పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ గల్లీలను ఆక్రమించిన మహిళలు

ఫొటో సోర్స్, Getty Images
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. భారతదేశ రాజధాని దిల్లీలో అత్యంత శీతకాలపు చలిని ఎదిరిస్తూ రెండు వారాలుగా వందలాది మంది మహిళలు రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి అరవింద్ చాబ్రా కథనం.
డిసెంబర్ 31.. దిల్లీ చరిత్రలో వందేళ్లలో అత్యంత చలిగా ఉన్న రోజు. కానీ షహీన్‌బాగ్ ప్రాంతపు ప్రజలు ఆ చలికి వెరవలేదు. వీరు డిసెంబర్ 15వ తేదీ నుంచీ ఒక వీధిలో టెంటు కింద ధర్నా చేస్తున్నారు. మందంగా దుప్పట్లు, వేడి టీ కప్పులు వారి ఆయుధాలయ్యాయి.
ఆ తీవ్ర చలిలో రోడ్డు మీద ప్రతిఘటనా పాటలు పాడుతూ వీరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అర్థరాత్రికి కొద్ది నిమిషాల ముందు అందరూ నిలుచుని జాతీయ గీతం ఆలపించారు.
వారి డిమాండ్ ఏమిటి?
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించటం. డిసెంబర్ 11వ తేదీన అమలులోకి వచ్చిన ఈ చట్టం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు ఆశ్రయం ఇవ్వజూపుతోంది. ఆ దేశాల్లో మతపరమైన వివక్ష, అణచివేతల నుంచి పారిపోయి వచ్చే మత మైనారిటీలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం చెప్తోంది.
కానీ.. భారతదేశపు ముస్లింలకు ప్రభుత్వ మాటలు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయాయి. ఈ చట్టం తమ పట్ల వివక్ష చూపుతుందని.. తమలో కొందరిని దేశం నుంచి బహిష్కరించటమో, నిర్బంధ కేంద్రాలకు తరలించటమో కూడా జరగవచ్చునని వారిలో చాలా మంది భయపడుతున్నారు.
''నేను ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రాను. సమీపంలోని మార్కెట్‌కు వెళ్లటానికి కూడా నా కొడుకు కానీ, నా భర్త కానీ నాకు తోడుగా వస్తారు. కాబట్టి నేను ఇక్కడ ధర్నాలో పాల్గొనటం మొదట కష్టంగా అనిపించింది. కానీ.. నిరసన తెలపక తప్పదని నాకు బలంగా తోచింది'' అని నిరసనకారుల్లో ఒకరైన ఫిర్దౌస్ షఫీక్ చెప్పారు.
ఫిర్దౌస్ షఫీక్ వంటి మహిళలు పాల్గొనటం వల్ల షహీన్ బాగ్ నిరసన అసాధారణ కార్యక్రమంగా మారిందని ఉద్యమకారులు, వ్యాఖ్యాతలు అభివర్ణిస్తున్నారు.

''ఈ మహిళలు ఉద్యమకారులు కాదు..'' అని దిల్లీకి చెందిన ముస్లిం విమెన్స్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు సయ్యదా హమీద్ చెప్తారు.
వీళ్లు సాధారణ ముస్లిం మహిళలు. ఇంటి వ్యవహారాలు చూసుకునే గృహిణులు. ఇప్పుడు ఒక జాతీయ చర్చకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలుచున్నారు.
''మతాలకు అతీతంగా ఒక జాతీయ సమస్య విషయంలో వీరు బయటికి రావటం ఇదే మొదటిసారి. ఇది ముఖ్యమైన విషయమని నేను భావిస్తున్నా. ఇది ముస్లిం సమాజాన్ని బాధితులుగా చేయటానికి సంబంధించిన అంశమైనప్పటికీ.. ఇది లౌకిక అంశం'' అంటారు హమీద్.
ఈ నిరసన మొదలైనపుడు ఎంత మంది మహిళలు ఉన్నారనేది చెప్పటం కష్టం. కానీ వీరి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోయింది. మొదట.. దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన.. పోలీసులతో ఘర్షణగా ముగిసిన డిసెంబర్ 15వ తేదీ రాత్రి వీరు బయటకు వచ్చారు. పోలీసులు ఆ తర్వాత అనుమతి లేకుండా క్యాంపస్‌లోకి ప్రవేశించి.. విద్యార్థులు, సిబ్బంది మీద దాడి చేశారని ఆ యూనివర్సిటీ చెప్పింది.
ఆ రాత్రి అనంతరం పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూ పోయి.. దేశమంతటా విస్తరించాయి.
చాలా నిరసనలు మొదలై, ముగిసిపోయినప్పటికీ.. కొన్ని ఆందోళనలు హింసాత్మకంగా మారినప్పటికీ.. షహీన్‌బాగ్‌లోని ఈ ప్రాంతంలో ధర్నా స్థిరంగా శాంతియుతంగా కొనసాగుతోంది.
అయితే.. దిల్లీ, నోయిడాల సరిహద్దులోని ఈ ప్రాంతం ప్రయాణికులకు కీలకమైన అనుసంధానంగా ఉండటంతో.. కొందరు ఈ ధర్నా పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
''ఇది మా వ్యాపారం మీద ప్రభావం చూపుతోంది'' అని స్థానిక దుకాణదారుడు ఒకరు చెప్పారు. నోయిడాలో పనిచేసే స్థానికుడు ఒకరు.. తాను విధులకు వెళ్లటానికి ఇప్పుడు రెట్టింపు సమయం పడుతోందని తెలిపారు. ఎవరి జీవనానికీ ఆటంకం కలిగించాలని తాము భావించటం లేదని.. తమ ధర్నాను శాంతియుతంగా కొనసాగిస్తామని నిరసనకారులు హామీ ఇస్తున్నారు.
అయితే.. మరో దుకాణదారు వీరికి సంఘీభావం తెలిపారు. కొంతమంది దుకాణదారులైతే నిరసనలో పాల్గొంటున్న వారికి ఆహారం కూడా సరఫరా చేస్తున్నారు. నిజానికి ఈ నిరసన పెరుగుతున్న కొద్దీ.. రాజధాని నగరం నలుమూలల నుంచీ జనం వస్తున్నారు. వారిలో విద్యార్థుల నుంచి, రాజకీయ వ్యాఖ్యాతల వరకూ అనేక వర్గాల వారు ఉన్నారు.

''ఈ నిరసన హింసాత్మకంగా మారకూడదని.. మా మీద బలప్రయోగం చేయటానికి పోలీసులకు అవకాశం ఇవ్వరాదని మేం కోరుకుంటున్నాం'' అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక మహిళ చెప్పారు.
''ప్రభుత్వం వల్ల మేం ఆందోళన చేపట్టక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఒకవేళ మేం మా పౌరసత్వాన్ని నిరూపించుకోవటంలో విఫలమైతే.. మమ్మల్ని నిర్బంధ కేంద్రంలో పెట్టటమో, దేశం నుంచి బహిష్కరించటమో జరుగుతుంది. కాబట్టి మా హక్కుల కోసం ఇప్పుడే పోరాటం చేయటం ఉత్తమం'' అని షఫీక్ పేర్కొన్నారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని పౌరుల జాతీయ జాబితా (ఎన్‌ఆర్‌సీ)తో కలిపి అమలు చేసినట్లయితే తమ పౌరసత్వం ప్రమాదంలో పడుతుందన్న చాలా మంది ఆందోళనలకు.. ఆమె మాటలు అద్దంపడుతున్నాయి.
పౌరుల జాతీయ జాబితా కోసం.. భారతీయులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ధృవపత్రాలు సమర్పించాల్సి ఉండటం దీనికి కారణం.
అయితే.. ఆ జాబితాలో లేని ముస్లిమేతరులు పౌరసత్వ సవరణ చట్టం కింద మైనారిటీలుగా రక్షణ పొందవచ్చు. కానీ ధృవపత్రాలు లేని ముస్లింలకు ఆ హక్కు లేదు. వారిని నిర్బంధించటం లేదా దేశం నుంచి పంపించి వేయటం జరగవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ జాబితాను తక్షణం అమలు చేసే ప్రణాళికలేవీ లేవని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ మహిళల్లో కొంత మంది తమ పనులు వదులుకుని మరీ ఆందోళన కొనసాగిస్తున్నారు.
రిజ్వానా బనీ రోజు వారీ వేతన కార్మికురాలు. తాను ఇక్కడ రాత్రీ పగలూ ధర్నాలో పాల్గొనటం వల్ల తన వేతనం కోల్పోతున్నానని చెప్తున్నారు. కానీ.. ఆ చట్టం వల్ల తనకు, తన కుటుంబానికి ఏం జరుగుతుందో అనే భయం ఆమెను వేధిస్తోంది.
''మా పౌరసత్వాన్ని నిరూపించే ధృవపత్రాలను ఎక్కడి నుంచి తేవాలి? ఎలా తేవాలి? అనేది మాకు తెలియదు. మమ్మల్ని మతం ప్రాదిపదికన విభజిస్తున్నారు. మేం ముందు భారతీయులం. ఆ తర్వాతే.. హిందువులమైనా.. ముస్లింలమైనా'' అని ఆమె పేర్కొన్నారు.
ఈ నిరసన ప్రదర్శనలో అన్ని వయసుల మహిళలూ పాల్గొంటున్నారు.
''నేను ఈ దేశాన్ని విడిచి వెళ్లను. నా పౌరసత్వాన్ని నిరూపించుకునే క్రమంలో చనిపోవాలనీ నాకు లేదు'' అని 70 ఏళ్ల ఆస్మా ఖటూన్ చెప్పారు. ఆమె రోజుల తరబడి ఈ ధర్నా శిబిరంలో కదలకుండా నిరసన కొనసాగిస్తున్నారు.

''నేను ఒక్కదానినే కాదు.. నా పూర్వీకులు, నా పిల్లలు, నా మనవళ్లు.. మేమందరం భారతీయులమే. కానీ దీనిని నిరూపించుకోవాలని మేం కోరుకోవటం లేదు'' అని ఉద్ఘాటించారు ఆస్మా.
ఈ చట్టం ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తమకు కనిపిస్తోందని.. కానీ ఇది ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమేనని నిరసనకారులు చెప్తున్నారు.
''ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. ఇది ప్రస్తుతానికి ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చసుకోవచ్చు. కానీ.. క్రమంగా ఇతర మతస్తులను కూడా ఇది లక్ష్యంగా చేసుకుంటుందని మేం భావిస్తున్నాం'' అని యూనివర్సిటీ విద్యార్థిని హుమైరా సయీద్ పేర్కొన్నారు.
''ఒక ముస్లింగా.. నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల కోసం.. మా సమాజం కోసం.. ప్రతి ఒక్కరి కోసం నేను ఈ నిరసనలో పాల్గొనాలని నాకు తెలుసు'' అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఎన్‌ఆర్‌సీ: వారు భారతీయులు కాదు - కేంద్ర ప్రభుత్వం
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా
- యూపీ పోలీస్, మోదీ ప్రభుత్వంపై మరో ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
- 'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









