ప్రభుత్వానికి ఎదురు నిలిచిన చెట్టు కథ: ఈ చెట్టును కొట్టేస్తే విపత్తులు వస్తాయని ప్రజలు గట్టిగా నమ్ముతారు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, జోసెఫ్ వరుంగు
- హోదా, బీబీసీ న్యూస్
ప్రజల అభిప్రాయాలను పెడచెవిన పెట్టడంలో ప్రభుత్వాలు ముందుంటాయి.
ప్రభుత్వాలే ఒకవేళ ప్రజల మాట వినుంటే.. రాజధాని వీధుల్లో నిరసనలు, ప్రదర్శనలు, ఘర్షణలు, హింస ఉండవు. ప్రజల నోరు నొక్కేయడానికి బలప్రయోగమూ చేయాల్సిన అవసరం ఉండదు.
కెన్యాలో కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏకరువు పెడుతున్నారు. రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని వారు నిరసనలు చేపడుతున్నారు.
పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంపుతోపాటు మరిన్ని పదవులు సృష్టించాలని, అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరుతున్నారు.
అధికార పార్టీతోపాటు విపక్షాల్లోని కొందరు రాజకీయ నాయకులు కూడా ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు ఇస్తున్నారు. అయితే, భారీగా నిరసనలు చేపడుతున్న ప్రజల డిమాండ్లను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరైతే మాస్కులు లేకుండా నిరసనలకు వస్తున్నారు.
కెన్యాలో కరోనావైరస్ పరిస్థితులు మరింత దిగజారడానికి ఇదే కారణమని వార్తలు కూడా వస్తున్నాయి. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం కేసులు ఇక్కడ బాగా పెరుగుతున్నాయి.
ఇంతమంది చెబుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఒక చెట్టు చెప్పిన మాట వినడం ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఫొటో సోర్స్, AFP
మామూలు చెట్టు కాదు..
ఇది వందేళ్లనాటి అత్తిపండు చెట్టు. కెన్యా రాజధాని నైరోబీలోని వేయంకీ మార్గంలో ఇది కనిపిస్తుంది. ఈ మార్గాన్ని ఎక్స్‌ప్రెస్ మార్గంగా మార్చేందుకు చెట్టును కొట్టేయాలని అధికారులు తీర్మానించారు.
27 కి.మీ. పొడవైన ఈ రోడ్డు జోమో కెన్యట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, పశ్చిమ నైరోబీలోని ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గం గుండానే పశ్చిమ కెన్యా, ఉగాండాలకు వెళ్లాలి.
ఈ చెట్టును కొట్టేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు ఎందుకు మనసు మార్చుకున్నారో స్పష్టంగా తెలియదు.
కెన్యా సంస్కృతి, వారసత్వ సంప్రదాయాలకు ఈ చెట్టు నిదర్శనమని ఆయన చెప్పారు.
బంటు భాషలో మాట్లాడే తెగలు ఈ చెట్టును దైవంతో సమానంగా కొలుస్తారు.
పశ్చిమ కెన్యాలోని లుహ్య జాతి ప్రజలు ఈ చెట్టును చాలా ఆరాధిస్తారు. ఒకప్పుడు ఈ చెట్టు కిందే గ్రామ పెద్దలు తీర్పులు ఇచ్చేవారు.

ఫొటో సోర్స్, AFP
అధికార బదిలీకి సంకేతం
సెంట్రల్ కెన్యాలోని అతిపెద్ద జాతి అయిన కికుయు ప్రజలు ఈ అత్తి చెట్టును పూజించడంతోపాటు ఇక్కడ బలిదానాలు కూడా చేస్తారు.
ఈ చెట్లను కొట్టివేయడానికి కికుయు ప్రజలు అసలు ఒప్పుకోరు. దీన్ని నరికితే విపత్తులు వస్తాయని వారు బలంగా నమ్ముతారు.
ఒకవేళ ఈ చెట్టు దానికదే పడిపోయిందంటే.. చెడు సంకేతంగా భావిస్తారు. ఒక తరం నుంచి మరొక తరానికి అధికారం మారుతుందనడానికి దీన్ని సంకేతంగా చెబుతారు. ఒక్కో తరం 30ఏళ్లు అధికారంలో ఉంటుందని వారు విశ్వసిస్తారు.
కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా కూడా కికుయు జాతికి చెందినవారే. ఆయన రాజకీయ ప్రస్థానంలో కెన్యా వాసులు చాలా చెడు వార్తలు వినాల్సి వచ్చింది. అయితే, ఈ చెట్టును కొట్టేస్తే.. విపత్తులు వస్తాయనే వాదనను ఆయన నమ్ముతారో లేదో మనకు తెలియదు.

ఫొటో సోర్స్, Geofrey Angote
ఈ చెట్టును కొట్టేయొద్దని చాలామంది పర్యావరణ వేత్తలు ప్రచారం చేపట్టారు. మరోవైపు కికుయు సంప్రదాయవాదులు మాత్రం.. చెట్టును కొట్టేస్తే తమ సంస్కృతీ సంప్రదాయాలను దెబ్బతీయడమేనని చెప్పుకొచ్చారు.
మొండిగా ముందుకు వెళ్లే ప్రభుత్వ చర్యలను ప్రజలు అడ్డుకోవడం ఇదేమీ ఇక్కడ తొలిసారి కాదు.
1980ల్లో అప్పటి అధికార పార్టీ కెన్యా ఆఫ్రికన్ నేషనల్ యూనియన్.. నైరోబీలోని ఉహురు పార్క్‌లో భారీ ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
60 అంతస్తుల్లో భారీగా షాపింగ్ మాల్స్, పార్కింగ్ ప్రాంగణాలు, కార్యాలయాలు నిర్మించాలని భావించింది.
అయితే, ఈ పార్క్‌ను కాపాడాలంటూ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రొఫెసర్ వాంగెరి మాథాయ్ సహా పలువురు పర్యావరణవేత్తలు ఉద్యమించారు.
చివరికి అప్పటి అధ్యక్షుడు డేనియేల్ అరాప్ మొయి.. ఉహురు పార్క్‌లోని చెట్ల మాటే విన్నారు.
భారీ భవన నిర్మాణ ప్రణాళికలను ఆయన రద్దుచేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతం మొత్తం పచ్చగా కళకళలాడుతుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం వేయంకీ మార్గంలోని వందేళ్ల చెట్టు కూడా అలానే విజయం సాధించింది.
గతవారం నేను ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు.. కొందరు ఇంజినీర్లు ఇక్కడ సొరంగ మార్గం ఏర్పాటుకు సన్నద్ధం అవుతూ కనిపించారు.
‘‘అధ్యక్షుడి ఆదేశం తర్వాత.. ఒక చైనా కాంట్రాక్టరు వచ్చి చెట్టువైపే అలానే చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తల ఊపుకుంటూ వెళ్లిపోయాడు’’ అని ఒక ట్యాక్సీ డ్రైవర్ తెలిపారు.
బహుశా ఈ చెట్టు అధ్యక్షుడితో ఏం మాట్లాడిందోనని చైనా కాంట్రాక్టరు ఆలోచిస్తూ ఉండొచ్చు.
చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ మార్గం నుంచి తనను తాను రక్షించుకోవడంలో ఈ చెట్టు విజయం సాధించింది.
మిగతా చెట్లు కూడా ఇలానే ముందుకు వచ్చి సంకుచిత రాజకీయ ఉద్దేశాలకు ఎదురు నిలవాలని చాలా మంది కెన్యన్లు కోరుకుంటున్నారు.
మరి ప్రభుత్వం ఆ చెట్ల మాట వినేందుకు సిద్ధంగా ఉందా?
ఇవి కూడా చదవండి
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- మోదీ కోటి ఉద్యోగాల హామీ నిజమా? అబద్ధమా? BBC REALITYCHECK
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- ఐర్లండ్ పార్లమెంటులో అండర్ వేర్ ప్రదర్శించిన ఎంపీ... ఎందుకంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








