కరోనావైరస్ సోకితే ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాల ఆస్పత్రులకు వెళ్లిపోతున్న వీఐపీలు

ఫొటో సోర్స్, facebook/VijaySaiReddy
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువుకు పెద్ద పరీక్ష పెట్టింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ కట్టడి, చికిత్సల విషయంలో తాము ముందున్నామని చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
కానీ, ఆ క్రమంలో వారి విశ్వసనీయతకు పెద్ద పరీక్ష ఎదురైంది. అదే ప్రభుత్వం, పార్టీలోని కీలక వ్యక్తులకు కరోనా వైరస్ సోకడం..
వారికి వైరస్ సోకడంలో విచిత్రం, ప్రభుత్వ దోషం లేకపోవచ్చు.. కానీ సమస్య ఏంటంటే, ఆ వీఐపీలు వైరస్ రాగానే తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను, తమ సొంత ప్రభుత్వ ఏర్పాట్లను వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం.
అవును, ఆంధ్రలో కరోనావైరస్ సోకిన చాలా మంది వైఎస్సార్సీపీ ప్రముఖులు తమ సొంత రాష్ట్రం, సొంత ప్రభుత్వాన్ని కాదని పక్క రాష్ట్రాలకు వెళ్లారు.
వారిలో ముఖ్యమైన పేరు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి.
ఏపీ ప్రభుత్వంలో, వైఎస్సార్‌సీపీలో జగన్ తరువాత వినిపించే రెండు మూడు పేర్లలో మొదటి పేరు విజయసాయి రెడ్డిది. అలాంటిది తనకు కరోనా వైరస్ సోకగానే వెంటనే ఆయన చికిత్స కోసం హైదరాబాద్ వచ్చేశారు.
ఆయన హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
నిజానికి ఆయన ఆసుపత్రిలో చేరిన మొదటి రోజే ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది.
అందుకు కారణం.. కొన్ని రోజుల కిందట విజయసాయిరెడ్డి టీడీపీ నేత అచ్చెన్నాయుడు విషయంలో వేసిన ప్రశ్నలు, చేసిన ట్వీట్లు ఈ చర్చకు దారి తీశాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయినప్పుడు ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న డిమాండు వస్తే, దానికి కౌంటర్ గా, ''గుండ్రాయిలా ఉన్న నీకు కార్పొరేట్ ఆసుపత్రి ఎందుకు అంటూ'' ట్వీట్లు చేశారు విజయసాయి.
ఆ తరువాత పది రోజులకు విజయసాయిరెడ్డికి వైరస్ సోకింది. వెంటనే ఆయన కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. అది కూడా తన సొంత రాష్ట్రం కాదని పక్క రాష్ట్రంలోని హాస్పిటల్లో చేరారు. దానర్థం, ఆయన తన సొంత ప్రభుత్వ ఏర్పాట్లను విశ్వసించకపోవడమే కదా అన్న ధోరణిలో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, facebook/amzath basha
ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా..
ఇది విజయసాయి రెడ్డికే పరిమితం కాలేదు. ఏపీ నుంచి చాలా మంది ఇదే బాట పట్టారు. విజయసాయి రెడ్డి కంటే ముందు వైరస్ సోకిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కడపకు చెందిన అంజాద్ బాషా స్వయంగా హైదరాబాద్ వచ్చి కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వెళ్లారు.
మరో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి భార్య కూడా కోవిడ్ చికిత్స కోసం చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.
తెలంగాణలోనూ నేతలకు కరోనా సోకినప్పుడు వారు ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. గాంధీ ఆసుపత్రికి కాకుండా, తమకు నచ్చిన ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు.
తెలంగాణలో జరిగినప్పుడు, ఆంధ్రలో జరగడం పెద్ద వింతేముంది అనకోవడానికి లేదు. ఎందుకంటే, తెలంగాణ నేతలు ప్రైవేటు హాస్పిటళ్లయినా సరే తమ రాష్ట్రంలోనే చేరారు. కానీ, ఏపీ ప్రభుత్వంలోని నేతలు మాత్రం రాష్ట్రాన్ని వదిలి వెళ్లారు.

ఫొటో సోర్స్, FB

ఫొటో సోర్స్, FB
అంతేకాకుండా, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా ముందుగా నెల్లూరులోనే చికిత్స పొందినప్పటికీ తరువాత, చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర రెడ్డి (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి తండ్రి ఈయన) కూడా ప్రస్తుతం హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, TTD
ఇక తిరుమల దేవస్థానంలో పూజలన్నీ సంప్రదాయం ప్రకారమే జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించే పెద్ద జీయంగారిని కూడా చెన్నై తరలించారు.
ఆయనను ముందుగా తిరుపతిలోనే చేర్చినప్పటికీ, తరువాత చెన్నైకి తరలించినట్టు ధ్రువీకరించింది టిటిడి.

ఏపీలో వైద్యం పరిస్థితి ఏమిటి?
ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి - ఈ మూడు పెద్ద నగరాల్లోనూ, ఆ తరువాత స్థానంలో రాజమండ్రి, కాకినాడ, భీమవరం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు వంటి పట్టణాల్లోనూ చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి.
కానీ హైదరాబాద్ తో పోలిస్తే సంఖ్యా పరంగా, విస్తృతి పరంగా అవి చిన్నవే.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి హైదరాబాద్ ఆసుపత్రులే అలవాటు.
గతంలో చెన్నై, బెంగళూరు వెళ్లే అలవాటున్న చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరులోని చాలా ప్రాంతాల వారు కూడా చాలా వరకూ హైదరాబాద్ లో స్థిరపడడమో, లేక బంధువులు ఉండడమో కారణంతో, ఇక్కడకి రావడం మొదలుపెట్టారు.
అయినప్పటికీ ఇంకా చెన్నై, బెంగళూరు వెళ్లేవారూ కొందరున్నారు.
కానీ కోస్తాలో శ్రీకాకుళం నుంచి మొదలు ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు వరకూ ఎక్కువ మంది పెద్ద జబ్బులకు చికిత్స అంటే హైదరాబాద్ ఆసుపత్రులనే నమ్ముతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ క్రమంలోనే ఏపీకి చెందినప్పటికీ, బాగా స్తోమత ఉండి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం ఆసక్తి లేని వారు కరోనా చికిత్సకు హైదరాబాద్ వస్తున్నారు.
ఈ ధోరణిపై సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు స్పందిస్తూ, ''ఆంధ్రలో చిత్రమైన పరిస్థితి ఉంది. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వీఐపీలు వెళ్లడం లేదు. కడపలో రిమ్స్, తిరుపతిలో స్విమ్స్ వంటి మెడికల్ కాలేజీలతో కూడిన ఆసుపత్రులు పెట్టుకుని కూడా హైదరాబాద్, చెన్నైలకు వైద్యం కోసం వస్తున్నారంటే, వారి ప్రభుత్వం నడుపుతోన్న వైద్య వ్యవస్థపైనే వారికి నమ్మకం లేని పరిస్థితి. జనాలు మాత్రం వాటికే వెళ్లాలి. ఈ ధోరణితో ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజలకు విశ్వాసం తగ్గుతోంది. తిరుపతిలో పెద్ద మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ, స్వామీజీలను మద్రాస్ తీసుకెళ్లి చికిత్స అందించారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం అందుతోంది?" అని ప్రశ్నించారు.
ఇటీవలే కరోనా సోకిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారని గుర్తు చేసిన నాగరాజు, "ఇక్కడి ప్రజా ప్రతినిధులు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు? ఇక్కడి ప్రజలకు బతుకు మీద తీపి ఉండదా? ఈ చర్యల వల్లే ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పోతోంది. నమ్మకం కలిగించడానికి ప్రయత్నాల చేయాలి ఈ నాయకత్వం.'' అని అన్నారు.
కొన్ని సందర్భాల్లో అత్యవసరం అయినప్పుడు, సరిహద్దుకు మరీ దగ్గరగా అంటే ఏపీలోని నగరాల కంటే చెన్నై, బెంగళూరులే దగ్గరగా ఉన్న ప్రాంతాల వారు అక్కడకు వెళ్లడం కూడా ఉండవచ్చు. కానీ పనిగట్టుకుని కూడా చాలా మంది వెళ్లారు.
దీనిపై ఆయా నేతలను, ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖనూ బీబీసీ సంప్రదించింది. వారి నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








