విజయవాడ అగ్ని ప్రమాదం: ‘‘డోర్ బయటి నుంచి లాక్ చేయడం వల్లే మా అమ్మ చనిపోయింది’’

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
విజయవాడ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. వారిలో కొందరు కరోనా పాజిటివ్ అయ్యాక చేరగా, కొందరు మాత్రం టెస్ట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మంటలు చూసి చాలా మందికి మెలకువ వచ్చి తమ బంధువులకు కాల్ చేశారు. కానీ, బయటకు వచ్చే దారిలేకే ఎక్కువ మంది మరణించారు.
''మంటలు అంటుకున్నాయి.. బయటకు వచ్చే దారి లేదు అని ఆరోజు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేసి చెప్పారు. ఆ హోటల్లో బయటకు రావడానికి ఒకటే దారి ఉంది. కారిడార్ మంటల్లో చిక్కుకుంది. కిటికీల దగ్గరా మంటలున్నాయి. మొత్తం పొగ కమ్మేసుకుంది. ఎటూ వెళ్లే దారి లేదు. ఊపిరి ఆడలేదు ఆయనకు. నేను ఆయనతో ఫోన్ మాట్లాడుతూ సలహాలు ఇస్తున్నాను. అద్దాలు పగలగొట్టమని చెప్పాను. తల కిటికీ నుంచి బయటకు పెట్టమని చెప్పాను. బయటకు వచ్చి కూర్చోమన్నాను. కానీ, మంటల వల్ల ఏం చేసే అవకాశమూ లేకపోయింది'' అన్నారు శివ బ్రహ్మయ్య కుమారుడు.
‘‘తలుపు తీసినా బయట ఏమీ కనిపించలేదన్నారు. అప్పటికే చీకటి అయిపోయింది. పొగ వచ్చింది. వెళ్లే దారి లేదన్నారు. అప్పటికే ఆయనకు ఊపిరి సరిగా ఆడటంలేదు. నేను వెంటనే పోలీసులకూ, ఫైర్ సిబ్బందికీ కాల్ చేసి, బయల్దేరాను. పది పదిహేను నిమిషాల్లో వెళ్లాను.''

''అక్కడకు వెళ్లి చూశాక, రెస్క్యూ ఆపరేషన్ సమయం పడుతుంది అనిపించింది. నాన్నను కాపాడుకోవడానికి నేనే వెళ్లడం బెటర్ అనిపించింది. వెంటనే ఆయన రూమ్ దగ్గరకు లోపలికి వెళ్లాను. కారిడార్ మొత్తం చీకటి. నా సెల్ ఫోన్లో లైట్ వేసుకుని మెట్లెక్కి వెళ్లాను. ఆయన 214లో ఉన్నారు. వెళ్లిన వెంటనే నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేశాను. ఛాతీ మీద నొక్కాను. నోట్లో నోరు పెట్టి ఊపిరి ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను వెళ్లాక కూడా ఐదు పది నిమిషాలు ఊపిరి తీసుకున్నారు నాన్నగారు. నేను ఒకసారి పుష్ ఇవ్వడం, తరువాత కిటికీ దగ్గరకు వచ్చి ఆక్సిజన్ మాస్కు కోసం సైగ చేయడం, ఇలా చేశాను. నేను స్ట్రెచర్ కోసం, ఆక్సిజన్ మాస్కు కోసం సైగ చేసిన దృశ్యాలు తరువాత మీడియాలో చూశాను. గది నంబరు గాల్లో రాస్తూ కిందున్న వారిక సైగ చేసే ప్రయత్నం చేశాను కానీ, ఎందుకో, అవి అందలేదు.''
''నేను లోపలికి వెళ్లే సరికి చిన్న చిన్న మంటలున్నాయి. ఫైర్ వాళ్లు ఆర్పుతున్నారు. నేను గదిలో ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నప్పుడే నాన్న ఊపిరి ఆగిపోయింది. ఇదంతా పావు తక్కువ ఆరు, ఆరున్నర మధ్య జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చాక కిందకు తరలించాం.''
''రమేశ్ ఆసుపత్రిలో పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రిలో బెడ్స్ లేవని హోటల్‌కు పంపారు. ఆరో తేదీ మధ్యాహ్నం అక్కడ చేరారు. నేను రోజూ ఫోనులో మాట్లాడే వాడిని'' అని వివరించారు శివ బ్రహ్మయ్య కుమారుడు. ఆయన మచిలీపట్నం బీఈఎల్ లో పనిచేశారు.

అమ్మ డోర్ బయటి నుంచి లాక్ చేసేశారు
''అమ్మ ఆ రోజు ఉదయాన్నే ఐదు గంటలకు మాకు ఫోన్ చేసి ఊపిరి ఆడడం లేదు అన్నారు. హలో ఎవరు ఎవరు అన్నాను నేను. అమ్మ అటు వైపు నుంచి నేను నేను అంది. అదే చివరి కాల్. వెంటనే మేం విజయవాడలో ఆ హోటల్ దగ్గర్లోనే ఉండే తాతయ్య వాళ్లకు ఫోన్ చేశాం'' అని వివరించారు సువర్ణలత కుమారుడు భార్గవ రామ్.
''రూమ్ బయటి నుంచి లాక్ చేయడం వల్లే మా అమ్మ మరణించింది. రూమ్ లాక్ చేయకుండా ఉండుంటే మా అమ్మ బతికుండేది. ఆ రోజే కాదు ప్రతీ రోజూ డోర్ బయటి నుంచి లాక్ చేసేసేవారు. ఫుడ్ అదీ బానే ఇచ్చారు. కానీ డోర్ లాక్ మాత్రం ఉండేది. డోర్ లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వారికి? డబ్బులు కట్టి చేరిన వారు పారిపోతారా?'' అన్నారాయన.
''అమ్మ రెండు రోజుల ముందే అడ్మిట్ అయ్యారు. ఆమె ఒక ఫంక్షన్‌కు వెళ్లింది. వచ్చిన తరువాత బాగా లేకపోతే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లాం. మలేరియా, డెంగ్యూ వచ్చాయి, కరోనా నెగిటివ్ రిపోర్టు తెస్తే జాయిన్ చేసుకుంటాం అన్నారు. అప్పుడు మళ్లీ వేరే చోట పరీక్షలన్నీ చేయించాం. కిడ్నీలో సమస్య ఉందన్నారు. కోవిడ్-19 లక్షణాల్లా ఉన్నాయి అన్నారు. దీంతో ఆమె రిపోర్టులు తెలిసిన వైద్యులకు చూపిస్తే ఆసుపత్రిలో చేర్చడం మంచిది అన్నారు. అప్పటికి కరోనా టెస్టు చేశారు కానీ, ఫలితాలు రాలేదు.''
సువర్ణలత భర్త వ్యాపారం చేస్తారు. ఆమె పెద్దకుమారుడు భార్గవ రామ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. చిన్న కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నారు.

తల్లీ కొడుకులిద్దరూ మృత్యు ఒడిలోకి...
''మా అమ్మ ఐదో తేదీన చేరారు. మంగళవారం కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాయి. అమ్మ అన్నయ్య ఇద్దరూ అదే హోటల్ లో ఉన్నారు. బహుశా అన్నయ్యకు ముందుగా మెలకువ వచ్చినట్టుంది. అన్నయ్య అమ్మ ఒకే గదిలో ఉన్నారు. ఫోటో చూస్తే పక్కనే ఫోన్ ఉంది. మాకు కాల్ చేయడానికి చూసినట్టున్నారు. నాన్న షాపు నడుపుతారు. అమ్మ ఇంట్లోనే ఉంటారు. అన్నయ్య బెంగళూరులోఇంజినీర్. వదిన ప్రెగ్నెంట్. నిజానికి మరణానంతరం పరీక్ష చేస్తే, అమ్మకూ, అన్నయ్యకూ ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది'' అని బీబీసీకి చెప్పారు పవన్ కుమార్ సోదరుడు.

ఈ ప్రమాదంలో డివి జయలక్ష్మి, ఆమె కుమారుడు డివిఎం పవన్ కుమార్ ఇద్దరూ మరణించారు. పవన్ కుమార్ భార్య గర్భవతి. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఫోన్ ఎత్తకపోతే నిద్ర లేవలేదనుకున్నాం
''ఆదివారం పొద్దున్నే నేనూ పిల్లలమూ కలసి వీడియో కాల్ చేశాం. మావయ్య గారు ఎత్తలేదు. బహుశా ఇంకా నిద్రలేవలేదు అనుకున్నాను. ఈలోపు ఒక బంధువు ఫోన్ చేశారు. న్యూస్ చూశారా? మీ మామయ్య గారు స్వర్ణ పాలెస్‌లోనే ఉన్నారు కదా. అక్కడ ప్రమాదం జరిగింది అని చెప్పారు. అప్పుడు హడావుడిగా హోటల్ దగ్గరకు వెళ్లాం. కానీ అక్కడే సమాచారమూ లేదు. ఒక గంటన్నర ఉన్నాను. వారి హడావిడిలో వాళ్లున్నారు. ఆ తరువాత రమేశ్ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడున్న వారిలో ఈయన పేరులేదు. వారు సరిగా చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ అప్పటికింకా అంబులెన్సుల్లోనే మృతదేహాలున్నాయి. అప్పుడు మావయ్య గారిని గుర్తుపట్టాను. ఆయన నోరు, ముక్కుల్లో నల్లగా మసి కనిపించింది. అంతకుమించి శరీరానికి గాయాలేమీ కాలేదు. నిజానికి ఆయన ఉన్న రూము 216 దగ్గర ఏ ప్రమాదమూ లేదు. కేవలం పొగవల్లే చనిపోయారు.'' అన్నారు సుంకర బాబూ రావు అల్లుడు.
సుంకర బాబూ రావు ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ''ఆయనతో చివరిసారి ముందురోజు రాత్రే వీడియో కాల్‌లో మాట్లాడాను. ఆయన ఆస్థమా పేషెంట్ కావడంతో హోమియో వాడుతుంటారు. మామూలుగా సీజన్ బాలేనప్పుడు ఆయనకు ఇబ్బంది ఉంటుంది. కానీ, కరోనా సమయంలో అనారోగ్యంగా అనిపించింది. అందుకే టెస్టుకు వెళ్దాం అంటే సరే అన్నారు. సీటీ స్కాన్ చేశారు. ఇంట్లో అత్తయ్య గారు ఉండడంతో, ఇబ్బంది లేకుండా ఉంటుందని మేమే హోటెల్‌లో ఉండమమని సలహా ఇచ్చాం. దానికి ఆయన ఒప్పుకున్నారు. బెడ్ లేదు అంటే తెలిసిన వారి ద్వారా రిక్వెస్ట్ చేసి మరీ జాయిన్ చేశాం. అనవసరంగా పంపామని బాధగా ఉందిప్పుడు. ఆరో తేదీన జాయిన్ చేశాం. మృతదేహానికి చేసిన పరీక్షలో నెగిటివ్ వచ్చింది'' అన్నారు ఆయన అల్లుడు.
ఇవి కూడా చదవండి:
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు.... ఇవే ఆ విధ్వంసకర దృశ్యాలు
- రామజన్మభూమి తరువాత మోదీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి తేవడమేనా?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








