‘నరేంద్ర మోదీ దక్షిణ భారత్‌ను పట్టించుకోవట్లేదు.. అందుకే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నా’ - రాహుల్ గాంధీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోలేదని, తమను నిర్లక్ష్యం చేశారన్న భావన దక్షిణ భారతంలో ఉందని.. అందుకే, దక్షిణ భారతదేశానికి అండగా నిలిచేందుకు తాను కేరళ నుంచి పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని అడగ్గా..
‘‘ప్రస్తుత ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని దక్షిణ భారతదేశంలో ఒక గట్టి భావన ఉంది. నరేంద్ర మోదీ దక్షిణ భారత దేశం పట్ల ద్వేషం ప్రదర్శిస్తున్నారు. దేశ నిర్ణయాల్లో తమను భాగం చేయట్లేదని దక్షిణ భారతదేశం భావిస్తోంది. అందుకే నేను దక్షిణ భారతదేశానికి ఒక సందేశం పంపించదల్చుకున్నాను. మేం మీతో ఉన్నాం.. నేను మీతో కలసి నిలబడతాను అని. అందుకే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నాను’’ అని రాహుల్ చెప్పారు.

‘భారతీయ మీడియా అంటే మోదీ ఎందుకు భయపడుతున్నారు?’
‘‘నరేంద్ర మోదీ భయపడుతున్నారు. నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవినీతి, దేశ భద్రత, విదేశాంగ విధానంపై నాతో చర్చకు రండి. చాలెంజ్ చేస్తున్నా నరేంద్ర మోదీకి... నాతో చర్చకు రండి. ప్రధాని మోదీ మీతో (జర్నలిస్టులతో) కూడా నేరుగా ఎందుకు మాట్లాడరు?మీరంటే ఎందుకు భయపడుతున్నారు? ప్రధానమంత్రిని ఎందుకు అడగరు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు అని ప్రధానిని ఎందుకు అడగరు? మీకూ కొంత బాధ్యత ఉంది కదా. మీరు అడగలేరు. అడిగేందుకు భయపడతారు. మీరు నన్నైతే ప్రశ్నలు అడుగుతారు.. ప్రధాని అంటే భయపడతారు. భారతీయ మీడియా అంటే ఎందుకు భయపడుతున్నారు అని ప్రధానిని అడగండి’’ అని రాహుల్ అన్నారు.
‘‘ప్రధాని బయపడతారు.. మేం ఎన్నికల్లో ఆయన్ను ఓడిస్తాం. చూడండి’’ అని ధీమా వ్యక్తం చేశారు.

‘మోదీవి అన్నీ అబద్ధాలే.. నేను నిజాలే చెబుతా’
తమ మేనిఫెస్టోలో ఒక్క అబద్ధం కూడా లేదని రాహుల్ వెల్లడించారు.
‘‘ఇప్పటికే ప్రధాని ప్రతి రోజూ చెప్పే అబద్ధాలను చూస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్పినా ప్రజల నుంచి స్పందన వస్తోంది. మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారు.. నేను నిజాలే చెబుతా.. కాబట్టి నాకు వాస్తవ సమాచారం ఇవ్వండి అని మేనిఫెస్టో కమిటీకి చెప్పాను.
మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చిన కాపలాదారుడే చోరీ చేశాడు.
మాపై విశ్వాసం ఉంచండి.. నేను అబద్ధపు హామీలు ఇవ్వను. రూ.15 లక్షలు అని చెప్పను కానీ, 3.6 లక్షలు అని చెబుతాను ఎందుకంటే ఇది వాస్తవం. బీజేపీకి సాధ్యం కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ కు మాత్రం ఇది సాధ్యమే.
అయిదేళ్లకు 3.60 లక్షల రూపాయలను దేశంలోని 20 శాతం మంది పేదలకు అందజేస్తాం.
ఈ ఎన్నికలను నిర్ణయించేది 'న్యాయ్'
25 కోట్ల మంది పేదలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుంది’’ అని రాహుల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కాంగ్రెస్ మేనిఫెస్టో: ఏపీకి ప్రత్యేక హోదా... పేదలకు ఏడాదికి రూ.72,000
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- నరేంద్ర మోదీ ప్రభావం దక్షిణ భారతంలో ఎందుకు లేదు...
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
- దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








