ఆన్‌లైన్ క్లాసెస్ వినే అవకాశం లేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

ఆన్‌లైన్ పాఠాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కేరళలో 14 ఏళ్ల దళిత విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకుంది.. ఆ విద్యార్థిని మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా హఠాత్తుగా మొదలైన్ ఆన్‌లైన్ తరగతులు సమాజంపై చూపించే ప్రభావంపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.

కరోనావైరస్ కారణంగా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నాయి.

కేరళలోని మల్లాపురం జిల్లాలో ఇరుంబిలియం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాధిత బాలిక తన ఇంటికి సమీపంలోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆన్‌లైన్ పాఠాలు వినడానికి కావాల్సిన సాధన సంపత్తి తమ వద్ద లేకపోవడంతో చదువుకోలేకపోతున్నాననే ఆందోళనతో ఆమె ప్రాణాలు తీసుకుంది.

''ఆమె చాలా మంచి విద్యార్థిని. ఎనిమిది నుంచి తొమ్మిదో తరగతికి ఆమెను ప్రమోట్ చేశాం. ఆన్‌లైన్ తరగతులను ఏడు రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పాం. కానీ, ఈ ఘోరం జరిగిపోయింద''ని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీకాంత్ పెరుంపెరవిల్ 'బీబీసీ హిందీ'కి చెప్పారు.

ఆన్ లైన్ పాఠాలు

ఫొటో సోర్స్, Getty Images

బాలిక తండ్రి రోజు కూలీ. తన ఇంట్లో పాడైపోయిన టీవీనే లాక్‌డౌన్ వల్ల బాగు చేయించుకోలేకపోయానని ఆయన చెప్పారు.

ప్రభుత్వం విద్యార్థుల కోసం నిర్వహించే చానల్‌ను చూడ్డానికి తన కుమార్తెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే పరిస్థితిలో లేనని ఆయన చెప్పారు.

''ఈ ఆన్‌లైన్ తరగతులు మిస్సవుతున్నానని నా కూతురు ఆందోళన పడుతుండేది. టీచర్లు దీనికి ఏదో ఒక పరిష్కారం చూపుతారని చెప్పాను. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది'' అని ఆయన స్థానిక మీడియాతో అన్నారు.

'ఆన్‌లైన్ క్లాసులు పొందలేనివారి కోసం ప్రత్యేకంగా వేరే ఏదైనా ఏర్పాటు చేయాలని అప్పటికే మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆన్‌లైన్ క్లాసులు పొందలేని విద్యార్థులు 25 మందికిపైగా ఉంటారు'' అని ఉపాధ్యాయుడు శ్రీకాంత్ చెప్పారు.

అయితే.. దళిత యాక్టివిస్ట్ సన్నీ కప్పిక్కాడ్ 'బీబీసీ హిందీ'తో మాట్లాడుతూ.. ''ల్యాప్ టాప్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ లేకపోవడం అసలు సమస్య కాదు. సమాజంలో అణగారిన వర్గాల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇళ్లు, ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సదుపాయాలు వారికి అందాలి'' అన్నారు.

సింబాలిక్

ఫొటో సోర్స్, Getty Images

చరిత్రకారులు, సామాజికవేత్త ప్రొఫెసర్ జె.దేవిక మాట్లాడుతూ.. ''ఇది ఒక్క రోజు సమస్య కాదు. పదేపదే ఎదురయ్యే నిరాశల భారం పరాకాష్ఠకు చేరుకోవడంతో ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది'' అన్నారు.

దిగువ తరగతి వర్గాల పిల్లలు వ్యవస్థ కారణంగా ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిని ఉంటారని.. ఇంటర్నెట్, స్మార్టు ఫోన్లు లేక ఆన్ లైన్ తరగతులు వినలేక ఎక్కడ వెనుకబడతామో అన్న ఆందోళన ఆమె ప్రాణం తీసిందని దేవిక అన్నారు.

అయితే... ఆన్ లైన్ తరగతులకు మళ్లాలన్న నిర్ణయాన్ని మాత్రం దేవిక తప్పుపట్టలేదు. అమలు చేయడానికి ముందు అందరికీ అందుబాటులో ఉందా లేదా అన్నది చూసుకోవాలని సూచించారు.

అంతేకాదు.. విద్యార్థులను ఉపాధ్యాయుల గదమాయింపులు, మోరల్ పోలీసింగ్ నుంచి కూడా బయటపడేస్తుందని... వెనుకబడినవర్గాల పిల్లలు ఇలాంటి వేధింపులను ఎక్కువగా ఎదుర్కొంటుంటారని అన్నారామె.

లంచ్ బ్రేకులో తప్ప ఇంకెప్పుడూ పిల్లలకు ఆడుకోవడానికి కూడా సమయం దొరక్కపోవడాన్నీ ఆమె ప్రస్తావించారు.

అయితే.. కేరళ ప్రభుత్వం పేద పిల్లల కోసం 'నెయిబర్‌హుడ్ కంప్యూటర్ సెంటర్స్' ఏర్పాటు చేసి ఆన్‌లైన్ క్లాసులు వినే అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఆన్‌లైన్ విద్యావిధానానికి మళ్లడమనేది అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ సాగాల్సిన అంశమని దేవిక అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)