఈ దేశంలో పిల్లలు తరచుగా స్వీట్లను బహుమతులుగా ఇస్తుంటారు.
ఇలా స్వీట్లను ఇవ్వడం ద్వారా ఫాదర్స్ డేన కొడుకులు, కూతుర్లు తమ తండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
ఒకవేళ తండ్రి మరణిస్తే, ఫాదర్స్ డే రోజు పిల్లలు దేవుడి గుడికి వెళ్లి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ ప్రార్థనలు, పూజలు చేస్తారు.

ఫొటో సోర్స్, PICTORIAL PARADE/ GETTY IMAGES
ఫ్రాన్స్: ఈ దేశంలో పితృ దినోత్సవాన్ని సంప్రదాయంగా కేథలిక్ సెలబ్రేషన్స్‌గా నిర్వహించేవారు.
కానీ, ఆ తర్వాత 1900లలో ఈ సెలబ్రేషన్స్‌ను పూర్తిగా కమర్షియల్‌గా మార్చారు.
ఈ రోజు బహుమతుల రూపంలో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. గులాబీ పువ్వులను కూడా తండ్రికి బహుమతిగా ఇవ్వొచ్చు.
తండ్రి బతికే ఉంటే ఫ్రాన్స్‌లో సంప్రదాయబద్ధంగా వారికి ఎర్ర గులాబీలు ఇస్తుంటారు. ఒకవేళ తండ్రి మరణిస్తే, వారి సమాధిపై తెల్ల గులాబీలు పెట్టే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఇరాన్: ‘ఆమె మరణానికి ముందున్న పరిస్థితులకు తిరిగి వెళ్లటం జరగదు’ - 100 రోజులకు చేరిన హిజాబ్ నిరసనలు
- చైనా: 'షీ జిన్‌పింగ్ దిగిపో' అంటూ తొలిసారిగా నిరసన బాట పట్టిన చైనా నవతరం... ఆ దేశంలో అసలేం జరుగుతోంది?
- ప్రజా ఉద్యమాలను చైనా ఎలా అణచివేస్తోంది?
- ఇరాన్ నిరసనలు: మహిళల ఆందోళనలతో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














