సీఏఏ నిరసనలు: షాహీన్ బాగ్ ధర్నా ప్రదేశాన్ని ఖాళీ చేయించిన పోలీసులు... నిరసన స్ఫూర్తి కొనసాగుతుందన్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, న్యూదిల్లీ
పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా 101 రోజుల పాటు నిరసనలు కొనసాగిన ప్రాంతం మంగళవారం ఖాళీగా కనిపించింది.
మహిళలు డిసెంబర్ 15 నుంచి మూసివేసిన ఆ మార్గం ఇప్పుడు తెరుచుకుంది. షాహీన్‌బాగ్ ధర్నా ప్రాంతాన్ని ఈ ఉదయం ఖాళీ చేయించారు.
మెహరున్నీసా అనే మహిళ సోనియా విహార్‌లోని తన ఇంటికి తాళం వేసి, ఒక క్యాంటీన్‌లో తన ఉద్యోగం వదిలేసి ఇక్కడ నిరసనలో పాల్గొన్నారు. చాలా వారాలుగా నిరాహార దీక్ష చేసిన మెహరున్నీసా ఇప్పుడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోతూ కనిపించింది. ఇరుకైన ఒక గల్లీలోకి వెళ్లి అదృశ్యమైంది.
సోమవారం రాత్రి పోలీసులు ఇక్కడికి వచ్చారు. ధర్నా చేస్తున్న వారిని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం ఆపేయాలని చెప్పారు. కానీ, మహిళలు తిరస్కరించారు.

కొన్ని గంటల్లో అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. ముస్లిం మహిళల ఆందోళనను సూచించే చిహ్నాలన్నింటినీ తొలగించారు. పగులగొట్టారు. తరలించారు. వ్యర్థాలతో పెద్దగా తయారు చేసి నిలబెట్టిన భారతదేశ చిత్రాన్నిముక్కలు చేశారు. ఇండియా గేట్ ప్రతిబింబాన్ని లాక్కెళ్లిపోయారు. టెంటును కూల్చివేశారు. ఇక్కడ ధర్నా చేస్తున్న మహిళలను సూచిస్తూ సృజనాత్మకంగా ఏర్పాటు చేసిన చెప్పులను ఐదు ట్రక్కుల్లోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు.
దిల్లీలో లాక్‌డౌన్ విధించినందున షాహీన్ బాగ్‌ను ఖాళీ చేయాలని నిరసనలోని జనానికి విజ్ఞప్తి చేసినట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. కానీ వారు తిరస్కరించారని.. ఆంక్షలు అమలులో ఉన్నపుడు సమావేశం కావటం చట్టవ్యతిరేకమైనందున వారిపై చర్యలు చేపట్టామని తెలిపారు. ధర్నా ప్రాంతాన్ని ఖాళీ చేయించామని, కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నిరసనకారులు చెప్పారు. వారిని సాయంత్రానికి విడుదల చేస్తారని చెప్పారు.

ఫొటో సోర్స్, EMAD KAZI
పోలీసుల అదుపులో ఉన్న వారిలో మరియం ఖాన్ (36) కూడా ఉన్నారు. ఇక్కడ ఆందోళన మొదలైనప్పటి నుంచీ ముందువరుసలో ఉన్న మరియం ఆదివారం నాడు బీబీసీతో మాట్లాడుతూ, చట్టపరిధిలో తమ నిరసనను కొనసాగిస్తామని, సోమవారం నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే ధర్నాలో కూర్చుంటారని చెప్పారు. ఆ అయిదుగురు కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు ధరించి, ధర్నా ప్రాంతంలో దూరదూరంగా కూర్చుంటారని చెప్పారు.
కరోనావైరస్ విజృంభించకుండా నివారించే లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఆదివారం సాయంత్రం దేశంలోని చాలా జిల్లాల్లో సెక్షన్ 144 అమలును ప్రకటించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ షహీన్ బాగ్‌లో మహిళలు చేపట్టిన నిరసన మీద జనతా కర్ఫ్యూ రోజున గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఇటువంటి హింసాత్మక సంఘటనలు ఇంతకుముందూ జరిగాయి. అయినా కూడా ఈ ధర్నా 100 రోజుల మైలురాయి దాటింది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షహీన్ బాగ్‌లో సామూహిక ధర్నా ప్రమాదకరమని, దానిని తొలగించాలని న్యాయవాది అమిత్ సాహ్నీ తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇక్కడ ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరపటానికి, హైవేకు అవరోధంగా లేకుండా ధర్నా ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశానికి తరలించాలని ఆందోళనకారులను ఒత్తిడి చేయటానికి సుప్రీంకోర్టు ఇంతకుముందు మధ్యవర్తులను పంపించింది.
పోలీసులు మంగళవారం ఉదయం 7 గంటలకు నిరసన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ధర్నా చేస్తున్న వారిని ''బలప్రయోగం''తో తొలగించామని పోలీసులు స్వయంగా వార్తా చానళ్లకు చెప్పారు.
దిల్లీలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి లాక్‌డౌన్ మొదలైంది. కేవలం అత్యవసర సేవలు అందించే వారు మాత్రమే నగరంలో సంచరించటానికి అనుమతి ఉంటుంది. నగరమంతటా సెక్షన్ 144 విధించారు. దీనిప్రకారం నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటానికి వీలులేదు.

ఫొటో సోర్స్, ANI
ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు చేపడతారు. ''జామియా, షాహీన్ బాగ్, ఇతర ప్రాంతాల్లో నిరసన ప్రదేశాలను ఖాళీ చేయిస్తున్నపుడు మాకు స్వల్ప ఆటంకాలు ఎదురయ్యాయి.. కొంతమందిని అరెస్ట్ చేశాం. కానీ ప్రజల నుంచి ప్రతిఘటన లేదు.. అది సంతోషకరమైన విషయం'' అని దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ ఏఎన్ఐ వార్తా సంస్థకు వివరించారు.
షాహీన్ బాగ్ ప్రదేశాన్ని ఖాళీ చేయించిన పోలీసులకు స్థానికులు కొందరు పువ్వులు అందిస్తున్న దృశ్యాలు ఏఎన్ఐ వార్తా సంస్థ ఫొటోల్లో కనిపించాయి.
అయితే, కోవిడ్-19 కన్నా పౌరసత్వ సవరణ చట్టం మరింత ప్రమాదకరమని మరియం అంటున్నారు.
ఆ మహమ్మారి ప్రాణాంతకమైనదని తనకు తెలుసునని.. కానీ పౌరసత్వం అంశం కూడా ప్రాణాంతకమైన విషయమేనని ఆమె అభివర్ణించారు.
ఈ నిరసన ముగిసిన తీరు విచారకరమే అయినా.. తమ నిరసన స్ఫూర్తి కొనసాగుతుందని ఈ ధర్నాలో మొదటి రోజు నుంచీ పాల్గొన్న షాహీన్ కౌసర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

నిరసనకారులు తమ ధర్నాను కొంత కాలం పాటు నిలిపివేయాలని కొద్ది రోజులుగా చర్చించుకుంటున్నారు. దిల్లీ ప్రభుత్వం 50 మంది కన్నా ఎక్కువ మంది సమావేశం కారాదని నిషేధించటంతో, ధర్నాలో పాల్గొనే వారి సంఖ్యను 45 మందికి పరిమితం చేస్తూ గత వారంలోనే వీరు నిర్ణయం తీసుకున్నారు.
ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ రోజున కూడా.. కేవలం నలుగురు మాత్రమే ధర్నాలో పాల్గొనగా మిగతా మహిళల హాజరుకు చిహ్నంగా వారి చెప్పులను ప్రదర్శించారు.
సోమవారం సాయంత్రం తాను ధర్నా స్థలానికి వెళ్లానని.. ధర్నాను నిలిపివేయాలా వద్దా అనే అంశంపై చర్చించి ఇంటికి తిరిగివచ్చానని కౌసర్ తెలిపారు.
''మేం ముందుగానే.. సరైన సమయంలో ధర్నాను నిలిపివేసి ఉండాల్సింది. అలా చేసినట్లయితే లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మేం మళ్లీ వచ్చి కొనసాగించగలిగేవాళ్లం. కానీ ఆందోళనకారుల్లో కొంతమంది ఒప్పుకోలేదు. తమ లక్ష్యం కోసం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు'' అని ఆమె వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నాయకులు అంటూ ఎవరూ లేని షహీన్ బాగ్ నిరసన కార్యక్రమం.. ప్రతి అంశాన్నీ చర్చించుకుని, అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయంతో తీసుకునే ఆరోగ్యవంతమైన సంస్కృతితో సాగింది.
కానీ.. ఇటీవల వివిధ ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమాలను ఖాళీ చేయిస్తుండటంతో.. ఈ ధర్నాను కొనసాగించాలా వద్దా అనే అంశం మీద గత కొన్ని రోజులుగా వీరిలో భిన్నాప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దిల్లీలో జాఫ్రాబాద్, హౌజ్ రాణి, జామియా మిలియా ఇస్లామియా, తుర్కుమాన్ గేట్ నిరసన ప్రాంతాలను కూడా మంగళవారం నాడే ఖాళీ చేయించారు. పాత దిల్లీలోని ఈద్గా నిరసనలో కూడా ఆందోళనకారులు ప్రతీకాత్మకంగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ నిరసన కేంద్రాన్ని కూడా పోలీసులు కూల్చేశారు. ముంబై, దేవ్‌బంద్, లక్నో తదితర ప్రాంతాల్లోని నిరసన కేంద్రాలు కూడా ఇప్పుడు లేవు.
అందంగా ముగియాల్సిన తమ నిరసన కార్యక్రమం ఇలా అవమానకరంగా ముగియటం విచారం కలిగిస్తోందని ఓఖ్లాలో నివసించే షాగుఫ్తా (43) పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో మొదటి రోజు నుంచి పాల్గొంటున్న ఆమె ఇక్కడి కార్యక్రమాలను క్రియాశీలాంగా సమన్వయం చేసేవారు.

ఫొటో సోర్స్, Ani
''మేం ఎంతో ప్రేమగా, కష్టపడి ఈ నిరసన కేంద్రాన్ని తీర్చిదిద్దాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడచుకుంటున్నాం. కానీ, సాహసోపేతమైన నిరసన ఇలా విచారకరంగా ముగిసింది'' అని ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు.
ఈ ధర్నా కార్యక్రమాన్ని బలవంతంగా తొలగించిన తీరు.. అధికార బలాన్ని చాటుకోవటాన్ని, దేశంలో పౌరసత్వ భేదాలను సూచిస్తోందని సహేలీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాణి సుబ్రమణ్యం పేర్కొన్నారు.
''ఇది.. చరిత్రాత్మకమైన ఒక అంశాన్ని కూల్చివేయటానికి, చెరిపివేయటానికి తమకు గల అధికారాన్ని చాటుకోవటమే. జనతా కర్ఫ్యూ సందర్భంగా జనం పళ్లేలు మోగిస్తూ బయటకు వచ్చి గుమిగూడారు. పౌరసత్వ భేదం గురించి అది చాలా చెప్తుంది. దేశంలో ఒక మహమ్మారి విస్తరిస్తున్నందనే.. ఇతర అంశాలను చెరిపివేయజాలరు. ఆ మహిళలకు మేం మద్దతుగా నిలుస్తున్నాం'' అని ఆమె చెప్పారు.
నిరసన తెలుపుతున్న వేలాది మంది మహిళలతో చర్చించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయని చెబుతూ, ''ఇదేం ప్రజాస్వామ్యం?'' అని ఆమె విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ పరిణామం మీద 70 మందికి పైగా ఉద్యమకారులు, మహిళా సంఘాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఎన్‌పీఆర్ సమాచార సేకరణ ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేయాలని, దీర్ఘకాలంలో పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి.
షహీన్ బాగ్‌లో మహిళల ధర్నాను తొలగించే అంశం కోర్టులో ఉండగానే, ప్రభుత్వ ఆదేశాలు, సూచనలను నిరసనకారులు పాటిస్తున్నా కూడా.. వారి ధర్నాను బలవంతంగా తొలగించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తనకు తెలియటం లేదని ఉద్యమకారుడు సాజిద్ మజీద్ పేర్కొన్నారు.
''కోర్టు మీద ప్రభుత్వానికి ఎలాంటి విశ్వాసం లేదని ఇది చెప్తోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''చివరికి.. ఆ రోడ్డు అలాగే ఉంది. 101 రోజుల నిరసన జ్ఞాపకం అలాగే ఉండిపోతుంది. దానిని ఎవరూ చెరిపివేయలేరు. ఇది సంస్మరణ కాదు. ఈ షహీన్ (డేగ) మళ్లీ నింగికి దూసుకుపోతుంది'' అని పేరు చెప్పటానికి నిరాకరించిన ఒక మహిళ పేర్కొన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- ‘అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది...’ మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి?
- కరోనావైరస్: ప్రపంచమంతా ఇంట్లో ఉంటే... వీళ్ళు బీచ్‌లో ఏం చేస్తున్నారు?
- తిరుమలలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటున్న అధికారులు
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- ఈ కుర్రాడు రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








