కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్: నెల రోజుల్లో 2 లక్షల కేసులు.. టెస్టులు, ఆస్పత్రులు, వైద్యులు సరిపోక సతమతం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ కేసుల విషయంలో గత నెల ప్రారంభంలో కూడా కాస్త ధీమాగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది. గత నెల రోజుల్లో 2,00,000 కు పైగా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ నేటికీ అవసరం అయిన వారికి, ప్రైమరీ కాంటాక్టులకి కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉంది.
మరోవైపు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది మీద పని ఒత్తిడి పెరుగుతోంది. రోగులకు తగ్గట్టుగా సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. వైద్య సేవల్లో ఉన్న అనేక మంది కరోనా బారినపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అరకొర సదుపాయాలతో ఈ పరిస్థితిని వినియోగించుకుని పెద్ద మొత్తంలో రోగుల నుంచి వసూళ్లు సాగిస్తున్నట్టు విజయవాడ స్వర్ణా ప్యాలస్ ఘటన చాటిచెబుతోంది.

ఏపీలో కేసులు ఎలా పెరిగాయంటే...
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10వ తేదీ నాటికి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తొలి కేసు మార్చి 12న నెల్లూరు జిల్లాలో నమోదయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ 10 నాటికి 381కి కేసులు పెరిగాయి. వాటిలో అత్యధికం ఢిల్లీలోని జమాతే ఇస్లామీ సమావేశానికి హాజరయిన వారివే.
ఆ తర్వాత మే 10 నాటికి ఆ కేసులు 1,910కి పెరిగాయి. అంటే దాదాపుగా మూడు రెట్లు వరకూ కొత్త కేసులు వచ్చాయి. ఈ కాలంలో తమిళనాడు కోయంబేడు మార్కెట్ కారణంగా వచ్చిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మరుసటి నెల జూన్ 10 నాటికి కేసుల సంఖ్య 4,126కి పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. కానీ ఆ తర్వాత లాక్‌డౌన్ సడలింపులు ఏపీలో కేసులు వేగంగా పెరగడానికి ప్రధాన కారణం అయ్యింది.
ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారితో కేసులు అమాంతంగా పెరగడం ప్రారంభమయ్యింది. దాంతో జూలై 10 నాటికి ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,422కి చేరింది. అంటే ఒకే నెలలో ఆరు రెట్లు కేసులు పెరిగాయి.
ఆ తర్వాత గడిచిన నెల రోజులు గమనిస్తే లాక్‌డౌన్‌కి మరిన్ని సడలింపులు తోడుకావడంతో కరోనా విస్తృతి భారీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కేసులు రెట్టింపు కావడానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే తీసుకుంటుందంటే పరిస్థితి అర్థమవుతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనే ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. దాంతో ఆగస్టు 10 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 2,35,525కి చేరింది. అంటే జూలై 10 తర్వాత నెల రోజుల్లోనే 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిత్యం దాదాపు 10,000 కేసులు కొత్తవి కనిపిస్తున్నాయి. కరోనా ఎంత వేగంగా విస్తరిస్తోందననే విషయం ఈ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

యాక్టివ్ కేసులలో దేశంలోనే రెండో స్థానం
ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం. కానీ రోజువారీ కేసులు, యాక్టివ్ కేసులను గమనిస్తే ఏపీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.63 లక్షల యాక్టివ్ కేసులుంటే ఆ తర్వాత ఆంధ్ర్రప్రదేశ్‌లో 87,773 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
రికవరీ అయిన వారి సంఖ్యను గమనిస్తే మహారాష్ట్రలో వారి సంఖ్య 3.52 లక్షలు, తమిళనాడులో 2.39 లక్షలుంటే ఏపీలో ఇప్పటి వరకూ 1.45 లక్షల మంది రికవరీ అయ్యారు.
పెరుగుతున్న కేసుల సంఖ్యకు తగ్గట్టుగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేపట్టటం ప్రభుత్వానికి పెను భారంగా మారుతోంది. టెస్టుల విషయంలో సగటున మిలియన్ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఇప్పటివరకూ సుమారు 25.5 లక్షల మందికి పరీక్షలు చేశారు. మొత్తం పరీక్షల్లో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఏపీ కన్నా ఎక్కువగా నిర్వహించినట్టు ఐసీఎంఆర్ లెక్కలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైమరీ కాంటాక్టులకు టెస్ట్ చేయటానికీ తప్పని నిరీక్షణ...
ప్రస్తుతం ఏపీలో రోజుకి సగటున 50 వేలకు పైగా శాంపిళ్లు స్వీకరిస్తున్నారు. అందులో సగం వరకూ ర్యాపిడ్ టెస్టులుంటున్నాయి. అయితే 10 వేల కొత్త కేసులు వస్తుంటే దానికి తగ్గట్టుగా ప్రైమరీ కాంటాక్టులను గమనించినా 50 వేల మంది ఉంటారని అంచనా. ఇక ఇతరులలో లక్షణాలు కనిపించిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారందరికీ సకాలంలో పరీక్షలు నిర్వహించడం పెద్ద సమస్య అవుతోంది.
కరోనా బాధితుల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేసేందుకు ఎదురు చూడాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నాటికి ఒక్క టెస్టింగ్ ల్యాబ్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం సుమారు 60 సెంటర్లలో పరీక్షలు జరుగుతున్నాయి. సంజీవిని బస్సులు సహా వివిధ పద్దతుల్లో మొబైల్ తరహాలో శాంపిళ్ళు సేకరిస్తున్నారు.
ప్రభుత్వం గతంతో పోలిస్తే పరీక్షల విషయంలో పెద్ద ప్రయత్నమే చేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదన్నది పలువురి అనుభవం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన పలివెల శ్రీనివాస్‌కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జూలై 30న ఆయన పరీక్ష చేయించుకుంటే ఆగస్టు 2న ఆయన ఫలితం తెలిసింది. కానీ ఆగస్టు 10 వరకూ తన ఇంట్లో వారికి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కావడం లేదని ఆయన వాపోతున్నారు.
ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు. ''నాకు కరోనా వచ్చింది. హోం క్వారంటైన్‌లో జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ మా కుటుంబానికి పరీక్షలు చేయాలని వాలంటీర్‌ని, ఏఎన్ఎంని, పంచాయితీ అధికారులను మొత్తుకుంటున్నాను. మా ఇంట్లో ఇద్దరికీ జ్వరాలు కూడా ఉన్నాయి. కానీ పరీక్షలు మాత్రం జరగలేదు. గ్రామానికి రోజుకి ఇంత మొత్తం కోటా ఇవ్వడంతో ఇప్పటికే వరుసలో ఉన్న వారికి ముందు చేస్తున్నామని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో మాకు చేస్తామని చెప్పారు'' అని ఆయన తెలిపారు.
''కొందరు అవకాశం ఉన్న వాళ్లు ప్రైవేటు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుంటున్నారు. మాకు అసలే వ్యాపారాలు లేక పైసా ఆదాయం లేదు. దాంతో ప్రైవేటు పరీక్షల కోసం ఖర్చు చేయలేక ప్రభుత్వం టెస్టులు చేస్తుందని ఎదురు చూస్తున్నాం. ఏమవుతుందోననే భయంగా ఉంది'' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?


బెడ్ కావాలంటే ఒక రోగి డిశ్ఛార్జ్ కావాలి..
ప్రస్తుతం రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ఎటువంటి లక్షణాలు లేకుండానే ఎక్కువ మంది కరోనా పీడితులుగా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో వారందరూ ఇంట్లోనే ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేస్తున్నారు.
హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి అవసరమైన మందులు, ఇతర అవసరాలు కిట్ రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన లక్షణాలున్న వారు మాత్రమే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. దానికి అనుగుణంగా ఏపీలోని మొత్తం ఆసుపత్రులలో 37,000 పైగా బెడ్లు సిద్ధం చేశామని సీఎం జగన్ ప్రకటించారు. వాటితో పాటుగా 109 కోవిడ్‌కేర్ సెంటర్లలలో 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అనుగుణంగా గతంలో కేవలం 3,286 బెడ్లు మాత్రమే ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్యను 7,000 పెంచి 11,000 కు పైగా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం చెప్పారు. ఎవరైనా అత్యవసరాలతో ఆసుపత్రికి వస్తే అరగంటలోగా బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, జేసీలు దానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు.
కానీ వాస్తవంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉన్న బెడ్ కావాలంటే సంబంధీకులు చాలా పెద్ద ప్రయత్నమే చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దామెర్ల శ్రీరాములు బండి మీద కూరగాయాలు అమ్ముకుంటారు. ఆయన కరోనా బారిన పడడంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. బెడ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన కుమార్తె శ్రావణి బీబీసీకి తెలిపారు.
''మా నాన్నకు శ్వాస సమస్య రావడంతో తాడేపల్లిలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లాం. కానీ అక్కడ కాదని చెప్పి గుంటూరు తీసుకెళ్లాలని చెప్పారు. తీరా గుంటూరు వెళ్లిన తర్వాత బెడ్లు ఖాళీ లేవని మంగళగిరి ఎన్నారైకి తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా రెండు మూడు గంటలు పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఎవరైనా రోగి డిశ్చార్జ్ అయితే వారి స్థానంలో బెడ్ కేటాయిస్తామని డాక్టర్లు చెప్పారు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యులు, సిబ్బంది కొరత తీర్చేందుకు నోటిఫికేషన్లు.. అయినా తీరని సమస్య
కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గ్రహించిన ఏపీ ప్రభుత్వం ప్రారంభంలోనే అప్రమత్తమయ్యింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా సిబ్బందిని, వైద్యుల సంఖ్యను పెంచాలని ఆలోచించింది. దానికి అనుగుణంగా తొలుత ఏప్రిల్ 14 న నోటిఫిషన్ ఇచ్చింది.
ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1,170 మంది స్పెషలిస్టులు, 1,170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2,000 మంది నర్సులు 306 మంది అనస్థీషియా నిపుణులు, 300 ఫిమేల్ నర్సింగ్ సిబ్బంది, 300 నర్సింగ్ సిబ్బందితో పాటు 300 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించేందుకు సిద్ధమయ్యింది.
కానీ నోటిఫికేషన్‌కి పెద్దగా స్పందన రాలేదు. ఆ తర్వాత పదే పదే ఈ నియామకాలకు కోసం చేసిన ప్రయత్నాలతో ఇప్పటి వరకూ స్పెషలిస్టులు 409, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 945 మందిని మాత్రమే నియమించగలిగారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ట్రైనీ నర్సులతో కలిపి ఇప్పటి వరకూ 8,439 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. రాబోయే కొద్ది రోజుల్లో మరింత మంది నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే 30,887 మెడికల్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని బీబీసీకి తెలిపారు.
''వైద్యులు, సిబ్బంది కొరత రాకుండా చూస్తున్నాము. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త నియామకాలు చేస్తున్నాము. వేతనాలు, రవాణా ఖర్చులు సహా అన్నింటినీ అందించేందుకు సిద్ధమవుతున్నా'' అని మంత్రి చెప్పారు.
''కోవిడ్ వారియర్లుగా ముందుకొచ్చిన అందరినీ ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి అనుగుణంగా వేతనాల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాము. రోగులకు సమస్య రాకుండా ఓవైపు సదుపాయాల కల్పన, మరోవైపు సిబ్బంది నియామకాల విషయంలో ప్రభుత్వం చొరవగా ఉంది'' అని పేర్కొన్నారు.

''చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాం.. వైద్యం అందించలేకపోతున్నారు''
కరోనా బాధితులకు వైద్య సేవలందించడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని విశాఖ విమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. ''ఐదు నెలల నుంచి కరోనా డ్యూటీలో ఉన్నాను. చాలా సమస్యగా ఉంది. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. వైద్య సేవల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు కూడా ఎదుర్కోవడం కష్టంగా ఉంది'' అని ఆయన తెలిపారు.
''ఒక వారం డ్యూటీ చేస్తే మరో వారం రెస్ట్ ఇస్తున్నారు. కానీ హోం క్వారంటైన్‌లో ఉండక తప్పడం లేదు. ఇప్పటికే డాక్టర్లు, సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. ఒక్క విశాఖలోనే కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్న 20 మంది డాక్టర్లు పాజిటివ్‌గా తేలారు. సిబ్బంది సంఖ్య మరో 50కి పైగానే ఉంది'' అని డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు.
''ఇలాంటి సమయంలో కూడా కొందరు ప్రదర్శించే చిన్నపాటి నిర్లక్ష్యం మొత్తం వైద్య సేవల మీద ప్రభావం పడుతోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో ఇంకా కొంత కాలం తప్పదనిపిస్తోంది. కొత్తగా వైద్యులు రావడం లేదు. కేసులు పెరుగుతున్నా డాక్టర్లు, సిబ్బంది సరిపడా లేకపోవడడం సమస్యే'' అని పేర్కొన్నారు.
ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులలో వైద్య సేవల పట్ల అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని ఘటనలలో వైద్యుల తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న తన తండ్రి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని నర్సాపురం ఎంపీడీవో బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ అందించలేకపోవడంతో చివరకు బాత్రూమ్‌కి వెళ్లి అక్కడే జారిపడిపోయారని వాపోయారు. ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల నమోదవుతుండడం గమనార్హం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరణాల సంఖ్యను నియంత్రించడంపైనే దృష్టి: సీఎం
కరోనా వచ్చిన నాటికి తగిన సదుపాయాలు లేకపోయినప్పటికీ క్రమంగా వాటిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆయన ఈ విషయంపై పీఎం మోడీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం సహాయం కూడా కోరారు.
''పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు మాకు లేవు, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలికసదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవు. అయినా ప్రయత్నాలు చేస్తున్నాం. వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆసుపత్రులలో సదుపాయాలు మెరుగుపరిచాం. ఆంబులెన్సుల సంఖ్య కూడా పెంచాము. కోవిడ్ సమయంలో అదనంగా 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నాం. హెల్ప్ డెస్కులు కూడా ఏర్పాటు చేశాం'' అని ఆయన ఆ భేటీలో చెప్పారు.
''గ్రామ సచివాలయాల స్థాయిలో వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం మరణాల రేటు 0.89 శాతంగా ఉంది. దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాము. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం'' అంటూ పీఎంకి నివేదించారు.
ఏపీలో కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, సిబ్బంది సంఖ్యను పెంచడం అత్యవసరంగా కనిపిస్తోంది. అదే సమయంలో తగిన పారితోషకం చెల్లించడం లేదంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కరోనా బారిన పడిన వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది కొరత తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలకు పూనుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- 'కరోనా తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం.. నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం': పుతిన్
- మతాలకు అతీతంగా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్న రాజమండ్రి యువకులు
- స్వర్ణ ప్యాలెస్: ‘‘డోర్ బయటి నుంచి లాక్ చేయడం వల్లే మా అమ్మ చనిపోయింది’’
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు.... ఇవే ఆ విధ్వంసకర దృశ్యాలు
- రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








