'కరోనావైరస్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు...' ఆసియాలోనే అత్యంత సీరియస్ కోవిడ్ పేషెంట్ హెచ్చరిక

స్టీఫెన్ కామెరాన్
ఫొటో క్యాప్షన్, స్టీఫెన్ కామెరాన్

స్కాట్‌లాండ్‌కు చెందిన స్టీఫెన్‌ కామెరాన్‌ కరోనావైరస్‌ సోకడంతో వియత్నాంలో రెండు నెలలపాటు కోమాలో ఉండిపోయారు. ఆ దేశంలో మరోసారి కరోనా విజృంభించనుందన్న హెచ్చరికల నేపథ్యంలో, కరోనా తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో బీబీసీకి వివరించారు కామెరాన్‌.

బతకడానికి 10శాతం మాత్రమే అవకాశం ఉందన్న డాక్టర్లు, ఆయన్ను రెండు నెలలపాటు వెంటిలేటర్‌ మీద ఉంచారు. అది ఆయన సొంత దేశం స్కాట్‌లాండ్‌లో కాదు. దానికి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియత్నాంలో. "నా శరీరంలో చాలాచోట్ల రక్తం గడ్డ కట్టింది. కొన్ని అవయవాలు పని చేయడం మానేశాయి. మూత్రపిండాలు చెడిపోయాయి. ఒక దశలో నా ఊపిరితిత్తులు వాటి సామర్ధ్యంలో 10 శాతం మాత్రమే పని చేశాయి" అని స్టీఫెన్ కామెరాన్‌ వెల్లడించారు.

ఆయన కేసును డాక్టర్లు, అధికారులు, మీడియా చాలా దగ్గరగా పరిశీలించాయి. "ఆసియాలో నా అంత కోవిడ్‌-19 బాధితుడు మరొకరు లేరని డాక్టర్లు చెప్పారు'' అని స్టీఫెన్‌ అన్నారు.

కామెరాన్‌ కేసును డాక్టర్లు నిజంగా చాలా సీరియస్‌గా పరిశీలించారు. ఎందుకంటే వియత్నాంలో ఇంత వరకు ఒక్క కోవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదు. 42ఏళ్ల కామెరాన్‌కు పేషెంట్ నంబర్‌ 91గా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

స్టీఫెన్ కామెరాన్

కామెరాన్‌ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్‌-19ను తక్కువ అంచనా వేయవద్దన్నారు కామెరాన్‌. "కోవిడ్‌-19 వైరస్ మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి నేను ప్రత్యక్ష ఉదాహరణ'' అని ప్రస్తుతం స్కాట్‌లాండ్‌లో ఓ ఆసుపత్రిలో ఉన్న కామెరాన్‌ బీబీసీకి చెప్పారు. "వైరస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయేదాకా ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు'' అని ఆయన హెచ్చరించారు.

వైరస్‌ను పూర్తిగా నియంత్రించడానికి వియత్నాం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. 100 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అయితే డా నాంగ్‌ సిటీలో తాజాగా నాలుగు కేసులు బైటపడ్డాయి.

స్టీఫెన్ కామెరాన్

ఫొటో సోర్స్, Cho Ray Hospital

అన్నింటికీ సిద్ధం

తీవ్ర ప్రాణాపాయ పరిస్థితుల్లో వాడే ఎక్మో మెషిన్‌ మీద కామెరాన్‌ కోమా చికిత్స మొత్తం సాగింది. ఈ మెషిన్‌ రోగి రక్తాన్ని బైటికి తీసి, దానికి ఆక్సిజన్‌ ఎక్కించి తిరిగి శరీరంలో పంపిస్తాయి. "ఒక దశలో నేను బతకడానికి 10శాతమే అవకాశం ఉన్నట్లు నా స్నేహితుడు క్రెయిగ్‌కు విదేశాంగశాఖ అధికారులు చెప్పారు. నేను శవంగా వస్తే అంతకు ముందు చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. నా అపార్ట్‌మెంట్‌ను అమ్ముకున్నాను'' అని జూన్‌లో హో చి మిన్‌ సిటీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో కామెరాన్‌ బీబీసీకి చెప్పారు.

ఊపిరితిత్తులను మార్చాల్సిన పరిస్థితిని కామెరాన్‌ కొద్దిలో తప్పించుకున్నారు. ఒక దశలో అతని ఊపిరితిత్తులు 10శాతం మాత్రమే పని చేశాయి. ఒంట్లోని పలు అవయవాలు పని చేయడం మానేశాయి. అయితే ఒక రకంగా కామెరాన్ అదృష్ణవంతులు. ఎందుకంటే ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 420 కేసులు మాత్రమే బైటపడ్డాయి. అందులో కూడా చాలా కొద్ది కేసులే సీరియస్‌గా ఉన్నాయి. ఆసుపత్రుల్లో పెద్దగా రద్దీ లేకపోవడంతో ఆయనకు మెరుగైన చికిత్స సాధ్యమైంది. "ప్రపంచంలో మరెక్కడున్నా నేను చచ్చిపోయేవాడిని. నెల రోజుల చూసి డాక్టర్లు నా ఆక్సిజన్‌ను పీకేసేవారు'' అని కామెరాన్‌ జూన్‌లో అన్నారు. "వియత్నామీలు నన్ను తమ గుండెల్లో పెట్టుకున్నందుకు నా వందనాలు. వారి కళ్ల ముందు నా ప్రాణాలు పోవద్దని ప్రతి డాక్టర్‌ ప్రయత్నించారు'' అని కామెరాన్‌ అన్నారు.

స్టీఫెన్ కామెరాన్

ఫొటో సోర్స్, Vietnam government

అదో క్లిష్లమైన పరుగు పందెం

"కామెరాన్‌ అన్ని రోజులు చికిత్స తీసుకుని బతికి బైటపడటం అనేది ఒక వింత. చాలా అరుదైన ఘటన'' అని ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులకు చికిత్స చేసిన డాక్టర్ మనీశ్‌ పటేల్‌ అన్నారు. "ఐసీయులో గడపడం మారథాన్‌ పరుగులాంటిదని అంటారు. కానీ కామెరాన్‌ మల్టిపుల్‌ అల్ట్రా మారథాన్‌ పరుగు పందెంలో పాల్గొన్నారు'' అని పటేల్‌ బీబీసీతో అన్నారు.

కోమాలో ఉండగా కామెరాన్‌ 30 కేజీల బరువు తగ్గిపోయారు. ఇప్పటికీ నడవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. "కోమా నుంచి బైటికి రాగానే నేను మళ్లీ నడవగలనా అనుకున్నాను. నా కాళ్లు పడిపోయినట్లనిపించింది. నా జీవితం, నా పైలట్‌ కెరీర్‌ ముగిసినట్లేనని భయపడ్డాను'' అని కామెరాన్‌ అన్నారు.

వచ్చే ఏడాదికల్లా మళ్లీ పైలట్‌గా గాల్లోకి ఎగరాలన్నది కామెరాన్‌ లక్ష్యం. కానీ అది చాలా కష్టమని ఆయనకు అర్దమవుతోంది. చికిత్స మరికొంత కాలం కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆసియాలో ట్రావెల్‌ ఇండస్ట్రీ కష్టాల్లో ఉండటంతో తన ఉద్యోగ భద్రత కూడా సందేహంలో పడింది.

స్టీఫెన్ కామెరాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వియత్నాం హాస్పిటల్ నుంచి తిరిగి స్కాట్‌లాండ్‌కు వెళ్ళిన స్టీఫెన్ కామెరాన్

వియత్నాంలో కొత్త కేసులు

కరోనా వైరస్‌ నియంత్రణలో వియత్నాం అనుసరించిన వ్యూహం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ తాజాగా డా నాంగ్‌ సిటీలో నాలుగు కొత్త కేసులు బైటపడటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా నమోదైన కేసులకు అంతర్జాతీయంగా ఎలాంటి లింకు లేదని, ఇది ఆందోళన కలిగించే అంశమని బీబీసీ బ్యాంకాక్‌ కరస్పాండెంట్ జోనాథన్‌ హీడ్‌ అన్నారు. నగరంలో సామాజికవ్యాప్తి ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నట్లు హీడ్‌ వెల్లడించారు.

అత్యవసరం కానీ సర్వీసులను నిలిపేయాలని, భౌతిక దూరం పాటించాలని వియత్నాం ప్రధానమంత్రి ఎన్‌గ్యుయెన్‌ జువాన్ హెచ్చరించారు. 14 రోజులపాటు నగరంలోకి టూరిస్టులను రానివ్వద్దని, ఇప్పటికే ఉన్న 80,000మంది స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఇది క్లిష్టమైన పరిస్థితే అయినా దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ఆదేశించడం లేదని ప్రధానమంత్రి వెల్లడించారు.

కోవిడ్‌-19ను నియంత్రించడంలో వియత్నాంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను పక్కాగా నిర్వహించడం, వైరస్‌ బారినపడిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించడంలాంటివన్నీ పకడ్బందీగా అమలు చేశారని జోనాథన్‌ హీడ్‌ వెల్లడించారు.

పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌ కూడా ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా తీవ్రమైన చర్యలు తీసుకుని జీరో కేసుల స్థాయికి వెళ్లగిలిగింది. వియత్నాంలో కోవిడ్‌-19 టెస్టులకు తగిన సదుపాయాలు లేవు. అయినా రెండు దేశాలు కమ్యూనిటీ కంట్రోల్‌ను అనుసరించడం ద్వారా వైరస్‌ను నియంత్రించగలిగాయి. టూరిజం మీద ఆధారపడ్డ ఈ రెండు దేశాలు ఆర్ధిక సమస్యలను కూడా లెక్కచేయకుండా సరిహద్దులు మూసివేసి వైరస్‌ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

రిపోర్టర్: ఆలివర్‌ బార్నెస్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)