ఆసియా కప్: క్రికెట్ సమరానికి భారత్-పాకిస్తాన్ జట్లు రెడీగా ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సురేష్ మీనన్
- హోదా, స్పోర్ట్స్ రైటర్
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆసియా కప్ టోర్నమెంటులో భాగంగా.. ఈ రెండు దిగ్గజ జట్లు ఆదివారం నాడు క్రికెట్ మైదానంలో పోరాడబోతున్నాయి.
టెలివిజన్ యజమానులకు అదృష్టం కలిసొస్తే.. ఈ టోర్నమెంటులో మూడు సార్లు ముఖాముఖి తలపడనున్న భారత్ - పాక్ జట్ల మధ్య ఇది తొలి సమరమవుతుంది.
భారత్ - పాకిస్తాన్ శత్రుత్వం.. క్రీడాకారుల కన్నా ప్రేక్షకులు, అభిమానుల గుండెల్లోనే మరింత తీవ్రంగా ఉంటుంది.
క్రికెట్ మైదానంలో ఒక గెలుపు.. వైరి దేశపు రాజకీయ వ్యవస్థ లేదా మతం లేదా దేశం కన్నా.. తమది గొప్పదనటానికి రుజువని నమ్మే అభిమానుల మధ్య సోషల్ మీడియాలోనూ యుద్ధాలు జరుగుతుంటాయి.
భారత్, పాకిస్తాన్ జట్లు ఎప్పుడు తలపడినా.. రెండు ఆటలు ఉంటాయి. నైపుణ్యమున్న క్రీడాకారులతో కూడిన రెండు జట్ల మధ్య మైదానంలో పోటీ ఒకటి. మైదానానికి వెలుపల ఈ పోటీ మరోదానికి చిహ్నం: జార్జ్ ఆర్వెల్ మాటల్లో చెప్పాలంటే.. 'తుపాకుల కాల్పులు లేని యుద్ధం'.
ఈ రెండు జట్లు చివరిసారి 2021 అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ పోటీల్లో తలపడ్డాయి. ఆ పోటీల్లో భారత జట్టును పాకిస్తాన్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత జట్టులో ఏకైక ముస్లిం క్రీడాకారుడైన బౌలర్ మొహమ్మద్ షమీ మీద నిర్దాక్షిణ్యంగా ట్రోలింగ్ జరిగింది. ఆయన బౌలింగ్ గణాంకాలు 3.5 - 0 - 43 - 0 గా నమోదయ్యాయి. టీ20 ఆటలో ఇవేమీ అసాధారణ అంకెలు కాదు. కానీ నిందించటం కోసం ఓ బలిపశువు కోసం వెదికేవారికి షమీ సరిగ్గా సరిపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. భారత్ - పాక్ జట్ల మధ్య ఆదివారం జరుగబోయే ఆసియా కప్ మ్యాచ్ విషయంలో ఈసారి సోషల్ మీడియాలో వాదోపవాదాలు పెద్దగా కనిపించటం లేదు. కానీ భారత్ - పాక్ జట్ల మధ్య క్రికెట్ జట్టు.. జాతీయవాదానికి పరీక్ష అనే భావన నుంచి 'అది కూడా మరో ఆట మత్రమే' అనే భావనకు వెళ్లటానికి చాలా కాలమే పడుతుంది.
ఆదివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్.. మోకాలికి గాయమైన తన ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది లేకుండానే బరిలో దిగుతుంది. టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోటీలో అఫ్రిది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
''షహీన్‌కు గాయం కావటం భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌కు పెద్ద ఊరట...'' అని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ వకార్ యూనిస్ గత వారంలో ట్వీట్ చేశాడు.
దీనికి భారత జట్టు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ''బుమ్రా ఈ ఆసియా కప్‌లో ఆడకపోవటం ఇతర జట్లకు పెద్ద ఊరట'' అని ట్వీట్ చేశారు. భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం వల్ల ఈ పోటీల్లో ఆడటం లేదు.
ఇటీవలి కాలంలో కొందరు క్రీడాకారులు, అభిమానులు చేస్తున్న ట్వీట్లతో పోలిస్తే.. ఈ మాటలు చాలా తేలికైనవే. పరిస్థితు విసుగుపుట్టించేలా ఉందంటే అది మంచిదే. కానీ అలా ఆశించటం అత్యాశే కావచ్చు. వ్యక్తిగత, వృత్తిగత, రాజకీయ కారణాలతో అగ్గి రాజేసే క్రీడాకారులు, అభిమానులు, టెలివిజన్ అధికారులు గణనీయంగానే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ.. ఈ వాగ్వాదాలకు విరుద్ధంగా ఇరు పక్షాలకు చెందిన ప్రధాన బ్యాట్స్‌మన్ మధ్య సుహృద్భావ సంభాషణ చోటు చేసుకుంది.
భారత జట్టుకు చెందిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ గత నెలలో ఇంగ్లండ్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజాం ఆయనకు ఒక సందేశం పంపించారు: ''ఇది కూడా అధిగమిస్తావు. గట్టిగా ఉండు''.
కోహ్లీ కూడా అంతే సాదరంగా స్పందించాడు: ''థాంక్యూ. మెరుస్తూ, ఎదుగుతూ ఉండు. ఆల్ ది బెస్ట్''.
భారత్, పాకిస్తాన్ జట్లు రాజకీయ కారణాల వల్ల.. బహుళ జట్లు పాల్గొనే టోర్నమెంట్లలో మాత్రమే, అది కూడా తమ తమ దేశాలకు వెలుపల ముఖాముఖి మ్యాచ్‌లు ఆడతాయి. అందువల్ల ఈ మ్యాచ్‌లు ఉద్విగ్నభరితంగా ఉంటాయి.
సుదీర్ఘ కాలంగా పెరుగుతూ పోయే భావోద్వేగాలు.. ఈ మ్యాచ్‌ల సందర్భంగా బయటకు వచ్చే దారి దొరుకుతుంది.
అయితే అది అభిమానుల్లోనే. క్రీడాకారులు మరింత తెలివిడి ప్రదర్శిస్తారు. మ్యాచ్ వేదిక వద్ద ఇరు దేశాల క్రీడాకారులు సాదరంగా పలకరించుకుంటూ, ఒకరి కుటుంబాల బాగోగుల గురించి అడుగుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాల వీడియోలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ విడుదల చేసింది. వారికి ఇది మామూలు విషయమే.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ తొలి మ్యాచ్‌కు ముందు మామూలుగా ఉండే ఉద్విగ్నత ఈసారి కనిపించకపోవటానికి ఒక కారణం.. బహుశా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవటం వల్ల అభిమానుల దృష్టి మరలటం కావచ్చు.
భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రధాన బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ.. 2019 నవంబర్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. భారత జట్టు ఆడిన గత 24 టీ20 మ్యాచ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు.
విశ్రాంతి కోసం కొంత సమయం విరామం తీసుకున్న కోహ్లీ తిరిగి జట్టులోకి రావటంతో.. అతడి మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.
జట్టు గెలుపులో కోహ్లీ కీలక పాత్ర పోషించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇది కోహ్లీకి 100వ టీ20 ఇంటర్నేషనల్ అవుతుంది. క్రికెట్ మూడు ఫార్మట్లలోనూ 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రీడాకారుడిగా కోహ్లీ (న్యూజీలాండ్ క్రీడాకారుడు రాస్ టేలర్ తర్వాత) నిలువనున్నారు.
కోహ్లీ ఫామ్ అంశం భారతదేశంలో కీలకమైన విషయంగా మారింది. ఒక నేషనల్ మేగజీన్ ఈ అంశంపై కవర్ స్టోరీ విశ్లేషణ కూడా ప్రచురించింది. మిగతా మీడియాల్లో నిపుణులతో విశ్లేషణలు, వ్యాఖ్యానాలు రాయిస్తున్నారు. విరాట్ కోహ్లీ చివరి సెంచరీ చేసి 1,009 రోజులైందని ఒక వెబ్‌సైట్ లెక్కగట్టింది.
ఆసియా కప్‌లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చి తన బ్యాట్ ఝళిపిస్తే ఇవేవీ పనికిరావు. ఈ కథలో ఆసియా కప్ కథ, అందులో భారత్ - పాక్ జట్ల మ్యాచ్ కథ మరుగునపడ్డాయి.
శ్రీలంకలో జరగాల్సిన పదిహేనవ ఆసియా కప్ టోర్నమెంటు.. ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.
ఈ టోర్నీలో ఆరు జట్లు రెండు గ్రూపుల్లో ఆడతాయి. ఒక్కో జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడుతుంది. 'సూపర్ ఫోర్'గా నిలిచిన నాలుగు జట్లు పరస్పరం తలపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ - బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే
- వీర్యం లేదు, అండం లేదు, కృత్రిమ పిండం తయారైంది.. పైగా గుండె కొట్టుకుంటోంది
- మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
- హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










