జస్టిస్ ఎన్‌వీ రమణ: వివాదాలు ఎందుకని ముఖ్యమైన కేసుల్ని పెండింగ్‌లో ఉంచారా... ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి?

ఎన్వీ రమణ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ హిందీ, న్యూఢిల్లీ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పదవీకాలం నేటితో (ఆగస్టు 26) ముగియనుంది. ఆయన కంటే ముందు ఈ పదవిలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల పదవీకాలం వివాదాలతో ముగిసింది. అలాంటి సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ఎన్వీ రమణ పగ్గాలు చేపట్టారు.

మాజీ సీజేఐలు రంజన్ గొగొయ్, శరద్ అరవింద్ బోబ్డేల హయాంలో న్యాయవర్గాల్లో సుప్రీం కోర్టు గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి.

అయితే, ఎన్వీ రమణ పదవీ కాలం వీరిద్దరి కంటే భిన్నంగా సాగింది. ఆయన వివాదాలకు దూరంగా ఉన్నారు.

తన కోర్టులో తనకు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్‌ను తానే విచారించిన రంజన్ గొగొయ్, తనను తాను నిర్దోషిగా తీర్పు వెలువరించారు. బోబ్డే కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. రమణ హయాంలో ఇలాంటి వివాదాలేం లేవు.

అయితే ప్రసంగాలు, వ్యాఖ్యల వల్లే ఎన్వీ రమణకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని, ఆయన వెలువరించిన తీర్పుల వల్ల కాదని న్యాయవర్గాల్లో చర్చ జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తోన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

మూడు రోజుల క్రితం ఆయన చేసిన ఒక ప్రసంగం కూడా వార్తల ముఖ్యాంశాల్లో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... ''ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా పని చేస్తున్నందున సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి విద్యా ఫ్యాక్టరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి'' అని అన్నారు.

సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను ఆగస్టు 24న విచారించిన ఎన్వీ రమణ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ''పదవీ విరమణ చేసిన వ్యక్తులకు దేశంలో ఎలాంటి విలువ, గౌరవం లేదు'' అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఎన్వీ రమణను మరో విషయంలో కూడా అదృష్టవంతుడిగా భావిస్తున్నారు. దీనికి కారణం కొత్తగా వచ్చిన ఒక నిబంధన. ఈ నిబంధన ప్రకారం, రిటైర్మెంట్ అయిన సీజేఐలకు ఆరు నెలల పాటు ఉచిత వసతిని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్న తొలి మాజీ సీజేఐ ఎన్వీ రమణ.

దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను భారత న్యాయశాఖ జారీ చేసింది.

గతంలో, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. ఈ చర్యను ప్రతిపక్షాలు 'అనైతికంగా' అభివర్ణించాయి. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువరించిన కారణంగానే రిటైర్ అయిన వెంటనే గొగోయ్‌కు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపించాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

అనేక పెండింగ్‌ కేసులు

అయితే, ఎన్వీ రమణ విధానాలను న్యాయ వర్గాల్లో అనేక కోణాల నుంచి పరిశీలిస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉండి, క్లీన్ రికార్డుతో పదవికి వీడ్కోలు పలకాలని ఎన్వీ రమణ కోరుకున్నారని కొంతమంది నమ్ముతారు.

మరికొందరు మాత్రం ఎన్వీ రమణ విచారించదగిన లేదా జోక్యం చేసుకోదగిన కేసులు చాలా ఉన్నాయని, అయితే ఆ కేసులన్నింటినీ ఆయన పెండింగ్‌లోనే ఉంచారని అంటారు.

ఉదాహరణకు, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశం ఆయన కోర్టు పరిధిలోకి రాకపోవచ్చని కొంతమంది న్యాయమూర్తులు చెబుతున్నారు.

కానీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసే పిటిషనర్లను శిక్షించడం మాత్రం ఎన్వీ రమణ హయాంలోనే ప్రారంభమైందని అంటున్నారు.

2019లో ఈ ఆర్టికల్‌ను తొలిగించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా సంస్థలు, అనేక మంది వ్యక్తులు సుప్రీం కోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేశారు.

సీజేఐగా ఎన్వీ రమణ పదవీకాలాన్ని సమీక్షిస్తూ జర్నలిస్టు సౌరవ్ దాస్ ఒక వెబ్ న్యూస్ పోర్టల్‌లో ఆయన గురించి రాశారు. ''చట్టం, రాజ్యాంగాన్ని ఎలా కాపాడవచ్చనే అంశంపై మాత్రమే చీఫ్ జస్టిస్ తన పదవీకాలంలో మొత్తం 29 సార్లు ప్రసంగించారు'' అని ఆయన తెలిపారు.

దేశ ప్రయోజనాలకు సంబంధించిన కనీసం ఆరు అంశాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పిటిషన్లలో ఎలాంటి పురోగతి లేదని ఆయన అధ్యయనంలో తేలింది.

వీటితో పాటు రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసిన ఇతర 53 కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నట్లు సౌరవ్ దాస్ తెలుసుకున్నారు.

ఎన్వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

పెండింగ్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు

1.పౌరసత్వ సవరణ చట్టం రద్దు

2.ఎలక్టోరల్ బాండ్ల అంశం

3.కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం కేసు

4.జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన 23 పిటిషన్లు

5.యూఏపీఏ వంటి చట్టాల రద్దు

అయితే, తన రిటైర్మెంట్‌కు నాలుగు రోజుల ముందు జస్టిస్ ఎన్వీ రమణ ఒక ప్రకటన చేశారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై నియంత్రణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ కోసం ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

సీనియర్ న్యాయవాది కామిని జైస్వాల్ మాట్లాడుతూ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీకాలంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు, ఆశ్చర్యపరిచే తీర్పులు వెలువరించి ఉండకపోవచ్చు కానీ, ఆయన చాలా ముఖ్యమైన పని చేశారని అన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

'నమ్మకాన్ని పున:స్థాపించారు'

జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం గురించి కామినీ జైస్వాల్, బీబీసీతో మాట్లాడారు. ''గత ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలం తర్వాత ప్రజలు నిరాశకు గురయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ న్యాయవ్యవస్థపై ప్రజలకు మళ్లీ నమ్మకాన్ని కలిగేలా చేశారు. తన పదవీకాలంలో ప్రజాస్వామ్య శక్తిని ప్రజలకు తెలిసేలా చేశారు. ఇది చాలా పెద్ద ఘనత'' అని అన్నారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్‌కు చెందిన జగ్‌దీప్ చోకర్ ఒక వెబ్ పోర్టల్‌తో మాట్లాడుతూ... రాజకీయ పార్టీల ఎలక్టోరల్ బాండ్లు, కార్పొరేట్ ఫండింగ్ పారదర్శకంగా ఉండేలా చూడాలంటూ గత సీజేఐ హయాంలోనే తమ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు.

ఆర్‌బీఐతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని విమర్శించిందని అన్నారు.

దీని గురించి తమ సంస్థ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిందని చెప్పారు. అయితే, ఇప్పుడు తాజా సీజేఐ పదవీకాలం కూడా ముగిసిందని, ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు.

ఎన్వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన నూతలపాటి వెంకట రమణ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పనిచేశారు.

సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే, బీబీసీతో మాట్లాడారు. ''చాలా కేసులు పెండింగ్‌లో ఉండటమనేది వేరే విషయం. కానీ, ఆయన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు ప్రయత్నించారు. సీబీఐ డైరెక్టర్ కేసులో కూడా ఒత్తిడిలో పనిచేయడానికి తానొక రబ్బరు స్టాంపును కాదని సీజేఐ అని స్పష్టం చేశారు.

కొన్ని అంశాల్లో రమణ తన అధికారాలను పూర్తిగా ఉపయోగించారు. ఆయన ఇంకా చాలా చేసి ఉండగలిగేవారు కానీ, క్లీన్ రికార్డు కోసం ఆయన పెద్దగా వాటిపై దృష్టిపెట్టలేదు. కొన్ని చాలా ముఖ్యమైన పిటిషన్లను ఆయన పెండింగ్‌లో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయనపై చాలా ఆరోపణలు చేశారు. కానీ, ఆయన సగర్వంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. జెంటిల్‌మ్యాన్‌గా మిగిలిపోయారు. ఆయన అన్నింటిపై మాట్లాడుతూనే ఉన్నారు కానీ, వివాదాలను దరి చేరనీయలేదు'' అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)