‘సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌తో చర్చలకు జగన్ సిద్ధం’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Telangana cmo
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే అందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ ఓపెన్‌గానే ఉన్నారు' అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారని ‘ఈనాడు’ కథనం వెల్లడించింది.
‘‘అలాంటి పరిస్థితి ఉందని అనుకోవడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయినట్లు ఏమీ లేదు. వారి(తెలంగాణ) మంత్రిమండలిలో మాట్లాడుకున్నారని, బయట ఏవో నాలుగు వ్యాఖ్యల్లాంటివి మాత్రమే వస్తున్నాయి' అని సజ్జల అన్నారు.
గురువారం ఆయన వైకాపా కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తుండడంపై విలేకరులు అడగ్గా... సజ్జల స్పందిస్తూ.. 'మా పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించినంతవరకు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో వీలైనంతవరకు సత్సంబంధాలు కలిగి ఉండాలి.
మన ప్రయోజనాలను కాపాడుకోవడమే మన స్టాండ్, మనం మాట్లాడే మాటల్లో సంయమనం పాటించండి. మనం మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేలా ఉండాలే తప్ప, సంబంధం లేని ఆగ్రహావేశాలు పెరగడం, ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు పెంచేలా ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ మాకు చెబుతారు.
వారు(తెలంగాణ) మాట్లాడిన మాటలకు రెండింతలు ఇక్కడ నుంచి మాట్లాడగలం. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అటువైపు(తెలంగాణ) కొన్ని శక్తులు తెలంగాణ విడిపోయాక కూడా ఇంకా ఆ పేరుమీదనే ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి.
ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించారు. అప్పుడు రాయలసీమను ఆదుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలి, నేను రెండడుగులు ముందుండి నడిపిస్తా అని చాలా ఔదార్యంతో కేసీఆర్ హామీ ఇచ్చారు.
కృష్ణా నదిలో వస్తున్న వరద తగ్గిపోయింది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసి, నిల్వ చేసుకుంటే తప్ప రాయలసీమకు మోక్షం ఉండదనీ అంగీకరించారు.
ఏపీలో ఇప్పుడు చేసుకుంటున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కేటాయింపులకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోకుండా, వరద జలాలను ఒడిసిపట్టి వాటిని నిల్వ చేసేందుకు ఉన్న వనరులను పెంచుకునేందుకు చేస్తున్నవే.
రాయలసీమ ఎడారి కాకుండా కాపాడుకునేందుకు కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టుకునేందుకు ఏపీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏర్పాట్లకు తెలంగాణ నుంచి పూర్తి సహకారం, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, ఆశీస్సులుంటాయనే ఆశిస్తున్నాం అని తెలిపార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Prashant reddy
‘అది ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే’
అడ్డగోలు నీటి తరలింపుతో తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు ఏపీ సీఎం జగన్ కుట్ర లు చేస్తున్నారని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారని ‘నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.
‘‘ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టే అని.. పనులు వెంట నే నిలిపి వేయాలని స్వయంగా కృష్ణాబోర్డు ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.
తనపై విరుచుకుపడిన ఏపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
తమ ప్రాంత ప్రయోజనాలకోసం ఏపీకి చెందిన బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే.. తెలంగాణలోని ఆ పార్టీ అధ్యక్షుడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు.
గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
వైఎస్ ఏపీకి నీళ్లు మలుపుకుపోతుంటే హారతులు పట్టిన నాయకులు కూడా తమపై విమర్శలుచేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ రాజకీయ సమాజం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు’’ అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, ANDHRAPRADESH HIGHCOURT
ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంలో ఆలస్యం ఎందుకు..?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఆలస్యం కావడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని ‘ఆంధ్రజ్యోతి’ కథనం తెలిపింది.
‘‘ప్లాంట్ల ఏర్పాటు ఎప్పటిలోగా పూర్తవుతుంది. అవి ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయి.. తదితర వివరాలు మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2021 మే నెల నుంచి ఇప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ కేసులు, ఇంజక్షన్ల కేటాయింపు, కేంద్రం వద్ద ఉన్న ఇంజక్షన్ల నిల్వలు వంటి వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఏపీలో నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యకు అనుగుణంగా ఇంజక్షన్లు సరఫరా చేయడం లేదని అభిప్రాయపడింది. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ల కోటా పెంపు అంశంపైనా వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అలాగే ప్లాంట్ల నిర్మాణంపై తాజా వివరాలు మెమో రూపంలో కోర్టుకు అందజేయాని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది. కేసుల సంఖ్య తగ్గడంతో అధికారుల్లో అలసత్వం పెరిగిందని వ్యాఖ్యానించింద’’ని ఆ కథనంలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








