'బేరం కుదిరింది' అంటూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పిన 'సెక్సీ టీ షాప్'

టీ తాగుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలను అగౌరవపరిచేలా టీ కప్పులపై రాసినందుకు చైనీస్ సెక్సీ టీ సంస్థ క్షమాపణ చెప్పింది.
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

చైనాకు చెందిన ఒక పానీయాల సంస్థ.. తమ ఉత్పత్తులపై 'అనుచితమైన' నినాదాలు రాసినందుకుగానూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తరువాత "మా ఉద్దేశం అది కాదంటూ" ఆ సంస్థ మహిళలకు క్షమాపణలు తెలిపింది.

సాధారణంగా కాఫీ కప్పులు, టీ మగ్గులపై రకరకాల నినాదాలు (స్లోగన్స్), ట్యాగ్‌లైన్స్, కొటేషన్లు ముద్రిస్తుంటారు.

ఆ కోవలోనే చైనాకు చెందిన 'సెక్సీ టీ షాప్' తమ టీ కప్పులపై "బేరం" అనే అర్థం వచ్చేట్టుగా మహిళల గురించి అనుచితమైన వ్యాఖ్యలు రాసింది.

తాము ఆర్డర్ చేసిన పానీయాలు వచ్చే లోగా అక్కడ ఉన్న మహిళల్లో ఎవరినో ఒకరిని ఎంచుకోవచ్చు అనే అర్థం వచ్చేట్టు టీ కప్పుపై వాక్యాలు ముద్రించింది.

గతంలో కూడా ఈ టీ షాప్ తాము అమ్మిన టీ సంచులపై "మాస్టర్, నాకు నువ్వు కావాలి" అని రాసి పక్కనే తోకకప్పల బొమ్మలు ముద్రించింది. తోకకప్పలు మానవ వీర్యాన్ని పోలి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఈ నినాదాలు ఆడవాళ్లను కించపరుస్తున్నట్లుగా ఉన్నాయంటూ పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మహిళలను అగౌరవపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదంటూ" ఈ టీ షాప్ యాజమాన్యం తరువాత వివరణ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో తమ టీ కప్పులపై ముద్రించిన నినాదాల పట్ల "తాము సిగ్గుపడుతున్నామని" తెలిపింది.

సెక్సీ టీ

ఫొటో సోర్స్, Sexy Tea/Website

ఫొటో క్యాప్షన్, సెక్సీ టీ షాప్ చైనాలో చాలా పాపులర్ బ్రాండ్

సెక్సీ టీ షాప్ ఇటీవల తమ కప్పులపై "చంగ్షా మాండలికం"లో రకరకాల నినాదాలు ముద్రించి మార్కెట్లోకి విడుదల చేసింది.

చైనాలోని హునాన్ ప్రావిన్సు రాజధాని, ప్రధాన పట్టణం అయిన చంగ్షాలో ఈ బ్రాండ్‌కు చెందిన 270 దుకాణాలున్నాయి.

ఆ ప్రాంతంలో తమ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక చంగ్షా యాసలో టీ కప్పులపై రకరకాల వ్యాఖ్యలు, పదబంధాలను ముద్రించింది.

ఒకదానిపై "జియాన్ లౌ జీ" అని రాసి ఉంది. అంటే "చౌకగా బేరం కుదిరింది" అని అర్థం.

ఇలాంటి పదబంధాలతో పాటూ వాటిని ఎలా ఉపయోగించాలో సూచిస్తూ వాక్యాలు కూడా ముద్రించింది. ఉదాహరణకు.. "నేను బబుల్ టీ కొనడానికి వెళ్లినప్పుడు, అక్కడ చాలామంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. అందులో మీకు ఇలాంటి పిల్ల తగిలితే.. నాకు చౌకగా బేరం కుదిరింది అని మీ స్నేహితులకు చెప్పొచ్చు".

ఇలా రాసి ఇన్న టీ కప్పు ఫొటో చైనీస్ సోషల్ మీడియా వీబోలో వైరల్ అవ్వడంతో సెక్సీ టీ షాప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

"ఇది చాలా అసభ్యకరమైన మార్కెటింగ్" అంటూ ఒక యూజర్ రాశారు.

"ఆ పదబంధం మాత్రమే కాకుండా ఉదాహరణగా ఇచ్చిన వాక్యం కూడా చాలా అవమానకరంగా ఉంది. మార్కెటింగ్ బృందంలో ఎవరికీ ఇది తప్పుగా అనిపించలేదా?" అంటూ మరొక యూజర్ విమర్శించారు.

అనంతరం, అలాంటి ఉదాహరణలను ముద్రించినందుకు ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.

"మేము తగని వాక్యం రాశాం. దీనిని చంగ్షా ప్రజలు కూడా హర్షించరు. ఇలాంటి వాక్యాలు రాసినందుకు మేము సిగ్గుపడుతున్నాం. మహిళలను అగౌరవపరచాలన్న ఉద్దేశం మాకు ఏ మాత్రం లేదు. మేము వెంటనే చంగ్షా యాస కప్పులన్నింటినీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంటాం. ఈ సమస్యను మేము తీవ్రంగా పరిగణించి, చర్చిస్తాం" అంటూ సెక్సీ టీ షాప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే, ఈ బ్రాండ్ ఇలాంటి అసభ్యకరమైన నినాదాలు, వాక్యాలు ముద్రించడం ఇదేం మొదటిసారి కాదని, అనేకమార్లు తమ మార్కెటింగ్‌లో భాగంగా ఇలాంటి చవకబారు పదబంధాలను గతంలో కూడా ఉపయోగించిందని యూజర్స్ గుర్తు చేశారు.

గతంలో టీ కప్పులపై ముద్రించిన తోకకప్పలను గుర్తు చేస్తూ.. వీర్యాన్ని సూచించే ఉద్దేశంతోనే అలాంటి చవకబారు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)