నేపాల్ హెచ్చరిక: 'కొన్ని భారతీయ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సురేంద్ర ఫుయాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది.
నేపాల్‌లో చైనా రాయబారి హావో యాంగ్ చీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడంపై కొన్ని భారతీయ మీడియా సంస్థలు అవహేళనకరమైన రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేశాయని నేపాల్ ఆరోపించింది.
గురువారం సాయంత్రం నుంచి నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత టెలివిజన్ చానళ్ల ప్రసారాన్ని నిలిపేశారు. "కొన్ని భారత చానళ్లలో నేపాల్ ప్రధానమంత్రి గురించి అభ్యంతరకరమైన వార్తలు ప్రసారమవుతున్నాయి" అని వారన్నారు.
మాక్స్ టివి ఆపరేటర్ కె. ధ్రువ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, "కొన్ని భారతీయ చానళ్లు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి గురించి, చైనా రాయబారి గురించి అభ్యంతరకర విషయాలను ప్రసారం చేస్తున్నాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/Denis Balibouse/File Photo
నేపాల్ ప్రభుత్వ హెచ్చరిక
భారతీయ మీడియాలో సున్నితత్వం లేకుండా అలాంటి వార్తలు ప్రసారం చేసిన వారికి వ్యతిరేకంగా కఠిన 'రాజకీయ, చట్టపరమైన' చర్యలు చేపట్టే అవకాశం ఉందని నేపాల్ ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ యువరాజ్ ఖతివడా గురువారం చెప్పారు.
తమ ప్రభుత్వం ఫ్రీ మీడియాపై నమ్మకం ఉంచుతుందని ఆయన ఒక మీడియా సమావేశంలో చెప్పారు. "ప్రభుత్వం మీడియాపై ఎలాంటి ఏ ఆంక్షలూ విధించాలని అనుకోలేదు. కానీ మీడియా క్రమశిక్షణలో ఉండాలని మేం భావిస్తున్నాం" అని తెలిపారు.
భారత మీడియాలోని ఒక భాగం నేపాల్ గురించి నెగటివ్ కవరేజ్ ఇస్తున్నాయనే సంకేతాలు ఇచ్చిన ఆయన "విదేశీ మీడియా వల్ల దేశ సౌర్వభౌమాధికారం, జాతీయ సమగ్రత, నేపాల్ ప్రజల గౌరవానికి భంగం కలగడాన్ని నేపాల్ కోరుకోవడం లేదు" అని చెప్పారు.
ఖతివాడా ప్రత్యేకంగా ఏ మీడియా సంస్థ పేరూ చెప్పకపోయినా, ఇలాంటి కవరేజ్ కొనసాగితే, దానిని నేపాల్ ప్రభుత్వం అడ్డుకోవాల్సి ఉంటుందని, వారిపై కఠిన 'రాజకీయ, దౌత్యపరమైన' చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.
"ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయ, చట్టపరమైన మార్గాలు వెతకాల్సి ఉంటుంది" అన్నారు.
నేపాల్‌లో ప్రస్తుత సంక్షోభం
నేపాల్‌లోని చైనా రాయబారి హావో యాంగ్ చీ గురువారం సాయంత్రం రాజధాని కాఠ్‌మాండూలో కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండతో సమావేశం అయ్యారు.
అధికార కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విభేదాల మధ్య, చైనా రాయబారి అంతకు ముందు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, మాజీ ప్రధాని ఝాలానాథ్ ఖనాల్, మాధవ్ కుమార్ నేపాల్ సహా పార్టీలోని మిగతా సీనియర్ నేతలతో కూడా సమావేశం అయ్యారు.
కోవిడ్-19 నుంచి బయటపడేందుకు తమ ప్రధానమంత్రి చేపడుతున్న విధానాలు, లిపులేఖ్ వివాదం తర్వాత భారత్‌తో ఉద్రిక్తంగా మారిన సంబంధాలపై అధికార పార్టీలోని స్టాండింగ్ కమిటీల సభ్యులు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీలోపల సంక్షోభం నెలకొంది.
రాజీనామా చేయడానికి ఓలీ నిరాకరించారు. కానీ, ఆ తర్వాత ఓలీ, ప్రచండ మధ్య అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రాజకీయ సంక్షోభానికి వారు ఎలాంటి పరిష్కారం గుర్తించలేకపోయారు.
హిమాలయ పర్వతాల్లో ఉన్న నేపాల్, భారత్, చైనాలు తమ సరిహద్దులు పంచుకుంటాయి. అలాంటి సమయంలో చైనా దౌత్యపరంగా నేపాల్లో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తోంది.
నేపాల్‌లో ముక్కలైన కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండేళ్ల క్రితం సరిగ్గా ఎన్నికలకు ముందు చేతులు కలిపిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిస్ట్-లెనినిస్ట్, మావోయిస్ట్ పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడంతో దాని ప్రయత్నాలు సఫలం అయ్యాయి.
కానీ గత కొన్ని రోజులుగా చైనా రాయబారి హావో యాంగ్ ఛీను భారత్‌లో అనుమాన దృష్టితో చూస్తున్నారు. మీడియాలోని ఒక వర్గం ఆమె సీనియర్ నేపాల్ నేతలను కలవడంపై జోకులు వేసింది. సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్టులు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, @PRCAMBNEPAL
భారత మీడియా గురించి ఆందోళన
ఇదంతా చూసి నేపాల్ దౌత్యవేత్తలు, సినియర్ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కవరేజీ వల్ల రెండు దేశాల సంబంధాలు, నేపాలీలు, భారతీయుల మధ్య బంధంపై ప్రభావం పడుతుందన్నారు.
నేపాల్‌కు సంబంధించిన వార్తల నెగటివ్ కవరేజ్ గురించి నేపాల్ జర్నలిస్టుల సంఘం, నేపాల్ జర్నలిస్టుల ఫెడరేషన్ గురువారం ఒక ప్రకటన జారీ చేశాయి. అందులో, ఇలాంటి రిపోర్టులను 'సంచలనాత్మక జర్నలిజానికి ఉదాహరణ'గా చెప్పాయి.
భారత మీడియా బాధ్యతాయుతంగా, నిస్పాక్షికంగా ఉండాలని కోరిన జర్నలిస్టుల సంఘాలు, సార్వత్రిక పత్రికా స్వేచ్ఛ సిద్ధాంతాలను ఎగతాళి చేయవద్దని చెప్పాయి.
"నేపాల్ ప్రభుత్వం, నేపాల్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా భారతీయ మీడియాలో వస్తున్న వార్తలు, చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. మేం వాటిని ఖండిస్తున్నాం. ఆ వార్తలు జర్నలిజం ప్రాథమిక సిద్ధాంతాలకు అనుగుణంగా లేవు" అని నేపాల్ ప్రధానమంత్రి సలహాదారు విష్ణు రిమాల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"తనకు వ్యతిరేకంగా కొన్ని భారతీయ చానళ్లలో తప్పుడు వార్తలు చూపిస్తున్నారని ప్రధాని ఓలీకి సమాచారం ఉంది" అని అటు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రెస్ అడ్వైజర్ సూర్య థాపా కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామాబాద్ హిందూ ఆలయ నిర్మాణానికి లైన్ క్లియర్
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








