క‌రోనావైర‌స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లాక్‌డౌన్ ప్ర‌భావం ఎలా ఉంది.. లాక్‌డౌన్‌ల‌లో కేసులు ఎలా పెరిగాయి

ఇండియా ఇప్పటి వరకు 180,000 పరీక్షలు నిర్వహించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా ఇప్పటి వరకు 180,000 పరీక్షలు నిర్వహించింది
    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాలుగు లాక్‌డౌన్‌ల న‌డుమ‌ భార‌త్‌లో క‌రోనావైర‌స్ కేసులు 1,50,000కుపైగా పెరిగాయి. మ‌రోవైపు పాజిటివిటీ రేటు కూడా ఏడు శాతాన్ని దాటింది.

రోజువారీ కేసుల పెరుగుద‌ల రేటు కూడా స‌గ‌టున 5 శాతానికిపైనే ఉంది. కేసుల డ‌బ్లింగ్ రేటు 13 రోజులుగా న‌మోద‌వుతోంది. అంటే ప్ర‌తి 13 రోజులకూ కేసులు రెట్టింపవుతున్నాయి.

Total cases in India

దేశ వ్యాప్తంగా కేసుల‌తో పోల్చిన‌ప్పుడు ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌ల్లోనూ ప‌రిస్థితి కాస్త మెరుగ్గానే క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్రదేశ్‌లో మే 20 నుంచి 26 మ‌ధ్య కేసుల రోజువారీ పెరుగుద‌ల రేటు 2 శాతంగా ఉంది. తెలంగాణ‌లో ఇది మూడు శాతం.

గ‌త రెండు నెల‌ల్లో భార‌త్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఎలా పెరుగుతూ వ‌స్తున్నాయి? ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తున్నారు? పాజిటివిటీ రేటు ఎలా ఉంది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానాలు చూద్దాం.

cases lockdown wise in India

భార‌త్‌లో తొలి కోవిడ్-19 కేసు జనవరి 30న నమోదైంది. స‌రిగ్గా 65 రోజుల త‌ర్వాత, మార్చి 25న తొలి లాక్‌డౌన్ మొద‌లైంది. అప్ప‌టికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 571. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా అన్నింటిపైనా ఆంక్ష‌లు విధిస్తూ 21 రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేశారు. దీంతో రోజువారీ కేసులు క‌నిష్ఠంగా 37 నుంచి గ‌రిష్ఠంగా 1,248 వ‌ర‌కు న‌మోద‌య్యాయి. మొత్తం మ‌ర‌ణాలు 393కు ప‌రిమితం అయ్యాయి. ఈ లాక్‌డౌన్ పూర్త‌య్యేనాటికి కేసులు 11,487కు పెరిగాయి.

లాక్‌డౌన్‌-2 ఏప్రిల్ 15న మొద‌లైంది. ఇది 19 రోజుల‌పాటు కొన‌సాగింది. రైతులు, కూలీలతోపాటు కేసులు త‌క్కువ‌గానున్న కొన్ని రాష్ట్రాల‌కూ ఆంక్ష‌లు స‌డ‌లించారు. రోజువారీ కేసులు క‌నిష్ఠంగా 883 నుంచి గ‌రిష్ఠంగా 2,806 వ‌ర‌కు న‌మోద‌య్యాయి. ‌మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,391కు పెరిగింది. లాక్‌డౌన్‌-2 పూర్త‌య్యేనాటికి కేసులు 42,505కు చేరుకున్నాయి.

లాక్‌డౌన్‌-3 మే 4న మొదలైంది. 14 రోజుల‌పాటు ఇది కొన‌సాగింది. జోన్ల వారీగా జిల్లాల‌ను విభ‌జిస్తూ.. ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో మిన‌హాయింపులు ఇచ్చారు. ఒక్క కేసు కూడా న‌మోదుకాని లేదా గ‌త 21 రోజుల్లో కొత్త కేసులేవీ న‌మోదుకాని జిల్లాల‌ను గ్రీన్ జోన్లుగా గుర్తించారు. యాక్టివ్ కేసులు, డ‌బ్లింగ్ రేటు, టెస్టింగ్ ఫీడ్ బ్యాక్‌ల ఆధారంగా ముప్పు ఎక్కువ‌గా ఉండే జిల్లాల‌ను రెడ్ జోన్లుగా గుర్తించారు. మిగ‌తావి ఆరెంజ్‌గా ప్ర‌క‌టించారు.

రోజువారీ కేసులు క‌నిష్ఠంగా 2,963 నుంచి గ‌రిష్ఠంగా 5,050 వ‌ర‌కు న‌మోద‌య్యాయి. ‌మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3025కు పెరిగింది. లాక్‌డౌన్‌-3 పూర్త‌య్యేనాటికి కేసులు 95,698కు చేరుకున్నాయి.

Tests in India

లాక్‌డౌన్‌-4 మే 18న మొదలైంది. 14 రోజుల‌పాటు ఇది కొన‌సాగుతోంది. రాష్ట్రాల మ‌ధ్య రవాణా‌ సేవ‌లు ప్రారంభించారు. క్రీడా మైదానాల‌ను తెరిచారు. ప్ర‌త్యేక రైళ్లు, విమాన సేవ‌ల‌నూ మొద‌లుపెట్టారు. రెడ్‌జోన్ల‌లోనూ ఈ-కామ‌ర్స్ సేవ‌లు మొద‌ల‌య్యాయి. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌లు, నిర్మాణ రంగ కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి.

అయితే కంటైన్‌మెంట్ జోన్ల‌లోని షాప్‌లపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మాల్స్‌, మార్కెట్ కాంప్లెక్స్‌ల‌పై ఆంక్ష‌లు ఉన్నాయి.ఈ లాక్‌డౌన్‌లో రోజువారీ కేసుల క‌నిష్ఠంగా 4,630 నుంచి గ‌రిష్ఠంగా 7,113 వ‌ర‌కు న‌మోద‌య్యాయి. మే 26నాటికి ‌మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,344కు పెరిగింది. కేసులు 1,50,793కు చేరుకున్నాయి.

కేసులు పెర‌గ‌డానికి టెస్టులు ఎక్కువ‌గా చేయ‌డ‌మూ ఒక కార‌ణ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాన్‌హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వివ‌రాల ప్ర‌కారం.. భార‌త్‌లో ప‌ది ల‌క్ష‌ల మందిలో 2,267 మందికి టెస్టులు నిర్వ‌హించారు.

ర‌ష్యా (ప‌ది ల‌క్ష‌ల మందిలో 62,774 టెస్టులు), యూకే (54,265), ఆస్ట్రేలియా (50,577), అమెరికా (46,951) టెస్టులు భారీగా నిర్వ‌హిస్తున్నాయి. అయితే జ‌నాభా, ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా భార‌త్ మెరుగ్గా టెస్టులు చేస్తోంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పాకిస్తాన్ ప‌ది ల‌క్ష‌ల మందిలో 2,227 మందికి, బంగ్లాదేశ్ 1,571 మందికి, జ‌పాన్ 2,183 మందికి, ఇండోనేషియా 967 మందికి టెస్టులు నిర్వ‌హించాయి.

"లాక్‌డౌన్‌ల అనంత‌రం హాట్‌స్పాట్ల‌లో వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతోంది. మ‌హారాష్ట్ర‌లో మొత్తానికి విప‌రీతంగా పెరుగుతున్న కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అన్ని చోట్లా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప‌శ్చిమ బెంగాల్‌, బిహార్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఝార్ఖండ్‌, అసోం, హ‌రియాణా, చ‌త్తీస్‌గ‌ఢ్‌,ల‌లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి"అని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలిగా పనిచేసిన ప్రొఫెసర్ షామిక రవి వివ‌రించారు.

Positivity rate in India

మొద‌టి లాక్‌డౌన్‌లో 5.28గా ఉన్న స‌గ‌టు పాజిటివిటీ రేటు.. రెండో లాక్‌డౌన్‌లో 3.69కు త‌గ్గింది. మూడో లాక్‌డౌన్‌కు ఇది మ‌ళ్లీ 4.55కు పెరిగింది. మే 25న గ‌రిష్ఠంగా ఇది ఏడును మించిపోయింది.

జాన్‌హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ స‌మాచారం ప్ర‌కారం.. బ్రెజిల్‌లో పాజిటివిటీ రేటు 45 శాతంగా ఉంది. అమెరికా (11.1), స్పెయిన్ (7.9), యూకే (7.2), ఇట‌లీ (6.5), ర‌ష్యా (3.9)ల పాజిటివిటీ రేటు ఇలా ఉంది.

భార‌త్‌లో కేసులు పెర‌గ‌డానికి జ‌న సాంధ్ర‌త కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని నిపుణులు వివ‌రించారు.

భార‌త్‌లో ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు 109 కేసులు నమోదు అవుతుండ‌గా... స్పెయిన్లో 6,060, అమెరికాలో 5,215, యూకేలో 3,909, ఇట‌లీలో 3,813, ర‌ష్యాలో 2,483, బ్రెజిల్‌లో 1,847, చైనాలో 58గా ఉంది.

"ప్ర‌స్తుత‌మున్న స‌మాచారం ప‌రిశీలిస్తే.. యాక్టివ్ కేసులు భార‌త్‌లో ఇంకా పెరిగే అవ‌కాశ‌ముంది. భార‌త్‌తోపాటు ర‌ష్యా, బ్రిట‌న్‌, బ్రెజిల్‌, అమెరికాల్లో కూడా ఇంకా పెరుగుతాయి"అని ప్రొఫెస‌ర్ షామిక ర‌వి చెప్పారు.

Andhra Pradesh new cases

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్-1 మొద‌ల‌య్యేనాటికి ప‌ది కేసులున్నాయి. ఇవి ఏప్రిల్ 14నాటికి 483 అయ్యాయి. ఇక్కడ క‌నిష్ఠంగా ఒక‌టి, గ‌రిష్ఠంగా 62 కేసులు న‌మోద‌య్యాయి.

లాక్‌డౌన్‌-2లో మొత్తంగా 1,100 కేసులు న‌మోద‌య్యాయి. స‌గ‌టున ఒక్కోరోజు ఇక్క‌డ 57 కేసులు న‌మోద‌య్యాయి. గ‌రిష్ఠంగా ఏప్రిల్ 25న 106 కేసులు వ‌చ్చాయి. లాక్‌డౌన్ పూర్త‌య్యేనాటికి మొత్తంగా 1,583 కేసులు వ‌చ్చాయి.

లాక్‌డౌన్‌-2తో పోలిస్తే.. లాక్‌డౌన్‌-3లో కేసులు త‌గ్గాయి. మొత్తంగా 797 కేసులు న‌మోద‌య్యాయి. స‌గ‌టున ఒక్కోరోజు ఇక్క‌డ 49 కేసులు న‌మోద‌య్యాయి. లాక్‌డౌన్ పూర్త‌య్యేనాటికి మొత్తంగా 2,380 కేసులు వ‌చ్చాయి.

లాక్‌డౌన్‌-4లో ఇప్ప‌టివ‌ర‌కు 506 కేసులు వ‌చ్చాయి. స‌గ‌టున ఒక్కోరోజు 55 కేసులు న‌మోద‌వుతున్నాయి.

"లాక్‌డౌన్‌ను తెలుగు రాష్ట్రాల్లో అంత ప‌కడ్బందీగా అమ‌లు చేయ‌లేదు. ఒకవేళ అమ‌లు చేసుంటే కేసులు పూర్తిగా త‌గ్గుండేవి."అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ వైద్యుడు సంజీవ్ సింగ్‌ వివ‌రించారు.

"హాట్‌స్పాట్‌లుగా మారిన క‌ర్నూలు, చిత్తూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తే కేసులు పూర్తిగా త‌గ్గుతాయి"

Andhra Pradesh total new cases

ఐసీఎంఆర్ లెక్క‌ల ప్ర‌కారం.. మే 26నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ 3,22,714 టెస్టులు చేసింది. త‌మిళ‌నాడు 4,31,739, మ‌హారాష్ట్ర 3,90,757, రాజ‌స్థాన్ 3,37,159, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ 2,40,588, గుజ‌రాత్ 1,89,313, దిల్లీ 1,78,579, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 1,41,598 ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయి. తెలంగాణ 16 మే వ‌ర‌కు 23,388 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు తెలిపింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో 6,180 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కేసుల విష‌యానికొస్తే.. ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో 57 మందికి కోవిడ్‌-19 సోకింది. రోగుల్లో 67.62 శాతం మంది కోలుకున్నారు. మ‌ర‌ణ రేటు 1.91 శాతంగా ఉంది.

త‌మిళ‌నాడులో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో 5,704 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కేసుల విష‌యానికొస్తే.. ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందిలో 234 మందికి కోవిడ్‌-19 సోకింది. రోగుల్లో 52.7 శాతం మంది కోలుకున్నారు. మ‌ర‌ణ రేటు 0.72 శాతంగా ఉంది.

ఈ రెండింటినీ పోల్చి చూస్తే.. టెస్టింగ్‌, కేసుల్లో త‌మిళ‌నాడు కంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెరుగ్గా ప‌నిచేస్తోందని తెలుస్తోంది.

"తెలుగు రాష్ట్రాల్లో ర్యాపిడ్ టెస్టులు ఎక్కువ చేస్తున్నారు. పీసీఆర్ విధానంలో ప‌రీక్ష‌లు చేస్తే క‌చ్చిత‌మైన ఫ‌లితాలుంటాయి. ర్యాపిడ్ టెస్టుల్లో 50 శాతం ఫాల్స్ నెగిటివ్‌లు ఉంటాయి. వీటిలో పాజిటివ్ కేసులు కొన్ని జారిపోతే... వైర‌స్ వ్యాప్తి చెందే ముప్పుంటుంది. అందుకే ఐసీఎంఆర్ వీటిపై అంత సంతృప్తిగా లేదు. పీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలి" అని సంజీవ్ సింగ్‌ అన్నారు.

Andhra Pradesh tests

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాజిటివిటీ రేటు.. లాక్‌డౌన్‌-2లో స‌గ‌టున 1.06 శాతంగా ఉంది. లాక్‌డౌన్-3కి వ‌చ్చేస‌రికి ఇది 0.56 శాతానికి త‌గ్గింది. మే 25న 0.42 శాతంగా న‌మోదైంది. ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా నిర్వ‌హించ‌డంతో పాజిటివిటీ రేటు త‌గ్గుతూ వ‌స్తోంది.

తెలంగాణ‌లో మాత్రం ఇది 6.45గా ఉంది. మ‌హారాష్ట్ర‌లో 14, త‌మిళ‌నాడు 4.1 శాతంగా న‌మోదైంది.

తెలంగాణలో ఎక్కువగా క‌నిపిస్తున్న‌ పాజిటివిటీ రేటు ఆధారంగా పరీక్షల సంఖ్యను పెంచడం అవసరమని నిపుణులు అంటున్నారు.

ఇక్క‌డ ప్రైవేటు ల్యాబ్‌లు ప‌రీక్షలు నిర్వ‌హించ‌డం లేదు. మ‌రోవైపు బులెటిన్ల‌లో రోజువారీగా నిర్వ‌హిస్తున్న టెస్టుల వివ‌రాల‌నూ ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌డం లేదు. దీంతో నిర్వ‌హిస్తున్న కేసుల సంఖ్య‌, పాజిటివిటీ రేటుల‌పై స్ప‌ష్ట‌మైన స‌మాచారం అందుబాటులో లేదు.

Telangana total cases

తెలంగాణ‌లో లాక్‌డౌన్-1 మొద‌ల‌య్యేనాటికి 40 కేసులున్నాయి. 21 రోజుల తొలి లాక్‌డౌన్ పూర్త‌య్యేనాటికి ఇవి 644కు పెరిగాయి. గ‌రిష్ఠంగా ఏప్రిల్ 3న 75 కేసులు న‌మోద‌య్యాయి.

లాక్‌డౌన్‌-2లో మొత్తంగా 438 కొత్త కేసులు వ‌చ్చాయి. గ‌రిష్ఠంగా ఏప్రిల్ 17న 66 కేసులు న‌మోద‌య్యాయి. స‌గ‌టున ఒక్కోరోజు 23 కేసులు చొప్పున న‌మోద‌య్యాయి. లాక్‌డౌన్‌-2 పూర్త‌య్యేనాటికి కేసుల సంఖ్య 1082కు పెరిగింది.

లాక్‌డౌన్‌-3లో మొత్తంగా 469 కొత్త కేసులు వ‌చ్చాయి. గ‌రిష్ఠంగా మే 11న 79 కేసులు వ‌చ్చాయి. స‌గ‌టున ఒక్కోరోజు 38 కేసులు వ‌చ్చాయి. లాక్‌డౌన్‌-3 పూర్త‌య్యేనాటికి 1551 కేసులు అయ్యాయి.

లాక్‌డౌన్‌-4లో కేంద్ర ప్ర‌భుత్వ లేఖ‌లు, హైకోర్టు సూచ‌న‌ల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న టెస్టుల సంఖ్య‌ను పెంచింది. దీంతో రోజువారీ కేసుల సగ‌టు 38 నుంచి 46కు పెరిగింది. మే 25న అత్య‌ధికంగా 66 కేసులు న‌మోద‌య్యాయి.

Telangana daily cases

"తెలంగాణ‌లో టెస్టులు స‌రిగా చేయ‌డంలేదు. కేసులు మాత్రం రోజూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్ల‌లో టెస్టులు ఎక్కువ‌గా చేయాలి. అస‌లు అలా జ‌ర‌గ‌డంలేదు. ప్ర‌భుత్వ విధానాల‌ను నేను విమ‌ర్శించ‌కూడ‌దు. అయితే ఒక డాక్ట‌ర్‌గా ఇంత‌కంటే ఎక్కువ‌గా టెస్టులు చేయాల‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను" అని సంజీవ్ సింగ్‌ వ్యాఖ్యానించారు.

"ప్రైవేటు ల్యాబ్‌ల‌కు టెస్టింగ్ ఇవ్వ‌డం లేదు. ప్రైవేటు ల్యాబ్‌ల‌కు టెస్టింగ్ ఇవ్వ‌డంలో ఎలాంటి త‌ప్పులేద‌నేది నా అభిప్రాయం. రాష్ట్రంలో బులెటిన్లు రోజూ రావ‌డం లేదు. ఎందుకంటే వారు టెస్టులు స‌రిగా చేయ‌డం లేదు. టెస్టులు చేస్తే.. రిపోర్టులు వ‌స్తాయి"

"మ‌రోవైపు లాక్‌డౌన్ స‌రిగా అమ‌లు చేయ‌క‌పోతే హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్ర‌భుత్వాలు వేస‌విని ఉప‌యోగించుకుంటున్న‌ట్లు అనిపిస్తోంది. ఎలానో వ‌చ్చే వ‌ర్షాకాలం, శీతాకాలాల్లో కేసులు పెరిగే అవ‌కాశ‌ముంది"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)