చైనా గురించి మోదీ ప్రభుత్వం ఎందుకు గొంతెత్తడం లేదు?... నిస్సహాయతా లేక దౌత్య వ్యూహమా?

నరేంద్ర మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Mikhail Svetlov

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జయ్‌శంకర్ అక్టోబర్ 6న టోక్యోలో జరిగిన క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడాన్ని భారత్ సమర్థిస్తుందని, నియమాల ప్రకారం నడిచే అంతర్జాతీయ వ్యవస్థను కోరుకుంటోందని ఆయన అక్కడ అన్నారు. అయితే, దేశ సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిని ఖండిస్తున్నట్లుగా నేరుగా ఆ దేశం పేరును ప్రస్తావిస్తూ ఆయన ఎలాంటి విమర్శలూ చేయలేదు.

మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాత్రం నేరుగా చైనాపైనే మాటల దాడి చేశారు.

క్వాడ్‌లో భారత్, అమెరికాతోపాటు జపాన్, ఆస్ట్రేలియా సభ్యులుగా ఉన్నాయి. చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు, దానిపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు టోక్యో సమావేశంలో ఈ దేశాలు పరిష్కారాలను వెతికే పనిచేశాయి.

చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకు క్వాడ్‌ తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని ‘ఆసియా నాటో’గా విశ్లేషకులు వర్ణిస్తుంటారు.

గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ విషయమై భారత్‌లో చైనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, జయ్‌శంకర్ బహిరంగంగా చైనాను తప్పుపట్టట్లేదని విశ్లేషకులు అంటున్నారు.

క్వాడ్‌లో జయ్‌శంకర్ తీరుపై రక్షణ రంగ నిపుణుడు బ్రహ్మా చెలానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘‘జయ్‌శంకర్ చైనా పేరు ప్రస్తావించడం కాదు, కనీసం చైనా వల్ల భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పరోక్షంగా కూడా చెప్పలేదు’’ అని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

చైనా వైఖరిని బహిరంగంగా ఖండించే అవకాశం మంగళవారం మరోసారి భారత్‌కు వచ్చింది. షింజియాంగ్‌లో మానవహక్కుల పరిస్థితిపై, హాంకాంగ్‌లో జరుగుతున్న ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. 39 దేశాలు కలిసి చైనాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓ ప్రకటనను విడుదల చేశాయి.

కానీ, ఈ దేశాలతో భారత్ కలవలేదు.

క్వాడ్ సదస్సు

ఫొటో సోర్స్, EPA/Nicolas Datiche

భారత్‌తో ముడిపడిన అంశాలపైనా...

మోదీ ప్రభుత్వం చైనా వైఖరిని బహిరంగంగా ఖండించకుండా, మౌనం పాటిస్తూ వస్తోంది.

అయితే, భారత్‌తో ముడిపడిన అంశాలపైనా ప్రధాని మోదీ పెదవి విప్పకపోవడంపై విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గల్వాన్ లోయలో జూన్ 15-16 తేదీల మధ్య ఘర్షణ జరిగినప్పుడు, చైనా భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించినట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో... ‘‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదు. మన స్థావరాలేవీ వేరేవాళ్ల ఆధీనంలో లేవు’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా చైనా ఎలాంటి చొరబాట్లకూ పాల్పడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లైందని చాలా మంది విశ్లేషకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని తీరును తప్పుపట్టింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అప్పటి నుంచీ మోదీ ప్రభుత్వం చైనా గురించి నేరుగా మాట్లాడటం లేదు.

భారత రక్షణ శాఖ తమ వెబ్‌సైట్‌లోని నెలవారీ నివేదికలను తొలగించినట్లు కూడా పత్రికల్లో కథనాలు వచ్చాయి.

‘‘చైనా ఏకపక్షంగా ఉల్లంఘనకు పాల్పడినట్లుగా పేర్కొన్న నెలవారీ నివేదికను తీసినేసిన తర్వాత, 2017 నుంచీ ఉన్న నెలవారీ నివేదికలన్నింటిని కూడా రక్షణ శాఖ తొలగించింది. 2017లోని డోక్లామ్ ప్రతిష్టంభన గురించిన నివేదికలు కూడా వీటిలో ఉన్నాయి’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కథనం రాసింది.

ఈ విషయమై స్పందించేందుకు రక్షణ శాఖ నిరాకరించింది.

నిస్సహాయతా? వ్యూహమా?

ఇంతకీ చైనా విషయంలో భారత్ మౌనం వహిస్తుండటం వెనకున్న రహస్యం ఏంటి? ఇది నిస్సహాయతా? లేక దౌత్య వ్యూహమా?

చైనా విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉంటూ, విమర్శించే బాధ్యతను జూనియర్ మంత్రులకు వదిలేశారని గేట్ వే అనే మేధోమథన సంస్థకు చెందిన నిపుణుడు సమీర్ పాటిల్ అంటున్నారు.

దౌత్యపరమైన వ్యూహంలో ఇది భాగమని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలో ఒకవేళ చైనాతో చర్చలు జరపాల్సి వస్తే, ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదనే ఇలా చేస్తున్నారని అన్నారు.

ఇక దౌత్య వ్యూహాలన్నీ ‘దండోరా వేసి’ బయటకు చెప్పేవి కాదని భారత మాజీ దౌత్యవేత్త, రచయిత రాజీవ్ డోగ్రా అన్నారు.

‘‘దౌత్యనీతిలో మౌనం వహించడమే మంచిది. భారత్-చైనా సంబంధాలకు ఇది చాలా సున్నితమైన సమయం. మౌనంగా పని చేస్తూ ఉద్రిక్తతలను తగ్గించుకోగలిగితే, నేను దాన్ని దౌత్యపరమైన విజయంగానే భావిస్తా’’ అని ఆయన చెప్పారు.

భారత్, చైనా సరిహద్దు

ఫొటో సోర్స్, EPA/FAROOQ KHAN

మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు కొనసాగుతున్న చర్చలు విజయవంతమవ్వాలని చైనా కూడా కోరుకుంటోందని చైనాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ హువాంగ్ యూన్‌సోంగ్ అంటున్నారు.

‘‘అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల మాయలో భారత్ పడకుంటే, రెండు దేశాలూ కలిసి పనిచేయొచ్చు. ఆసియాలోనే కాదు, ప్రపంచంలోనే రెండు పెద్ద ఆర్థికవ్యవస్థలుగా మారొచ్చు. చైనా ఇప్పటికే ఈ దిశగా లక్ష్యానికి చేరువలో ఉంది. భారత్ కూడా ఇదే బాటలో చేరొచ్చు’’ అని ఆయన అన్నారు.

వాస్తవాధీన రేఖ వద్ద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడటంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక ఎడిటర్ రిజావుల్ హసన్ లస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికీ పరిస్థితి మెరుగపడలేదని, బలగాల ఉసంహరణ జరగలేదని... అందుకే భారత నాయకులు చైనా గురించి ప్రస్తావించకుండా ఉంటుండొచ్చని ఆయన అన్నారు.

జిన్‌పింగ్ కూడా భారత్ పేరు ఎత్తడం లేదు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలూ చేయలేదన్న విషయాన్ని సమీర్ పాటిల్ గుర్తు చేశారు.

‘‘వాస్తవాధీన రేఖను భారత్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చైనా విదేశాంగ శాఖ చాలా ప్రకటనలు చేసింది. అయితే, ఆ దేశంలోని పెద్ద నేతలు ఎవరూ ఈ తరహా ప్రకటనలు చేయలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న మాట వాస్తవం. కానీ, బంధాలు తెగిపోలేదు. రెండు దేశాలూ అధికారికంగా యుద్ధమైతే ప్రకటించుకోలేదుగా’’ అని ఆయన అన్నారు.

పుతిన్, నరేంద్ర మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Mikhail Svetlov

‘మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా?’ అన్న ప్రశ్నకు... ఈ ఏడాదైతే అలాంటి అవకాశాలు కనిపించడం లేదని సమీర్ పాటిల్ బదులిచ్చారు.

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన తర్వాత తొలిసారి నవంబర్ 17న బ్రిక్స్ సమావేశంలో మోదీ, జిన్‌పింగ్ కలవబోతున్నారు. ఇది వర్చువల్ సమావేశం.

బ్రిక్స్ సమావేశంలో భారత్, చైనాలతోపాటు రష్యా, బ్రెజిల్, ఆఫ్రికా పాల్గొంటాయి.

అయితే, ఈ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం ఉండొచ్చన్న సంకేతాలు ఇప్పటివరకూ కనిపించలేదని సమీర్ పాటిల్ అన్నారు.

ఇదివరకు డోక్లాం ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత కూడా బ్రిక్స్ సదస్సు జరిగింది. ఆ సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ సమావేశం అయ్యారు.

అందుకే, వచ్చే బ్రిక్స్ సదస్సుపై కూడా ఇప్పుడు అందరి దృష్టీ ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)