విజయవాడ ‘కోవిడ్ సెంటర్’ అగ్నిప్రమాదం కేసులో రమేశ్ హాస్పిటల్ సీఓఓ సహా ముగ్గురు అరెస్ట్

విజయవాడ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్‌గా నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారని ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ ఆదివారం చెప్పారు. అయితే.. మృతుల సంఖ్య 10 మందేనని విజయవాడ నగర పోలీసు కమమిషనర్ బి శ్రీనివాసులు సోమవారం నాడు బీబీసీకి చెప్పారు.

ప్రమాద సమయంలో ఒక వ్యక్తి ఆచూకీ తెలియకపోవటంతో మరణించినట్లు పరిగణించామని.. ఆ వ్యక్తి ఆచూకీ తర్వాత తెలిసిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.

సీఓఓ సహా ముగ్గురు అరెస్ట్

కోవిడ్ కేర్ సెంటర్ కోసం స్వర్ణ ప్యాలెస్ తో ఎం ఓ యూ కుదుర్చుకున్న రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్ రావు తో పాటు జనరల్ మేనేజర్ కూరసాటి సుదర్శన్ ,నైట్ షిఫ్ట్ మేనేజర్ పొల్లబోతు వెంకటేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా, హోటల్ ‌ను ఆస్పత్రిగా మార్చుతున్నట్లు చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

ఆదివారం నాడు ఏం జరిగింది...

విజయవాడ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లాకు సమీపంలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఉంది. ప్రైవేటు ఆస్పత్రి అయిన రమేష్ హాస్పిటల్ దీన్ని అద్దెకు తీసుకుని, కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది.

ఆస్పత్రిలో బెడ్ల కొరత ఉండటంతో కొందరు రోగులను ఈ హోటల్‌లో ఉంచి చికిత్స చేస్తోంది. ప్రమాద సమయంలో.. ఈ ఆస్పత్రిలో 30 మంది రోగులు, ఏడుగురు వైద్య సిబ్బంది, ఆరుగురు ఆస్పత్రి సిబ్బంది ఉన్నట్లు పోలీసు అధికారులు నిర్ధారించారు.

విజయవాడ అగ్నిప్రమాదం

అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఒక్క శనివారం నాడే 10,008 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

‘‘కోవిడ్ సెంటర్‌గా మార్చటానికి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు’’

స్వర్ణ ప్యాలస్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చటానికి అగ్నిమాపక శాఖ నుంచి రమేష్ ఆస్పత్రి ఎన్ఓసీ తీసుకోలేదని రాష్ట్ర విపత్తులు, అగ్నిప్రమాద భద్రత విభాగం డైరెక్టర్ జనరల్ ఎహసాన్ రెజా బీబీసీకి చెప్పారు.

‘‘ఈ భవనం వినియోగాన్ని హోటల్‌ నుంచి ఆస్పత్రికి మార్చుతున్నపుడు అందుకు అగ్నిమాపక శాఖ నుంచి అభ్యంతరం లేదనే ధృవీకరణ పొందాల్సి ఉంది. అది తీసుకోలేదు’’ అని ఆయన తెలిపారు.

‘‘భవనం నుంచి తప్పించుకోవటానికి కనిపించే ఏకైక మార్గం మంటల్లో చిక్కుకుంది. తప్పించుకోవటానికి వీలున్న మరో మార్గం ప్రజలకు కనిపించటం లేదు’’ అని ఆయన వివరించారు.

‘‘ప్రమాదం జరిగినపుడు హెచ్చరించే అలారం బెల్ మోగలేదు. భవనం వెనుక తలుపు తెరవటమూ ఆలస్యమైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాం. విచారణ తర్వాత హోటల్ యాజమాన్యం మీద చర్యలు చేపడతాం’’ అని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ పేర్కొన్నారు.

మేకతోటి సుచరిత

‘‘రిసెప్షన్ ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి’’

స్వర్ణప్యాలెస్‌ ప్రమాదానికి కారణమైన మంటలు తొలుత భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని రిసెప్షన్‌లో మొదలయ్యాయని జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ వివరించారు.

‘‘ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. రిసెప్షన్ ప్రాంతంలో విద్యుత్ వైఫల్యం వల్ల నిప్పు రాజుకుని మంటలు వ్యాపించాయి. రిసెప్షన్ పక్కనుంచి మెట్లు ఉండటం వల్ల పొగ మొత్తం పై అంతస్తులకు వెళ్లింది’’ అని ఆయన తెలిపారు.

విజయవాడ అగ్నిప్రమాదం

భవనంలో ఫైరస్ సేఫ్టీ (అగ్ని ప్రమాద భద్రత) వ్యవస్థ ఉన్నప్పటికీ.. అవేవీ పనిచేస్తున్న స్థితిలో లేవన్నారు. మంటలు చెలరేగినపుడు గుర్తించి నీళ్లు చిలకరించే ‘‘స్ప్రింక్లర్లు ఆటో మోడ్‌లో లేవు. సైలెంట్ మోడ్‌లో ఉండటంతో అవి పనిచేయలేదు’’ అని ఆయన చెప్పారు.

ప్రమాదం జరిగినపుడు అక్కడ ఉన్నవారు కూడా వాటిని పనిచేసేలా చర్యలు చేపట్టలేదన్నారు. కోవిడ్ సెంటర్‌గా నిర్వహిస్తున్నందువల్ల ఇక్కడ ఉన్న శానిటైజర్లు వంటివి అగ్ని ప్రమాదం తీవ్రమయ్యేలా దోహదపడి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది పొగను పీల్చుకోవటం వల్ల చనిపోయారని.. ఇద్దరు కాలిన గాయాలతో మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయినట్లు డైరెక్టర్ జనరల్ తెలిపారు.

విజయవాడ అగ్నిప్రమాదం

కరోనారోగులు ఉన్న హోటల్ కావడంతో సహాయ చర్యలు చేపట్టేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి లోపలికి వెళ్లి, అక్కడ నుంచి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనువాసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు.

విజయవాడ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం జరిగిందని తమకు ఉదయం 5:06 గంటలకు సమాచారం అందిందని డీజీపీ చెప్పారు.

విషయం తెలిసిన ఐదు నిమిషాల్లో పోలీసు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు.

ఉదయం 5:45 గంటలకల్లా మంటలను ఆర్పివేశామని భవనం నుంచి ఆస్పత్రి సిబ్బంది సహా 20 మందికి పైగా వ్యక్తులను రక్షించామన్నారు.

విజయవాడ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

గ్రౌండ్, మొదటి, రెండు ఫ్లోర్లలో మంటలు, పొగ వ్యాపించి ఎక్కువ నష్టం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి.

ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు కిందకి దూకేశారు.

విజయవాడ అగ్నిప్రమాదం

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు.

వెంటిలేషన్ సమస్య వల్ల పొగ వ్యాపించి మృతుల సంఖ్య పెరిగినట్టు చెబుతున్నారు.

కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. రమేష్ ఆస్పత్రికి 15 మంది రోగులను, నాలుగు మృతదేహాలు తరలించారు.

విజయవాడ అగ్నిప్రమాదం

మృతులకురూ. 50 లక్షల చొప్పున పరిహారం: సీఎం

స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనపై రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

వారి కుటుంబాలకు అండగా ఉంటామని.. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

విజయవాడలో కోవిడ్ సెంటర్‌గా ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్‌లు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని మోదీ సీఎం వైయస్‌.జగన్‌‌కు ఫోన్‌ చేశారు. ఈ ఘటన వివరాలను ప్రధానికి సీఎం తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ఈ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లను ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

విజయవాడ అగ్నిప్రమాదం

అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని, కొంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని.. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధాని మంత్రికి సీఎం తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, రవాణా మంత్రి పేర్ని నాని, దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

‘‘నిర్వహణా లోపాలున్నాయి. కంప్యూటర్ నుంచి మంటలు వ్యాపించాయి. హోటల్ యాజమాన్యం గానీ, నిర్వాహకులు ఆస్పత్రి గానీ ఎవరి లోపం ఉన్నా చర్యలు తప్పవు’’ అని ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.

కరోనా బాధితులు ఉండడంతో సహాయక చర్యలకు సమస్య అవుతోందన్నారు. లిఫ్టులు బంద్ కావడం, కోవిడ్ రోగులకు శ్వాస ఆడకపోవడం వల్లే ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

విజయవాడ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, Ani

ఐదుగురు మాత్రమే ఉన్నారన్న ఆస్పత్రి?

కోవిడ్ కేంద్రంగా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో ఉన్న రోగుల సంఖ్యపై రమేష్ ఆస్పత్రి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు చెప్తున్నారు.

ఈ సెంటర్‌లో 40 మందికి పైగా కోవిడ్ రోగులు ఉండగా.. కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారని ఆస్పత్రి చెప్పినట్లు తెలియటంతో జిల్లా కలెక్టర్ ఈ అంశంపై విచారణ చేపట్టారు.

విజయవాడ అగ్నిప్రమాదం

అగ్ని ప్రమాదానికి సంబంధించి స్వర్ణ ప్యాలస్ హోటల్, రమేష్ హాస్పిటల్‌ యాజమాన్యాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఐపీసీ చట్టంలోని సెక్షన్ 304 (2), 308 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.

విజయవాడ అగ్నిప్రమాదం

మృతుల వివరాలివీ...

విజయవాడలోని కరోనా క్వారంటైన్ సెంటర్ హోటల్ స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో తొమ్మిది మందిని వారి బంధువులు, అధికారులు గుర్తించారు. ఆ వివరాలు...

1. కొసరాజు సువర్ణలత, గృహిణి (42), గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు

2. డొక్కు శివబ్రహ్మయ్య (59), బెల్‌ కంపెనీ మేనేజర్, కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం (మూడు రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు)

3. పొట్లూరి పూర్ణచంద్రరరావు (80), రిటైర్డ్ సీపీఓ, కృష్ణా జిల్లా కొడాలి (లంగ్‌ ఇన్పెక్షన్‌తో చేరారు)

4. సుంకర బాబూరావు (80), రిటైర్డ్‌ ఎస్‌ఐ, ఇందిరానగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌, విజయవాడ

5. మజ్జి గోపి (54) మచిలీపట్నం

6. జి.వెంకట జయలక్ష్మి (52), ప్రకాశం జిల్లా కందుకూరు

7. డి.బి.ప‌వ‌న్‌ (29), కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌ (మంటల నుంచి త‌ప్పించుకునేందుకు పైనుంచి దూకేయ‌డంతో త‌ల‌ప‌గిలి చ‌నిపోయారు)

8. స‌బ్బిలి ర‌త్న అబ్ర‌హం (48), క్రిస్టియన్ ఫాదర్, కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌

9. సబ్బిలి రాజ‌కుమారి, అబ్రహం భార్య, కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)