జాతిరత్నాలు - సినిమా రివ్యూ: మందు, సిగరెట్, గొడవలు... ముగ్గురూ ముగ్గురే

ఫొటో సోర్స్, fariaabdullah/instagram
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
వినూత్నమైన పోస్టర్లు, సరికొత్త టైటిల్, విభిన్నంగా ఉన్న ట్రైలర్‌తో ఈ మధ్య ప్రేక్షకుల ఆసక్తిని చూరగొన్న సినిమా 'జాతిరత్నాలు'.
'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాలో నటనతో యువతను మెప్పించిన నవీన్ పొలిశెట్టితో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించడం మంచి కాంబినేషన్ అనిపిస్తుంది.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "జాతి రత్నాలు"సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం.
జోగిపేట అనే గ్రామంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా మొదలయ్యే కథ ఇది. శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి) అనే కుర్రాడు లేడీస్ ఎంపోరియం ఓనర్(తనికెళ్ళ భరణి) కొడుకు. కొడుకును లేడీస్ ఎంపోరియంలో కూర్చోబెట్టాలన్నది తండ్రి చిరకాల కోరిక. లేడీస్ ఎంపోరియంతో సంబంధం లేకుండా బతకాలన్నది కొడుకు బలమైన కోరిక. జీవితంలో ఎలాంటి టార్గెట్లు లేని హీరోకు మరో ఇద్దరు స్నేహితులు (ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ). ముగ్గురు ఒకేలాంటి మనస్తత్వం గలవారు. బలాదూర్ తిరుగుళ్లు, మద్యం, గొడవలు... వీళ్లంటే గ్రామంలో ఒక్కరికీ మంచి అభిప్రాయం ఉండదు.

ఫొటో సోర్స్, fariaabdullah/instagram
ఎలాగైనా హైదరాబాద్ వెళ్లి ఉద్యోగంలో చేరి అందరితో సైబరాబాద్ శ్రీకాంత్ అనిపించుకోవాలని హైదరాబాద్ వచ్చిన ఆ యువకులకు చిట్టి అలియాస్ షామిలి (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది.
తొలిచూపులోనే చిట్టి ప్రేమలో పడతాడు శ్రీకాంత్. అలా ఊరు నుంచి ఉద్యోగం కోసం పసుపుపచ్చ కారు, పెట్టేబేడా.. తోడుగా ఓ బుట్టతో బయలుదేరిన యువకులు ఎమ్మెల్యే చాణక్య(మురళీ శర్మ)పై మర్డర్ అటెంప్ట్ కేసులో ఎందుకు ఇరుక్కుంటారు? ఆ కేసు నుంచి ఎలా బయట పడతారు? చిట్టితో శ్రీకాంత్ ప్రేమ చివరకు ఏమవుతుందనేది తెరపై చూడాల్సిందే..

ఫొటో సోర్స్, facebook/naveenpolishetty
సినిమా రిలీజ్‌కి ముందు హైప్ చేసినంత కాకపోయినా ఫరవాలేదనిపిస్తుంది. దర్శకుడు తాను ఎంచుకున్న మార్గంలో సినిమాను తెరకెక్కించగలిగాడనే చెప్పాలి. వినోదం పంచడమే సినిమా ప్రధాన ఉద్దేశం కాబట్టి ఒక్క సీన్లో కూడా సీరియస్‌నెస్ లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఎమోషన్స్ నడిపించగల సందర్భాలలో కూడా హ్యూమర్‌తోనే నడిపించడం బాగనిపిస్తుంది. ట్రైలర్, పోస్టర్లతో ముందుగానే ప్రేక్షకులకు సినిమా మెయిన్ థీమ్ ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ప్రేక్షకులు కూడా సినిమాకు కనెక్ట్ అవుతారు.
ప్రథమార్థంలో జోగిపేటలో జరిగే కథంతా సీన్ బై సీన్ నవ్వులు పండిస్తూ సాగిపోతుంది. అయితే ద్వితీయార్థంలో ఆ ఫ్లో తగ్గి కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ వచ్చినప్పటికీ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్స్‌తో లాక్కొచ్చారు.అయితే సినిమా ఎక్కడో మొదలై మరెక్కడో ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

ఫొటో సోర్స్, facebook/naveenpolishetty
కొన్నిసార్లు ఆటో పంచ్‌లు విసుగు తెప్పించక మానవు. కాకపోతే డైరెక్టర్ ఎంచుకున్న టెంపో కంటిన్యుటీ కోసం అనిపిస్తుంది.
చాలాచోట్ల సీన్ కి సీన్ మధ్య ఉన్న లింక్ కూడా తెగిపోయినట్లుగా అనిపిస్తుంది. అది ఎడిటింగ్ లోపమని చెప్పవచ్చు.
మరీ సెకండాఫ్‌లో అయితే ఏ ముక్కకు ఆ ముక్క అతికించినట్లుగా, సీరియస్‌గా సాగాల్సిన సీన్లు కూడా ఇంత సిల్లీగా నడిపించేస్తున్నారు ఏమిటో అనిపిస్తుంది.
కాకపోతే వీటన్నింటితో పెద్దగా సంబంధం లేని ప్రేక్షకులకు, వెగటుపుట్టించని హాస్యం కనుక కుటుంబ సమేతంగా ఒకసారి చూడదగిన సినిమా.
దర్శకుడు తాను అనుకున్న లైన్ ను కథగా మలిచి,తెరపై చూపడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఫొటో సోర్స్, facebook/priyadarshi
ముఖ్యంగా కొన్ని సార్లు మినహాయిస్తే పంచ్ డైలాగులు, మాటలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు. కథకు అనుగుణంగా నటీనటులను ఎంచుకోవడం, ఎక్కడా హ్యూమర్ సెన్స్ మిస్సవ్వకుండా జాగ్రత్త పడడం బాగుంది.
ఎక్కడా సినిమా పరిధిని మించిన భావోద్వేగాలను వ్యక్తపరచకపోవడమే సినిమా ప్రధానమైన బలం. తరువాత చెప్పుకోవాల్సింది రథన్ మ్యూజిక్. కొత్త తరహాలో సాగే పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను సినిమాలో మరింత లీనమయ్యేలా చేస్తాయి. సిద్దం మనోహర్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. అన్నింట్లోకి పెద్ద లోపం ఎడిటింగ్. ఎక్కడా కట్ చేయాలో అక్కడ వదిలేసి ఎక్కడ పెంచాలో అక్కడ కట్ చేసినట్లుగా అనిపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే... నవీన్ పొలిశెట్టి హ్యూమర్‌తో బాగా మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ బాగుంది. నెమ్మదిగా యంగ్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకోగలిగాడని చెప్పవచ్చు.
నవీన్ పొలిశెట్టి హవాను తట్టుకుని నిలబడి కనబడిన నటుడు రాహుల్ రామకృష్ణ. రవి పాత్రలో తాగుబోతుగా చాలా బాగా నటించాడు.
ప్రియదర్శి తనదైన కామెడీ ట్రాక్‌లో ఫర్వాలేదనిపిస్తాడు. కొత్త నటి ఫరియా అబ్దుల్లా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది.
మురళీ శర్మ తనదైన ఈజ్‌తో మెప్పిస్తాడు. బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, నరేష్, తనికెళ్ళ భరణీ... కాస్టింగ్ అంతా సినిమాకు అనుగుణంగా సరిపోయింది.
అతిథి పాత్రలలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ ఒక్కసారి మెరిసి మాయమవుతారు.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- హాథ్రస్: అమ్మాయిని వేధించి జైలుకెళ్లారు.. తిరిగొచ్చాక ఆమె తండ్రి ప్రాణం తీశారు - గ్రౌండ్ రిపోర్ట్
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









