ఇండియన్ బ్యూరోక్రసీ: ఇక్కడ బాత్‌రూం టవల్ కూడా అధికారి ప్రతిష్టను పెంచుతుందా?

దిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

భారతదేశంలో ఓ సగటు ఉన్నతాధికారి ఎలా ఉండాలనుకుంటారు? ఏం కోరుకుంటాడు ? ఏ అంశాన్ని తన విధి నిర్వహణలో గర్వించే విషయంగా భావిస్తారు?

బాధ్యతలను పొల్లు పోకుండా నిర్వర్తించడం, అవినీతికి అక్రమాలు, నిర్లక్ష్యం, నిర్లిప్తతలకు దూరంగా ఉండటం...ఇలాంటివి ఆ జాబితాలో ఉంటాయా? ఎంత మాత్రం కాదు.

ప్రత్యేక డిజైన్ చేసిన టవల్స్, అవసరమైనప్పుడు ఎత్తు పెంచుకునే, తగ్గించుకునే కుర్చీలు, నిత్యం తన దగ్గరికి వచ్చి పర్మిషన్లు అడిగే కింది ఉద్యోగులు, సమయ పాలన మీద అలుపులేని ఉపన్యాసాలు...ఓ భారతీయ ఉన్నతాధికారి ఆలోచనలు వీటి చుట్టూ తిరుగుతుంటాయట.

ప్రముఖ ఆర్ధికవేత్త, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసేన ఓ సీనియర్ అధికారి, మూడేళ్ల పాటు భారతీయ కార్యాలయంలో పని చేసినప్పుడు గమనించిన అంశాలివి.

2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పిలుపు మేరకు కార్నెల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవిని వదిలి పెట్టి ప్రభుత్వానికి ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన కౌశిక్ బసు తన అనుభవాలను వెల్లడించారు.

ఆయన రాసిన 'పాలసీ మేకర్స్ జర్నల్' అనే పుస్తకంలో భారతీయ బ్యూరోక్రసీ పనితీరు, అందులో పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించారు.

కౌశిక్ బసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కౌశిక్ బసు

ఎస్..సర్!

ఉన్నత స్థాయి సమావేశాల్లో అధికారులు అత్యధికసార్లు ఉపయోగించే పదం ఎస్..సర్.

ఓ మంత్రి హాజరైన సమావేశంలో ఒక సీనియర్ అధికారిణి ఎన్నిసార్లు సర్ అనే మాటను వాడారో సరదాగా లెక్కించినట్లు కౌశిక్‌ వెల్లడించారు. నిమిషంలో 16 సార్లు ఆ అధికారిణి సర్ అనే పదం వాడినట్లు కౌశిక్ బసు గుర్తించారు.

సదరు అధికారిణి సర్ అనే మాట వాడటానికి అర సెకన్ టైమ్ తీసుకుందని భావించినా, ఆమె ఆ సమావేశంలో మాట్లాడిన దాంట్లో 13శాతం సమయాన్ని సర్ అనడానికే వినియోగించినట్లు బసు గుర్తించారు.

అన్నిటికి పర్మిషన్లు

''నా అనుమతి లేకుండా నన్నెవరు బాధ పెట్టలేరు'' అని గాంధీ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కానీ, భారతీయ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న విషయానికి పర్మిషన్లు అవసరమని కౌశిక్ బసు అన్నారు.

''భారతీయ అధికారుల్లో పర్మిషన్ ఇచ్చే అధికార స్థాయిలు పిరమిడ్ రూపంలో ఉంటాయని, ఆ అనుమతి ఇచ్చే చివరి వ్యక్తి సహజంగా మంత్రి అయ్యుంటారని బసు వెల్లడించారు.

ప్రతి చిన్న విషయానికి అంటే, తన బంధువుల్లో ఎవరికైనా బాగా లేక సెలవు పెట్టడం దగ్గర్నుంచి, మంత్రి కార్యాలయంలో సరఫరా చేసే కాఫీ బ్రాండ్ మార్చడం వరకు అన్నీ పర్మిషన్ల మీదే నడుస్తాయట.

''ఇలాంటి పర్మిషన్, ప్రపోజల్ లెటర్లు కార్డ్ బోర్డు అట్టల మీద తాళ్లతో కట్టి, ఒక గది నుంచి మరో గదికి అధికారుల సంతకాలు, అనుమతుల కోసం తిరుగుతూ ఉంటాయి'' అని ప్రొఫెసర్ బసు తన పుస్తకంలో రాశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో సరైన సదుపాయాలు లేని ఓ ప్రభుత్వ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో సరైన సదుపాయాలు లేని ఓ ప్రభుత్వ కార్యాలయం

తలుపు తట్టరాదు

ఈ అధికార సామ్రాజ్యంలో తలుపు తట్టడం అనేది పెద్ద తప్పుగా, అదో అమర్యాదకరమైన చర్యగా భావిస్తారని బసు అన్నారు.

''ఒక కార్యాలయంలోకి నేరుగా ప్రవేశించే అధికారం ఉన్నవారు, లేనివారు కూడా తలుపు తట్ట కూడదు'' అన్నారాయన. అధికారం ఉంటే నేరుగా లోపలికి వెళ్లిపోవడమేనని తెలిపారు.

''ఈ సంప్రదాయానికి అలవాటు పడేందుకు నాకు కొంత సమయం పట్టింది. పశ్చిమ దేశాలు ఎవరి ఆఫీసులోపలికైనా వెళ్లే ముందు తలుపు తట్టడం తప్పని సరి'' అన్నారు బసు.

ఆలస్యం పెద్ద నేరం

ఆర్ధిక శాఖలో పని చేసే అధికారులు తమ ఫైళ్లకు నిత్యం రెండు పేజీలు జత చేస్తుంటారని, వాటి మీద ఓ 44 పదాలు కామన్‌గా రాసి ఉంటాయని కౌశిక్ బసు వెల్లడించారు.

అయితే, వారిలో ఎందరు ఆ పదాలలోని అర్ధాన్ని ఆచరణలో చూపిస్తారో తెలియదని ఆయన అన్నారు.

ఆ పదాలలో కొన్ని ఇవి:

  • త్వరగా చర్యలు తీసుకోవాలి
  • ఆలస్యాన్ని సహించేది లేదు.
  • ఆలస్యం జరగకుండా చూడాలి
  • ఆలస్యానికి వివరణ ఇవ్వాలి
  • సమాధానం నేడు/ఇప్పుడు/వెంటనే ఇవ్వాలి
  • ఇవాళే విడుదల చేయాలి

ఇలాంటి పదాలు ఆ పేజీలలో ఉంటాయి.

''ఇన్ని హెచ్చరికలు కనిపిస్తున్నా పనుల్లో మాత్రం సమయ పాలన కనిపించదు. అయితే, 10-15 సంవత్సరాల కిందటితో పోలిస్తే ఇప్పుడు సమయపాలన కాస్త మెరుగ్గా ఉంది'' అన్నారు ప్రొఫెసర్ బసు.

భారతీయ కార్యాలయాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా అనుమతులు తీసుకోవాలి.
ఫొటో క్యాప్షన్, భారతీయ కార్యాలయాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా అనుమతులు తీసుకోవాలి.

మంచి కుర్చీ ఉందా?

అధికారిక సమావేశాల్లో మన పదవి, స్థాయి కీలకం అవుతాయి. మన కుర్చీ ఎంత ఎత్తులో ఉంటే మన భావాలు, స్థాయి అంత ఉన్నతంగా ఉన్నట్లు ఇక్కడి ఉద్యోగులు భావిస్తారని ప్రొఫెసర్ బసు కనిపెట్టారు.

''మిగతా వాటికన్నా కాస్త ఎత్తుగ్గా ఉన్న కుర్చీలో కూర్చుంటే, సమావేశాల్లో కొంత లాభదాయకంగా ఉంటుంది''అన్నారాయన.

"భారత దేశంలోని చాలా ఆఫీసుల్లో కుర్చీలకు కుడివైపు కిందన చిన్న మీటల్లాంటివి ఉంటాయి. వాటిని కొంచెం కొంచెం నొక్కితే కుర్చీ ఎత్తు పెరుగుతుంది. వాటిని మెల్లగా నొక్కాలి. లేదంటే ఒక్కసారిగా కుర్చీ పైకి లేస్తుంది, నవ్వుల పాలవుతాం" అన్నారు బసు

"మెల్లగా కుర్చీ ఎత్తు పెంచితే మీ స్థాయి కూడా పెరిగిన భావన వస్తుంది. అయితే, అందరూ అదే పని చేస్తే మాత్రం ఫలితం ఉండదు. అందరి కాళ్లూ వేలాడుతూ కనిపిస్తాయి అంతే..."అని ప్రొఫెసర్ బసు వివరించారు.

కొన్ని కార్యాలయాల్లో ఉన్నతాధికారులకు బాత్రూంలో ప్రత్యేకంగా టవల్స్ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టవల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

టవల్ సమస్య

ప్రొఫెసర్ బసు మంత్రిత్వ శాఖలో చేరిన తరువాత ఆయన సిబ్బంది ఎదుర్కొన్న తొలి ఇబ్బందులో బాత్రూం సమస్య ఒకటి.

మొదటి అంతస్తులో చాలా శుభ్రంగా ఉండే పెద్ద బాత్రూం ఒకటి ఉంటుంది. కానీ, దాన్ని వాడుకునే హక్కుపై స్థాయి సెక్రటరీలకు మాత్రమే ఉంది.

''ఇందులో మూడు టవళ్లు (తువ్వాలు) ఉంటాయి. వాటిపై ఫైనాన్స్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఎక్స్‌పెండిచర్ సెక్రెటరీ అని రాసి ఉంటుంది'' అని వివరించారు బసు.

అయితే, ఈ బాత్రూంను వాడుకునే అవకాశం నాకు కూడా ఇవ్వాల్సిందేనని తన సిబ్బంది పట్టుబట్టినట్లు ప్రొఫెసర్ బసు వెల్లడించారు.

'' దాన్ని వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ, నేను వాళ్లకు ఒక్కటే చెప్పాను. ''ఓ పక్క ధరల పెరుగుదల, బడ్జెట్ లోటు గురించి చర్చలు జరుగుతుంటే, మధ్యలో నాకు ఆ బాత్రూం కావాలని అని ఆర్థిక మంత్రికి అభ్యర్థన పెట్టుకోవడం ఏం బాగుంటుంది'' అని అన్నట్లు బసు వెల్లడించారు.

కానీ, సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. ఆ బాత్రూం గురించి పోరాటం కొనసాగించారు. చివరకు, ప్రొఫసర్ బసుకు ఆ పెద్ద బాత్రూం వాడుకునే అధికారం దక్కింది.

"తరువాత, అక్కడ కొత్త ర్యాక్, నాలుగో తువ్వాలు కనిపించింది. దానిపై సీఈఏ (చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్) అని రాసి ఉండడం చూసి ఆశ్చర్యపోయా" అని బసు వెల్లడించారు.

ఎక్కడివి ఈ అలవాట్లు

ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 రిపోర్ట్ ప్రకారం 190 దేశాల లిస్టులో భారత్ 63వ స్థానంలో ఉందని, దేశంలోని చాలా కార్యాలయాలు పాతకాలపు పద్ధతుల్లో పని చేస్తుంటాయని బసు అన్నారు.

ఇదంతా బ్రిటీష్ పాలన నుంచి వారసత్వంగా వచ్చిందని మీరు అనుకుంటున్నారా అని నేను బసును అడిగాను. అందుకాయన అవునన్నారు. ''కచ్చితంగా ఇవన్నీ వలస పాలకుల నుంచి వచ్చిన విధానాలే'' అన్నారు బసు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)