పాము కాటుకు దేశంలో 20 ఏళ్లలో 12 లక్షల మంది మృతి

పాము

ఫొటో సోర్స్, AFP

భారతదేశంలో పాము కాటు వల్ల గత 20 ఏళ్లలో 12 లక్షల మంది చనిపోయినట్లు ఓ కొత్త అధ్యయనం అంచనా వేసింది.

ఈ మృతుల్లో దాదాపు సగం మంది 30 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్కులయితే.. నాలుగో వంతు మంది చిన్నారులని ఆ అధ్యయనం చెప్తోంది.

ఎక్కువ మంది మరణాలకు రక్త పింజరి (రసెల్స్ వైపర్) పాములు, కట్ల పాములు, తాచు పాములు ప్రధాన కారణమైతే.. మిగతా మరణాలకు మరో 12 జాతుల పాములు కారణమయ్యాయి.

పాము కాటు వల్ల ఇంత మంది చనిపోవటానికి కారణం.. వైద్య సదుపాయాలను వేగంగా చేరుకోలేని ప్రాంతాల్లో ఈ పాముల దాడులు జరగటం కారణం.

ఈ మరణాల్లో సగం వరకూ.. జూన్ - సెప్టెంబర్ నెలల మధ్య వర్షాకాలంలోనే చోటు చేసుకున్నాయి. ఈ కాలంలోనే పాములు ఎక్కువగా బయట తిరుగుతుంటాయి. అలాగే మృతుల్లో ఎక్కువ మందికి కాళ్ల మీదే పాములు కాటేశాయి.

ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ నిపుణులు నిర్వహించిన ఈ అధ్యయనాన్ని ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురించారు. భారతదేశం చేపట్టిన 'మిలియన్ డెత్ స్టడీ' నుంచి సేకరించిన సమాచారం దీనికి ఆధారం.

కట్ల పాము
ఫొటో క్యాప్షన్, భారత ఉపఖండంలో విషసర్పాలైన కట్ల పాములు పలు రకాలు కనిపిస్తాయి

సాధారణంగా దూకుడుగా ఉండే రక్త పింజరి పాము భారతదేశంతో పాటు దక్షిణాసియా అంతటా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మనుషుల ఆవాసాల దగ్గర తరచుగా కనిపిస్తుంది.

ఇక కట్ల పాము (ఇండియన్ క్రెయిట్) సాధారణంగా పగటిపూట స్తబ్దుగా ఉంటుంది. కానీ రాత్రిపూట దూకుడుగా ఉంటుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాలు) వరకూ పొడవు పెరుగుతంది.

తాచు పాము (ఇండియన్ కోబ్రా) సాధారణంగా చీకటి పడ్డాక దాడి చేస్తుంది. దీని కాటు వల్ల అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. దీనికి తక్షణమే వైద్య చికిత్స అవసరం.

2001-2014 మధ్య పాము కాటు మరణాల్లో 70 శాతం వరకూ ఎనిమిది రాష్ట్రాల్లో - బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా), రాజస్థాన్, గుజరాత్‌లలోనే చోటుచేసుకున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.

భారతదేశంలో సగటున ప్రతి 250 మందిలో ఒకరు 70 ఏళ్ల వయసుకన్నా ముందు పాము కాటు వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. అయితే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రమాదం సగటున నూటికి ఒక్కరికి చొప్పున ఉంటుందని ఈ అధ్యయనం చెప్తోంది.

గ్రామాల్లో నివసించే వ్యవసాయ సమాజాలకే వర్షాకాలంలో పాము కాటు ప్రమాదం అత్యధికంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ ప్రాంతాల్లో పాముల నుంచి రక్షణ పొందటం గురించి, పాముల దాడికి గురికాకుండా వ్యవసాయ పనులు చేసుకోవటం ఎలా అనేదాని గురించి తేలికైన పద్ధతుల్లో అవగాహన పెంపొందించాలని వారు సూచిస్తున్నారు. పాము కాటు ముప్పును తగ్గించటానికి రబ్బరు బూట్లు, గ్లవ్స్ తొడుక్కోవటం, టార్చి లైట్లు ఉపయోగించటం వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు.

పాము కాటు అనేది ఇప్పుడు ఒక ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. చాలా నిర్లక్ష్యం వహించే వ్యాధుల్లో ఇది ఒకటని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది వరకూ పాము కాటు వల్ల చనిపోతున్నారు. ఇంతకు మూడు రెట్లు ఎక్కువ మంది పాము కాటుకు గురై కోలుకుంటున్నా.. శాశ్వత వైకల్యాలలకు లోనవుతున్నారు.

వీడియో క్యాప్షన్, రెండు తలల పామును చూశారా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)